Politics of razakar memory

రజాకార్లు: రాజకీయ ప్రయోజనాలు 

సెప్టెంబర్ నెల వచ్చింది. 1948 సెప్టెంబర్లో హైద్రాబాదు రాజ్యాన్ని భారత దేశంలో కలిపిన తేదీ గురించిన చర్చ మళ్ళా ముందుకొచ్చింది. 2009 నుండి జరిగిన తెలంగాణా రాష్ర పోరాట సందర్భం, హైద్రాబాదు రాజ్యాన్ని భారత దేశంలో కలిపిన తీరుని ఇరుకు జాతీయవాద పరిధి నుండి బయటకి తెచ్చి అది విలీనమా, విమోచనమా లేక విద్రోహమా అన్న సందిగ్ధాన్ని లేవనెత్తింది. ప్రజాస్వామిక తెలంగాణా కోరే వారందరు విద్రోహంతో మొదలయ్యి నెమ్మదిగా విలీనమే అన్న వాదనకి రాజీ పడితే, విమోచన వాదానికి దాసోహం అయిన వారు ఒక పట్టాన దాన్ని వదల లేక పోతున్నారు. క్షీణించిన రాచరిక వ్యవస్థపై కొత్త జాతి-రాజ్య విజయంగా మాత్రమే చూడవలసిన ఈ ఘటనని విమోచన వాదం ‘ముస్లిం రాజు, ముస్లిం ఫ్రజల’ పై ‘హిందువుల ప్రజాస్వామ్య’ విజయంగా చిత్రీకరించి ఇప్పటికే చాలా హాని చేసింది. డెబ్బై ఏళ్లుగా ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచి పోషించిన ఈ వాదం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంబంధాల నిర్మాణానికి ఎంత మాత్రము ఉపయోగ పడదు. 

నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని తెలంగాణా విమోచన పోరాటంగా వర్ణించే చరిత్రలో ‘రజాకార్ల’ పాత్ర అందరికీ విదితమే. తెలంగాణా ప్రాంత ప్రజలు  పిరికి వారు కాదని నిరూపించటానికి గ్రామీణ ప్రజలు రజాకార్లని వ్యతిరేకించిన తీరే నిదర్శనమని విమోచన చరిత్ర ఉద్ఘాటిస్తుంది. అయితే దానికి నిదర్శనంగా భూస్వామ్య సంస్కృతిని అంతమొందించేందుకు 1948 నుండి 1951 వరకు భారత సైన్యాన్ని నాలుగేళ్ల పాటు ఎదుర్కొన్న తెలంగాణా సాయుధ పోరాటం గురించి లేదా 1970 ల నుండి 1990 ల వరకు ఆ దొరతనపు అవశేషాల్ని తీసివేయటానికి తీవ్ర రాజ్య హింసని ఎదుర్కొన్న నక్సలైటు పోరాటాన్నీ గురించి చెప్పుకోవాలి కానీ స్వాతంత్య్రం రాక ముందు కేవలం ఒకే సంవత్సరం పాటు వున్న రజాకార్ల గురించి మాత్రమే పదే పదే ప్రస్తావించటం ఆశ్చర్యకరం. అంటే, ఈ జ్ఞాపకం, దానిని ఆ విధంగా క్రోడీకరించే చరిత్ర, ఆ రెండిటినీ బలపరిచే సంస్కృతి వల్ల ఒనకూడే రాజకీయ ప్రయోజనాలు వేరే ఏవో ఉన్నాయన్నమాట. ఈ డెబ్బై ఏళ్లలో వీటి వల్ల నెరవేరిన రాజకీయ ప్రయోజనాలని పరిశీలించి కొత్తగా దీన్నుండి విమోచన వాదులు ఏమాసిస్తున్నారో అర్ధం చేసుకోవటానికి ఈ క్రింది వ్యాసంలో ప్రయత్నిద్దాం. 

మొదటగా కొన్ని వాస్తవాలు ప్రస్తావించటం అవసరం. కిశోరీలాల్ నీలకంఠ్ తన ‘రజాకార్’ నవలలో వర్ణించినట్లు లేదా అనేక మంది ప్రచారం చేసినట్లు రజాకార్లు హైద్రాబాదు రాజ్యంలో దశాబ్దాల తరబడి లేరు. ఎక్కువ కాలం కూడా లేరు. వున్నది కేవలం సంవత్సరం - 1947 నుండి 1948 మధ్య. 1927 లో పుట్టిన ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 1936 వరకు హైద్రాబాదు రాజ్యంలో ఒక మత సంస్కరణ సంస్థగా, అనేక ముస్లిం వర్గాల మధ్య ఐక్యత తీసుకురావటానికి, ముస్లిం స్త్రీలకి చదువు కోసం, ముస్లింలలో రాజకీయ అవగాహన కోసం ఒక రకంగా చెప్పాలంటే, ఆంధ్ర మహాసభ తీరులోనే  పనిచేసింది. 1935 లో భారత ప్రభుత్వ చట్టం వచ్చి పరిమిత వోటింగ్ తో ఎన్నికలు మొదలయిన తరువాత, హైద్రాబాదు రాజ్యంలో రాజకీయ సంస్కరణల కోసం, బాధ్యతాయుత ప్రభుత్వం తేవటం కోసం హైద్రాబాదు రాష్ట్ర కాంగ్రెసుతోనూ, నిజాం ప్రభుత్వంతోనూ అనేక చర్చలు జరిపింది. ఈ చర్చలు 1944 వరకు కొనసాగాయి. 1946-47 ల మధ్య పరిమిత ఓట్ల ఎన్నికలలో పాల్గొని, మంత్రి వర్గంలో దళిత మంత్రులతో కలిసి పనిచేసింది. బత్తుల శ్యామసుందర్ అలా పని చేసిన మంత్రి. 1947 లో బ్రిటిషు వారు భారత దేశానికి స్వతంత్రం ప్రకటించిన తరువాత, శాంతి భద్రతలు పూర్తిగా విచ్చిన్నమైన హైద్రాబాదు రాజ్యంలో పోలీసులకి సహాయ పడటానికి ఆ పార్టీ అధ్యక్షుడు స్వచ్చంద రక్షణ దళం వుండాలని ప్రతిపాదించాడు. హైద్రాబాదు రాజ్యాన్ని పరిరక్షించాలన్న ఆకాంక్షతో ఇటువంటి దళాలని సమర్ధించిన వారిలో అప్పటి ప్రముఖ దళిత నాయకుడు బి. శ్యామసుందర్ కూడా వున్నారు. ఇటువంటి ఆకాంక్ష అప్పట్లో అనేక మందిలో ఉండనటానికి నిదర్శనం వీరిలో ముస్లిం లే కాక, దళితులు, బహుజనులు, రెడ్డి కులాల వారు కూడా వున్నారని చారిత్రకంగా రికార్డు చేయబడి వుంది.  దీనికి నిజామ్ ప్రభుత్వం సహాయం చేసిందా, లేదా అన్నది ఇప్పటికీ తేలని చర్చ. అయితే ఈ రజాకార్లలో చాలామందికి కర్రలు, కత్తులు తప్ప తుపాకులు లేవని అటువంటి వారు హైద్రాబాదు రాజ్యాన్ని భారత సైన్యం నుండి రక్షిస్తారను కోవటం హాస్యాస్పదమని బిబిసి మరియు టైమ్స్ పత్రికల జర్నలిస్టులు రాసారు. కానీ తెలంగాణా గ్రామాలలో రెడ్డి దొరలు ఇటువంటి వారిని ప్రయివేటు సైన్యంగా వాడుకుని కమ్యూనిస్టు ఉద్యమ కారులని, కొంత మేరకి కాంగ్రెసు వారిని భయ భ్రాతులని చెయ్యటానికి, చంపటానికి  వాడుకున్నారనేది వాస్తవం. ఈ భయం వల్ల రెండు, మూడు లక్షల మంది ప్రజలు హైద్రాబాదు రాజ్యాన్ని వదిలి కొంత కాలం వేరే ప్రాంతాలకి వలస వెళ్లారనేది కూడా వాస్తవమే. దీనికి మందమల నరసింహ రావు, పుచ్చలపల్లి  సుందరయ్య పుస్తకాలే సాక్ష్యాలు. వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన గంగు నవల కూడా దీనికి అడ్డం పడుతుంది. 

అయితే, జరిగిన దమనకాండ, హింస గురించిన సమాచారం ఎంతమేరకు సహేతుకమైనవో, ఎంతమేరకు అసత్య ప్రచారంలో ఉన్నవో అన్నది చర్చినీయాంశం. ఒక పక్క భారత సైన్యం కాంగ్రెసు వాదులని, ఆర్య సమాజ్ వారినీ, హైద్రాబాదు రాజ్య సరిహద్దుల్లో ‘సరిహద్దు కేంపులలో’ పెట్టి, తుపాకులు, శిక్షణ ఇచ్చి సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులు జరిపి, వాటిని రజాకార్ల హింసగా ప్రచారం చేసిందనటానికి అనేక సాక్ష్యాలు వున్నాయి. ప్రజలపై జరిపే దాడుల్ని కూడా విమోచన పోరాటంలో కలిపెయ్యటంలో వున్న అనర్ధాన్ని మనమింకా అర్ధం చేసుకోలేదనిపిస్తుంది. రజ్వీని, ఇత్తెహాదు ని తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి ఔరంగాబాదు కలెక్టరు మొహమ్మద్ హైదర్ 2012 లో వచ్చిన ‘అక్టోబర్ కూ’ అన్న తన జ్ఞాపిక లో ఈ విషయం గురించి వివరంగా రాసారు. సరిహద్దు గ్రామాల్లో నివసించిన కుటుంబాలకి ఇప్పటికీ ఆ ‘స్వతంత్ర పోరాట యోధులు’ తమపై రాత్రులు జరిపిన ఆ దాడులు బాగా జ్ఞాపకమే. హైద్రాబాదు చరిత్ర పై వచ్చిన అనేక పుస్తకాల్లో హైద్రాబాదు స్వాతంత్ర పోరాట యోధులు చేసిన అల్లర్లు, దాడుల గురించి బాహాటంగానే రాసారు. నిజమైన రజాకార్ల దాడుల్ని తెలంగాణా గ్రామాల్లో తిప్పి కొట్టిన ఉదంతాలు సాయుధ పోరాట లిఖిత చరిత్రలో కూడా మనకి చాలానే కనిపిస్తాయి. మరో పక్క, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు రజాకార్లన్న అనుమానంతో అమాయకులైన ముస్లింలని చంపిన సంఘటనలు ఉన్నాయని స్వయంగా  రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి వంటి పెద్ద నాయకులే ఒప్పుకున్నారు. అంటే, 1947-1948 ల మధ్య విపరీతంగా రాజ్యేతర సాయుధ బలగాలు అన్ని వైపులా తమ తమ పోరాటాల పేరుతో హింసకి పాల్పడ్డారు. అన్ని రాజ్యేతర సాయుధ బలగాలు ప్రమాదభరితమే అయినప్పుడు కేవలం రజాకార్ల హింస గురించే అప్పుడూ, ఇప్పుడూ ఎక్కువగా రాయబడింది? కేవలం వారిని నిందించటం చాలా సులువైన విషయం అవటమే కావచ్చు. 

రజాకార్ల హింసపై వచ్చిన కధనాలు అప్పుడే పుట్టిన భారత రాజ్యానికి హైద్రాబాదు రాజ్యం పైకి సైన్యాన్ని పంపటానికి ప్రధాన కారణంగా ఉపయోగ పడ్డాయి అని సునీల్ పురుషోత్తం అనే చరిత్రకారుడు సాధికారంగా వివరించారు. ఆ సమయంలో హైద్రాబాదు సరిహద్దుల్లో ఆర్య సమాజ్, కాంగ్రెసు కార్యకర్తలు భారత సైన్యం కనుసన్నల్లో జరిపిన హింస; కమ్యూనిస్టు ఉద్యమకారులు దొరలకి, వారి సమర్ధకులకి వ్యతిరేకంగా జరిపిన హింస, హైద్రాబాదు రాజ్యాన్ని, తెలంగాణా గ్రామాల్లో దొరలని సమర్ధిస్తూ రజాకార్లు జరిపిన హింస గురించి దొరికిన సాధికారిక సాక్ష్యాధారాలనీ సమకూర్చి అనేక రకాల చరిత్ర రచనలలో రజాకార్ల వల్ల జరిగిన హింసని ఎక్కువ చేసి చూపించారని తేల్చి తిప్పారు. మీలో ఎవరైనా కావాలంటే భారత రాజ్యం హైద్రాబాదు పై విడుదల చేసిన శ్వేత పత్రం చూడండి. పోలీసులు మామూలు ప్రజలపై రోజూ చేసే వేధింపులు ఎక్కువగా, రజాకార్ల హింస తక్కువగా ఉంటుంది. కానీ దీన్నే ఒక ప్రధాన కారణంగా చూపి భారత దేశం హైదరా బాదు రాజ్యంపై సైన్యాన్ని ప్రయోగించి ఈ రాజ్యాన్ని ‘విముక్తి’ చేసింది. ఇలా ‘రజాకార్లని అణచివేయటాన్ని’  మొట్టమొదట తన ప్రత్యేక రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్న ఘనత భారత జాతి-రాజ్యానికి దక్కుతుంది. 

అంతే కాక, ఈ రకంగా రజాకార్ల ‘హింసని’ అనేక రకాల రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటానికి నాంది పలికింది కూడా. భారత సైన్యం హైద్రాబాదు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న వెనువెంటనే ఇక్కడి హిందూ ఉద్యమకారులు, కాంగ్రెసు వాదులు గ్రామాలలో రజాకార్లని అంతమొందించే పేరుతో ముస్లిములపై పెద్ద ఎత్తున దాడులు చేసి వారిని చంపి, కొట్టి, ఆస్తులని దోచుకుని, స్త్రీలపై అత్యాచారాలు చేసి, గ్రామాలనుండి వెళ్లగొట్టి దాన్నంతా రజాకార్లు చేసిన హింసకి ‘ప్రతి హింస’ గా అభివర్ణించుకున్నారు. ఈ హింసని ఖండిస్తూ పద్మజ నాయుడు రాసిన వుత్తరంతో స్పందించి అప్పటి ప్రధాని నెహ్రు పంపిన సుందర్ లాల్ ఇటువంటి మారణ కాండలో 40,000 పైనే మంది మరణించి ఉంటారని తన రిపోర్టులో రాస్తే, ఆ నివేదికని బ్రిటిషు పార్లమెంటు చర్చించింది కానీ, భారత పార్లమెంటులో చర్చకు రాలేదు. ఈ మధ్యే వచ్చిన ఏ. జి. నూరాని పుస్తకంలో ఆయన ఈ విషయాలని చర్చించారు. అట్లాగే సునీల్ పురుషోత్తం తన వ్యాసంలో ఈ దారుణ హింస ద్వారా కొత్తగా ఏర్పడిన భారత జాతి రాజ్యం ముస్లింలని ఒక పెద్ద రాజకీయ సమూహ స్థాయి నుండి ఒక మతపరమైన మైనారిటీగా కుదించి తనలో కలుపుకుందని ప్రతిపాదించారు. ఇది ‘రజాకార్లని అణిచే ప్రక్రియ’లో ఒనకూడిన రెండవ రాజకీయ ప్రయోజనం. 

ఆ తరుణంలో జనరల్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పడ్డ సైనిక ప్రభుత్వం అన్ని చోట్ల చెలరేగిన హింసని తగ్గించాలన్న ఉద్దేశంతో - రజాకార్ల సానుభూతి పరులు, రజాకార్లు, కాంగ్రెసు సభ్యులు, ఆర్య సమాజ్ ప్రచారకులు, హైద్రాబాదు రాజ్య ఉన్నతాధికారులు - అందరిని జైల్లో పెట్టింది. సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల రజాకార్ల సానుభూతి పరులని వదిలేస్తూ, వారితో పాటు, జైళ్లలో వున్న ‘హిందూ’ ఉద్యమకారులని కూడా తేలిక శిక్షలతో లేదా శిక్షలు లేకుండా వదిలేసింది. వారిది ప్రతి హింస మాత్రమే నని, వారు రజాకార్ల హింసని తట్టుకోలేక ప్రతి హింసకి పాల్పడ్డారని బలంగా అధికారులు నమ్మటమే దీనికి కారణమని టేలర్ షర్మన్ అనే చరిత్రకారిని ఈ మధ్యే రాసిన పుస్తకంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య జరిగిన పలు ఉత్తర ప్రత్యుత్తరాలు, అప్పటి వార్తా పత్రికల నివేదికల ఆధారంగా నిర్ధారించారు . ఇలా 1950 లలో అనేక మంది హంతకులు, రేపిస్టులు, దోపిడీ దార్లు శిక్షలు లేకుండా బయట పడ్డారు. ఇది విమోచన పోరాట చరిత్ర వల్ల నెరవేరిన మరొక పరోక్ష ప్రయోజనం. 

ఈ చరిత్రకారిణే ఇంకొక విషయ కూడా సాక్ష్యాలతో సహా చెప్పారు. హిందువులు చేసింది ప్రతి హింసగా నమ్మటం వల్ల సైనిక ప్రభుత్వం ముస్లింలపై జరిగిన హింసా కాండని గుర్తించటానికి నిరాకరించింది అని. అప్పటి జనరల్ చౌదరి ప్రభుత్వం ప్రధాన మంత్రి నెహ్రు నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని ఉత్తరాలు వచ్చినా పట్టించుకోలేదు. స్థానిక ముస్లిం రాజకీయ వేత్తలు, పెద్ద మనుషులు ఎన్ని సార్లు ప్రభుత్వాన్ని అర్ధించినా లక్షలాది బాధిత ముస్లింలకు సహాయ కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రకటించిన కార్యక్రమాలకి డబ్బులివ్వలేదు. దీని వల్ల ముస్లింల నుండి భూములు, ఇళ్ళు లాక్కున్న వాళ్లకి సాధికారత లభించటమే కాక, ప్రభుత్వానికి కూడా చాలా డబ్బు ఆదా అయ్యింది. ఇది రజాకార్లని అణచే వ్యూహం వల్ల లభించిన నాల్గవ రాజకీయ ప్రయోజనం. 

ఈ ప్రతి హింస సిద్ధాంతాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లి, హిందువులకి సమన్యాయం చెయ్యాలంటే, ముస్లిం ఉద్యోగుల్ని బర్తరఫ్ చెయ్యాలని లేదా వారి స్థాయి తగ్గించాలని, మరి కొంత మందిని శిక్షించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలా కొన్ని నెలల్లో దాదాపు 75 వేల మంది ఉద్యోగుల్ని పదవుల్లోంచి అకారణంగా తొలగించింది. మొహమ్మద్ హైదర్ వంటి జిల్లా కలెక్టర్లని అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. పాత బస్తి ముస్లింల ఆర్ధిక పతనంపై రషీయుద్దీన్ ఖాన్ అన్న ఉస్మానియా విశ్వ విద్యాలయ రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు, 1960 లలో సర్వే చేస్తే, అంతకు ముందటి ఉస్మానియా అధ్యాపకులతో సహా అనేక మంది రిక్షాలు నడుపుతున్నారని, పేదరికం విపరీతంగా పెరిగిందని, అప్పటి రిక్షాలు లాగే వారిలో 80% ముస్లింలే నని తేలింది. అలా ముస్లింలని  రజాకార్ల అణచివేత పేరుతో, నిజామ్ వ్యతిరేకత పేరుతో, కోలుకోలేని దెబ్బ తియ్యటం, ఈ చరిత్ర వల్ల లభించిన ఐదవ రాజకీయ ప్రయోజనం. దీనిని ఒమర్ ఖాలిద్, మసూద్ అలీ ఖాన్, ఏ.జీ నూరాని, మొహమ్మద్ హైదర్, సునీల్ పురుషోత్తం, టేలర్ షెర్మన్ వంటి చరిత్ర కారులు, రాజకీయ శాస్త్రవేత్తలు సాధికార సాక్ష్యాధారాలతో తమ రచనల్లో చర్చించారు. 

ఇక పొతే, రజాకార్లని తిట్టే విమోచన చరిత్రతో ఇప్పటికీ నెరవేరుతున్న పెద్ద ప్రయోజనం, ఏభయ్యేళ్ల నుండి పాత బస్తీలో ప్రజల మద్దతు వున్నమజ్లీస్ పార్టీని రజాకార్ల వారసులు అన్న పేరుతో భయంకర మత తత్వ పార్టీగా చిత్రీకరించటం. స్వాతంత్ర్యానంతరం 1957 పునర్జీవనం పొందిన ఈ పార్టీ భారత రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, పార్టీ అజెండా ని మార్చుకుని లౌకిక సిద్ధాంతాన్ని ఎన్ని దశాబ్దాలు మోసినా, వీలున్నప్పుడల్లా వారిని స్వాతంత్ర పూర్వ రజాకార్ల వారసులు అనటం మామూలయి పోయింది. ఎన్నికల్లో జన్ సంఘ్, కాంగ్రెస్, తెలుగు దేశం, బి.జె.పి అనేక ఏళ్లుగా దశాబ్దాలుగా ఈ నిందని వాడుకుంటూనే వున్నాయి. అంతే కాక, ముస్లిముల సమస్యలని అందరి సమస్యలో భాగంగా లేవనెత్తిన సందర్భాలలో మరీ గట్టిగా వాడుకున్నాయి. ఉదాహరణకి, 2010 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని పెద్ద చర్చ నడిచినప్పుడు, అక్బరుద్దీన్ ఒవైసి పాత బస్తి యువకులు కూడా తెలంగాణా లో భాగమేనని, వారిపై ఉగ్రవాదులనే పేరుతో పెట్టిన అబద్ధపు కేసుల వల్ల వారి జీవితం, చదువు నాశనమవుతోందని, కాబట్టి వాటిని కూడా ఎత్తివేయాలని అర్థిస్తే, అన్ని పార్టీలు - బిజెపి నుండి వామ పక్ష వాదులతో సహా - కూడగట్టుకుని మజ్లీస్ ని రజాకార్ల వారసులని నిందించాయి. ఇప్పటి మజ్లీస్ కి, అప్పటి ఇత్తెహాదు కి వున్న సంబంధం, స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతీయ కాంగ్రెసు కి, ఇప్పటి కాంగ్రెసు కి వున్న సంబంధం వంటిదే.  అంటే, నేతి బీరకాయలో నేతి లా, పేరు తప్ప మరేదీ లేదు.ఇలా రజాకార్ల వారసులన్న నింద దీర్ఘ కాలంగా ముస్లిములు ఎన్నుకుంటున్న ఒక పార్టీని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింలని, తెలుగు సమాజం నుండి వేరు చెయ్యటానికి, దూరంగా ఉంచటానికి ఉపయోగపడింది. 

ఇటువంటి బహుళ రాజకీయ ప్రయోజనాల చట్రంలో నిబిడి వున్నరజాకార్ల వ్యతిరేకతని, నిజామ్ వ్యతిరేక పోరాటాన్ని తమ వీరత్వానికి చిహ్నంగా చూపించుకోవాలని, ప్రత్యేక రాష్ట్ర తెలంగాణా రాష్ట్ర ఉద్యమంతో సహా, ఈ ప్రాంతంలో జరిగిన అన్ని ఉద్యమాలు ప్రయత్నించాయి. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రజాకార్లకు వ్యతిరేకంగా తాము ఎంత పోరాడామన్న విషయాన్ని తమ తమ అస్తిత్వ నిర్మాణాల్లో భాగం చేసుకుని తమ ఉద్యమ ప్రయోజనాలని కూడా నెరవేర్చుకున్నాయి. విస్తృత రాజకీయ, చారిత్రిక సందర్భం నుండి విడదీయబడి దొరల పీడన, రజాకార్లుతో నిండిన హైద్రాబాదు రాజ్యాన్ని తెలుగు సినిమాలు, రచనలు, నవలలు, పాటల ద్వారా ప్రజా సంస్కృతిలో భాగం చేసి, ప్రజల జ్ఞాపికల్లో నాటుకునేలా చేసాయి. ఇటువంటి అమూర్త రజాకార్ల జ్ఞాపికలే ఇప్పుడు అనేక మంది మనస్సులో చరిత్రగా రూపుదిద్దుకుని ప్రస్తుత హిందూత్వ రాజకీయాలకి ముడి సరుకుగా ఉపయోగపడుతున్నాయి. 

నిజాం వ్యతిరేకత లాగే, రజాకార్ల వ్యతిరేకత ముస్లిం వ్యతిరేకతకు చిహ్నంగా పనిచేస్తుంది. కుల వ్యతిరేక రాజకీయాలతో, ప్రాంతీయ స్పృహతో ప్రజాస్వామికరించ బడిన తెలంగాణా సమాజాన్ని నిజాము లేదా రజాకార్లనే డెబ్బై ఏళ్ల ముసలి భూతాల సహాయంతో ముస్లిం వ్యతిరేక హిందువులుగా ఐక్యం చెయ్యటానికి ‘విమోచన వాదం’ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ఇటువంటి చారిత్రిక సందర్భంలో రజాకార్ల గురించి ఎలా చర్చించాలి అన్న విషయం అందరం పునరాలోచించుకోవాలి. ప్రతి ప్రాంతంలో, ప్రతి సందర్భంలో ‘ప్రతి హింస’ సిద్ధాంతాన్ని హిందుత్వ వాదులు ముస్లిం వ్యతిరేకత ని పెంపొందించటానికి అన్ని మాధ్యమాల (ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు) ద్వారా వాడుకుంటున్న వాస్తవం ఈ రోజు మన ముందు వుంది. డెబ్బై ఏళ్ల పాటు నిరంతరాయంగా ముస్లిం వ్యతిరేక రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడిన హైద్రాబాదు రాజ్య రజాకార్ల అణచివేత సిద్ధాంతాన్ని - మళ్ళా అందరికీ గుర్తు చేస్తామని ప్రకటిస్తున్న విమోచన వాదులు, సెప్టెంబర్ 17 ని తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని వాదిస్తున్న రాజకీయ శక్తులు ఏ ప్రయోజనాలకు వారిని ఉపయోగించుకుంటారో పెద్దగా వూహించఖ్ఖర్లేదు. కానీ అటువంటి రాజకీయాలని వ్యతిరేకిస్తున్న ప్రజాస్వామ్య తెలంగాణా వాదులు, సామాజిక తెలంగాణ వాదులు ఇటువంటి విమోచన చరిత్ర రచనలని, జ్ఞాపికలని నిర్ద్వందంగా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. 

2017 సెప్టెంబర్ 22, 23 న "రజాకార్లు: రాజకీయ ప్రయోజనాలు"; "వనరుగా మారిన  విమోచన" పేరుతో ఆంధ్ర జ్యోతి వార్తా పత్రికలో ప్రచురితమయింది 

Comments