Madrassas

మదరసాలని వ్యతిరేకిస్తే, హిందూ ధర్మం రక్షించ బడుతుందా? 

తిరుపతి పట్టణానికి దగ్గరలో వున్న బాలికల మదరసా కు వ్యతిరేకంగా కొంత మంది హిందూ స్వాములు చేస్తున్న గొడవను గురించి జయశ్రీ, అన్వర్ గార్లు చేసిన విలువైన విశ్లేషణ తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మదరసాలు మత ధార్మిక విద్యను అందిస్తాయి గాని, ఇస్లాం మత ప్రచారానికి పనిచెయవు. 1990 ల తరువాత ముస్లిం బాలికల కోసం ఏర్పడిన ప్రత్యెక మదరసాలు వారికి ధార్మిక విద్యనే కాక, మామూలు విద్యనూ కూడా అందిస్తున్నాయి. ముస్లిం స్త్రీలలో ఆత్మ స్తైర్యాన్ని, నమ్మకాన్ని, ధార్మిక న్యాయ విషయాలపై అవగాహన కలిగించి వారికి తమ జీవిత గమనంపై కొంతలో కొంత పట్టుని కలిగింప చెస్తున్నాయి. ఇస్లాం మత ప్రజాస్వామీకరణ లో, ముస్లిం స్త్రీలకి ఇస్లాం మతంలో సమాన భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం లో భాగంగానే బాలికలకు, స్త్రీలకూ ఈ విద్య ని అందించే ప్రయత్నం మదరసాలు చేస్తున్నాయి. నేను, కనీజ్ ఫాతిమా కలిసి, 2010-2012 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ కోసం నగరం లోని మూడు బాలికల మదరసాల పై అధ్యయనం చేసినప్పుడు ఈ విషయాలు అర్ధమయినాయి. భారత రాజ్యాంగంలో మత పరమైన, సాంస్కృతిక పరమయిన స్వేచ్చ అన్ని సమూహాలకీ వుంది. ఆ హక్కు క్రిందే, మదరసాలు ఏర్పరుచుకోవటం జరుగుతోంది. 

ఇక ఈ విషయం గురించి స్వాములు చెప్తున్నహిందువుల మనోభావాల దగ్గరికి వద్దాం. తిరుపతి కి నిరంత రాయంగా వెళ్లి వస్తున్నభక్తులకీ, అక్కడ వుండే ప్రజలకీ, వుద్యోగులకీ, తిరుపతి ప్రజలలో అనేక మంది హిందువులే. వారికెవరికీ లేని అభ్యంతరాలు స్వాములకి ఎందుకు వస్తున్నట్లు? రెండవది, జయశ్రీ, అన్వర్ గార్లు చెప్పినట్లు, వెంకటేశ్వర స్వామికే బీబీ నాంచారమ్మ భార్య. భార్య పుట్టింటి వారిని తిరుపతి నుండి వెళ్ళిపోవాలని అయన కోరుకోలేదు. దేవుడికి భార్యంటే అంత గౌరవం వున్నప్పుడు, దాన్ని పక్కకి పెట్టి, భార్యని, భార్య పుట్టింటి వారినీ అగౌరవ పరిచే సంస్కృతీ ని  అలవరుచు కోవాలని గొడవ చేస్తున్న స్వాములు మనని కోరుకుంటున్నారా? సంసారయిన వెంకటేశ్వర స్వామికి వున్న విజ్ఞత, ఈ స్వాములకి లోపించిందని మనం భావించాలా? మూడవది, తిరుపతిని హిందూ మత కేంద్రమనీ, కాబట్టి అక్కడి నుండి ముస్లిం సంస్థలు వెళ్లి పోవాలని అనటం పూర్తిగా అసంబద్ధమయింది. తిరుపతికి వచ్చె భక్తులు శ్రీశైలం, కాళహస్తి, కాశీ, బదరీనాథ్, మదురై, తిరువనంతపురం మొదలైన అన్ని దేవాలయాల్నీ సమానంగానే చూస్తారు, తమ తమ గ్రామాల్లో గ్రామ దేవతలని, ఊళ్ళల్లో శివలయాల్తో సహా. అన్ని దేవాలయాలకు వెళ్ళాలనే కోరుకుంటారు. కేవలం తిరుపతిని మాత్రమె, అది పెద్ద దేవస్థానం కావచ్చు గాక, హిందూ ధార్మిక కేంద్రంగా చూడాలని ఏ ప్రాతిపదికపై సూచించలేము. ప్రజల రోజు వారీ జీవనంలో, తమ మతాన్ని పాటించటం అంటే అర్ధం, వేరే మతాన్ని వ్యతిరేకించటం కాదు. ముఖ్యంగా, అన్ని ఊళ్ళల్లో అసంఖ్యాక దేవాలయాలతో పాటు, మదరసాలు, మజీదులు, దర్గాలు వుంటాయి. పక్క పక్క నుండే హిందువులు, ముస్లిములు తమ తమ పండుగలని, దర్గాలని, పీర్లని, సూఫీలని, బాబాలని కలిసే కొలుచు కుంటున్నారు, జీవిస్తున్నారు. ఎవరూ కూడా ఇటువంటి అసంబద్ధమయిన డిమాండులు చెయ్యట్లేదు. తమకి తాము మాత్రమె జీవించే సంకుచింత పాత కాలపు విలువల నుండి బయటి కొచ్చి వివిధ రకాల మతాలు, జాతులు, కులాల ప్రజలు పరస్పర గౌరవంతో, ఆధునిక సమానత్వ ధోరణి తో జీవించటం అలవాటు చేసుకుంటున్నారు. తమ తమ మనోభావాలను కాలానుగుణంగా మార్చుకుంటున్నారు. మరి, స్వాములు కాలంతో పాటుగా ఎందుకు నడవట్లేదు? స్వాముల గొడవ, హిందూ మతం గురించి కాదు అన్న అనుమానం కలుగుతోంది. హిందూ మతాన్ని భారత రాజ్యం, రాజ్యాంగం, దేవాదాయ శాఖలు, అసంఖ్యాక భక్తులు బాగానే కాపాడుకుంటున్నారు. అత్యంత సంపద, ప్రజాదరణ వున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్తానాన్ని ఏ స్వాములు కాపాడవలసిన అవసరం వుందని ఇప్పటి వరకూ ఎవరికీ అన్పించటం లేదు. ఈ సంగతి వారికీ తెలిసినట్లే వుంది. ఇక హిందూ ధర్మాని కొద్దాం. 

హిందూ ధర్మాన్ని కాపాడాలని స్వాములకి వుంటే, హిందూ సమాజంలో పాకిపోయి వున్నకుల వ్యవస్థ, స్త్రీ వ్యతిరేకత, జోగిని వంటి అమానుష ఆచారాలు, కట్నం హత్యలూ, చేతబడి హత్యలూ, పరువు హత్యలు వంటి వాటికి వ్యతిరేకంగా పని చెయ్యాలి, అన్ని దేవాలయాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి, అన్ని కులాల ప్రజలు, స్త్రీలు, పురుషులు కూడా పూజారులు అయ్యే అవకాశాలుండాలి. ధార్మిక చింతన తప్ప, వేరే ఏ విషయమూ హిందూ దేవుళ్ళకీ, ప్రజలకీ మధ్య రాకుండా - కులము, సంపద, లింగము వంటివి - కృషి చెయ్యాలి. హిందూ ధర్మాన్ని ప్రస్తుత సమాజానికి అనుగుణంగా సంస్కరింఛి సమాజంలో హిందూ ధర్మం పేరుతో చలామణి అవుతున్న ఇటువంటి అధార్మిక ఆచారాల్ని, అమానుషాలని అరికట్టాలి. ఈ పని, పేద మదరసాలకు వ్యతిరేకంగా గొడవ చెయ్యటం, చార్మినార్ వద్ద దేవాలయం సృష్టించటం అంత సులభం కాదు. ప్రస్తుత సమాజంలో అన్ని మతాలూ తమని కాపాడు కోవటానికి ప్రజస్వామీకరించటం తప్పనిసరి అని అర్ధం చేసుకున్నాయి. పర మతాలపై అసహనం చూపించటం, ద్వేషం కూడ గట్టటం రాజకీయ సమీకరణకు, అధికార స్థాపనకు పనికొస్తుంది తప్ప, మతాలని, దేవుళ్ళని కాపాడు కునేందుకు, ధార్మిక విలువలని పెంచటానికి పనికి రాదనే విషయం కూడా చాలామంది ప్రజలకి అర్ధమయిన సంగతే. తిరుపతి లో మదరసాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్న స్వాములు, హిందూ సమాజంలో అధార్మిక ఆచారాల్ని నిర్మూలించి, హిందూ ధర్మాన్ని సంస్కరించి, తమ నైతిక ప్రవర్తన, ధార్మిక చింతనతో హిందూ ధర్మాన్ని, సమాజాన్ని కాపాడు కునే కష్టమయిన పని చేస్తారా, లేక ముస్లిముల మీద ద్వేషం కూడగట్టి, తామో, తమ లాంటి వారో తిరుపతి లోనో, వేరే చోటో రాజకీయ అధికారం లోకి రావటానికి ప్రయత్నం చేస్తారా అన్న విషయం - నిర్ణయించుకోవాలి. 


లెటర్ తో ది ఎడిటర్ - ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమయింది. 

Comments