తెలుగు మీడియా పితృస్వామ్యం
జనవరి 22 అర్ధరాత్రి న ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానెల్ సునీత రెడ్డి అనే అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ ఇంటిపై స్టింగ్ ఆపరేషన్ చేసి, ఆమె ఇంట్లోకి, పడక గది లోకి ప్రవేశించి, ఇంకా బాత్ రూమ్ లోకి గూడా చొచ్చుకు పోదామని ప్రయత్నించింది. ఆ తరువాత, ఆమె అనుమానపు భర్త చెప్పిన ఆరోపణనలని నిర్ధారిస్తున్నామన్న వాదనతో, ఆమెని ఒక్క మాటైనా అడగాలనే కనీస జర్నలిస్టిక్ విలువలని పాటించకుండా, ఆమె గత జీవితం సమాచారాన్ని సెన్సషనల్ రీతిలో చిలవలు పలవలుగా అల్లి పదుల సంఖ్యలో వీడియోల్ని ప్రసారం చేసింది. వారికొచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చూసి చొంగ కార్చుకున్న ఇతర 15 తెలుగు చానెళ్లు తాము కూడా ఆమెని ఏమీ అడక్కుండా, అదే రీతిలో రిపోర్టులు తయారు చేసి ప్రసారం చేశాయి. ఊరు పేరు లేని మరి కొంతమంది కూడా తమదైన రీతిలో రిపోర్టులు తయారు చేసి, తెలుగు ఛానెళ్లతో పాటు యూట్యూబ్ లో పెట్టాయి. మొత్తం మీద, ఇప్పటికి వందల సంఖ్యలో ఈవిడ వ్యక్తిగత జీవితంపై యూట్యూబ్ లింకులున్నాయి. ఈ వీడియోలు చూసిన వారెవరికైనా, పదుల సంఖ్యలో హత్యలు, వందల కోట్ల డబ్బు పెట్టుకున్న కిరాయి హంతకుడు నయీమ్ కన్నఈవిడే సమాజానికి హాని చేసిందనే అనుమానం కలుగక మానదు. అందుకేనేమో, పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆమెని సస్పెండ్ చేసి, తన ‘నైతికతని’ కూడా చాటుకుంది.
అసలు తెలుగు న్యూస్ ఛానెళ్ళకి వ్యక్తిగత జీవితాల్లో ఆసక్తి ఎందుకు? దీన్ని న్యూస్ అనొచ్చా? టెలివిజన్ ఛానెళ్ళకి స్త్రీల పడగ్గదిలోకి ప్రవేశించే అహంకారం, అధికారం ఎట్లా వచ్చాయి? ఛానెళ్ళని భార్య పడగ్గదిలోకి తీసుకెళ్లి వారిని ప్రపంచం ముందు అవమానపరిచే భర్తలని ఎలా అర్ధం చేసుకోవాలి? ఆయా భర్తలకు, తెలిసో తెలియకో, సహకరించిన ఆమె తల్లిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఈ వీడియోల్ని లక్షల సంఖ్యలో వీక్షించిన తెలుగు మీడియా ప్రేక్షక లోకాన్ని ఎలా చూడాలి?
ముందుగా ఆవిడ భర్తతో మొదలుపెడదాం. మీడియా రిపోర్టుల ప్రకారం అయన, ఆవిడ తనకు విడాకులు ఇవ్వట్లేదని, ఇవ్వకుండా వేరే మరొకరితో ఉంటోంది కాబట్టి, ఆవిడని ప్రపంచం ముందు ‘ఎక్సపోజ్’ చేస్తే, తనకి విడాకులు ఇస్తుందని ఆశతో ఇట్లా చేశానని అంటున్నాడు. భారత దేశ చట్టం ఇటువంటి అనుమాన పడే భర్తల కోసమే ‘అడల్టరీ చట్టాన్ని’, మహిళా సంఘాలు వద్దంటున్నా, ఇప్పటికీ అట్టిపెట్టింది. తన అనుమతి లేకుండా వేరే వారితో సంబంధం పెట్టుకుందనే అనుమానం ఉంటే ఈ భర్త ఆ వ్యక్తిపై పై కేసు వెయ్యచ్చు. ఈయన వేసాడు కూడా. కానీ విడాకులకోసం ప్రయత్నించినట్లు ఎక్కడా మీడియాలో చెప్పలేదు. విడాకులకు లాయరు దగ్గరికి వెళ్ళటానికి బదులు ఈయన టెలివిజన్ ఛానెల్ ని ఎందుకు పిలిచినట్లు? అక్కడే ఎవరికైనా అనుమానం రావాలి. ఆయనకి కావాల్సింది విడాకులు మాత్రమే కాదు, ప్రతీకారం కూడా. ఒక మంచి పోలీసు ఆఫీసరుగా పేరు తెచ్చుకున్న భార్యని (ఈమె ఓటుకు నోటు కేసులో అప్పటి తెలుగు దేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఇంటిపై రైడ్ కు వెళ్లిన టీం లీడర్) దెబ్బకొట్టాలంటే ఆమెని ఒక ‘వంచించే భార్య’ స్థాయికి కుదించటం దీనికి మంచి మార్గం అనుకున్నాడు. ఒక స్త్రీ ఉద్యోగపరంగా ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా సరే, ఆమె లైంగికత పై మచ్చ తెస్తే చాలు, సమాజమిచ్చే గౌరవం తగ్గిపోతుందని, పని చేసే చోట తలెత్తుకుని తిరగలేదని, ఈయనకి బాగా తెలిసు. ఆమె మళ్ళా నిలదొక్కుకోవటానికి చాలా కాలం పడుతుందని, ధైర్యం పోగొట్టుకుంటే, బహుసా ఎప్పటికీ నిలబడలేదని కూడా తెలిసిన వాడు. పాత రోజుల్లో లా తన్ని తగలేసే కన్నా, ఇలా ప్రపంచం ముందు ఒక స్థాయికి వచ్చిన భార్యల కేరక్టర్, కెరీర్ని నాశనం చేస్తే, ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకున్నా తన మీదికి నెపం కూడా రాదని, సమాజం క్షమించేస్తుందని అర్ధమయిన వాడు.
మరి ఆవిడ స్వంత తల్లి కూడా అల్లుడిని సమర్ధించింది కదా అనే ప్రశ్న వస్తుంది. కూతుళ్లు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, వృత్తిపరంగా గౌరవం సంపాదించినా, భార్య స్థానంతో సంబంధం లేని సామాజిక స్థాయిని అందుకున్నా, వారిని కేవలం స్త్రీలుగా మాత్రమే చూసే తల్లుల్లో ఈవిడ ఒకరు. వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కూతుళ్ళ శీలం, కాపురం నిలబెట్టే బాధ్యత తల్లుల పైనే పెట్టింది సమాజం మరి. ఆ తల్లిని చూసి జాలి పడటం తప్ప ఏమీ చెయ్యలేం. కూతురి కాపురం నిలబెట్టాలని చేసిన ప్రయత్నంలో లక్షల మంది ముందు ఆమెని దోషిగా నిలబెట్టానని ఆమెకి అర్ధమయిందో లేదో అనుమానమే.
భర్తకి, తల్లికి సునీత రెడ్డితో ప్రత్యక్ష సంబంధం వుంది. కానీ, టెలివిజన్ చానెళ్లకి ఇటువంటి విషయాల్లో ఏం సంబంధం? అసలు దీన్ని న్యూస్ అంటారా? సరే, కాస్సేపు పోలీసుల నైతిక విలువలని కాపాడే బాధ్యత మీడియా తీసుకుంది అనుకుందాం. వృత్తి పరంగా లంచం తీసుకుంటే, లేక ఒకరికి అన్యాయం చేస్తే, కొడితే, తిడితే, అక్రమంగా కేసులు పెడితే, ఇంకా చెప్పాలంటే, రేవంత్ రెడ్డి వంటి నాయకుడిపై కేసు సరిగ్గా చెయ్యకపోతే సునీత రెడ్డిపై స్కూప్ చెయ్యచ్చు, స్టింగ్ ఆపరేషన్లు చెయ్యచ్చు. అది ప్రజలకి అవసరమైన సమాచారం. ఆమె వ్యక్తిగత జీవితంలోకి చొరబడి, భర్తకి, ఆమెకి ఏ గొడవలు ఉన్నాయో చూడకుండా, అతని అనుమానాన్ని నమ్మి, పోలీసుల గురించి ప్రజలకుండే అసహ్యాన్ని ఈ రకంగా వాడుకుని, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడి చెయ్యటం ఏ రకమైన న్యూస్? మాకు పక్షపాతం లేదు, మగ పోలీసులు చేసినా ఇదే చేస్తున్నాం అని అనొచ్చు వాళ్ళు. అది మాత్రం సరైందా? పురుష ఆఫీసర్లు తమ అధికారం వాడుకుని తమ దగ్గరికొచ్చే మహిళా ఫిర్యాదు దార్లని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవటం, లైంగిక దోపిడీ చెయ్యటాన్ని తప్పకుండా రిపోర్టు చెయ్యాలి, ముఖ్యంగా ఆయా స్త్రీలు అటువంటి ఫిర్యాదు చేస్తే. అది ప్రజలకి అవసరమయ్యే న్యూస్. కానీ వ్యక్తుల అంగీకారంతో నడిచే పరస్పర వ్యక్తిగత సంబంధాలని నైతిక చట్రంలో నడిపించే బాధ్యతని తెలుగు న్యూస్ చానెళ్లు తీసుకోవటం సబబేనా?
అసలింతకీ ఈ తెలుగు మీడియా నైతిక పోలీసులు తమ నైతికతని ఏ చట్ట పరిధిలో నిర్ణయించుకుంటున్నారు? భారత దేశ చట్టంలోనే వున్నకొద్దీ సంక్లిష్ట మవుతున్న కుటుంబ, వివాహ సంబంధ విషయాలని కేవలం పితృస్వామ్య నైతిక చట్రంలో బిగించకుండా లేదా నేరపూరితం చెయ్యకుండా సివిల్ చట్ట పరిధి కింద, పర్సనల్ చట్టాల పరిధిలో హక్కుల నేపథ్యంలో చూస్తున్నారు. వివాహేతర సంబంధాలు, బహు భార్యత్వం, భార్యలని చూసుకోకపోవటం ఇవన్నిటికీ చట్ట పరిధిలో ఉపశమనాలు వున్నాయి. దాని కోసం ప్రయత్నించటానికి అనేక మంది న్యాయవాదులు, సంక్లిష్ట కుటుంబ చట్టాలు, వాటిని అమలు పరిచే న్యాయస్థానాలు దేశం నిండా, ప్రతి మండలంలో, జిల్లాలో వున్నాయి. మరి మన న్యూస్ ఛానెళ్ళకి వీటి పైన నమ్మకం లేదా?
వీగిపోతున్న పాత నైతికతని ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు, వాటి పరిధిలో పనిచేసే న్యాయస్థానాలు సరిగ్గా కాపాడట్లేదని తెలుగు న్యూస్ ఛానెళ్ళ కి అభిప్రాయం వున్నట్లుంది. స్త్రీలు పబ్ కి వెళ్తే సమస్య; స్త్రీలు, పురుషులు కలిసి అర్ధ రాత్రి యూనివర్సిటీలో లైబ్రరీ నుండి కలిసి వస్తే సమస్య; స్త్రీల బట్టలు చిన్నవైనా, బిగుతుగా వున్నా సమస్య, ముఖ్యంగా జీన్స్ వంటి ‘పాశ్చాత్య’ బట్టలైతే; సమలైంగికులు కనపడితే, వినపడితే సమస్య; హీరోయిన్లకి తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు వుండవు అంటే సమస్య, రాజకీయ పార్టీలలో స్త్రీలకి భాగస్వామ్యం లేదని అంటే సమస్య; మహిళా ప్రభుత్వ అధికారులు కొంచెం మంచిగా, ట్రెండీగా బట్టలేసుకుంటే సమస్య, మహిళా, పురుష పోలీసు ఆఫీసర్లు కలిసి పని చేస్తే సమస్య, స్త్రీలు ఆల్కహాల్ తాగితే సమస్య. వారికి ఇవన్నీ ఆధునిక స్త్రీలు కుటుంబం, కమ్యూనిటీ (లేదా వీళ్ళు) పెట్టిన పరిధులు దాటుతున్నారనటానికి సూచనలు. ఇటువంటి ‘దారి తప్పుతున్న’ స్త్రీలని (వారికి సహకరించే పురుషులని) సరయిన దారికి తీసుకొచ్చే బృహత్తర బాధ్యత, కుటుంబ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ సరిగ్గా పోషించట్లేదనే బాధ తెలుగు మీడియాకి ప్రత్యేకంగా వున్నదని అర్ధమవుతుంది. దారితప్పుతున్న ఆధునిక స్త్రీలని (పురుషులని కూడా) నియంత్రించటానికి ఆధునిక మీడియా కన్నా శక్తిమంతమైనది ఏముంది?
అయితే, ఇక్కడ ఇంకో ముఖ్యమైన ప్రశ్న వ్యక్తిగత జీవితం లోకి మీడియా చొచ్చుకు రావటాన్ని ప్రేక్షకులు ఎందుకు ఒప్పుకుంటున్నారు అన్నది. ఆధునిక జీవితంలో ప్రవేశించిన కొద్దీ వ్యక్తిగత జీవితంపై కుటుంబ నియంత్రణ కొంత మేరకు తగ్గుతుంది. అలాగే పట్టణీకరణ పెరిగే కొద్దీ వ్యక్తిగత జీవితాలలో సమస్యలని ఇప్పటి వరకూ మీడియేట్ చేసిన కుటుంబం, కుల సంఘాల ప్రభావం కూడా తగ్గి క్రమంగా ఈ సమస్యలని ఇంకా సీరియస్ గా పరిగణించని పోలీసు స్టేషన్లు ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే కుటుంబ సమస్యలు, వ్యక్తిగత జీవితాలు మన టెలివిజన్కి వినియోగ సరుకుగా మారాయి. ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో అనంతంగా సాగే కుటుంబ కధనాల సీరియళ్లు ఒక పక్క, బతుకు జట్కా బండి వంటి రియాలిటీ షో లు మరో పక్క, క్రైమ్ ప్రోగ్రామ్స్ ఇంకో పక్క కుటుంబ జీవితాలని విశదీకరించే, సమస్యల్ని పరిష్కరించే, భావోద్వేగాల్ని నిభాయించే పాత్రని తీసుకున్నాయి. తమ తమ కుటుంబ జీవితాల్ని, సమస్యల్ని అర్ధం చేసుకోవటానికి అనేక మంది వీటిని చూస్తుంటే, మరి కొంత మంది రియాలిటీ షోలల్లో తమ జీవిత సమస్యలు పరిష్కారమవుతాయని అందరి ముందు పరుచుకుంటున్నారు. అయితే టెలివిజన్ ప్రధానంగా వినోద మాధ్యమం, ఇతరుల సేవ కోసం పనిచేయదు. లాభాల లేకుంటే కుదరదు. వాటి కోసం సీరియళ్లలో నటించే నటీమణులు రియాలిటీ షోలకి యాంకర్లుగా మారి నిజ జీవితంలో సమస్యల్ని పరిషరించే మధ్యవర్తులుగా అవతారమెత్తితే; జరిగిన నేరాలని మళ్ళా పునర్నిర్మించి క్రైమ్ షో యాంకర్లు వ్యక్తిగత జీవితాల్లోని చీకటి కోణాలని తామే ఆవిష్కరించినట్లు నటించి - మొత్తానికి వ్యక్తిగత జీవితాలకి, ఎంటర్టైన్మెంట్ కి మధ్య రేఖ చెరిపేస్తున్నారు. ఇలా అనేక మంది ప్రేక్షకులకి ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటం అతి పెద్ద వినోదంగా మారింది. వోయెరిజం పెరిగింది. తెలుగు న్యూస్ ఛానెళ్లు కూడా ఇదే బాట పట్టి మనుషుల జీవితాలని చర్చించేటప్పుడు పాటించాల్సిన హద్దుల్ని పూర్తిగా చెరిపేస్తున్నాయి. సునీత రెడ్డి విషయంలో జరిగిందిదే.
లాభాల కోసం దేనికైనా ప్రసారం చెయ్యటానికి సిద్ధపడుతున్న మీడియా అధినేతల్ని వదిలేద్దాం. అలాగే, కేవలం తమ వినోదం కోసం ఎటువంటి వీడియోల్ని చూసే ప్రేక్షకులని కూడా వదిలేద్దాం. తెలిసో, తెలియకో ఈ రకమైన నైతిక పోలీసు పాత్ర పోషిస్తున్న సాధారణ మీడియా రిపోర్టర్లు, ఇటువంటి స్టింగ్ ఆపరేషన్లతో సమాజ ‘నైతికత’ నిలబడుతుందని నమ్మేవాళ్ళు ఆగి, ఆలోచిస్తే పైన చర్చించిన విషయాలు వారికే తడతాయి. తమని తాము ఆ వ్యక్తి స్థానంలో పెట్టుకుంటే, పర్యవసానాలు కూడా అర్ధమవుతాయి.
వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన స్త్రీని ఇతర దేశాల్లో రాళ్లు వేసి చంపుతారు. మన దేశంలో కుల, సమూహ కట్టుబాట్లు ధిక్కరించిన స్త్రీలని, మంత్రగత్తెల పేరుతో చంపుతారు. దానికి, ఈ స్టింగ్ ఆపరేషన్ కి తేడా ఏముంది? ఇటువంటి దుర్మార్గపు దాడి తరువాత ఆమె తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే పడే నరక యాతన ఎట్లా ఉంటుందో తలుచుకుంటే దడ పుడుతుంది. స్వంత తల్లి, కట్టుకున్న భర్త, అత్త ఇలా చేసిన తరువాత, మనుషులపై నమ్మకం పోతుంది. శెభాష్ అనిపించుకున్న చోటే, అందరికీ కాల్మొక్కి సస్పెన్షన్ ఎత్తించు కోవాలి. ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం ఛానెళ్ల వెబ్సైటు లో పెట్టిన తన వ్యక్తిగత జీవితం గురించిన వీడియోలు తీయించటానికి లాయర్ నోటీసులు పంపించాలి; ఎందుకంటే, ఛానళ్ళు ‘మీడియా ఫ్రీడొమ్’ వంకతో చేసింది తప్పని పొరపాటున కూడా ఒప్పుకోవు; క్షమాపణ చెప్పవు; వీడియోలు తమ వెబ్సైట్ల నుండి తియ్యవు. యూట్యూబ్ లో వున్నవీడియో లు తియ్యాలంటే, వాళ్లకి కూడా నోటీసు పంపించాలి. ఇంకా ..ఇంకా ఎన్నో. అనుమానాస్పద భర్త ప్రతీకార ఇచ్చని తృప్తి పరచటం కోసం ఒక స్త్రీని ఇంత క్షోభ పెట్టటం, సామాజిక శిక్షకి గురిచేయ్యటం ఏ చట్ట స్మ్రుతి క్రింద అమలుచేస్తున్న న్యాయమో పాఠకులే ఆలోచించాలి!
ఆంధ్ర జ్యోతి లో 'వ్యక్తిగతాలపై నైతిక తీర్పులేందుకు?" పేరుతో మార్చ్ 4 2018 న ప్రచురింపబడింది
http://www.andhrajyothy.com/artical?SID=544755
Comments
Post a Comment