Politics of razakar memory

కిశోరిలాల్ వ్యాస్ నీలకంఠ రాసిన 'రజాకర్' నవల - ఒక సమీక్ష 

హిందీ రచయిత కిశోరిలాల్ వ్యాస్ నీలకంఠ రాసిన 'రజాకార్' నవల హైదరాబాదు రాజ్యాన్ని భారత దేశంలో కలపటం కోసం జరిగిన పోరాటం, దానిలోని ముఖ్య సంఘటనల చుట్టూ నడుస్తుంది. ముఖచిత్రంపై ఉన్మాదిగా కనిపించే ఖాసిం రజ్వి తో సహా అనేక మంది చారిత్రక ప్రముఖుల పాత్రలు, కాల్పనిక పాత్రలతో కలిసి నవలను నడిపిస్తాయి: మంచి వాడు, కానీ బలహీనుడయిన ఉస్మాన్ అలీ ఖాన్; ధీరుడయిన స్వామీజీ; హిందూ ధర్మాన్ని కాపాడటానికి వీరోచితంగా ఆయుధాలు చేపట్టే ఆర్య సమాజ సభ్యులు; భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్ట్ కార్యకర్త శంకర్; క్రూరులయిన ముస్లిం పోలీసు అధికారులు; మత పిచ్చితో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పెట్రేగి పోయి వినాశనానికి పాల్పడిన రజాకార్లు, వీరికి వ్యతిరేకంగా పోరాడి, తమ మగవారికి చేయూతనిచ్చే హిందూ స్త్రీలు; అణగారి నివసించే ముస్లిము స్త్రీలు; మత మార్పిడికి లొంగ కుండా ప్రాణాలు పోగొట్టుకున్న మంచి హరిజనులు; ప్రలోభాలకు లొంగిపోయి రాజాకార్ల తో కలిసిపోయిన చెడు హరిజనులు. షోయబుల్లా ఖాన్, నరసింగ రావు, నెహ్రూ, మున్షి, లాయక్ అలీ కూడా ఈ నవలలో పాత్రలే. నవల కధనం ఇలా సాగుతుంది. బలహీనుడయిన ఉస్మాన్ అలీ ఖాన్ ఖాసిం రజ్వి కి అధికార పగ్గాలు అప్పగిం చటం అనేక విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. శంకర్ వంటి యువకులు రజాకార్ల అత్యాచారాలను చుస్తూ పెద్దవుతారు. పెద్దయిన తరువాత వీరు వారి ఆగడాలని అడ్డుకోవటానికి ఆర్య సమాజ్, కాంగ్రెసు, కమునిస్ట్ పార్టీలలో రాజకీయ కార్యకర్తలవుతారు. శాంతి యుతంగా నిజాం  పాలనకు వ్యతిరేకంగా ప్రజలని సమీకరిస్తారు. పత్రికల్లో రాస్తారు. కొన్నిసార్లు భరించలేక ఎదురు తిరుగుతారు. నిజాం పోలీసులు ప్రభుత్వ వ్యతిరేకులను చంపటమే కాక, రైతులను, హరిజనులను తమ పశుత్వానికి గురి చేస్తారు. ఇవన్నీ తీవ్ర స్థాయికి చేరుకున్న సందర్భంలో హిందువులను రక్షించటానికి భారత సైనికులు వస్తారు. భారత సైన్యంలో వున్న సిక్కులు, అప్పటికే దేశ విభజన సమయంలో ముస్లిముల చేతుల్లో హింసకి గురయి వున్నారు కాబట్టి ఆ కోపాన్నంతా ఇక్కడి ముస్లిం సైనికులు, పోలీసుల పై తీర్చు కుంటారు. నిజాం ప్రభుత్వం పడిపోయిన తరువాత, కొంత మంది మామూలు హిందువులు ముస్లిం లపై దాడులు చేస్తారు. కానీ ఒక గ్రామంలో ముస్లిము జాగిర్దార్ ని హిందువులు క్షమించి, రక్షణ కల్పించటంతో నవల ముగుస్తుంది.       

నవల తెలంగాణా ప్రజల జ్ఞాపకాల్లో నిక్షిప్తమయిపోయిన అనేక సంఘటనలను వర్ణిస్తూ వివరిస్తుంది. కమునిస్టు ఉద్యమంలో ముఖ్య సంఘటనలు, వారు ప్రజలని సమీకరించిన విధానం, రజాకార్లతో, నిజాం పోలీసులతో వారి యుద్ధాలు; మామూలు హిందువులపై ముస్లిం పోలీసులు జరిపిన అత్యాచారాలు, వారు వాటిని వ్యతిరేకించిన తీరు; ఆయా పోరాటాల్లో స్త్రీల పాత్రా - కళ్ళకు కట్టేటట్లు వర్ణిస్తారు. ఈ పరిస్థితులు రావటానికి కారణాలు కొంత తానూ, మరి కొంత పాత్రల ద్వారా రచయిత చెప్పిస్తారు.  ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలన మంచిగా ఉండేదనీ, ఆయన తన హిందూ ప్రజల పండగలలో పాల్గొని, వారితో కలిసి పోయే వాడనీ ప్రశంసా పూర్వకంగా వర్ణించిన తరువాత, గాంధీ-జిన్నాల మధ్య భారత దేశ భవిష్య రాజకీయ చిత్రం గురించిన చర్చ పరిస్థితులను మార్చిన నేపధ్యంగా ముందుకు తెస్తారు. దేశ స్వాతంత్ర్య సమరంలో కలవకుండా జిన్నా హిందువులు ముస్లిం ల మధ్య విభేదాలు సృష్టించాడని, ఆ విభేదాలే హైదరాబాదు రాజ్యంలో కూడా పొడచూపాయనీ, వాటికి కారణం మత మౌడ్యం వున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, తన ఇస్లామిక్ భావజాలంతో ముందుకు రావటమే నని అంటారు. హైదరాబాదు రాజ్యంలో తలెత్తిన గందరగోళ పరిస్థితులు మన కళ్ళ ముందు చిత్రీకరిస్తారు. షోయబుల్లా ఖాన్ హత్య, బహదూర్ యార్ జుంగ్ అకాల మరణం ఈ పరిస్థితులలో భాగమే. దేశాన్ని విభజించిన జిన్నాతో సంబంధం పెట్టుకున్న రజ్వి చేపట్టిన చర్యల వల్లే అనేక రకాల ఉద్యమాలు తెలంగాణా ప్రాంతంలో వచ్చాయని; అమాయక 'హరిజనుల'ను చేర్చుకుని హిందువుల ఆస్తుల మీద, వారి స్త్రీల పైనా దాడులు చేసి, మొత్తం రాజ్యమంతా అల్లకల్లోలం సృష్టించి రజ్వి తెలంగాణా జిన్నా గా అవతరించాడనీ ఈ నవల చెప్తుంది. 
జరిగిన సంఘటనల చుట్టూ తిరిగే ఈ చారిత్రిక నవల చరిత్రను, తనకిష్టం వచ్చినట్లు తిప్పుకుంటూ వాడుకుంటుంది. శంకర్ రజాకార్ల ఆగడాలు చూస్తూ పెద్దవుతాడు, అంటే, రజాకార్లు దశాబ్దానికి పైగా వున్నారని రచయిత  భావన. హైదరాబాదు రాజ్య చరిత్ర తెలిసిన ఎవరికయినా రజాకార్లు రెండు, మూడు సంవత్సరాలకు మించి లేరని తెలుసు. ఇస్లాం లోకి దళితుల మత మార్పిడులు జరిగింది రజ్వి వున్నప్పుడు కాదు, 1920లలొ, ముఖ్యంగా బహదూర్ యార్ జంగ్ నాయకత్వంలో. అవి బల వంతపు మత మార్పిడులు అనటానికి ఆధారాలు లేవు.  కాంగ్రెసు, ఆర్య సమాజం అందరూ రజాకార్ల కు ప్రతి చర్యగా ఉద్భవించాయని రచయిత చిత్రణ. ఆర్య సమాజం హైదరాబాదు రాజ్యంలో 1890 ల నుండి పని చేసింది. కాంగ్రెసు పార్టీ, నిజాం ప్రభుత్వం వొప్పుకోకపోయినా, 1920 ల మధ్య నుండి ఏదో రూపంలో ఉంటూనే వచ్చింది. గాంధీ హైదరాబాదు రాజ్యానికి మూడు సార్లు వస్తే, ప్రభుత్వాధికారులు వెళ్లి స్వాగతం పలికారు. రచయిత చెప్పినట్లు, పోలీసు చర్య తరువాత హిందువుల, హిందు సైన్యం దాడుల్లో చనిపోయింది పోలీసు అధికార్లు మాత్రమె కాదు, మామూలు,  సాధారణ ముస్లిం లు కూడాను. అయితే, ఈ నవల ఉద్దేశం జరిగింది జరిగినట్లు చెప్పటమో, సంక్లిష్ట సమాజ చిత్రాన్ని పాఠకులకి అందించటమో కాదు. అందరు ద్వేషించగలిగె ఒకే ఒక్క శత్రువుని సృష్టించటం. ఆ శత్రువు ఎవరంటే 'రజాకార్లు'. 


వారు గ్రామాల పై చేసిన దాడుల్నీ, వారి క్రూరత్వాన్ని, దయ లేని తనాన్ని, అమానుషత్వాన్ని వివిధ రకాలుగా చిత్రీకరి స్తుంది ఈ నవల. వారు స్త్రీల పట్లే కాదు, 'హరిజనుల' పట్ల కూడా క్రూరత్వాన్నిచూపించారనీ, ఎట్లా అంటే, వాళ్లకి గొడ్డు మాంసం తినిపించి, ఇస్లాం లోకి మార్పించి అని అంటుంది! మరి వారి నుండి 'ప్రజల్ని' కాపాడగలిగే సత్తా వున్నవాళ్ళెవ్వరు? బ్రాహ్మణులు. నవలలో ముస్లిములు, 'హరిజన్లు', బ్రాహ్మణులూ, రెడ్లు తప్ప మరే కులాల వాళ్ళు పెద్దగా కనిపించరు. కనిపించినా వారి వారి కులాల ప్రస్తావన వుండదు. బ్రాహ్మణులు తప్ప అన్ని కులాల వారూ డబ్బు, అధికారం, స్త్రీల వ్యామోహానికి గురవుతూ వుంటారు. బ్రాహ్మణ పాత్రలు ఎప్పుడు ఈ వ్యామోహాలకి గురి కావు. నిజాయితీతో, దైవ భక్తితో, హిందూ మత రక్షణ కోసం ఆయుధాలు పట్టటానికి కూడా సిద్ధంగా వుంటారు. వీరి నాయకత్వంలో పనిచేయటానికి మిగిలిన కులాల వారు  కూడా సిద్ధం గా ఉంటారు, కమ్యునిస్టులు, కాంగ్రెసు వారితో సహా. అంటే, ప్రధానంగా, అప్పుడు జరిగింది, హిందూ ధర్మానికీ, ఇస్లాం మత మౌడ్యానికి (ముస్లిములకు) మధ్య జరిగిన యుద్ధమని చెప్పటం నవల వుద్దేశం: హిందువులు కేవలం ఆత్మ రక్షణ కోసం పోరాడారు తప్ప,  వారికి మత మౌడ్యమ్ వుండదు. ఎందుకంటే, రచయిత దృష్టిలో హిందూ మతంలో ఎవరి పాత్ర - కుల వ్యవస్థ రూపంలో - రైతులు, స్త్రీలు, యువకులు, హరిజనులు - వారి కుంటుంది. వారందరూ, ఈ 'హిందూ సమాజాన్ని' రజాకార్ల నుండి రక్షించుకునే పోరాటంలో తమ తమ స్థాయిల్లో, రక రకాల పార్టీల ద్వారా ఈ పోరాటంలో పాల్గొన్నారు. 

నవల మొదట్లో ముస్లిం లలో - రజాకార్లకి, షోయబుల్లా ఖాన్ కి, మంచి వాడయిన నిజాముకు మధ్య - తేడాలు చూపించినా, మధ్యలో కొచ్చేటప్పటికి, ముస్లిమ్ లందర్నీ ఒకే వర్గం గా (ముస్లిం లు కాని వారందరినీ, హిందువులు గా) వర్ణించటం మొదలు పెడుతుంది. అంతే కాదు, నెమ్మదిగా ముస్లిం లందరికి మత పిచ్చి ఉన్నట్లుగా - వారికి సమాజంలో, ప్రభుత్వంలో, రాజకీయాలలో వున్న స్థానానికి సంబంధం లేకుండా -  చిత్రీకరిస్తుంది. తన సృజనాత్మక వాస్తవికత ద్వారా ప్రతి సాధారణ ముస్లిం లో 'రజాకారు' దాగి ఉంటాడని చూపిస్తుంది. చివరికి, అమాయక ముస్లిం ల మీద పోలీసు యాక్షన్ తరువాత జరిగిన మారణహోమం కూడా, ముస్లిం లు చేసిన దానికి 'జరగాల్సిన' (ఇనెవిటబుల్) ప్రతిచర్యగా చూపిస్తుంది.  

2005/2007 లలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ లలో  వచ్చిన ఈ నవలా 'వాస్తవికత' స్పష్టంగా సమకాలీన హిందుత్వ జాతీయవాద రాజకీయ దృక్కోణంలో హైదరాబాదు రాజ్య 'విలీన' చరిత్రను చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ వాస్తవికతలో, నిజాం ప్రభుత్వం లో గ్రామ గ్రామానా పనిచేసిన బ్రాహ్మణ కరణాలు, అధికార్లు, మిగిలిన బ్రాహ్మణ ఉద్యోగుల ప్రస్తావన కి స్తానం వుండదు (వాళ్ళందరూ వుంటే, ఆ రోజుల్ని హిందూ ధర్మమూ, ఇస్లాం మత పిచ్చి కి మధ్య యుద్ధం గా వర్ణించటం అసాధ్యం కద!) 'హరిజనులు' గొడ్డు మాంసం తిని తమ మతాన్ని కొల్పోతారనే హెజిమోనిక్ (అ)'సత్యం' దీనిలోనే అర్ధం చెసుకోగలం. గొడ్డు మాంసం తినే అలవాటు ముస్లిం ల వల్లే వచ్చిందని చెప్పటం వల్ల, దళితులను, ముస్లిం లను వేరు చేయచ్చు. మొత్తానికి దళితులు హిందూ సమాజంలో భాగమే అని చెప్పచ్చు (ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న గొడ్డు మాంస ఉత్సవాలకి హిందుత్వ వాదుల నుండి వస్తున్న వ్యతిరేకత ఈ దృక్పధం నుండే) మరి 'ప్రతి చర్య' సిద్ధాంతం 2002 సందర్భంలో నరేంద్ర మోదీ ప్రతిపాదించిందే. వీటన్నిటితో పాటు ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిన సంఘటలని కలిపి రంగరించిన నవలిది.   

అయితే, హైదరాబాదు రాజ్యం గురించి ఇటువంటి 'చారిత్రకత' కేవలం హిందూత్వవాద కాల్పనిక (ఎంత వాస్తవికతతో కూడినదయినా) సాహిత్యానికి మాత్రమే పరిమితమయి లేదు. ఈ మధ్యనే (2008లో) గాంధీ భవన్ నుండి ప్రచురించ బడిన కాంగ్రెసు బ్రాండు చరిత్ర (రామారావు గారి హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్ర్య ఉద్యమం) కూడా ఇదే ధోరణిలో, మరిన్ని వివరాలతో, సాక్ష్యాలతో, ఆధారాలతో రాయబడింది. ఇక్కడ కూడా, రామానంద తీర్ధ, సుందరయ్య, నరసింగ రావులు, ఎటువంటి వైరుధ్యాలు లేకుండా, తెలుగు భాష కోసం, మత మార్పిడులకు, దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతూ వుంటారు. ఈ పుస్తకంలో ఒక దశాబ్ద కాల - 1940 ల చరిత్రను, మొత్తం ఆధునిక హైదరాబాదు రాజ్య చరిత్రగా జరిగే ప్రయత్నం జరిగింది. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన కొత్తల్లో రాయబడిన హైదరాబాదు చరిత్ర జాతీయవాద దృక్పథంలో రాయబడితే, క్రమ క్రమంగా దీనికి, వామ పక్ష దృక్పధం తోడయ్యి దొరలకు, రజాకార్లకు, నిజాముకు వ్యతిరేకంగా పోరాడటమే (తెలంగాణా) హైదరాబాదు రాజ్య చరిత్ర గా - విమోచన పోరాట చరిత్ర గా- (జాతీయ వాద విమోచన కావచ్చు, సాయుధ పోరాట విమోచన చరిత్ర కావచ్చు) - చిత్రీకరించటం ఎక్కువయింది. ఇటువంటి చరిత్రీకరణే ఉద్యమాల ద్వారా, సాహిత్యం ద్వారా తెలుగులో ప్రాచుర్యం పొందింది. ముస్లిం లకు (సామాన్య ముస్లిం లు,  కులీన వర్గాలు, మధ్య తరగతి తేడా లేకుండా) జాతీయ వాదులు,  కమ్యూనిస్టులు, నిజాం ప్రభుత్వ ఉద్యోగులు గానో తప్ప - ఈ చరిత్రలో స్థానం లెదు. 1940 లలోనే లక్షల్లో సభ్యులున్న మజ్లిస్ పార్టీకి, ఆ పార్టీ సభ్యులకు రజాకార్లుగా, జిన్నా సమర్ధకులుగా తప్ప స్థానం లెదు. దళితులకు, ముస్లిం లకు మధ్య సంబంధాలు, దళితులకు, నిజాం ప్రభుత్వానికి గల సంబంధాలు కూడా వ్యతిరేకతతోనే కూడుకుని వున్నట్లు, మూస పోసిన ఆలోచనా రీతుల్లోనే చిత్రీకరించ బడ్డాయి, చాలా వరకు.   

ప్రస్థుతమున్న ఇటువంటి జాతీయ వాద, విమోచన వాద రీజినల్ చరిత్రను తిరగ రాయటానికి కొన్ని దశాబాలే పట్టొచ్చని సరోజినీ రేగానే వంటి చరిత్రకారులు అభిప్రాయ పడ్డారని కె. శ్రీనివాసు వంటి కొత్త తెలంగాణా చరిత్రకారులు అన్నారు. బొడ్డు వెంకట్, కవిత దాట్ల, గోగు శ్యామల వంటి కొంత మంది ఈ చరిత్రను వేరే ద్రుక్కోణాల్నుండి రాయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, 1990 లలో మొదలయిన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చైతన్యం విస్తరించిన తరువాత ఈ  చరిత్ర, జ్ఞాపకాల లో ఖాళీ - సామాన్య ముస్లిం లకు స్థానం లేకపోవటం - అన్నది స్పష్టంగా కనిపించటం మొదలయింది. ఈ ఖాళీ లోకి, ఇప్పటికే ప్రాచుర్యంలో వున్న చరిత్ర, సాంస్కృతిక స్మృతులు, కళా రూపాల్లో నిబిడీ కృతమయిన నిజాం, రజాకార్ల వ్యతిరేక జ్ఞాపకాలలోని ముస్లిం ల గురించిన కల్పనలు ప్రవేశిస్తున్నాయి. ముస్లింలందరూ అంతర్గతంగా రజాకార్లే అన్న భావన ను, జాతీయ వాద, విమోచన దృక్పధాల చరిత్ర ప్రభావానికి, అది ప్రజల జ్ఞాపకాలో నిక్షిప్తమయిపోయిన విధానానికి సంబంధం లేకుండా అర్ధం చేసుకోలేము. ఈ మధ్యన సంగిశెట్టి శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా, జిలుకర శ్రీనివాస్ వంటి కొంతమంది దళిత, ముస్లిం ఉద్యమకారులు ఇటువంటి చరిత్ర, జ్ఞాపకాల కున్న రాజకీయాలను  ప్రశ్నించారు. కానీ, అంచుల నుండి వేస్తున్న ఈ సవాళ్లు అధికారిక చరిత్రని, ఉద్యమ చరిత్రని, అంత కన్నా ముఖ్యంగా ముస్లిం లు అంటే రజాకార్లు అని సాధారణ ప్రజల్లో వున్నబలమయిన జ్ఞాపకం/అభిప్రాయాన్ని మార్చగలవా అన్నది ప్రశ్నార్ధకమే.    

ఈ సాధారణ ప్రజల 'జ్ఞాపకం' ఎంత బలమయిందో నాకు 2010 లో మా సహాధ్యాయులు మొయీద్, డా.  మొహమ్మద్ తో కలిసి సిద్దిపేటలో హిందువులు ముస్లిముల మధ్య చెలరేగిన కమ్యూనల్ టెన్షన్ గురించి అర్ధం చేసుకోవటానికి వెళ్ళినపుడు తెలిసింది. తన కూరల దుకాణంపై పక్క ముస్లిం దుకాణాదారులు చేసిన దాడిని వర్ణిస్తూ ఒక కూరలమ్మే బి.సి కులస్తురాలయిన మహిళా దుకాణదారు  'మా అమ్మ చెప్తుండే ..వెనకటి సంది తుర్కోల్లు, రజాకార్లు .. మనోల్లని, తెలుగోల్లని.. ఇట్లనే కొట్టిన్రట' అన్నది.  ఆవిడ అన్న మాటల్ని తేలిగ్గా కొట్టిపడేయ్యచ్చు.  అక్కడున్న హిందుత్వ వాద కార్యకర్తలు ఆవిడకి అవన్నీ నేర్పారని అనుకొవచ్చు. అప్పుడే గొడవయింది కాబట్టి ఆవిడ కోపంతో మాట్లాడింది అనుకోవచ్చు. ఆవిడా, ఆవిడ తో గొడవ పడ్డ దుకాణాదారులు అందరు దాదాపు ఒకే వర్గానికి చెందిన వారు, బహుశా ఒకే కులానికి చెందిన వారయి వుంటారు.  అయినా సరే, 'తుర్కోల్లు-మనోళ్ళు; రజాకార్లు-తెలుగోళ్ళు' అన్నతేడా, చదువు రాని కూరలమ్మే ఆమెకి నాలుక మీదే వుందంటే..అది నిజంగానే కుటుంబం, కమ్యూనిటి జ్ఞాపకాలనించి వచ్చిందనుకోవాలా? లేదా ఆవిడ రోజువారి జీవితాన్నించి వచ్చిందనుకోవాలా? గత పదేళ్లుగా రజాకార్ల గురించిన 'జ్ఞాపకాల' ను తిరగ తోడిన తెలంగాణా ఉద్యమ చరిత్ర దీనికెంత తోడ్పడింది? తెలంగాణాలో మారుతున్న రాజకీయ సమీకరణల్లో కొత్తగా అధికారంలోకి ప్రవేశిస్తున్న కులాలలో వస్తున్నసాధికారత ఎంత మేరకు తోడ్పడుతోంది?  


Published in Saranga magazine in August 2013. Link no longer works. 
-- 

Comments