విద్యార్థులు - రాజకీయాలు
గుర్మీహెర్ కౌర్ మన దేశం లో డెబ్బై ఏళ్ల విఫలమయిన విద్యా వ్యవస్థకి, సామాజిక, కుటుంబ విలువలకి చిహ్నం అని మన రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు వాపోయారు. ఇరవయ్యేళ్ళ ఈ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, తమ కాలేజీలో ‘నిరసన సంస్కృతి’ పై పెట్టుకున్న సెమినార్ ని అఖిల భారత విద్యార్థి సంఘ కార్యకర్తలు వచ్చి భగ్నం చెయ్యటమే కాక, రాళ్లు వేసి విద్యార్థులని, ఉపాధ్యాయుల్ని బొమికెలు విరిగేలా కొట్టడాన్ని ఖండించినందుకు, ‘నేను ఏబి విపి కి భయపడను’ అని పేస్ బుక్ లో చెప్పినందుకు. ధైర్యంగా హింసని వ్యతిరేకించిన ఒక ఇరవయ్యేళ్ళ అమ్మాయిని వ్యవస్థ వైఫల్యంగా అయన ఏ ఉద్దేశంతో వారించారో కానీ, నాతో సహా, చదువుకుంటున్న పిల్లలు వున్న అందరికి, ఈయన ఏ కాలంలో జీవిస్తున్నారో అని ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో విశ్వ విద్యాలయాల్లో, కాలేజీల్లో, ఇంకా చెప్పాలంటే, బడిలో చదువుకుంటున్న పిల్లలక్కూడా అనేక విషయాలపై, రాజకీయాలతో సహా, స్వంత అభిప్రాయాలు ఉంటున్నాయి. ఎక్కడో అక్కడ, పేస్ బుక్ లోనో, మిగిలిన సోషల్ మీడియా లోనో, వాటిని వ్యక్తం చెయ్యటం కూడా మామూలే.
గత పది, పదిహేను సంవత్సరాలలో మన విద్యా వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా విద్యార్ధులకి స్వంత ఆలోచన వుండాలని నొక్కి చెపుతున్నారు. విద్యార్థులు కేవలం పుస్తకాల్లో వున్నది లేదా ఉపాధ్యాయులు చెప్పింది బట్టి కొట్టకుండా, స్వంతంగా ఆలోచించి రాయాలని ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుండి దిన పత్రికలని చదవాలని, సమకాలీన విషయాలని గురించి తెలుసుకోవాలని చెపుతున్నారు. ఉదాహరణకి, ఎంతో మంది విద్యార్థులు గత ఆరు నెలల్లో ‘దీమోనేటైజేషన్’ పైన తమ క్లాసులో మాట్లాడాల్సి వచ్చింది. వారు దాని కోసం టీవీల్లో చర్చలు చూసి, దినపత్రికలు చదివారు. తల్లి తండ్రులని అడిగారు. అవి చదివే, లేక క్లాసులో నివేదించే సందర్భంలో వారికి తమదైన అభిప్రాయం, ఆలోచనలు, సందేహాలు కలగక పోవు. ఆ మూడు నెలల్లో వారి వారి ఖర్చులపై తల్లి తండ్రులు నియంత్రణ పెట్టినప్పుడు తాము చదివిన దానికి, ఇంట్లో జరుగుతున్న దానికి అన్వయించుకోకుండా వుండరు. అంటే రాజకీయ పరిజ్ఞానం పెంచటం మన విద్యావ్యవస్థలో ఒక భాగంగా మారింది.
మనలో చాలా మంది పెద్ద వాళ్ళు అయ్యాక తాము పిల్లలుగా, యువతీ యువకులుగా వున్నప్పుడు తమ ఆలోచనలని విద్యాలయాలు ఎలా మలిచాయో మరిచిపోతాం గానీ, ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, ఆ సమయంలోనే మనమందరం దేశం గురించి, దేశ చరిత్ర గురించి, వలస పాలన గురించి, సంఘ సంస్కరణ ఉద్యమం గురించి, రాజ్యాంగ సభ నుండి రాజ్యాగంలోని ప్రాధమిక హక్కుల వరకు ఇక్కడే నేర్చుకుంటాం. తమ దేశం గురించి అభిమానం, గర్వం, అలాగే సమాజం గురించి ఎంతో కొంత అవగాహన ఏర్పడే సమయం ఇది. అలాగే, ఆదర్శాలు ఏర్పడే సమయం కూడా ఇదే. ఇటువంటి ప్రాధమిక రాజకీయ అవగాహన మాత్రమే కాక ప్రభుత్వాలు లైంగిక వేధింపులు, రాగింగ్, లేదా పర్యావరణం గురించి పట్టించు కోవాలని విద్యార్ధులకి ప్రత్యేక అవగాహన అందిస్తున్నాయి. చట్టాలు, విధానాలు కాకముందు ఇవన్నీ రాజకీయ ఉద్యమాల నుండి ఉద్భవించిన విషయాలే.
అంతర్జాలం కూడా అన్ని రకాల సమాచారాన్ని, చర్చలని, విషయాలని ఇది వరకటి కంటే మరింత అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్ధులందరు ఇక్కడ దేశ దేశాల గురించి, అక్కడి విద్యా సంస్థల గురించి, కోర్సుల గురించే కాక, కొత్త ఆలోచనలని కూడా నేర్చుకుంటున్నారు. అమెరికా ఎన్నికలు, ఫ్రాన్స్ లో బుర్ఖిని వివాదం లతో పాటు, ఆడపిల్ల బహిష్టు వస్తే సిగ్గు పడే విషయం కాదని, నల్ల గా వున్న వారిని వారి చర్మ రంగు గురించి గేలి చెయ్యటం, వివక్ష చూపటం రేసిజం అంటారని, అమ్మాయిలు అబ్బాయిల్లాగే అన్ని వేళల్లో బయట తిరగ వచ్చని, మన దేశంలో దళితులపై అన్ని రంగాల్లో వివక్ష ఉందని - ఇలా అంతర్జాలం లో చర్చ జరగని విషయం లేదు. వీటన్నిటి వల్ల అనేక రకాల విషయాలపై విద్యార్థులు అవగాహన, ఆలోచనలు, అభిప్రాయాలని ఏర్పర్చుకుని, జీవితాలని మెరుగు పరిచుకుంటున్నారు.
పైగా, మన ప్రభుత్వాలే విద్యార్థులని తమ తమ వైఫల్యాలతో క్రియాశీలక రాజకీయాలలోకి నెడుతూ ఉంటాయి. ఉదాహరణకి ప్రభుత్వ విద్యాలయాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో సహా, విద్యార్ధులకి సమయానికి స్కాలర్ షిప్పులు అందించకపోవడం లేక ఫీజులు చెల్లించకపోవడం, లైంగిక వేధింపులకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోక పోవటం, విద్యార్ధినులకు లైబ్రరీ సమయంపై ఆంక్షలు పెట్టటం, లేదా పరిశోధన విద్యార్ధులకి ఇచ్చే ఫెలోషిప్ అందించక పోవటం, ఉద్యోగాలు భర్తీలు చేయకపోవటం - ఇలా ఎన్నో.
అయితే, రోజు వారీ సమస్యల గురించి లేదా నిరుద్యోగం గురించి విద్యార్థులు ఆందోళనలకు దిగటం అర్ధం చేసుకున్న వారికి కూడా, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు రోజు వారీ సమస్యలతో సంబంధం లేని సామాజిక, రాజకీయ విషయాలపై నిరసన చేపట్టటాన్ని జీర్ణించుకోవటం కష్టంగా పరిణమించింది. దీనికి ఒక కారణం మన సమాజంలో ప్రొఫెషనల్ కోర్సులకి సంబంధించిన పరిజ్ఞానంతో పోలిస్తే, సామాజిక శాస్త్రాలు, మానవ శాస్త్రాల గురించిన పరిజ్ఞానం కొంచెం తక్కువగా ఉండటం. ఏ జ్ఞానం, విద్య కూడా కేవలం టెక్నీకల్ విషయాలు కావు, వాటిని అన్వయించుకున్నప్పుడే ఒక మంచి విద్యార్థినిగా తయారవుతారని అందరికీ తెలుసు. రాజకీయ శాత్రం, సాహిత్యం, చరిత్ర, ఆర్ధిక శాస్త్రం చర్చించే సమాజం, ప్రభుత్వం, రాజ్యం, ప్రభుత్వ విధానాలు, ఉద్యమాల గురించి అర్ధం చేసుకున్న విద్యార్థినికి, ఆ స్వాతంత్ర ఫలాలు, ఆయా ఉద్యమ ఫలాలు ఇప్పటికి, తన సమాజానికి, కుటుంబానికి, తనకి ఎందుకు అందట్లేదనే ప్రశ్న రావటం సహజం. ఆ విద్యార్థులని గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చిన మొదటి తరం ఆదివాసీ, దళిత, బహుజన, మహిళా, పేద విద్యార్థిగా లేదా గుర్మీహెర్ కౌర్ లా యుద్ధంలో తండ్రిని కోల్పోయిన అమ్మాయిలా ఊహించుకుంటే మనకు ప్రస్తుత విద్యార్థుల ఆందోళనలను అర్ధం చేసుకోవటం సులభమవుతుంది.
విద్యని కేవలం ఉద్యోగాలకి సంబంధించిన టెక్నీకల్ విషయంగా చూసి, సమాజానికి, విద్యార్ధులకి వుండే సంబంధాలని పక్కన పెట్టాలనే ధోరణులకు ప్రభుత్వ విధానాలు కూడా ఒక ప్రధాన కారణం. ఇరవయ్యేళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రయివేటీకరణ విధానాల్లో, అప్పటికి పుంజుకుంటున్న అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలని అంది పుచ్చుకునేందుకు టెక్నీకల్ విద్యకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచ బాంకు విధానాలు పాటించి ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా బందు పెట్టారు. ఈ రొండింటి వల్ల రెండు అపోహలు మన సమాజంలో పెరిగాయి. ఒకటి, అంతర్జాతీయ మార్కెట్ లో ‘ఆయా డిగ్రీలు పొంది, ఉద్యోగాలు కొట్టటం’ అలవాటు పడిన ప్రజానీకం అవి తప్ప మిగిలిన శాస్త్రాలు అనవసరం అన్న అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంది. రెండవది, సామజిక శాస్త్రాలు చదివిన వారికి ఉద్యోగాలు లేకపోవటమన్న విషయాన్ని సామాజిక శాస్త్రాల అంతర్గత విలువకి జోడించి, వాటిలో ఆసక్తి పోగొట్టుకుని, అవి అనవసరం అన్న అభిప్రాయానికి వచ్చింది. ఉద్యోగ లేమి ప్రభుత్వ రంగం, ముఖ్యంగా విద్యా రంగంలో ఉద్యోగాలు నింపక పోవటం వల్ల జరిగిందనే విషయం ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. దేశానికి సాఫ్ట్ వెర్ రంగం నుండి వచ్చే ఆదాయం ఎంత అవసరమో, పౌరుల్ని తయారు చెయ్యాల్సిన సామాజిక, మానవ శాస్త్రాలు కూడా అంతే అవసరం అన్న మౌలిక అవగాహన కొరవడటం దూర ద్రుష్టి లేని ప్రభుత్వ విధానాల వల్ల కూడా జరిగింది.
ఇటువంటి సామాజిక పరిస్థితులకి ఇటీవల మన దేశంలో పెరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయ ధోరణులు కూడా తోడయ్యి విశ్వ విద్యాలయాలలో విద్యార్థుల జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి. నిరసనలని ఏ మాత్రం సహించకపోవటం, చేసిన వారిపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటం, చీటికీ, మాటికీ, హాస్టల్ నుండి, యూనివర్సిటీ నుండి బహిష్కరించటం లేదా క్రిమినల్ కేసులు పెట్టటం దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా హైద్రాబాదులోని విశ్వవిద్యాలయాల్లో బాగా పెరిగాయి. విద్యార్థులు తమ తమ సంస్థల్లోని అప్రజాస్వామిక ధోరణులు, విధానాల పట్ల నిరసన వ్యక్తం చెయ్యటం కొత్తేమి కాదు. కానీ,విశ్వవిద్యాలయాలు విద్యార్థుల పట్ల, ముఖ్యంగా దళిత, బహుజన, మైనారిటీ విద్యార్థుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించటం మాత్రం కొత్త పరిణామమే. పెద్ద ఎత్తున ఆయా సమూహాల విద్యార్థులు విశ్వ విద్యాలయాల్లో ప్రవేశిస్తున్న సందర్భంలో ఈ ధోరణులు పెరగటం కొనసాగుతున్న కులీనత, బ్రాహ్మణిజంగా తప్ప వేరే రకంగా అర్ధం చేసుకోవటం కష్టం.
రోహిత్ సంస్థాగత హత్యకి గురయినప్పుడు, ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఐదుగురు విద్యార్థులని, ఇఎఫ్ ఎల్ విశ్వవిద్యాలయంలో పదకొండు మందిని, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు హాస్టల్ నుండి బహిష్కరించారు. మరి కొంత మందిని యూనివర్సిటీ నుండి బహిష్కరించారు. మొన్నటికి మొన్న, ఇఎఫెల్ విశ్వవిద్యాలయం ఒక ఆదివాసీ విద్యార్థి పట్ల వివక్షాపూరిత ధోరణితో వ్యవహరించిన ఉపాధ్యాయినికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినందుకు, న్యాయం కావాలని అడిగి నుందుకు ఐదుగురు విద్యార్ధులపై ఆమె పరువు నష్టం దావా వేస్తె, కోర్టు వారికి శిక్ష కూడా విధించింది. మామూలుగా కోర్టుల్లో ఈ దావాలు నిలువవు, ఏ నేర చరిత్ర లేని విద్యార్థులు కాబట్టి మహా అయితే ఒక వార్నింగ్ తో వదిలేస్తారు. కానీ దేశంలో ప్రబలుతున్నవిద్యార్థి వ్యతిరేక వాతావరణం వల్ల కాబోలు కోర్టుకి కూడా వివక్షని వ్యతిరేకించిన నేరానికి వారికి శిక్ష వెయ్యాలని అన్పించింది.
విద్యార్థులంటే ఏదో కాలేజీలో, విశ్వవిద్యాలయంలో డిగ్రీలు సంపాదించి ఆ తరువాత, కంపెనీలలో లేదా కార్యాలయాల్లో పని చెయ్యాలి; విద్యాలయాలంటే అటువంటి మంచి ఉద్యోగునని, కార్మికుల్ని తయారుచేయాలి తప్ప వేరే దేనినీ అనుమతించ కూడదు అన్న ఆలోచనా రీతి ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగం కాదు. విద్యా వ్యవస్థ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే. అసలు అన్ని ఆధునిక ప్రజాస్వామిక దేశాలలో విద్యా వ్యవస్థ ప్రధాన ఉద్దేశం దేశానికి కావాల్సిన పౌరులని తయారు చెయ్యటమే. విద్యార్ధులకి రాజ్యాంగం కొంతలో కొంతయినా నేర్పి, కుటుంబం, కమ్యూనిటీ, మతం ఇచ్చిన పాత విలువలని, నైతికతని పక్కన పెట్టి, ఒక లౌకిక, రాజ్యాంగ నైతికత, ప్రజాస్వామ్య విలువలు, సంస్కృతిని నేర్పించటం కోసం విద్యా వ్యవస్త పని చేస్తుంది. రాజ్యాంగ నైతికతకు, సమాజ నైతికతకు లేదా ప్రభుత్వ విధానాలకు వైరుధ్యం కనిపించినపుడు పుట్టేవే విద్యార్థి రాజకీయాలు. అవి వ్యవస్థకి, ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయలు మాత్రమే వ్యక్తం చెయ్యాలని భావించటానికి డెబ్భై ఏళ్ళ స్వాతంత్య్రానంతర భారత చరిత్ర సహకరించదు. ప్రతి దశకంలోనూ విద్యార్థులు ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించిన రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో పాల్గొనటం, ఆ తరువాత ఎన్నికల రాజకీయాల్లో పాల్గొని, ప్రజా ప్రతినిధులయ్యి, దేశ ప్రయోజనాలు కాపాడటానికి చట్టాలు చెయ్యటం మామూలుగా వస్తోంది. మన దేశ రాజకీయ సంస్కృతిలో విద్య వ్యవస్థలో ఉద్యమాలు ప్రత్యక్ష రాజకీయాలకి మెట్టుగా ఉంటూ వచ్చాయి.
ఏ ప్రజాస్వామ్యంలో అయినా ప్రభుత్వ విధానాల వ్యతిరేకత సహజం. అది విదేశాంగ విధానం, రైతాంగ విధానం లేదా కాశ్మీరు విధానం లేదా ఉగ్రవాద వ్యతిరేక విధానం కావచ్చు, కానీ ఒక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాల వ్యతిరేకతని, ప్రజాస్వామ్య విలువలని రాజకీయ పార్టీలకి లేదా ఎన్నికలకి పరిమితం చెయ్యాలనే ద్రుష్టి కోణం మౌలికంగా అప్రజాస్వామికం. విశ్వవిద్యాలయాలలో వున్నకులీన, బ్రాహ్మణీయ సంస్కృతిని ప్రజాస్వామీకరించటం భారత ప్రజాస్వామ్యానికి అత్యవసరం. ఆయా వ్యవస్థల, విధానాల విమర్శని, వాటి పట్ల నిరసనని, నేరంగా పరిగణించటం, దాన్ని బలవంతంగా అణచి వెయ్యాలనుకోవటం లేదా ఆయా విద్యార్ధులపై ఆక్రమ కేసులు పెట్టి వేధించటం ప్రజాస్వామ్య వ్యవస్థీకరణకు, స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్య విలువలని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రతి పౌరునిపై పెట్టింది. అటువంటి బాధ్యతని నెత్తిన వేసుకున్న మన విద్యార్థి రాజకీయాలు మన సమాజాన్ని, ప్రభుత్వాలని, ప్రజాస్వామ్యాన్ని బలపరిచి, రాజ్యాంగ నైతికతని నిలబెట్టటానికి పూనుకున్నాయి. మన విద్యార్థులు ఇటువంటి బాధ్యతని ఎత్తుకున్నందుకు మనందరం గర్వ పడాలి. వారిని వ్యవస్థ వైఫల్యాలుగా వర్ణించటం సంకుచిత ద్రుష్టి కోణాన్ని, స్వార్ధ ప్రయోజనాలని, రాజకీయ అపరిపక్వతని ప్రతిబింబిస్తుంది.
"వివక్ష వద్దంటే శిక్షిస్తారా?" పేరుతో ఆంధ్ర జ్యోతి వార్తా పత్రికలో 12 మార్చ్ 2017 న ప్రచురితమయింది
https://epaper.andhrajyothy.com/c/17469813
Comments
Post a Comment