అయితే 1948 నుండి 1950 మధ్యన జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో అందరికీ ఒకే రకమైన వివాహ చట్టాలు ఉండాలనే ప్రతిపాదనలను హిందువుల లో చాలా మంది కులం, గోత్రం, మతం భ్రష్టు పడతాయని వ్యతిరేకిస్తే, దేశ విభజన తరువాత మైనారిటీ స్థాయికి కుదించబడిన ముస్లిములు తమ అస్తిత్వానికి భంగం కలుగుతుందని వ్యతిరేకించారు. ఉమ్మడి పౌర స్మ్రితిని అందువల్లే ప్రాధమిక హక్కులలో కాక, ఆదేశిక సూత్రాలలో చేర్చారు. 1955 లో స్వతంత్ర భారత దేశంలో మొదటి సారి హిందూ వివాహ చట్టాలని సంస్కరించటానికి అంబెడ్కర్ ప్రవేశ పెట్టిన హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో అనేక మంది మితవాదుల తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొని (అయన రాజీనామా తరువాత) చట్ట రూపం తీసుకునేటప్పటికే, ముస్లిం వివాహ చట్టాలు వచ్చి దశాబ్ద కాలం పైగా గడిచింది. అనేక మంది ముస్లిం స్త్రీలు ఆయా చట్టాల క్రింద తమ తమ హక్కుల కోసం కోర్టులని ఆశ్రయించే వారు.
స్వాతంత్య్రం తరువాత ముస్లింల పరిస్థితి మెరుగవటం అటుంచి మరింత దిగజారింది. ఈ విషయం సచార్ కమిటీ నివేదిక వచ్చే వరకు చాలా మందికి అర్ధం కాలేదు కానీ, ఆర్ధిక వెనుకబాటు తనం, రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు వంటి ఏ రక్షణలు లేకుండా, అనేక మతపరమైన అల్లర్లలో తీవ్రంగా నష్టపోతూ ఉన్న ముస్లిం సమాజాలు తమ కుటుంబ చట్టాలలో మార్పులని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ముస్లిం సమాజాలలో సంస్కరణ వాదులు 1980 ల వరకూ కూడా స్త్రీలకి కుటుంబాలలో - వివాహం, ఆస్తి హక్కు, విడాకులు, పిల్లల కస్టడీ విషయాలు - న్యాయం జరగాలంటే వారికి సమానత్వం వచ్చే దిశగా తమ చట్టాలు ఇంకా సంస్కరించ బడాలని నమ్ముతూ వచ్చారు. పాకిస్తాన్, ఈజిప్టు, ఇరాన్, మొరాకో వంటి ముస్లిం దేశాలలో మార్పులకు లోనవుతున్న కుటుంబ చట్టాల గురించి అధ్యయనం చేస్తూ, చర్చలు కూడా జరుపుతూ వచ్చారు.
1985 లో సుప్రీం కోర్టు షా బానో కేసులో విడాకులు పొందిన ముస్లిం స్త్రీలకు పీనల్ కోడ్ లోని 125 సి ఆర్ పీ సి కింద భరణం ఇవ్వాలని తీర్పు చెపుతూ, ముస్లిం సమాజాలు తమంతట తాము సంస్కరణలు చేపట్టట్లేదు కాబట్టి, ప్రభుత్వం ఆ పాత్ర తీసుకుని ఇటువంటి కేసులు పురరావృతం కాకుండా ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని కేసుతో నిమిత్తం లేని కొన్ని వ్యాఖ్యలు చేసి ముస్లిం వివాహ చట్టాలపై స్వతంత్ర భారత దేశంలో మొదటిసారి పెద్ద చర్చకి తెర తీసింది. ఇదే సమయంలో ఎప్పుడూ స్త్రీ పురుష సమానత్వం గురించి కానీ, ముస్లిం స్త్రీల గురించి కానీ ఏ మాత్రం పట్టించు కోని భారతీయ జనతా పార్టీ ముస్లిం స్త్రీల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే, ఉమ్మడి పౌర స్మృతి రూపొందించాలని డిమాండ్ చేస్తూ రోడ్ల కెక్కింది. దీనితో పెల్లుబికిన ముస్లిం సమాజాల క్రోధాన్ని అరికట్టేటందుకు, అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం విడాకులు పొందిన ముస్లిం స్త్రీల భరణం కోసం 126 సి ఆర్ పి సి ని ప్రవేశ పెట్టింది. ఈ చట్టాన్ని విశదీకరిస్తూ 2001 లో సుప్రీమ్ కోర్టు విడాకులు ఇచ్చిన ముస్లిం పురుషుడు, ఇద్దత్ సమయం లోపల తన స్థోమత బట్టి ఆ స్త్రీ మరియు పిల్లలు సౌకర్యవంతంగా బ్రతకటానికి వీలయినంత డబ్బు ఇవ్వాలని చెప్పింది. ఈ చట్టం క్రింద కోర్టులకి వెళ్లిన ముస్లిం స్త్రీలకు అనేక హై కోర్టులు ఆ పురుషుడి ఆర్ధిక స్థోమత బట్టి సాధ్యమయినంత డబ్బు ఇప్పించాయి. నెల నెలా కోర్టు చుట్టూ భరణం కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే సారి డబ్బు పొందే ఈ వెసులుబాటు విడాకులు తీసుకున్న హిందూ స్త్రీలు కోర్టు బయట తమ తమ న్యాయవాదుల సంప్రదింపులతో పొందుతున్నారు కానీ, చట్ట ప్రకారం వారికీ వెసులుబాటు లేదు.
అంతకు ముందు వరకూ ఉమ్మడి పౌర స్మృతి మాత్రమే కుటుంబ చట్టాలలో స్త్రీ పురుష సమానత్వానికి దారి తీస్తుందని నమ్మిన వారికి ఈ సమయంలోనే కలిగిన జ్ఞానం ఏమిటంటే, అన్ని కుటుంబ చట్టాల్లో (హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వివాహ చట్టాలు) సమానత్వం కోసం కృషి చెయ్యటం దీని కన్నా అనువైన మార్గమని. అనేక రకాల విభిన్నతలు, చట్టాలు ఉన్న భారత దేశంలో సమానత్వం కొరకు ఈ రకంగా కృషి చెయ్యాలని అన్ని రకాల స్త్రీ వాదులతో సహా, అన్ని రకాల ప్రగతి శీల వాదులు, బుద్ధి జీవులు గుర్తించారు. అంతే కాక ముస్లిం సమాజాల సమ్మతి, అనుమతి లేకుండా ఒక ఉమ్మడి పౌర స్మ్రితి తయారు చేసి వారిపై రుద్దటం అత్యంత అప్రజాస్వామికమనే సూత్రాన్ని కూడా అందరూ అంగీకరించారు.
ఇప్పుడు ప్రస్తుత సమస్య దగ్గరికి వద్దాం. అసలు మూడు తలాక్ లు అంటే ఏమిటి? ముస్లిం మత చట్టాలు, సాంప్రదాయాల ప్రకారం ముస్లిం పురుషులకు, స్త్రీలకూ కూడా విడాకులు కావాలని అడిగే హక్కు, తీసుకునే హక్కు ఉన్నాయి. స్త్రీలు అడిగి, తీసుకునే విడాకులని 'ఖులా' అంటారు. ఈ పద్ధతిలో భర్తలు ఒప్పుకోపోయినా స్త్రీలకి విడాకులు మంజూరు చేయబడతాయి. పురుషులు తీసుకునే విడాకులలో అన్నిటికన్నా సరయిన పద్ధతిని తలాక్-ఎహసన్ (మెరుగైనది అని దీనర్ధం) అంటారు. పురుషుడు విడాకులు తీసుకున్నప్పుడు మూడు సార్లు, సాక్షుల సమక్షంలో, కనీసం నెల తేడాతో తలాక్ ని ప్రకటించాలి. ఇది సంప్రదింపులకు అనువైనది, మధ్యలో విడాకులు వద్దనుకొంటే కలిసి జీవించ వచ్చు. పవిత్ర గ్రంధం ఖురాన్ లో ఈ పద్ధతి అన్నిటికన్నా సరైందని విశదీకరించి నప్పటికీ, అనేక సమాజాల్లో ఇస్లాం వ్యాపించిన పరిస్థితుల్లో, ఒకానొక చారిత్రిక సందర్భంలో వచ్చిన ఒక దుష్ట సాంప్రదాయమే - మూడు తలాక్ లను ఒకే సారి, సాక్షుల అవసరం లేకుండా, తనంతట తానుగా ప్రకటించి భార్యని వదిలించు కోవటం (తలాక్-ఏ-బిద్దత్ అంటే కల్పించబడింది). ముస్లిం సమాజాల్లో షియాలు, ఆహ్ల్ హదీస్ కు చెందిన ముస్లింలు, మరియు ఇతర జమాత్ లకు చెందిన వారు ఈ సాంప్రదాయాన్ని ఒప్పుకోరు కానీ, అత్యధికులు పాటించే హనఫీ చట్ట సాంప్రదాయాల్లో దీనికి అనుమతి ఉంది. పాప భరిత మయినప్పటికీ పురుషుడు మూడు తలాక్ లని ఒకేసారి ప్రకటించటాన్ని వీరిలో కొంత మంది విడాకులు గానే ఒప్పుకుంటారు. అన్ని సమాజాల్లో ఉన్నట్లే ముస్లిం సమాజాల్లో కూడా దుష్ట సాంప్రదాయాలని వాడుకునే పురుషులు ఉన్నారు.
ఈ రకమైన విడాకులు పొందిన అనేక మంది ముస్లిం స్త్రీలు న్యాయ స్థానాల్లో దీనికి వ్యతిరేకంగా కేసులు వేసినప్పుడు, పవిత్ర గ్రంధమైన ఖురాన్ ప్రకారం, షరియత్ ప్రకారం ఏక పక్షంగా, సాక్షులు లేకుండా, ఒకే సమయంలో ఇచ్చిన మూడు తలాక్ లని ఒకే తలాక్ గా పరిగణించాలని, అప్పుడా విడాకులు చెల్లవని 1990 ల నుండి మన దేశం లో అనేక రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాలు చాలా తీర్పులు ఇస్తూ వచ్చాయి. 2002 లో సుప్రీమ్ కోర్టు షమీమ్ ఆరా కేసులో కూడా ఈ రకమైన విడాకులు చెల్లవని తీర్పు ఇచ్చి, ఈ విషయంలో చట్ట సాంప్రదాయాన్ని మార్చింది. మరి మళ్ళా షాయారా బానో ఎందుకు కేసు వేసింది అనే ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానం - సుప్రీమ్ కోర్టు ఇచ్చే అనేక రకాల ప్రగతి శీల తీర్పులు క్రింది దాకా, ముఖ్యంగా కోర్టుల బయటి దాకా చేరవు. ఈ పరిమితి వల్ల కోర్టుల బయట, సమాజాల్లో ఆయా పద్ధతులు - హిందువులలో బహు భార్యాత్వం, బాల్య వివాహాలు, కుటుంబ హింస వంటివి - కొనసాగుతున్నాయి. హిందువులలో లాగే అనేక మంది ముస్లింలు కూడా కోర్టు బయటే - ఖాజీల ద్వారా విడాకులు తీసుకుంటారు కాబట్టి ఈ సాంప్రదాయం స్త్రీలకి ఒక సమస్యగా పరిణమించింది. చట్ట సవరణ వచ్చి దాన్ని ఖాజీలు పాటించాల్సి వచ్చే వరకూ ఆయా విడాకులని ఒప్పుకోని స్త్రీలు కోర్టుకు వెళ్లి విడాకులు చెల్లవని నిరూపించుకోవాలి. అంత వరకూ వారు త్రిశంకు స్వర్గం లో జీవించాలి.
చాలా మంది ప్రస్తుత వివాదాన్ని షా బానో వివాదంతో పోలుస్తున్నారు. అయితే ఇప్పటి చారిత్రిక సందర్భం చాలా భిన్నమైంది. అప్పటిలా కాకుండా అనేక మంది ముస్లిం స్త్రీలు వివాదానికి రెండు పక్కలా చర్చలో పాల్గొంటున్నారు. దీనికి భారతీయ ముస్లిం సమాజాలలో స్త్రీల స్థానం గురించి షా బానో వివాదం తరువాత వచ్చిన ప్రగతిశీల మార్పులే ప్రధాన కారణం. ఆ వివాదంలో తీవ్ర విమర్శకు గురయిన ముస్లిం సమాజాలు సంస్కరణలకు పూనుకుని కుటుంబ వివాదాల్ని పరిష్కరించు కోవటానికి మద్రసాలలో, బయటా, షరియత్ పంచాయత్ లని స్థాపించాయి. ముస్లిం స్త్రీలు ఇస్లాం స్త్రీలకు ప్రసాదించిన హక్కుల గురించి తెలుసుకోలేక హింసకు, అన్యాయానికి గురువు తున్నారనే అవగాహనతో ముస్లిం స్త్రీల కోసం మద్రసాలు, ఇతర విద్యా సంస్థలు స్థాపించాయి. వివాహ సమయంలో భార్యా భర్తలు ఇద్దరూ సంతకం పెట్టె నిఖానామా ని సంస్కరించి స్త్రీల హక్కులు, సమానత్వం ప్రతిబింబిస్తూ రూపొందిన కొత్త నిఖానామాని ఆహ్వానించి కొన్ని మత సంస్థలు, మతంతో సంబంధం లేని సంస్థలు కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నాయి. ముస్లిం స్త్రీలు 1985 తో పోలిస్తే విద్యాధికులయ్యారు. తమ తమ సమాజాలపై ఒక్కో సమయంలో ఒకో పేరు మీద జరిగే దాడులను (గుజరాత్, ముజఫ్ఫర్ నగర్ వంటి నరమేధాలు. టెర్రరిజం లేదా గోవధ, లేదా లవ్ జిహాద్, లేదా ఘర్ వాపసీ పేర్లతో జరిగే ప్రచార, భౌతిక దాడులు) వ్యతిరేకించటంలో అనివార్యంగా వారు పోరాటంలో పాలు పంచుకున్నారు. తమ సమాజాల గురించి, తమ మతం గురించి, ఇస్లాం తమకిచ్చే హక్కుల గురించి వారికి అవగాహన పెరిగింది. తమ తమ స్థాయిల్లో అనేక మంది కుటుంబ హింస పైన, విద్యా హక్కుల పైన కూడా వారు పని చేస్తున్నారు. ముస్లిం సమాజాలు తమ తమ అభివృద్ధి కోసం ప్రభుత్వ పధకాలను, నిధులను కోరుతున్నాయి. ముస్లిం స్త్రీలు తమ సమాజాల్లో తమ గొంతుని వినిపించే స్థాయికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే దేశం మొత్తం మీద స్థాపించ బడిన ముస్లిం స్త్రీల సంఘాలలో ఒకటయిన భారతీయ ముస్లిం మహిళా ఆందోళన అనే ముస్లిం స్త్రీల కూటమి మూడు తలాక్ ల సమస్యపై సంవత్సర కాలంగా ఉద్యమిస్తూ వచ్చింది. తమ వద్దకు కుటుంబ సమస్యల గురించి వచ్చే ముస్లిం స్త్రీలలో ఈ రకమైన తలాక్ ద్వారా విడాకులు పొందిన స్త్రీలు గురవుతున్న వేదనని వారు వివరమయిన నివేదికల ద్వారా బయటకి తీసుకు వచ్చారు
https://bmmaindia.files.wordpress.com/2016/01/triple-talaq-report.pdf. ఖురాన్
ప్రకారం చెల్లని ఈ పద్ధతిని, తమ ముస్లిం వివాహ చట్టంలో చిన్న మార్పు చేసి భారతీయ ముస్లిం సమాజాల్లో చెల్లదని చెప్పమని వారు కోర్టుని అడుగుతున్నారు. ఉమ్మడి పౌర స్మ్రితిని వ్యతిరేకిస్తున్నారు. ఇస్లామిక్ స్త్రీవాద దృక్పధాన్ని మొదటి సారి మన దేశ చర్చల్లో ప్రవేశ పెట్టిన ఈ వాదన చాలా ఆసక్తి కరమైన పరిణామం. ఇది ముస్లిం సమాజ అభివృద్ధికి చిహ్నం.
ముస్లింలకి ఇది అసలు సమస్య కాదని, ఇలా ఎక్కడా జరగదని, కేవలం ముస్లిం సమాజాలని బదనాం చెయ్యటానికే ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేశారని కొంత మంది ప్రముఖులు, ముస్లిం పర్సనల్ లా బోర్డు పైకి వాదిస్తున్నప్పటికీ ముస్లిం సమాజాల్లో షాయారా బానో కేసు చాలా చర్చకు లేవదీస్తోంది. కొంత మంది ముస్లిం లా బోర్డు సభ్యులతో సహా మూడు తలాక్ లు ఖురాన్కి వ్యతిరేకమని చాలా మంది అంగీకరిస్తున్నారు. అయితే దీనిని పరిష్కరించుకునే మార్గాల గురించి పెద్దగా ఏకీభావం లేదు. ముస్లింలకు వున్న సమస్యల్లో ఇదేనా పెద్ద సమస్య? అయినా సుప్రీం కోర్టు ఇచ్చిన షమీమ్ ఆరా తీర్పు ఉండగా కొత్తగా కేసు వెయ్యటం అవసరమా? అనేక మంది స్త్రీలు కోర్టుకి వెళ్లలేని పరిస్థితుల్లో ఉండగా కొత్తగా కోర్టు తీర్పు ఇచ్చి మాత్రం ఏమి ఒరుగుతుంది? కోర్టు ద్వారా కాక తమ తమ సమాజాల్లో ప్రచారం, సంస్కరణల ద్వారా పరిష్కరించు కోలేమా? ఇవన్నీ సమాజాల్లో జరుగుతున్న చర్చలు. కొంత మంది భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ ని చిన్న విషయాన్ని పెద్దగా చేసారని, మరి కొంత మంది సమస్య ఉందని తెలిసినా ఇన్నాళ్లూ ఏమి చెయ్యలేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు ని విమర్శిస్తున్నారు.
హిందూ, క్రైస్తవ, మరియు ఇతర సమాజాలు, చట్టాల లాగానే ముస్లిం సమాజాలు, ఆయా కుటుంబ, వివాహ చట్టాలు కూడా స్త్రీ పురుష సంబంధాల పరంగా గత కొన్ని దశాబ్దాలుగా అనేక ఉత్కంఠభరితమయిన చర్చలకూ, ప్రగతిశీల మార్పులకూ లోనవుతూ వచ్చాయి. ముస్లిం కుటుంబ చట్టాలని మార్చ కూడదని, మార్చినా తాము ఒప్పుకోమని, ముస్లింలు కమ్యూనిటీ వేదికల ద్వారా తమ కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని నమ్మే అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా సుప్రీమ్ కోర్టులో తాము వేసిన పిటిషన్ లో ముస్లిం స్త్రీలకి 126 సిఆర్పిసి చట్టం (1986), కుటుంబ హింస వ్యతిరేక చట్టం (2005) మరియు మూడు తలాక్ లకి వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన షమీమ్ ఆరా తీర్పు ఉన్నాయని, వాటిని వారు ఉపయోగించుకోవాలని తేల్చి చెప్పింది. ఇది బోర్డు ఆయా సమయాల్లో ఆయా చట్టాలకు వ్యతిరేకంగా వెలిబుచ్చిన అభిప్రాయాల నుండి పెద్ద మార్పు.
తాము ప్రభుత్వం లో వున్నా, లేకపోయినా ఏదో రకంగా ముస్లిం సమాజాలపై దాడి చేసి ముస్లిం కుటుంబాలని, ఆయా స్త్రీలని అనేక బాధలకి గురిచేసే భారతీయ జనతా పార్టీ సభ్యులు, మంత్రులు ఆకస్మాత్తుగా ముస్లిం స్త్రీల ఉద్ధారకులుగా, సంస్కరణ వాదులుగా అవతారమెత్తి ప్రకటనలు చెయ్యటం ముస్లిం సమాజాలని మరింత చికాకుకీ, బాధకి, అభద్రతకీ గురి చేస్తోంది. పైగా, ఈ కేసు సుప్రీమ్ కోర్టు పరిధిలో ఉండంగానే, లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రశ్నావళి ద్వారా అనవసర చర్చని లేవదీసి ముస్లిం సమాజాల్లో జరుగుతున్న చర్చలని పక్క దారి పట్టించి, మరింత గందరగోళాన్నీ సృష్టించింది. ముస్లిం సమాజాలని ఆత్మ రక్షణలో పడేసింది. ఇది అన్నిటికన్నా దురదృష్టకర మైన పరిణామం.
ముస్లిం స్త్రీలు షరియత్ పరిధిలో తమ జీవితాలని మెరుగుపర్చుకోవాలని, తమ కుటుంబ జీవితాలని గడపాలని, దానికి అనుగుణంగా ముస్లిం కుటుంబ చట్టాలని సంస్కరించు కోవాలని చేస్తున్నపోరాటాలే ప్రస్తుత చర్చకి దారి తీసాయని మనం గుర్తుంచుకోవాలి. వారి పోరాటాన్ని తమకు అనుకూలంగా, ముస్లిం సమాజాలకి వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్న హిందుత్వ వాదుల సంస్కరణ అవతారాన్ని ప్రగతిశీలత గా భావిస్తే మాత్రం మనం పప్పులో కాలేసినట్లే. ప్రతి సారీ ఆత్మ రక్షణలో పడినప్పటికీ అంతర్గత చర్చ, ఇస్లాం స్ఫూర్తితో సంస్కరణలని చేపట్టటానికి తాము సుముఖమేనని ముస్లిం సమాజాలు నిరూపించాయి. దానికి మంచి ఉదాహరణ సుప్రీమ్ కోర్టులో హాజీ ఆలీ దర్గా ట్రస్ట్ సభ్యులు తమకు స్త్రీ పురుష సమానత్వం లో పూర్తి విశ్వాసం వున్నదని చెప్తూ, కేసు వెనక్కి తీసుకుని, స్త్రీలు, పురుషులు ఇద్దరికీ దర్గా లో ప్రవేశాన్ని కల్పించటం. అదే విధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా బయటి వారికి (ముఖ్యంగా హిందూత్వ వాదులకి) అవకాశమివ్వని రీతిలో తమ సమాజాలలో మూడు తలాక్ లకు చోటు లేదని కోర్టు కి చెపితే బాగుండేదేమో! ఏది ఏమయినా, ఈ పరిస్థితిలో అభద్రత, వివక్షకు నిరంతరం గురయ్యే తమ తమ సమాజాలలో, కుటుంబాలలో దురాచారాలకు వ్యతిరేకంగా, సాంఘిక సంస్కరణ కోసం తమకు సాధ్యమయినంత వరకూ కృషి చేస్తూ వచ్చిన అనేక ముస్లిం సంఘాలు, ముస్లిం సమాజాలు భవిషత్తులో ఈ సమస్యపై కూడా తమ వంతు కృషి చేస్తాయనే నమ్మకం పెట్టుకోవటం మనందరికీ అవసరం.
Comments
Post a Comment