Casting couch

కొంచెం ఆలోచించి మాట్లాడదాం!


గత రెండు వారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి సమాజాన్ని కుదిపేసిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ప్రజాస్వామ్య విలువల కోసం సినీ పరిశ్రమని నిలదీసింది. సినీ ప్రరిశ్రమని స్త్రీల కనువయిన పనిస్థలంగా తయారుచెయ్యటానికి, అన్ని పని స్థలాల్లో జరిగే  లైంగిక దోపిడీ/వేధింపుల గురించి చర్యలు తీసుకోవాలని గుర్తు చేసింది. ఆ క్రమంలో వచ్చిన అనేక అసంబద్ధ వాదనలని త్రోసిపుచ్చి సరయిన ఆలోచనని ముందుకు తీసుకొచ్చింది. వివిధ మీడియాలలో (రొటీన్ బూతు స్పందనలని పక్కన పెడితే), జరిగిన చర్చలు, స్పందనల లో వచ్చిన సరయిన ఆలోచనని ఒక చోట కూరిస్తే అందరికీ కొంత ఉపయోగపడుతుందని మా ప్రయత్నం. 

ఇటువంటి బట్ట లిప్పి, అర్ధ నగ్న నిరసనతో మనం పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? చెడు ఆలోచనలు కాక? 
పెద్ద వాళ్ళు లాగా పిల్లలు శరీరాన్ని కేవలం లైంగిక వస్తువుగా చూడరని అందరికీ తెలుసు. వారికి శరీరం ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ఒక పరికరం మాత్రమే. పెద్ద వాళ్ళ పెత్తనం అధికారం, దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చెయ్యలేని అసహాయత అనుభవించే పిల్లలకి అధికారం లేని వాళ్ళ నిరసన బాగానే అర్ధమవుతుంది. శ్రీ రెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన గురించి వారికి తెలియటం చాలా మంచిది. ఎందుకంటే, చిన్న పిల్లలని లైంగిక వేధింపుల నుండి కాపాడటానికి  పాఠశాలల్లోనే శరీరాన్ని గురించి నేర్పి, మంచి  స్పర్శ, చెడ్డ స్పర్శ ల్లో  తేడాలని నేర్పిస్తున్నా రు. పెరిగిపోతున్న పిల్లల లైంగిక వేధింపులు ఈ పరిస్థితి కి దారితీసాయి. అధికారం వున్న వాళ్ళు, హీరో లుగా భావించే వాళ్ళు కూడా తప్పులు చేస్తారని తెలిస్తే, తమని వేధించే పెద్ద వాళ్ళ గురించి వారికుండే భయం పోయి బయటికి చెప్తారు. 

యువత లంచగొండితనం, విచ్చలవిడి శృంగారం అలవాటు చేసుకుని విలువలు లేకుండా తయారయింది. 
ముప్ఫయి ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి ఈ మాట చెప్పే ముందు ఆలోచించాలి. ఎందుకంటే, ఈ యువత పుట్టి, పెరిగిన ప్రపంచాన్ని సృస్టించి, ఇలా నిర్వహిస్తున్న వాళ్ళం మనమే. బాధ్యత యువతది మాత్రమే కాదు. తెలుగు  సినిమాలు తీసేవాళ్ళు, టెలివిజన్ ఛానళ్ళు, వార్తా పత్రికలు నడిపేవాళ్లు, సోషల్ మీడియా, ఫేస్బుక్ సృష్టించిన మార్క్ జుకెన్బెర్గ్ తో సహా మన అందరిదీ. మనం సృష్టించిన ప్రపంచంలోకి, విలువల్లోకి  ప్రవేశించిన యువతని నిందించి, వారిపైనే మొత్తం  బాధ్యత  పెట్టటం సబబు కాదు కదా? 

పరిశ్రమలో అందరు చెడ్డవాళ్ళు కాదు.  
స్త్రీలపై లైంగిక వేధింపులు, హింస గురించి మాట్లాడంగానే, మగవాళ్లందరూ చెడ్డవాళ్ళు కాదని, దళితులపై హింస గురించి మాట్లాడితే అగ్ర కులాలందరు చెడ్డవాళ్ళు కాదనటం వంటిదే ఇది కూడా.  కానీ ఆధిపత్య ధోరణులని, సంస్కృతిని, అలవాట్లని, పద్ధతులని ప్రశించటానికి కొంత మేరకి అందర్నీ ఒక గాటన కట్టటం అవసరం. తెలుగు సినీ పరిశ్రమలో స్త్రీలపై పురుషుల లైంగిక దోపిడీని, వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించటానికి సినీ రంగాన్ని ఒకటిగా పరిగణించటం అటువంటిదే. వాళ్ళే తమని తాము కుటుంబంగా వర్ణించుకుంటారు కూడా. తమ పరిశ్రమలో  ఇటువంటి చెడ్డ సంస్కృతి, ధోరణి  ఉందని ఒప్పుకున్నప్పుడే, పరిశ్రమ పెద్దలు అవి జరక్కుండా చర్యలు తీసుకోగలరు. భారత దేశ సంస్కృతికి మూలమని చెప్పుకునే కుటుంబంలోనే స్త్రీలపై హింస జరుగుతోందని చట్టాలు చేసిన దేశం మనది. వేలమంది పని చేసే ఒక పెద్ద పరిశ్రమలో వేధింపులు జరుగుతాయని ఒప్పుకోవటం వల్ల పరువు పోదు. అది పరిశ్రమ పరిణితికి సూచన అవుతుంది. 

సాక్ష్యాలేవీ?
ఒక్కొక్క పరిశ్రమలో లైంగిక దోపిడీ, వేధింపులు ఒకో రకంగా ఉంటాయి. భవన నిర్మాణ రంగంలో మేస్త్రీలు, కూలీలపై చేసేది ఒకటి, అలాగే యూనివర్సిటీల్లో మరొకటి. అలాగే సినిమా పరిశ్రమలో కూడా క్రింది స్థాయిలో వారిపై లైంగిక దోపిడీ ఆర్ధిక దోపిడీ తో కలిసి ఉంటుంది.  వీరిలో ఎవరూ సాక్ష్యాలని సేకరించరు.  పై స్థాయిలో జరిగే ‘నేను నీకిది చెయ్యాలంటే, నువ్వు నాకేమిస్తావ్’ అనే ఒప్పందాల్లో లైంగిక దోపిడీ అవకాశాలు కల్పించటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కానీ, ఆర్ధిక దోపిడీ తో కలిసి ఉండదు. కానీ రెండు సందర్భాల్లో ఆర్ధిక లావాదేవీలు ఉండటం వల్ల జరిగేది దోపిడీతో కలిసిన అసమాన కాంట్రాక్టు గానే కనిపిస్తుంది తప్ప, వేధింపులు, హింస గా కనిపించదు. అందుకే అవకాశాలు దొరకనప్పుడే ఫిర్యాదులు వస్తాయి. అప్పుడే జరిగింది దోపిడీ, మోసం గా కనిపిస్తుంది. అలా చేస్తారని ముందే ఊహించరు కాబట్టి సాక్ష్యాలు పొందుపరుచుకోరు. సెలెబ్రిటీ లని బెదిరించి డబ్బులు చేసుకుంటారు కాబట్టి సాక్ష్యాలు అడగాలి అనే వాళ్ళు కూడా గుర్తించాల్సింది, ఆ పరిశ్రమలో నిలదొక్కుకోవాలి అనే ఆశ కలవాళ్ళు ఎప్పటికీ ఆ పని చెయ్యరని. 

పేర్లు చెప్పాల్సిందే! 
ఇది అన్నిటికన్నా బాధ్యతా రహిత డిమాండ్. మాట్లాడే స్త్రీలకి, పరిశ్రమలో పురుషులకి వున్న తీవ్ర అధికార అంతరాన్ని గుర్తించని డిమాండ్. మాట్లాడే స్త్రీలు ఆధిపత్య శ్రేణిలో అతి క్రింద స్థాయిలో వుండేవాళ్ళు. లైంగిక వేధింపులకు పాల్పడే వాళ్ళు డబ్బులో, అధికారంలో, హోదాలో అత్యంత పెద్ద స్థాయిలో వున్నవాళ్ళు. మాట్లాడే స్త్రీలని ఏ రకంగా అయినా దెబ్బ తియ్యగలిగే అపరిమిత అధికారం వున్న వాళ్ళు. పరువు నష్టం దావాలు వారి ఆయుధాల్లో చిన్నది.  “మేము పేర్లు చెప్పలేమంటే” అర్ధం చేసుకోవాలి. చెప్పినవాళ్ళని సమర్ధించాలి. వారిని శిక్షించకూడదు. భద్రత కల్పించాలి. ఒక వేదిక ఏర్పర్చాలి. అప్పుడే ధైర్యంగా తమ పరిస్థితిని ఎదుర్కోగలరు. అంతే తప్ప, చెప్పాల్సిందే అని బెదిరించటం వల్ల మరింత హాని జరుగుతుంది. 


పవిత్ర స్త్రీలకి వేధింపులుండవు, అపవిత్ర స్త్రీలకే ఉంటాయి 
“నువ్వెందుకు అవకాశమిచ్చావ్? అడిగినోడ్ని ఒక తన్ను తన్నుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు” అనటం బాధితులపై బండలు వెయ్యటమే. కేవలం లైంగిక సంబంధాల ఆధారంగా మంచి స్త్రీలు, చెడ్డ స్త్రీలు అనే విభజన చేయటం స్త్రీ పురుషుల లైంగికత గురించిన పాత నైతిక సిద్ధాంతాలపై ఆధార పడింది. పురుషులకి ఇటువంటి విభజన వర్తించదు. వివాహం బయట ఇటువంటి సంబంధాలున్నాయని ఒప్పుకున్న స్త్రీలని చెడ్డ వాళ్ళంటారు. అదే, అటువంటి సంబంధాలలోకి స్త్రీలని ఆహ్వానించే వివాహిత పురుషులని మాత్రం ‘మగ వాళ్ళు అట్లాగే వుంటారు’ అంటూ సమర్థిస్తారు. ఈ ద్వంద్వ విలువలు పురుషాధిక్య హక్కులని కాపాడతాయి. మనం పురుషాధిక్య విలువలు మారాలని , వాటిని నిర్ములించాలని 1950 లో రాజ్యాంగాన్ని రాసుకున్నాం. పురుషులకి వున్న అనంతమైన అధికారాల్ని, హక్కుల్ని పరిమితం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. వాటిలో కొన్నింటిని ‘కుటుంబ హింస’, ‘లైంగిక వేధింపులు’ లేదా ‘లైంగిక దాడి’ అనే పేర్లతో నేరస్మృతిలో పొందుపరిచాం. ఇక్కడ విషయం పవిత్ర/అపవిత్ర స్త్రీల గురించి కాదు, పురుషాధిక్య హక్కులని తొలగించటం. 

అవకాశం కోసం లొంగిపోయిన స్త్రీకి మాట్లాడే అర్హత లేదు 
లైంగిక దోపిడీ లేదా లైంగిక వేధింపుల సమస్య ఫిర్యాదు చేసిన స్త్రీలతో మొదలవలేదు, వారితో ముగిసిపోదు. లైంగిక వేధింపుల కమిటీ పెట్టాలని చట్టం వచ్చిన ఐదేళ్ల పాటు కళ్ళు మూసుకుని గడిపిన పరిశ్రమలోని సంస్థల వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది.  ఎక్కడైనా సరే, ‘లైంగిక లొంగుబాటు’ తో పని దొరకటం అవమానకరం. ఈ సంస్కృతిని ఇన్నాళ్లు భరించిన సినీ రంగాన్ని తప్పు పడదామా లేక ఉందని చెప్పిన మహిళలనా? లంచం తీసుకున్న అధికారిని తప్పు పడతాం గానీ, ఇచ్చిన వారిని తప్పు పట్టం. అలాగే అవకాశం ఇస్తామని వాడుకున్న వారిది తప్పు గానీ అవకాశం కోసం లొంగిపోయిన వారిది కాదు. మాట్లాడే వారిపై దాడి చేస్తే, ఫిర్యాదు చెయ్యటానికి ఇంకెవరు ముందుకు రారు కదా. 

పోలీసుల దగ్గరికి వెళ్ళాలి గానీ, మీడియా దగ్గరికి కాదు 
సినీ పరిశ్రమ మీడియా లేనిదే ఒక్క రోజు కూడా బ్రతకలేదు. సినిమాల ప్రచారం, పోస్టర్లు, ఆడియో విడుదల, సినిమా సక్సెస్, కొంచెం నోరున్న హీరోయిన్లని నోరు మూయించటం కోసం - ఇలా ఎన్నో రకాలుగా మీడియా వారికి ఉపయోగపడుతుంది. మరి అటువంటి మీడియా దగ్గరికి వెళ్ళక ఇంకెక్కడికెళ్ళాలి? మీడియా సినిమా ప్రొడ్యూసర్లకే, హీరో లకే కాదు, అందరిదీ కదా. అన్ని రకాల అధికారం కలిగున్న పురుషులని వ్యతిరేకించటానికి మీడియా కొంచెం వేదిక ఇచ్చినందుకు మెచ్చుకుని, సంతోషించాలి గానీ, వెళ్ళద్దు అనటం సబబు కాదు కదా? 

మా పరిశ్రమని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? పరిశ్రమ అంటే లోకువ అయిపొయింది 
విషయం పరువు-ప్రతిష్ట లకి సంబంధించింది కాదు. పని స్థలాల్లో మహిళల భద్రతకు సంబంధించింది. వారికి తమ పని చికాకులు లేకుండా చేసుకునే వాతావరణం కల్పించటం గురించి. కొన్నాళ్ల క్రితం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెస్సర్ల లిస్టు ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. ఆయా విద్యా సంస్థలేవీ మా పేరు నాశనం అయిందని గగ్గోలు పెట్టలేదు. అలాగే  ప్రతి రోజు ఏదో పేరున్న సంస్థలో, రంగంలో వేధింపులు బయట పడుతూనే వున్నాయి. వాళ్ళందరూ సాధ్యమయినంత త్వరగా సమస్యని పరిష్కరించుకున్నారు. ఇప్పటికి కొంత శాతమైనా ఆయా రంగాలు బాగుపడి స్త్రీలు కొంతలో కొంత చికాకులు లేకుండా పని చేసుకునే వాతావరణం ఏర్పడింది. తెలుగు సినీ పరిశ్రమ తమని మాత్రమే వేలెత్తి చూపిస్తున్నారని భావన వీడి, త్వరగా పరిస్థితిని బాగు చేసుకోసుకుంటే అందరి గౌరవం పెరుగుతుంది. 

క్రింది స్థాయిలో కోఆర్డినేటర్స్, బ్రోకర్ల తోనే సమస్య, పై వాళ్ళతో సమస్య లేదు. 
పై స్థాయిలో వుండే వారి గురించి ఫిర్యాదులు లేకపోవటం, వారి ఆధిపత్యాన్ని సూచిస్తుంది తప్ప సమస్య లేదని కాదు. ఎక్కడయితే పూర్తి ఆధిపత్యం ఉంటుందో అక్కడ నిశ్శబ్దం కూడా రాజ్యమేలుతుంది. బొడ్డు మీద కొబ్బరి చిప్పలు వేశారని, తెలుగు సినీ పరిశ్రమ నుండి వెళ్ళిపోయిన హీరోయిన్లు చిన్నగా అంటేనే, వారిని నానా శాపనార్ధాలు పెట్టి వారితో క్షమాపణలు చెప్పించిన సినిమా భక్తులున్న సమాజం మనది. పరిశ్రమ తీసిన అతి పెద్ద సినిమాలో స్త్రీ పాత్ర చిల్లరగా ఉందని విమర్శించిన యువతిని ఇంటర్నెట్ లో వేధించి మళ్ళా కనిపించకుండా చేసిన ఘనులు కూడా వున్నారు. విమర్శ ఎదగటానికి తోడ్పడుతుందనే సోయి లేని భక్తులని, భరించలేని వారి తిట్లని పల్లెత్తు మాట కూడా అనని పురుషులున్న పరిశ్రమలో క్రింది వాళ్ళు మాత్రమే వేధింపులకు పాల్పడుతున్నారని నమ్మటం కొంచెం కష్టం. 

ఇప్పుడు మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు తరువాత మాట మీద నిలబడరు 
నిజమే. ఒత్తిడి తట్టుకోలేని కుటుంబ హింస బాధితులు ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటారు. అత్యాచార బాధితులు ఏమీ జరగ లేదంటారు. హత్యచేయబడిన వారి కుటుంబ సభ్యులే సహజ మరణమంటారు. మరి సినీ పరిశ్రమ వంటి ఆధిపత్య నిర్మాణాన్ని ఢీకొట్టిన వారు ఒత్తిడి, ఎదురు దాడి తట్టుకోలేక వెనుదిరగటంలో ఆశ్చర్యమేముంది? డబ్బులు తీసుకున్నారని, ఏదో రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారని నిందలు మోపితే తట్టుకోవటం అధికారం, డబ్బు లేని బాధితులకి సాధ్యం కాదు కదా. 

సమస్య లేవనెత్తిన మహిళల నుండి సమస్యని విడదీసి చూడాలని అనేక మంది సోషల్ మీడియాలోనే చక్కగా విడమర్చి చెప్పారు. ఇది మన సమాజ పరిణితికి చిహ్నం. లైంగిక వేధింపులు ఈ ఒక్క నిరసన, చర్చ తో మాయమయి పోతాయని చెప్పటం కష్టమే. కానీ ఈ చర్చ తరువాత వీటిని క్రిందికి నెట్టేయటం కూడా అంత తేలిక కాదు. అసలు ఇటువంటి చర్చ జరగటమే తెలుగు సమాజంలో ఒక ప్రజాస్వామ్య మార్పుకి సూచన అని మా నమ్మకం.  

ఎ. సునీత, తేజస్విని మాడభూషి  

నడుస్తున్న తెలంగాణ మే 2018 సంచికలో ప్రచురితమయింది

Comments