Casting couch in Telugu Film industry



“కాస్టింగ్ కౌచ్” - అపరిమిత పురుషాధికారమే ! 



తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ‘కమిట్మెంట్’ పేరుతో నడుస్తున్న లైంగిక దోపిడీ నెల క్రితం వర్ధమాన నటి శ్రీ రెడ్డి అర్ధ నగ్న నిరసనతో బట్టబయలయింది. ఆ సంఘటన తర్వాత  అనేకమంది డైలాగ్ & క్యారెక్టర్ ఆర్టిస్టులు  ధైర్యంగా బయటికొచ్చి తమపై  జరుగుతున్న లైంగిక, ఆర్ధిక దోపిడీల గురించి మీడియా ముందు  వెల్లడించారు. దానితో  తెలుగు సినీ పరిశ్రమలో  స్త్రీలపై, ట్రాన్సమహిళలు, (క్రింది స్థాయి పురుషులపై) జరుగుతున్నదోపిడీ, వేధింపులు, వివక్షల విశ్వరూపం ప్రజా రంగంలో ఆవిష్కృత మవటం మొదలయింది.  వేధింపులు, దోపిడీ గురించిన ఈ చర్చని సినీ పరిశ్రమ వర్గాలు   సాధ్యమయినంత పక్కదారి  పట్టించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇది కేవలం  శ్రీరెడ్డి వ్యక్తిగత సమస్య అని, సినిమా పరిశ్రమలో వున్న మహిళలని ఈ మీడియా చర్చలు కించ పరుస్తున్నాయని, సమస్య బహిరంగంగా లేవనెత్తిన వారు శీలవంతులు కాదని, స్వప్రయోజనాల కోసమే చేస్తున్నారని, డబ్బు తీసుకుని చేస్తున్నారని, అలాగే ఏవో రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారని పనికట్టుకుని రూమర్లు లేవనెత్తారు. కొంత మంది హీరోలయితే, సినిమా మహిళల పవిత్రతని చాటిచెప్పటానికి ప్రత్యేక సంఘం పెడతామని ముందుకొచ్చేశారు.  సమస్య లేవనెత్తిన స్త్రీలకి ఇతర స్త్రీలకి మధ్య ఒక ‘పవిత్రమైన’  తేడా ఉంటుందని చూపించటానికి చాలా ప్రయత్నం చేసారు.  విచిత్రమేమిటంటే, ఈ వాదనలన్నీ కూడా సమస్య మూలాల్ని పక్కన పెట్టి, దాన్ని  లేవనెత్తిన స్త్రీల, వ్యక్తుల శీలం, నిబద్ధత చుట్టూ తిప్పడం గమనిస్తే అసలు సమస్యను అర్థం చేసుకోవాలన్న ఉద్దేశం కూడా  పరిశ్రమ వర్గాలకు లేదని స్పష్టమవుతుంది.

అసలు సమస్యకి మూలం సినీ పరిశ్రమ లో వున్న అదుపులేని పురుషాధికారం (స్త్రీలు కూడా దీనికి పాల్పడతారని విన్నాం కానీ, ఎక్కువ శాతం పురుషులే ఉండబట్టి పురుషాధికారం అనవలసి వస్తోంది) అని మాట్లాడిన స్త్రీలు, ట్రాన్స్ మహిళలు అందరూ  చెప్పటమే కాదు, సినీ రంగంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం వున్న అనేకమంది చెప్తున్నారు. శ్రిరెడ్డి ని సమర్ధించక పోవచ్చు, కానీ ‘కాస్టింగ్ కౌచ్’ ఎప్పటినుండో ఉందని ఉద్ఘాటిస్తున్నారు.. ఇతర రంగాలతో పోల్చి చూస్తే, అన్నిచోట్లా పురుషుల అధికారం స్త్రీలపై ఉంటుంది. కానీ, ఈ స్థాయిలో లైంగిక అధికారాన్ని చెలాయించటం కనపడదు. పైగా ఇక్కడ పై స్థాయిలోని హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మాత్రమే కాక, సినిమాటోగ్రఫర్లు నుండి మీడియా హౌస్ మేనేజర్, కోఆర్డినేటర్స్ వంటి ఏ కొంచెం అధికారం వున్న వారయినా సరే ఇతరులని లైంగికంగా వాడుకుని తాము  పైస్థాయి కెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు కన్పిస్తోంది. సమస్య ఇంతగా ప్రబలిపోయిందంటే, ఈ రంగంలో ఈ దోపిడీని సహించటమే కాదు, పాలు పోసి, పెంచి పోషిస్తున్నారన్నమాట! కమిట్మెంట్ కాంట్రాక్టు అనే పేరు కూడా పెట్టుకున్నారంటే ఈ విషయం అంత వ్యవస్థీకృతం అయిందన్న మాట! 

ఇంత పురుషాధికారం కరుడుకట్టటం వల్లే కాబోలు, తెలుగు సినిమా తెరపై కనిపించే స్త్రీలు చాలా వరకు తమ తమ భర్తలు, కొడుకులు, ప్రేమికుల కోసం జీవితాల్ని ధారబోస్తూ, ఏ మాత్రం స్వతంత్ర వ్యక్తిత్వం లేని కీలు బొమ్మల్లా వుంటారు. స్వతంత్రత ఉంటే - అత్తలు, విలన్లు, వేశ్యలు వంటి అపవిత్ర స్త్రీలు - వాళ్ళు ‘అటువంటి’ స్త్రీలన్నమాట.   పురుషుల కోసమే, పురుషుల చుట్టూనే ప్రపంచం నడుస్తుందని భావించే పురుషులు ప్రధానంగా నడిపించే పరిశ్రమలో హీరోల చుట్టూ మాత్రమే నడిచే కధలు కాకుండా మరేం వస్తాయి? ఇటువంటి సినిమాలని పోషించే హీరోల భక్తులు కూడా వున్నప్పుడు పరిస్థితి మరింత హీనంగా కాకుండా ఏమవుతుంది? పెద్ద హీరోల సినిమాల్లో (చాలా కొన్ని తప్పించి) నెమ్మది నెమ్మదిగా  హీరోయిన్ కే పాత్ర లేకుండా చేస్తున్నారు. ఇటీవల విడుదలయిన రంగస్థలం సినిమాలో, హీరోయిన్ పాత్ర తెరపై పదిహేను నిమిషాల కంటే ఎక్కువ కనిపించదు. ఇంక ఆ పాత్రలు పోషించే మహిళలకి విలువ ఇచ్చి, వారికి తగినంత పారితోషికం ఇవ్వాల్సిన ఆవసరం ఏముంటుంది? హీరోయిన్ లకే విలువ లేకపోతె,  మహిళా క్యారక్టర్ ఆర్టిస్టులకి, జూనియర్ ఆర్టిస్టులకి మాత్రం నటనకి ఆస్కారం వున్న పాత్రలు వస్తాయా? వారికి తగినంత డబ్బు వస్తుందా? 

దీనికి తోడు తమ అన్నదమ్ములు, బాబాయిలు, పెదనాన్నలే సినిమా నిర్మాతలు, ఇంకా సినిమా థియేటర్ల నియంత్రణ చేసే వాళ్ళు అయిన తరువాత తెలుగు హీరోలకి తాము భూదేవుళ్లమనే అభిప్రాయం బలంగా ఏర్పడిపోయింది. అందుకే, వీళ్లు, వీళ్ళతో సినిమాలు తీసే దర్శకులు, నిర్మాతలు కూడా బయట సమాజంలో స్త్రీ పురుష సంబంధాల గురించి జరుగుతున్న మార్పులు, చర్చలు  పట్టించుకోకుండా  హాయిగా బ్రతికేస్తున్నారు. డబ్బులొస్తున్నాయి కాబట్టి, తెర మీదా, తెర వెనుకా తాము పాటించే  ‘స్త్రీలకో న్యాయం, పురుషులకో న్యాయం’ లోని ద్వంద్వ విలువల కపటత్వం వారికేమీ కనిపించట్లేదు. వాళ్ళ ద్రుష్టి లో అదంతా చాలా సహజం. 

ఇలా దశాబ్దాలుగా తమ తమ సినిమా రాజ్యాల్ని ఏలుతున్న సినిమా పెద్దలందరికీ శ్రీ రెడ్డి నిరసన  దిగ్భ్రాంతి కలిగించటం సహజమే. అరే, మమ్మల్ని, మా అధికారాల్ని ధిక్కరించే ధైర్యం ఇటువంటి చిన్న స్థాయిలో వుండే మహిళకి, పైగా తాము నిర్వచించిన ‘అపవిత్ర' ‘శీలం లేని' స్థాయి లోని వ్యక్తి కి  ఎట్లా వచ్చిందని రగులుతుంటే ఈ లోపల ఆమెకంటే ఇంకా చిన్న స్థాయిలో వున్న మహిళా ఆర్టిస్టులు  కూడా వచ్చి మరిన్ని విషయాలు బయట పెట్టేసారు. మగవాళ్ళు ఎంతమందితో సంబంధాలు పెట్టుకున్నా పర్లేదు గానీ, స్త్రీలు మాత్రం ఒకే ఒక భర్తకి కట్టుబడి లేకుంటే, ఆమె ‘అటువంటి అపవిత్ర ’ స్త్రీనే అని నమ్మే సినీ పరిశ్రమ ద్వంద్వ నీతి రాజుగారి దేవత వస్త్రాలతో సమానమని  కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసారు. 

ఇంత మంది ‘అపవిత్ర మహిళలు’ తిట్టిన తిట్లని భరించి మింగ లేక, కక్కలేక బాధ పడుతుంటే, శ్రీరెడ్డి కెమెరా ముందు వాడిన ఒక పదం మంచి ఆయుధంగా పనికొచ్చింది. వెంటనే అందరి మీదికి ఏ నియంత్రణా లేని హీరోల భక్తులని (దీనికి స్త్రీ పురుష బేధభావం లేదు) వదిలి వీరంగం చేసి, దడిపించి, భయపెట్టి, వారి ధైర్యాన్ని దెబ్బ తీయటానికి, కుటుంబ సభ్యులని బెదిరించటానికి నోరు మూయించటానికి బాగా వాడుకున్నారు. ఒక పదానికి ప్రత్యామ్నాయంగా, మేము లక్ష బూతులు వాడగలమని శాయశక్తులా నిరూపించారు. పైగా, తామే బాధితులమయినట్లు చిత్ర విచిత్ర వాదనలు చేసి, తమ ఆధిపత్యాన్ని వుపయోగించి మీడియా నోరు కూడా మూయించారు. ద్వంద్వ విలువలకి ఇంత కన్నా మంచి ఉదాహరణ దొరకదు. అటువంటి పదం వాడటం పట్ల నిజమైన అభ్యంతరముంటే, శ్రీ రెడ్డిని, మహిళా సంఘాల నాయకులని అంత కన్నా వందల రెట్ల బూతు పదాలతో  ఎందుకు తిట్టినట్లు? అంటే, వాళ్ళ అభ్యంతరం బూతు పదాల మీద కాదు. తాము వీరభక్తి ని చూపించే  వ్యక్తిని ఉద్దేశించి అన్నందుకు. నిజంగా బూతు సంస్కృతి మీద అంట వ్యతిరేకత వున్నవారైతే, ప్రతిరోజూ, ప్రతిక్షణం ఇంతా బయటా మగవాళ్ళు నిరంతరం వాడే బూతు పదజాలం పట్ల నిరసన గానీ, అభ్యంతరాలుగానీ వ్యక్తం చేసినట్లు మనమెప్పుడైనా విన్నామా ! సినిమా రంగానికే ప్రత్యేకంగా వస్తే, ఈ మధ్య వచ్చిన  అర్జున్ రెడ్డి అనే  సినిమా లో ఈ పదాన్ని చాలా స్పష్టంగానే వాడినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా విజయోత్సవ సభలో ఆ సినిమా హీరో అక్కడ వున్న వేలమంది ప్రేక్షకులతో  ఆ పదాన్ని పదే పదే అనిపించినప్పుడు లేని అభ్యంతరం సినిమా వర్గాలకు, వారి భక్తులకు, మీడియా కు  ఇప్పుడెందుకు వచ్చినట్లు? ఇవి ఏ రకమైన ద్వంద విలువో అర్తమౌతోందా!!!???

కుల, వర్గ, రాజకీయ ఆధిపత్యాలు కలిపిన ఇటువంటి పురుషాధిక్యత కరుడుకట్టిన రూపాన్ని బహుశా పాత రోజుల్లో ‘భూస్వామ్య అధికారం’, ‘దొరతనం’ అని వర్ణించేవారమేమో. కానీ, ఇటువంటి పురుషాధికారానికి ఆ పేరు సరిపోదు. ఎందుకంటే, దొరల  పీడన పైకి కనిపించే పీడన. సినీ పరిశ్రమలో వుండే పురుషాధిక్యత రూపం, స్వభావం వేరు. అదిచ్చే పేరు, పరపతి, ప్రాచుర్యం, డబ్బుతో తీవ్ర ఆకర్షణకి లోనయ్యి, స్త్రీ, పురుషులు, ఇతర జెండర్ల వ్యక్తులు తమంతట తామే, స్వచ్చందంగా లొంగి పోయే పరిస్థితులను కల్పించే ఆధునిక దోపిడీ వుండే రంగమిది. 

కానీ, లైంగికంగా లొంగిపోయినంత మాత్రాన అది స్వేచ్ఛ తో కూడిన సంబంధం అవుతుందా? అవదు కదా? 

వూర్లో పనుల్లేక పట్నానికి వలసపోయే కూలీలు భవనాలు కట్టే మేస్త్రీల ఆధిపత్యానికి లైంగికంగా లొంగిపోవటం జరుగుతుంది. దాన్ని పీడనే అంటాం. అలాగే, దుబాయ్ వంటి దేశాల్లో ఇంటి పని చెయ్యటానికి వెళ్లే మహిళలని, పురుషులని అత్యంత హీనమైన పీడనకు గురిచేస్తే, మీకు తెలిసే వెళ్లారు కదా అని ఎవరూ అనరు. మరి తెలుగు సినీ పరిశ్రమలోకి నటనపై, నృత్యంపై ఇష్టం తో, ప్రేమతో వచ్చి, పదుల సంఖ్యలో చిన్నా చితకా పాత్రలని పోషించిన మహిళలని మీకు తెలిసే సెక్స్ కి ఒప్పుకున్నారు కదా అని ఎందుకంటున్నట్లు? ఏ రంగమయినా సరే, పని స్థలమంటేనే అధికార సంబంధం. ఎక్కడైనా సరే, పని స్థలంలో, పని కల్పించే అధికారం వున్న వ్యక్తులకి, ఆ పని పైన ఆధారపడి, దాని కోసం వెతుక్కుంటున్న వ్యక్తులకి మధ్య స్వేచ్చాయుత సంబంధం ఏర్పడటానికి అవకాశం ఉందని ఎవరన్నా అనుకుంటే అది పూర్తిగా అజ్ఞానమే అని చెప్పాలి.  

అంతే కాదు, ఒప్పందం ప్రకారం ఆవిడ ఇవ్వాల్సింది ఇస్తే, ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు అని వాదిస్తున్న వాళ్ళు కూడా వున్నారు. ఒప్పందం ఏర్పడింది సరే, అది న్యాయబద్ధ మయినదేనా, ఏ పరిస్థితుల్లో ఆ ఒప్పందానికి క్రింది వాళ్ళు ఒప్పుకున్నారు అన్నవి న్యాయమయిన ప్రశ్నలు. న్యాయమంటే కోర్టులోనే ఉండదు. సమాజం లోని ప్రతి రంగం న్యాయం గురించి ఆలోచించాల్సిందే, సినిమా రంగంతో సహా. దానికి వారేమీ అతీతులు కాదు.  ఏ మాత్రం హక్కుల్లేని,  పై వాళ్ళ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి, దాన్ని అమలు చేయించగలిగే అధికారం లేని ఒప్పందాల్లోకి సినిమా రంగం లోని మహిళలు ఎందుకు ప్రవేశిస్తున్నారనేదే ప్రశ్న? 

ఇటువంటి వాదనలు వేరే ఏ రంగం లోని ప్రముఖులు చేసినా ఎంత ఎబ్బెట్టుగా వుంటాయో ఒక సారి ఊహించుకుంటే అర్ధమవుతుంది. మహిళా ఉద్యమాల కృషి ఫలితంగా వేధింపులు, లైంగిక దాడులకు గురయిన వ్యక్తుల చరిత్రని శంకించటం, కించపరచటం  చట్ట ప్రకారమే నిషేధించారు. అవే వాదనలు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల నోట వింటుంటే అసహ్యంగా అనిపిస్తోంది. అదృష్టవశాత్తు, తెలుగు సమాజం ఈ విషయంలో చాలా ముందుకు వెళ్లి ఈ విషయాన్ని అర్ధం చేసుకుంది. అందుకేనేమో, శ్రీ రెడ్డి అన్న ఒక్క మాటని పట్టుకుని సామాజిక మీడియాలో, వివిధ హీరోల భక్తులు అడ్డగోలుగా వాదనలు చేస్తున్నా, చాలా మంది ఆమె చేసిన నిరసనల్లో న్యాయం ఉందని బలంగా  నమ్ముతున్నారు. సామాజిక మీడియాలో రాస్తున్నారు. కానీ, తెలుగు సినీ పరిశ్రమే 19 వ శతాబ్దం నుండి 21 వ శతాబ్దానికి రావటానికి సిద్ధంగా ఉన్నట్లు లేదు!!?

లైంగిక వేధింపులు అన్నచోట్లా  జరుగుతాయని చేస్తున్న శుష్క వాదనలు ఈ అదుపులేని పురుషాధికార స్వభావాన్ని, విస్తృతిని గుర్తించటానికి సినీ పరిశ్రమ వర్గాలు ఇంకా సిద్ధ పడలేదన్న దానికి తార్కాణం. లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ పెడితే చాలదు. ఆరోపణలు వచ్చిన పురుషులపై చర్యలు తీసుకోవాలి. కనీసం వార్నింగ్ ఇవ్వాలి. ఇందులో స్థాయీ భేదాలు వుండవు.  పెద్దవారికి, చిన్నవారికి కూడా. లైంగిక వేధింపులకు పాల్పడిన వాళ్ళని పనిలోకి తీసుకోవద్దని పెద్ద సినిమా నిర్మాణ సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలి. స్టూడియోలో వారికి ప్రవేశం లేకుండా చూడాలి.  ఈ నిర్ణయాలన్నీ అందరికీ తెలిసేలా బహిర్గతం చెయ్యాలి. ఇది, ఒక ఇండస్ట్రీ గా మేమీ ప్రవర్తనని సహించం అనే అంతర్గత సంస్కృతిని నిర్మిస్తుంది. మహిళలకి (కింది స్థాయి పురుషులకి కూడా) భద్రత కలిగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. 

సినీ పరిశ్రమ నిబద్ధత అంతా సమస్య గురించి చర్చించిన స్త్రీలని శీలం లేని వాళ్ళని నిరూపించటం పైనే వుంది తప్ప అపరిమిత పురుషాధికారాన్ని తగ్గించటానికి, అటువంటి సంస్కృతిని మార్చటానికి, ద్వంద్వ విలువలని ప్రశ్నించటానికి  తీసుకోవాల్సిన చర్యలపై లేదు. శ్రీ రెడ్డి పై, మాట్లాడిన మిగతా  స్త్రీలపై సినిమా హీరోల భక్తులు దాడి చేస్తుంటే వారి వెనక నిలబడి చ్యోద్దం చూస్తున్నారు తప్పించి  ప్రశ్నిస్తున్న వారికి  ఏ మాత్రం సహకారం అందించలేదు. వీరి ఫోన్ నంబర్స్ బయట పెట్టటం, వారి మాటలని రహస్యంగా రికార్డ్ చేసి బయట పెట్టటం, అత్యాచారం చేస్తామని, కుటుంబ సభ్యులకి హాని కలిగిస్తామని, మళ్ళా అవకాశాలు లేకుండా చేస్తామని, ఇలా మాట్లాడిన స్త్రీలని బెదిరిస్తుంటే, వేసిన కమిటీలకి ఎవరొచ్చి ఫిర్యాదు చేస్తారనే  ప్రశ్న, అవి ఎలా పనిచేస్తాయో అన్న అనుమానం ఎవరికైనా కలుగుతాయి. 

నల్ల జాతి స్త్రీలు మొదలుపెట్టిన ‘మీ టూ’ కాంపెయిన్ ని ఒక స్ఫూర్తి తో ప్రపంచమంతటా స్త్రీలు పనిస్థలాల్లో లైంగిక వేధింపులు, సెక్సిజం కి వ్యతిరేకంగా కొనసాగిస్తున్నారు.. తెలుగు సినిమా పరిశ్రమలోని మహిళా ఆర్టిస్టులతో సహా అందరూ  చెప్పేది ఒకటే. పని స్థలాల్లో - అవి సినిమా స్టూడియో లు, యూనివర్సిటీలు, ఆఫీసులు, పత్రికా కార్యాలయాలు ఏమయినా కావచ్చు - ఎక్కడైనా స్త్రీలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు సమానంగా, సామర్ధ్యంతో పనిచేయాలంటే లైంగిక వేధింపులు, వారి శరీరంపై కామెంట్లు, బూతు జోకులు, కించపరిచే భాష, లొంగుబాటు, అనివార్యంగా లైంగిక సంబంధం లోకి వెళ్తేనే  వచ్చే అవకాశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదు. 

‘ సినిమా రంగం అంటేనే ఇవన్నీ వుంటాయి, ఇవన్నీ తట్టుకోకపోతే, నువ్వు ఈ రంగంలో వుండలేవు’ అన్న సినీ రంగ ఉవాచ అపరిమిత పురుషాధికారానికి పరాకాష్ట. కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుండో వున్నదన్న మరో ఉవాచ దాని సమర్థనే తప్ప, బాధిత వ్యక్తులకి ఏ మాత్రం స్వాంతన చేకూర్చదు. తెలుగు పరిశ్రమలో తెగించి శ్రీ రెడ్డి తో సహా క్రింది వాళ్ళు చేసిన నిరసన అన్ని స్థాయిల్లో వున్న స్త్రీలకి లైంగిక వేధింపులని ఎదుర్కోవటానికి కొంత బలం చేకూరుస్తోందని వార్తలు వస్తున్నాయి. నిరసన గళాలని ఎంత నొక్కేసినా, వాటి ప్రభావం చూపించక పోవు. ఇప్పటికైనా సినీ పరిశ్రమ వర్గాలు తమని తాము, అందరికీ నచ్చే సినిమాలు, ఈ రకమైన వేధింపుల సంస్కృతీ లేకుండా తియ్యలేమా  అని ప్రశ్నించుకుంటే బాగుంటుంది. 


ఎ . సునీత, కె. సజయ  

నవ తెలంగాణ లో ప్రచురితమయింది

Comments