Forms of protest

ఎడిటర్ గారికి, 

రాయలసీమ, కోస్తాంధ్ర లలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తమ ప్రజల బాధని, తమ ఆందోళనని వ్యక్తీకరిస్తున్నప్పటికీ, ఉద్యమంలో స్త్రీలకు, దళితులకు వ్యతిరేకమయిన పోరాట రూపాలు వ్యక్తమవటం బాధాకరంగా ఉంది. సోనియా గాంధీకి, వివిధ నేతలకు పెళ్ళిళ్ళు జరిపిన పోస్టర్లు, ఆవిడకు వ్యతిరేకంగా వచ్చిన నినాదాలు కోడళ్ళను ఎప్పటికీ బయటి వారుగా చూసే భారత పితృస్వామ్య సంస్కృతికి నిదర్శనమ్. ఉద్యమంలో ప్రజా ప్రతినిధులకు గాజులు, పూలు, చీరలు ఇవ్వటం ఆడవారంటే చేత కాని వారనటం ఇదే ధోరణికి మరో రూపం. ఏ పి ఎన్జీవోలు ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో కూడా హైదరాబాదు సభకి రాణి ఇళ్ళకి గాజులు పంపిస్తామనటం అసహ్యకర పరిణామం. ఒక పక్క నిర్ణయాలని తీసుకున్న స్త్రీని తిట్టి, ఇంకో పక్క తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకోని మగ ప్రతినిధులని ఆడవారని అవమానించటం అంటే, రాజకీయాలంటే 'మగ' వారే చేయాలని, ఆడవారు ఎప్పటికీ రాజకీయాల్లో కి రాకూడదని నిర్దెశించి, రాజకీయాల్లో పితృస్వామ్య సంస్కృతిని కాపాడటమే.  

ఇంకో పక్క, బూట్లు తుడవటం ద్వారా, రిక్షా తొక్కటం ద్వారా నిరసనని వ్యక్తం చెయ్యటమంటే, దళిత కులాల ప్రజల్నీ, వారి శ్రమనీ పని కట్టుకుని అవమానించటమె. ఈ రూపాలు రిజర్వేషన్ల కి వ్యతిరేకంగా నిరసనలను వ్యక్తం చేసే అగ్ర కుల విద్యార్ధులు కనిపెట్టినవి. శారీరక శ్రమ ని వ్యతిరేకించి, దానిని నీచంగా చూసే బ్రాహ్మణీయ సంస్కృతి లో మాత్రమె ఇటువంటివి నిరసన గా పరిగణించ బడతాయి. అంతే కాక, దళిత ప్రజాప్రతినిధులు ఈ రూపాలలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ఇంకా విచారకరం. 

ఉద్యమం అందరికీ చెందాలన్నప్పుడు, అందరి ఆకాంక్షలు వ్యక్తం చేయాలన్నా ఉద్యమాలు నిరసన రూపాలని కూడా ప్రజాస్వమీకరించు కోవాల్సిన అవసరం వుంది. 

సునీత 

Comments