Marriage Equality: Do families form only through birth or marriage?

కుటుంబాలు పుట్టుక, వివాహం తోనే ఏర్పడతాయా? సుప్రీం కోర్టు లో ‘వివాహ సమానత్వం’ కోరుతూ 20 మంది వేసిన పిటిషన్ల గురించి జరుగుతున్న వాదోపవాదనలు పెళ్లి, కుటుంబం, వివాహ హక్కులు, దగ్గరి సంబంధాల గురించి అత్యంత ఆసక్తికరమైన చర్చలని లేవదీస్తున్నాయి. ఈ వ్యాజ్యాలు వివాహ చట్టాలు, స్పెషల్ మ్యారేజ్ చట్టం తో సహా, సమ లైంగిక సంబంధాల్లోని వ్యక్తులకి, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కి వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ వివక్షని నిర్మూలించాలని అనేక మంది లైంగిక మరియు జెండర్ మైనారిటీ వర్గాల వ్యక్తులు వేసినవి. వాటిని విచారిస్తూ ఏ చట్టాల్లో ఎంత మేరకు, ఏ రకంగా మార్పు తేవచ్చు అన్న విషయంపై ప్రధాన న్యాయమూర్తి నియమించిన (ఆయనతో సహా) ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ప్రభుత్వం, పిటిషనర్ల న్యాయవాదులు జరుపుతున్న వాదనలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎవరయినా చూడొచ్చు. 2009 నుండి లైంగిక ధోరణులు, జెండర్ గుర్తింపుల గురించి ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు - ఢిల్లీ హై కోర్టు 2009 లో సెక్షన్ 377 గురించి ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత 2014 లో ట్రాన్స్ జెండర్ ప్రజల పట్ల వివక్షని పూర్వపక్షం చేస్తూ వచ్చిన తీర్పు, హోమోసెక్సువాలిటీ నేరం కాదని 2018 లో సెక్షన్ 377 గురించి ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత నల్సా తీర్పు కి అనుగుణంగా 2019 లో ట్రాన్సజెండర్ వ్యక్తులకి గుర్తింపు నిస్తూ తెచ్చిన ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం - ఇవన్నీ కూడా లైంగిక, జెండర్ మైనారిటీ లకి స్వాతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత పౌరసత్వ గుర్తింపు నివ్వటం మొదలు పెట్టాయి. ఉన్నత న్యాయస్థానం ప్రస్తుతం విచారిస్తున్న 20 వ్యాజ్యాలలో వివిధ రకాలయినవి వున్నాయి. కులం, మతం, ప్రాంతం మొదలయిన వాటితో సంబంధం లేకుండా ఏ ఇద్దరు వయోజనులయిన వ్యక్తులయినా పౌర వివాహం చేసుకోగలిగే అవకాశం కల్పించే స్పెషల్ మ్యారేజ్ చట్టంలో ఆడ, మగ అనే వర్గాలని తీసేసి ఎవరికయినా పెళ్లి చేసుకునే అవకాశం కల్పించాలి అనేవి కొన్ని. మరి కొన్ని ఈ వివాహ చట్టం కేవలం వివాహం చేసుకునేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది కానీ, కలిసి పిల్లల్ని దత్తత చేసుకునే హక్కు, ఆస్తి ని రాసిచ్చే హక్కు, కలిసి ఇల్లు అద్దెకి తీసుకోవటం లేదా కొనుక్కోగలిగే హక్కు, అకౌంట్లు, ఇన్స్యూరెన్స్ కలిసి తీసుకునే హక్కు, మెడికల్ సర్జరీలప్పుడు సంతకం చేసే హక్కు,మొదలయిన మరే హక్కులని కల్పించదు కాబట్టి అన్ని వివాహ చట్టాలలో, అంటే పర్సనల్ చట్టాలలో కూడా జెండర్ తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ మార్పులు తేవాలని అని అడిగినవి. అసలు స్పెషల్ వివాహ చట్టం ఆచరణలో కులాంతర, మతాంతర వివాహాలని ప్రోత్సహించే బదులు, నెల రోజుల పాటు పెళ్లి చేసుకుంటామని అర్జీ పెట్టుకున్న వారి పేర్లు, ఇతర వివరాలు అభ్యంతరాలని ఆహ్వానించే పేరుతో అన్ని చోట్లా ప్రదర్శనకు పెట్టి వారి ప్రైవసీ కి భంగం కలిగించటమే కాకుండా వారిపై హింస జరగటానికి వీలు కల్పిస్తోంది కాబట్టి, ఆ నిబంధనని తీసేయాలని దనక్ వంటి సంస్థలు అడుగుతున్నాయి. క్వియర్ యువతకి - గే, లెస్బియన్, ట్రాన్స్ మరియు ఇతర గుర్తింపుల - అన్నిటికన్నా పెద్ద ప్రమాదం, తీవ్ర హింస, ప్రాణ హానితో సహా అమ్మా, నాన్నలు, బాబాయిలు, అత్తలు, అక్కలు, తమ్ముళ్లు, అన్నలు - ముఖ్యంగా స్వంత కుటుంబాల నుండే వస్తోందని క్వియర్ స్త్రీవాద సంస్థలు వాదిస్తూ, అసలు కుటుంబం అంటే రక్త సంబంధీకులు లేదా పెళ్లి తో వచ్చేది గా మాత్రమే కాకుండా స్వంతంగా స్నేహితులు, హితులు, ఆత్మీయులతో కలిసి కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు చట్టాలలో కల్పించాలని ఆర్జీ వేసుకున్నాయి. ఢిల్లీలో ఒక పబ్లిక్ హియరింగ్ జరిపి దాని ఆధారంగా ఒక నివేదిక కూడా ఉన్నత న్యాయస్థానానికి సమర్పించాయి. వివాహ చట్టాలలో వున్న లొసుగులు, లోపాలు సాధారణంగా మత పరమయిన పర్సనల్ చట్టాలు పితృస్వామికంగా ఉన్నాయనే చర్చ సందర్భం లోనే బయటికి వస్తాయి. అన్ని మత పరమయిన చట్టాలలో స్త్రీలకి వ్యతిరేకమయిన నిబంధనలు వున్నాయి కానీ గత రెండు దశాబ్దాలలో కేవలం ముస్లిం వివాహ చట్టాల గురించి మాత్రమే చర్చ రేకెత్తించటంలో హిందూత్వ వాదులు సఫలీకృతులయ్యారు. దీని వల్ల అందరు స్త్రీలకి జరిగిన నష్టం మామూలుగా లేదు. ఒక రకమయిన విడాకులని నేర పూరితం చేస్తూ తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం, విడాకులు ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు భార్యలని వదిలేసే స్వేచ్ఛని అన్ని మతాల పురుషులతో పాటు ముస్లిం పురుషులకి కూడా ప్రసాదించింది! వీటన్నింటి మధ్యలో వున్న వివాహ హక్కు ముఖ్యంగా తమకి నచ్చిన వ్యక్తితో, కుల, మత భేదాలతో సంబంధం లేకుండా, చట్ట బద్ధంగా వివాహం చేసుకోవాలనే ఈ తరం యువతులు, యువకుల స్వేచ్ఛ ఎన్నో రకాలుగా హరించ బడటం ప్రారంభమయింది. లవ్ జిహాద్ బూచిని దేశ వ్యాప్తంగా పెంచి పోషించిన హిందూత్వ వాదులు, తాము అధికారంలో వున్న ఉత్తర్ ప్రదేశ్ లోనూ, ఈ మధ్యే మహారాష్ట్ర లోనూ కులాంతర, మతాంతర వివాహాలపై కఠిన నిబంధనలు పెడుతూ చట్టాలు, విధానాలు రూపొందించారు. అంతే కాక, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే యువతీ యువకులపై హింస దేశంలో అన్ని రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. పిల్లలపై జరిగే వేధింపులని ఆపటానికి చేసిన పోక్సో చట్టం, బాల్య వివాహాలని ఆపటానికి చేసిన చట్టాలని కూడా యువతీ యువకుల స్వేచ్చని నిర్మూలించటానికె ఎక్కువగా వాడుకుంటున్నారు. మన రాష్ట్రంలో తల్లి తండ్రులు చేసే బాల్య వివాహాలు ఎక్కువే గానీ, అదే వయసులోని అమ్మాయిలు, అబ్బాయిలు తమంతట తాము వివాహం చేసుకోదలిస్తే మాత్రం కుటుంబాలు, పోలీసులు, సంక్షేమ యంత్రాంగం తక్షణం ప్రవేశిస్తాయి. ఆయా చట్టాల ఉపయోగం కూడా ఎక్కువగా ఈ కేసుల్లోనే జరుగుతోంది, ముఖ్యంగా కులాంతర, మతాంతర సంబంధాల విషయంలో. దేశంలో ఎక్కడా కూడా పెద్దగా ఉపయోగం లోకి రాని బాల్య వివాహ చట్టాన్ని కూడా వంకరగా ఉపయోగించే ప్రయోగం ఈ మధ్య హేమంత బిస్వాస్ ఆధ్వర్యం లోని అస్సాం ప్రభుత్వం విజయవంతంగా జరిపి మైనారిటీ తీరకుండా వివాహం చేసుకున్నారనే నెపంతో అనేక మంది ముస్లిం యువకుల్ని అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. ఇప్పటి వరకూ ఇటువంటి జంటలకు ఆర్య సమాజ్ వివాహాలు అనుకూలంగా ఉండేవి. కానీ ఈ మధ్యే ఆర్య సమాజ్ పై కూడా కొరడా ఝుళింపించి తల్లి తండ్రుల అనుమతి లేకుండా ఆయా జంటలకు వివాహాలు జరిపమనే నిబంధన తెచ్చేలా చేశారు. కుటుంబం, తల్లి తండ్రుల అధికారాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఆధునిక రాజ్యం, దాని అంగాలు ఎందుకు కదులుతున్నాయనేది ఇప్పటికయినా అందరం సీరియస్ గా వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది అమాయకంగా ‘తండ్రి ప్రేమ’, ‘తల్లి ప్రేమ’ ల గురించి సెంటిమెంటల్గా మాట్లాడుకునే విషయం కాదు. ఎప్పుడయితే చట్టాలు వయోజనులని గుర్తించి వివాహ వయసు, హక్కులు మొదలయినవి కల్పించాయో అప్పుడే కుటుంబ సంబంధాలలో మౌలిక మార్పు రావటం మొదలు పెట్టాయి, అవి విద్య, ఉద్యోగాలు పెరగటంతో పెరిగాయి, పెరుగుతాయి తప్ప తగ్గవు. ఆధునిక సమాజంలో పిల్లల కేంద్రంగా పెంపకం ఉండాలనే ధోరణులు, భూస్వామ్య సమాజ విలువలకి భంగం కలిగిస్తాయి కానీ మన దేశంలో రాజ్యం మరియు పెట్టుబడి కలిసి ఎటువంటి మౌలిక హక్కులని కానీ, సాంఘిక సంక్షేమాన్ని కల్పించకుండా కుటుంబాన్నే అందరు వ్యక్తులకి ప్రధాన ఆర్ధిక, సామాజిక వనరుగా కాపాడడంతో ‘కుటుంబం’ యొక్క ప్రాధాన్యం తగ్గటానికి బదులు పెరుగుతూ వస్తోంది. పాశ్చాత్త్య దేశాల్లో ఉద్యోగాలు, పని కల్పన, నిరుద్యోగ భృతితో సహా రాజ్యం కల్పించే అనేక సాంఘిక సంక్షేమ వసతులు యుక్త వయసు వారికి కుటుంబం నుండి దూరంగా జరిగే వెసులుబాటు కల్పిస్తాయి. మన దేశంలో, ఎటు తిరిగినా ఏమయినా కుటుంబమే ప్రధాన సపోర్ట్ వ్యవస్థగా పరిణమించటంతో యువతీ, యువకుల జీవితాలపై తల్లితండ్రుల అధికారం కొనసాగుతూనే వుంది, భవిషత్తులో కూడా వుండబోతోంది. ఈ అధికారాన్ని మన దేశ వివాహ చట్టాలు, వాటిని తలకెత్తుకున్న మత సంస్థలు, రాజ్య వ్యవస్థ గట్టిగా కాపాడుతున్నాయి. తల్లి తండ్రులని కాదని వివాహం చేసుకున్న వాళ్ళు, ప్రధానంగా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిని కుటుంబాలు తమ సామాజికార్దికం నుండి చట్ట పరంగానే వెలెయ్యటానికి స్పెషల్ మ్యారేజ్ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. సాధికారంగా కలిసి జీవించటానికి అవసరమయిన హక్కులు అన్నీ కూడా మత పరమయిన వివాహ చట్టాలక్రిందే పొందగలం. ఇక తమ జెండర్ కి చెందిన వ్యక్తులతో కలిసి జీవిస్తున్న వాళ్ళని, ట్రాన్స్ జెండర్ వ్యక్తులని అయితే కుటుంబాలు పూర్తిగా వెలేస్తాయి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు వివాహ సమానత్వం గురించి ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో జరుగుతున్న వాదోపవాదనలు కేవలం సమలైంగికులకి, పర లైంగికులకి మధ్య బేధాల గురించి కాదు. పరలైంగిక వివాహాలన్నీ గురుతర సామాజిక బాధ్యతయిన పిల్లల పెంపకం కోసమే జరుగుతాయని, సమ లైంగిక సంబంధాలు కేవలం లైంగిక తృప్తి కోసమే నని ఎవరైనా అంటే అంత కన్నా హాస్యాస్పదం మరేమీ ఉండదు. వివాహం అంటేనే పరస్పర బాధ్యత, ఆర్ధిక సంబంధాలు, పిల్లల పెంపకం, వృద్ధాప్యంలో తోడు మొదలయినవి. ఎవరు చేసుకోవాలనుకున్నా వివాహ సంబంధాల అంతరార్ధం అదే. కులాంతర, మతాంతర, సమ లైంగిక, ట్రాన్స్ జెండర్ వివాహాలు ఏవయినా కావచ్చు అన్నీ అంతే. తామెంచుకున్న వ్యక్తితో ఉండాలనుకోవటం తప్ప ఏ వివాహం లోనయినా కొత్తది ఏమీ ఉండదు. ప్రభుత్వ తరపు న్యాయవాదులు సమలైంగిక, ట్రాన్స్ జెండర్ వివాహాల గురించి కాలేజీ విద్యార్ధులని కూడా ఒప్పించలేని వాదనలు ప్రధానంగా చేస్తున్నప్పటికీ, ఆ గందరగోళంలో కొన్ని అవసరమైన ప్రశ్నలు కూడా వున్నాయి. వివాహ ఒప్పందాల్లో స్త్రీలని బలహీన భాగస్వాములుగా గుర్తించి రూపొందించిన పౌర చట్టాల్లో వివాహం విచ్చిన్నమయినపుడు, భర్తలు వదిలేసినప్పుడు, హింసకి గురిచేసినప్పుడు స్త్రీలకి అవసరమయిన రక్షణలని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వివాహాల్లో సమానత్వం అడుగుతూ భార్యా భర్త లిద్దరినీ సమానులుగా పరిగణిస్తే ఈ రక్షణలని ఎలా అమలు చెయ్యాలి, ఎవరిని బలహీన భాగస్వాములుగా గుర్తించాలి? కుటుంబ/వివాహ చట్టాల్లో జండర్ న్యూట్రాలిటీని తెస్తే లాభపడేది మన సమాజంలో పరలింగ వివాహ సంబంధాల్లోని స్త్రీలయితే కాదు. అయితే క్వియర్ వ్యక్తులు గా జీవించే అనేక మంది వివాహం గురించే కాక, మన అందరికీ అసలు కుటుంబం అంటే ఏమిటనే రాడికల్ ప్రశ్న కూడా వేస్తున్నారు. పెళ్లి చేసుకో కూడదని నిర్ణయించుకున్న వ్యక్తులకి, వాళ్ళు ట్రాన్స్ కావచ్చు, కాకపోవచ్చు, పర లింగ, సమ లింగ లైంగికత్వ వ్యక్తులు కావచ్చు, కుటుంబం ఏర్పాటు చేసుకునే అవకాశాలు, ముఖ్యంగా ఆయా కుటుంబాలు హింసాత్మకమైనవి అయినప్పుడు, ఏమున్నాయి? కుటుంబం అంటే మన అందరికీ ఎంచుకోని రక్త సంబంధాలూ, తప్పని పెళ్లిళ్ల తో ఏర్పాటు అయేవేనా, స్నేహితులూ, దశాబ్దాలు కలిసి పని చేసిన కామ్రేడ్లూ కాదా, కలిసి జీవించే వాళ్లేనా, ఎప్పుడూ మనతో వివిధ ప్రయాణాలు చేసిన వాళ్ళు కాకూడదా, లేక కలిసి జీవించే వాళ్ళు, కలిసి ప్రయాణం చేసే వాళ్ళు రెండు రకాల వాళ్ళు కలిసి మన కుటుంబం ఎందుకు కాకూడదు అని. మత పరమైన చట్టాలని పక్కన పెట్టి, పౌర చట్టాలలో హింసాత్మక కుటుంబాల నుండి దూరమయ్యే వెసులుబాటు, తమ తోడుగా వుండే మనుషులకి గుర్తింపు నిచ్చే వెసులుబాటు కల్పించమని అంటున్నారు. 60 ల నుండి 20 ల వయసున్న క్వియర్ వ్యక్తులు తమ జీవితాలని ఉదహరిస్తూ తమ జీవితాల్లో ఆద్యంతం తమకి తోడున్న వ్యక్తులకి చట్ట పరమయిన గుర్తింపు లేకపోవటంతో క్లిష్ట సమయంలో కూడా తమని హింసించిన రక్త సంబంధీకుల సంతకాలకి మాత్రమే చట్టపరమయిన గుర్తింపు నివ్వటం అన్ని విధాలుగా అన్యాయానికి, క్షోభకి గురి చేస్తోందని, తమని వద్దనుకున్న కుటుంబ చట్రాల్లోకి తమని నెడుతోందని వారు చేస్తున్న విజ్ఞప్తులు వారికే కాక మన సమాజంలో అనేక మందికి కూడా వర్తిస్తాయి. కుటుంబ బంధాలు తెగిపోయాయని బాధపడే వాళ్ళందరూ కూడా ఎవరికీ హాని తలపెట్టకుండా తమకి నచ్చిన చదువు, పని, తమకి నచ్చిన మనుషులతో జీవితాలు గడపాలనుకున్నప్పుడు అవే కుటుంబాలు ఎంత క్రూరంగా, అమానుషంగా హింసిస్తాయో, మనిషితనాన్ని మర్చిపోతాయో కూడా గుర్తు తెచ్చుకోవాలి కదా. కుటుంబ బంధాలు సంక్లిష్టమే కానీ, కుటుంబమే బందిఖానా కాకూడదు కదా. ఆయా సందర్భాల్లో చిక్కుకున్న మనుషులకి తమదైన కుటుంబాన్ని - వివాహం ద్వారానే కాదు - ఎంచుకునే అవకాశం ఎందుకు వుండకూడదు? మన ప్రజాస్వామ్యం ఇప్పటికయినా పుట్టుక, వివాహం తోటే ముడిపడి వున్న కుటుంబ చట్టాల సంకెళ్ళ నుండి పౌరులకి తమ కుటుంబాలని తాము ఎంచుకోగలిగే స్వేచ్చని, వెసులుబాటుని కల్పించే దిశలో ఆలోచన చేస్తుందా అన్నది వేచి చూడాలి. Published in Andhra Jyoti newspaper

Comments