ముస్లింలలో వెనుకబాటుతనం: రిజర్వేషన్లు
మన రాష్ట్రం లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ముస్లింలలో వెనుకబడిన వర్గాలకి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చిన చట్టం ముస్లింలలో వెనుకబాటుతనం పై చర్చని మరలా ముందుకు తీసుకు వచ్చింది. ఈ రిజర్వేషన్లని వ్యతిరేకించే వాళ్ళు ముస్లింలు కేవలం ఆర్ధికంగా మాత్రమే వెనుక బడి వున్నారని, సామాజికంగా వారికి కుల సమస్య లేదు కాబట్టి వారిలో వెనుక బాటు తనం లేదని అందువల్ల రిజర్వేషన్లు ఇవ్వకూడదని; ఇచ్చినా సరే వెనుకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లలో కాకుండా సరి కొత్తగా వారికి రిజర్వేషన్లు కల్పించి ఇవ్వాలని, లేకుంటే దీని వల్ల వెనుకబడిన వర్గాలకి నష్టం వాటిల్లుతుందని; ముస్లింలకు సమూహంగా రిజర్వేషన్లు చట్ట పరంగా చెల్లవని, కోర్టు వీటిని కొట్టేస్తుందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనల్లో కొత్తవి ఏమీ లేవు. 2004 లో కాంగ్రెసు ప్రభుత్వం మొదటి సారి వెనుక బడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన ప్పటి నుండి వస్తున్నవే. అయితే వీటిలో సరయిన వాదనలని, తప్పుడు వాదనల నుండి వేరు చేస్తే తప్ప మనకి ముస్లింలకు రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం గురించి అర్ధం కాదు.
మొదటి అసంబద్ధ వాదన - ప్రస్తుత ప్రభుత్వం ‘ఓట్ల కోసమే’ దీన్ని ప్రవేశపెట్టింది అనటం. మునుపటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1970 నుండి అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ నడిచింది. మొదటి రెండు బిసి కమిషన్లు అప్పటికే రిజర్వేషన్లు వున్న దూదేకుల, మెహతార్లు ని ఆ తరువాత ఖురేషీలని తప్ప వేరే వారిని గుర్తించటానికి ఏ కృషీ చెయ్యలేదు. ఎప్పుడు మైనారిటీలపై చర్చ జరిగినా, అనేక మంది, పార్టీలతో సంబంధం లేకుండా ముస్లింలు వెనుకబడి వున్నారని ఒప్పుకుని, వారికి రిజర్వేషన్లు అవసరమని బలంగా చెప్పారు. 2004 నుండి మూడు బీసీ కమిషన్లు ఈ విషయంపై నివేదికలు సమర్పించాయి. మండల్ కమిషన్ నివేదిక కూర్పు లో ప్రధాన పాత్ర వహించిన పి ఎస్ కృష్ణన్ 2007 లోనే అప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లింల పరిస్థితులపై కూలంకషంగా పరిశోధన చేసి, అప్పటి వరకూ వున్న అన్ని పరిశోధక పత్రాలని క్రోడీకరించి దాదాపు 300 పేజీల నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు. దానిలో ఆయన, తెలుగు ముస్లింలలో కులీన వర్గాలు మినహాయించి మిగిలిన అందరు వెనుకబడి వున్నారని నిర్ధారించారు. దూదేకుల, ఖురేషీలు,మెహతారు వంటి తెలిసిన గ్రూపులని కాకుండా, మొదటి సారి అనేక ముస్లిం తెగలు/కులాలు/వర్గాలని - ముస్లిం ధోబీలు, ఫకీర్లు, గారడీ వాండ్లు వంటి 14 గ్రూపులని - ఈ కమిషన్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిని బీసీలలో చేరుస్తూ 2007 లో చేసిన చట్టం ఇప్పటికీ అమలులో వుంది.
ముస్లింలలో ఆర్ధిక వెనుకబాటు తప్ప వేరే విధమైన వెనుకబాటుతనం లేదని ఇంకొక వాదన వినిపిస్తోంది, కానీ తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుధీర్ కమిషన్ నివేదిక చదివితే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఏర్పడిన సామాజిక వెనుకబాటుతనం వల్లే వారిలో ఆర్ధిక వెనుకబాటుతనం కూడా పెరుగుతోందని అర్ధమవుతుంది. అనేక పరిశోధకులు 1991 నుండి 2011 వరకున్న విద్య, వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితులు, ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో శాతం, పేదరికం, స్వంత ఇల్లు, మాతా, శిశు ఆరోగ్యం, సంక్షేమం వంటి అనేక విషయాలపై ప్రభుత్వ గణాంకాలు తీసుకుని, అలాగే ముస్లింలలో వున్న కృష్ణన్ కమిషన్ పేర్కొన్న అనేక వృత్తి సమూహాలపై శాంపిల్ అధ్యయనాలు జరిపి ఈ సంవత్సరాలలో రిజర్వేషన్లు తీసుకున్న అనేక వెనుకబడ్డ కులాల, షెడ్యూల్డు తరగతుల స్త్త్తితి 2011 కి బాగా మెరుగుపడిందని, ముస్లింల స్థితి మాత్రం 1991 కంటే దిగజారిందని తేల్చారు. దీనికి ముస్లింలకు ఎటువంటి సంక్షేమ పథకాలు, తగినంత రిజర్వేషన్లు కల్పించకపోవడం, అమలు పరచకపోవటం ప్రధాన కారణాలు. అందువల్లే, కృష్ణన్ కమిషన్ కంటే ముందుకెళ్లి ఇటువంటి సామాజిక వెనుకబాటుని తగ్గించాలంటే ముస్లింలు అందరిని కూడా మన రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గంగా గుర్తించాలని సుధీర్ కమిషన్ చెప్పింది.
ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వటం ‘మత పరమైన’ రిజర్వేషన్లు కల్పించటం అని మరొక విమర్శ కూడా వినవస్తోంది. రిజర్వేషన్లని రెండు రకాల చారిత్రక అన్యాయాలకు చికిత్సగా రూపొందించారు: ఒకటి సామాజిక వెనుకబాటుతనం, రెండవది వివక్ష. సామాజిక వెనుకబాటుతనం కులం, వర్గం, ప్రాంతం అనేక కారణాల వల్ల రావచ్చు, వివక్ష అన్నది వీటికి అతీతంగా పనిచేస్తుంది. ముస్లింలు రెండు రకాల అన్యాయాలకు గురవుతున్నారనేది సచార్ కమిషన్ నివేదికతో అందరికీ స్పష్టమయింది. మన రాష్ట్రంలో సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక, కృష్ణన్ కమిషన్ నివేదిక, అబూ సాలే షరీఫ్ నివేదిక, సుధీర్ కమిషన్ నివేదిక దీన్ని ఇంకా నిర్ధారించాయి. ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా ఇతర ఉద్యోగాల్లో లేకుండా స్వంతంగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకోవాల్సి రావటం స్వాతంత్రానంతర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఫలితం. అంతే కాక, ఒక మతానికి చెందటం వల్లే వివక్షకు గురవ్వుతున్నారనే విషయం కూడా వినటానికి చేదుగానే ఉంటుంది గానీ అందరికీ తెలిసిన సత్యమే. వీటిని ‘మత పరమైన’ రిజర్వేషన్లుగా ప్రచారం చేస్తున్న వారికి చెప్పాల్సింది - మత పరమయిన వివక్షకి గురవుతున్న సమూహానికి ఈ రిజర్వేషన్లు విరుగుడుగా పనిచేస్తాయి.
సామాజిక వెనుకబాటుతనాన్ని కుల వ్యవస్థ కి కుదించి, అది ఇస్లాం మతం లో లేదు కాబట్టి వారు వివక్షకు గురవ్వరు కాబట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అన్న ఇంకొక విచిత్ర వాదన కొంత మంది చేస్తున్నారు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక మతంలో వివక్ష కాదు. సుప్రీమ్ కోర్టు కొంత కాలం వెనుకబడ్డ వర్గాలని వెనుకబడ్డ కులాల ఆధారంగా గుర్తించింది కానీ ఇటీవల ఈ ధోరణిని అనేక తీర్పులలో తోసిపుచ్చింది. ఈ వాదనని స్వర్గీయ బాలగోపాల్ కూడా కోర్టులో తన వాదనలలో, రచనలలో అనేక సార్లు వ్యతిరేకించారు. వివక్ష పలు రకాలుగా వుంటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని వాదించారు. వెనుకబాటు తనంపై కొన్ని దశాబ్దాలు పనిచేసిన పి.ఎస్ కృష్ణన్ కూడా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లని కల్పించకూడదని రాజ్యంగం గానీ, కోర్టులు గానీ, ఇతర వెనుకబడ్డ వర్గాల కమిషన్లు గానీ ఏ విధమయిన ఎక్కడా కూడా నియమం పెట్టలేదు అని స్పష్టం చేశారు.
సామాజిక వెనుకబాటుతనం కులంతో మాత్రమే ముడిపడి లేదన్న విషయం వెనుకబడ్డ వర్గాల లిస్టు చూస్తే కూడా తెలుస్తుంది. అనేక సంచార జాతులకు వీటిలో స్థానం వుంది. అలాగే ఇస్లాం, క్రిస్టియన్ మతాలకి మారిన దళితులు కూడా భాగమే. వివిధ రాష్ట్రాల నుండి వివిధ ముస్లిం కులాలు, వర్గాలు, తెగలు కేంద్ర వెనుకబడ్డ జాబితాలో భాగం పొందాయి కూడా. అంతేకాక వెనుకబడ్డ వర్గాలని ప్రాంతం బట్టి గుర్తిస్తారు. అందుకే బీహార్ వంటి రాష్ట్రాల్లో కొన్ని ముస్లిం కులాలు అతి వెనుకబడ్డ కులాల్లో, మరి కొన్ని వెనుకబడ్డ కులాల్లో వున్నాయి. కానీ, తమిళనాడులో ముస్లిము సమూహాన్ని వివక్షకు గురయిన సమూహంగా గుర్తించారు. వారిలో అత్యంత వెనుకబడిన వర్గాన్ని వెనుకబడిన వర్గాల్లో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు కుల ప్రాతిపదికన కాకుండా సమూహం గానే హైదెరాబాదు రాజ్య పతనం తరువాత జరిగిన పరిణామాల వల్ల వివక్షకు గురయ్యి వెనుకబడ్డారని ఒస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రషీయుద్దీన్ ఖాన్ మరియు ఒమర్ ఖాలిద్ వంటి ప్రసిద్ధ పరిశోధకుల రచనలు 1970 ల నుండే చెప్తూ వచ్చాయి. అంతేకాక గత కొన్ని సంవత్సరాలలో అనేక ప్రభుత్వ లెక్కలు, అంచనాలు కూడా ముస్లింలు సామాజిక వివక్షకు గురవుతున్న సమూహంగా చెప్తున్నాయి.
అయినా సరే, చాలా మంది దీన్ని ఎలాగో కోర్టు కొట్టేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాకి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఈ చట్టంపై వ్యవహరించిన తీరు కారణం. 2004, 2005 లలో అప్పటి ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లపై చేసిన చట్టాలని ఆంధ్ర ప్రదేశ్ వున్నత న్యాయస్థానం పద్ధతులు, నియమాలు పాటించలేదన్న కారణంతో కొట్టేసింది. అయితే, కృష్ణన్ కమిషన్ నివేదిక సమర్పించిన తరువాత కూడా 2010 లో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పు (ఐదుగురు వద్దని, ఇద్దరు ఉంచాలని) ముస్లింలలో వెనుకబాటుతనాన్ని నిర్ధారించటానికి అత్యంత కఠోర నియమాలని రూపిందించింది. ముస్లింలలో వెనుకబాటుతనం వున్నదని ఒప్పుకుంటూనే, దాన్ని శాస్త్రీయంగా, సరయిన నిదర్శనాలతో, ఏ మాత్రం తప్పు లేకుండా నిరూపించినప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని, లేకుంటే వీటిని ‘మత పరమయిన రిజర్వేషన్లుగా’ పరిగణిస్తామని చెప్పింది. చట్టాన్ని అత్యంత సంకుచితంగా నిర్వచించిన ఈ ధోరణి వెనుకబడ్డ ముస్లిం వర్గాలకి రిజర్వేషన్ల ఇవ్వటానికి తీవ్ర అడ్డంకిగా మారింది. కుల, మత, ఆర్ధిక పరమయిన శాస్త్రీయ గణాంకాలు లేని పరిస్థితుల్లో అందరు పరిశోధకులు అనుసరించే శాంపిల్ అధ్యయనాలు కాకుండా ప్రతి ఒక్క వెనుకబడిన ముస్లింల పరిస్థితులని తెలపాలని, ప్రతి ఒక్కరు ఏ విధమయిన వెనుకబాటుతనానికి గురవుతున్నారనేది స్పష్టమయిన ఆధారాలతో తెలపాలని నిర్దేశించటం ఏ విధంగానూ సరైంది కాదు. అయితే, ఈ సంకుచిత ధోరణిపైనే ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేక వాదులు తమ నమ్మకం పెట్టుకున్నారు.
అన్నిటికన్నా ఆశర్య కరమైన ధోరణి ముస్లిం వెనుకబాటుతనాన్ని గుర్తించటాన్ని ఇప్పటికే గుర్తించబడ్డ వెనుకబడ్డ వర్గాలకి వ్యతిరేకంగా భావించటం లేదా వారి రిజర్వేషన్లని ముస్లింలు తీసేసుకుంటున్నారని భావించటం. వెనుకబడ్డ వర్గాల జనాభాతో పోలిస్తే 27 శాతం రిజర్వేషన్లు తక్కువే. దానిని పెంచటానికి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా అందరూ ప్రయత్నించాలి. అయితే దానికి సుప్రీమ్ కోర్టు విధానం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గానీ, రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణా ముస్లింలు కారణం కాదు, ముస్లింలని తప్పు పట్టటం, వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదనటం అసంబద్ధ వాదన. మతపరంగా వెనుకబడ్డ వర్గాలని విభజించటం కొన్ని పార్టీలకి కొంత మేరకు ఎన్నికలలో తోడ్పడుతుండొచ్చు కానీ వెనుకబడ్డ ముస్లింలని పక్కన పెట్టటం మొత్తం దేశంలో వెనుకబడ్డ వర్గాల, కులాల పురోగతికే భంగం కల్పిస్తుంది.
2004 తో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటుతనం ఉందని హిందువుల్లో వెనుకబడ్డ తరగతుల ప్రతినిధులతో సహా అనేక మంది ఒప్పుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కల్పించిన 12 శాతం వాటా అందరిలో కొత్త ఆశలని కల్పిస్తూనే అనుమానాల్ని కూడా కలిగిస్తోంది. కేంద్రంలో ముస్లిం వ్యతిరేక, వారికి రిజర్వేషన్లని వ్యతిరేకించే ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకత తెలిసి కూడా ఏ నమ్మకంతో మన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు? హిందువుల్లో వెనుకబడ్డ వర్గాల ప్రతినిధులు, వ్యతిరేకించిన ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకోవటానికి ఇంకొంత ప్రయత్నం చేసి ఉండాలేమో? నిర్ణయం తీసుకోవటం ఎంత అవసరమో, ఆ నిర్ణయానికి ఈ పరిస్థితులలో మద్దతు కూడగట్టడం అంతే అవసరం కదా? వెనుకబడ్డ వర్గాలలో ముస్లింలకు, హిందువులకు మధ్య అనవసరమైన ఘర్షణని ఎలా తగ్గించాలి?
రాజ్యంగ కమిటీ ముస్లింలకు ఉద్యోగాల్లో, విద్యలో, చట్ట సభల్లో రిజర్వేషన్లని కల్పించి, దేశ విభజన తరువాత, చివరి నిముషంలో వాటిని వెనక్కి తీసుకుంది. ఒక ప్రధాన మైనారిటీ కి పాలనా వ్యవస్థలో, పౌర సమాజంలో చోటు కల్పించని రాజ్య వ్యవస్థలో వారికి కేవలం రక్షణ మాత్రమే కల్పించే ధోరణి ఇన్నాళ్లూ ప్రధాన పార్టీలు తీసుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ ధోరణి కొంత మారి ప్రభుత్వాలు ముస్లింలని కూడా పాలితులుగా గుర్తించి వారికి సంక్షేమ పధకాలు, సమాన పౌరసత్వం కోసం రిజర్వేషన్లు కల్పించాలనే ధోరణి, చర్చ ప్రారంభమయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముస్లింల కోసం 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని చెయ్యటం ఆహ్వానించదగ్గ అడుగు. ముస్లింలని తెలంగాణ రాష్ట్రము లో పూర్తి భాగస్వాముల్ని చేయటానికి ఈ విధానం అవసరం. ఈ విధానాన్ని సక్రమంగా అమలు పరచటం, మన రాష్ట్రంలో ముస్లింలని సమాన పౌరులుగా, పాలితులుగా గుర్తించటానికి అత్యంత అవసరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దీన్ని అమలు చెయ్యాలని ఆశిద్దాం.
"ముస్లిం రిజర్వేషన్స్ పై తప్పుడు వాదనలు" పేరుతో 17 మే 2017 న ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమయింది.
Comments
Post a Comment