Question Beef ban

బ్రతుకు తెరువును బలి తీసుకుంటున్న భావజాలం  

ఉత్తర ప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన భాజపా ప్రభుత్వం తాము పరిమితుల్లేని మాంస దుకాణాలపై, ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటున్నామనే నెపంతో దాడులు, మూసివేతలు మొదలు పెట్టింది. దీనిని వ్యతిరేకించిన మాంస వ్యాపారులు దుకాణాలు, ఫ్యాక్టరీలు మూసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరువాత తాము ప్రభుత్వం లోనికి వచ్చాము కాబట్టి, చట్టం లో క్రోడీకరించిన గోమాంస నిషేధమనే విలువని అమలు పరచాల్సిన బాధ్యత తాము తీసుకున్నామని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రపంచీకరణలో భాగంగా భారత దేశాన్ని అభివృద్ధి చేస్తామని, కాంగ్రెసు, సమాజవాది, బహుజన్ సమాజ్ పార్టీ కన్నా సుపరిపాలన అందిస్తామని చెప్పి ఎన్నికలు గెలిచిన భాజపా - మాంసం వ్యాపారం, దానిపై ఆధార పడిన ప్రజల బ్రతుకు తెరువు, విదేశీయుల్ని భారత దేశానికి ఆహ్వానించాలంటే వారికి కావాల్సిన ఆహారం అందించాల్సిన బాధ్యత - వీటన్నిటినీ పక్కకి పెట్టి కేవలం తమ పార్టీలో కూడా కొంతమందికె మాత్రమే నచ్చే కరుడు కట్టిన భావజాలం కోసం ఆధునిక పరిపాలన, దేశ అభివృద్ధిని బ్రష్టు పట్టించే కార్యక్రమం చేపట్టింది.

ఉత్తర ప్రదేశ్లో గొడ్డు మాంసం లేదా గోమాంస వ్యాపారం చాలా పెద్ద పరిశ్రమ. దానిలో గొడ్డు పోయిన పశువుల్ని అమ్ముకుని కొత్త పశువుల్ని కొనుక్కునే రైతులు, వాటిని కబేళాలకి తరలించే రవాణా వాహనదారులు, ప్రభుత్వం మరియు ప్రయివేటు ఆధ్వర్యంలో నడిచే కబేళాలు, చిన్న స్థాయిలో మాంసాన్ని అమ్ముకునే వ్యాపారులు కాక దీనికి అనుబంధమయిన అతి పెద్ద చర్మ పరిశ్రమ కూడా దాదాపు 25 లక్షల మందికి పైగా బ్రతుకు తెరువుని కల్పిస్తోంది. మాంస పరిశ్రమపై ఆధార పడిన వారిలో ముస్లిం ఖురేషిలు, చర్మ పరిశ్రమపై ఆధార పడిన వారిలో దళిత చమార్లు ప్రధానం. అయితే, వీటికి అనుబంధమయిన పరిశ్రమల్లో కూడా అనేక మంది బ్రతుకు తెరువుని పొందుతున్నారు. అన్ని పరిశ్రమల లాగే దీనిలో కూడా పశువుల్ని అమ్మటం, కొనటం, కబేళాలకి పంపించటం ఇవన్నీ ఎన్నో దశాబ్దాలనుండి వ్యవస్థీకృతమయి వున్నాయి. వీటి నుండి ప్రభుత్వానికి పడ్డ మొత్తంలో పన్ను రూపేణా ఆదాయం అందుతోంది. ఈ పరిశ్రమని దెబ్బతీయటమంటే ఇంత మంది బ్రతుకు తెరువుని దెబ్బ తీసినట్లే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుకున్నట్లే.  

ఇక చట్ట బద్ధత విషయాన్ని కొస్తే, భారత దేశంలో కూరగాయాలు, పళ్ళు, రోడ్ల పై జరిగే అనేక ఆహార వ్యాపారాల లాగే రిటైల్ మాంసం వ్యాపారం కూడా (కబేళాలని పక్కన పెడితే) చాలా భాగం అసంఘటిత రంగంలోనే జరుగుతోంది. ఇరుగు పొరుగులో మాంసం అమ్ముకునే వ్యాపారస్తులని లైసెన్సు తీసుకోమనటం ఇంటి కొచ్చి, రోడ్డు పై తిరిగి, బండిలో పెట్టి కూరలు, పళ్ళు అమ్మే కూరలమ్మికి, పళ్ళ వ్యాపారస్తులకు లైసెన్సులు తీసుకోవాలనే నియమం పెట్టినట్లు. ఏదయినా నియమం పెట్టటానికి రెండు రకాల పద్ధతులలో ప్రభుత్వం పనిచేయాలి. ఒకటి, చిన్నా చితకా వ్యాపారస్థులకి చవకగా ఆహార పదార్ధాలని భద్ర పరిచే సౌకర్యాలు కల్పించాలి. రైతులకి కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించినట్లు. అవి కల్పించిన తరువాత, అందరికీ సులభ పద్ధతుల్లో, సతాయించకుండా, లైసెన్సులు ఇవ్వాలి. దీనికి ముందు చూపు, పరిపాలన దక్షత రెండు అవసరం. ఈ రెండూ లేకుండా కఠిన మయిన నియమాలని అమలు పరచాలని చూడటం వల్ల ప్రజల జీవనోపాధి పట్ల అవగాహన లేని భాజపా ప్రభుత్వాలు వారిని మరింత అప్పుల్లొకి, ఇంకా చెప్పాలంటే, చావు నోట్లోకి తోస్తున్నాయి. 

దీనికి ఉదాహరణ గోమాంస నిషేధాన్ని అమలు చేసిన మహారాష్ట్ర లో ఖురేషిల పరిస్థితి చూస్తే స్పష్టమవుతుంది. రెండేళ్ల క్రితం పిల్లల్ని చదివిస్తూ స్వయం సమృద్ధితో బ్రతికిన కుటుంబాలు ఇప్పుడు అప్పుల్లో కూరుకు పోయి, పిల్లల్ని చదివించలేక, పెళ్లిళ్లు చెయ్యలేక దారిద్ర్య రేఖ అంచుల్లోకి నెట్టబడ్డాయి. అసలు వారు ఇటువంటి వ్యాపారాన్ని చేపట్టటానికి కారణం ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవటం వల్లే. అలాంటి వారిని కూడా తమ బ్రతుకు తాము బ్రతుకనియ్యక పోతే ప్రభుత్వ పాలనా దక్షత పైనే తప్పకుండా సందేహాలు కలుగుతాయి. 

గోమాంసం తమ మనోభావాల్ని దెబ్బతీస్తుందని వాదించే చాలా మందికి తాము పరోక్షంగా దీని వల్ల లాభ పడుతున్నామని తెలియదు. చనిపోయిన గొడ్డు శరీరంలోంచి తీసుకునే అనేక భాగాలని - తోకలోని ఈకల్ని పెయింట్ చేసుకునే బ్రష్ లలో ఉపయోగిస్తారు; అలాగే ప్రేవులలోని లోపలి భాగాన్ని అందరూ ఇష్టపడే చీజ్ ని గడ్డ కట్టడానికి ఉపయోగిస్తారు, మరి కొన్ని భాగాలని మందుల తయారీలో ఉపయోస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని బీఫ్ కబాబ్ లని ఇష్టంగా తినేవాళ్లలో అనేక మంది హిందువులు వున్నారు. అంతే కాక, విదేశాలకి గొడ్డు మాంసాన్ని ఎగుమతి చేసే సంస్థల్లో ప్రధాన భాగం, హైద్రాబాదు లోని అల్ కబీర్ సంస్థ వలే అగ్ర కుల హిందువుల లేదా జైనుల యాజమాన్యం లో నడిచేవే. 

అంతే కాదు, రైతులు గొడ్డు పోయిన పశువుల్ని అమ్ముకునే అవకాశం లేకపోతే, గోమాంస నిషేధం అమలు చేసిన రాష్ట్రాల్లో జరుగుతున్నట్లు, వ్యవసాయం పూర్తిగా దెబ్బ తింటుందని  పశు సంవర్ధకం పై పరిశోధనలు చేసిన సాగరి రాందాస్ వంటి అనేక మంది చెప్తున్నారు. ఆ అవకాశం ఉంటేనే, రైతులు, వ్యవసాయం వృద్ధి చెందుతుంది. వ్యవసాయ ప్రధాన దేశాలయిన బ్రెజిల్ వంటివి ఈ అవకాశం వల్లే గొడ్డు మాంస వ్యాపారంలోను, వ్యవసాయం లోను కూడా ముందుతున్నారు. గోవుల్ని ప్రేమించ టానికి, గోమాంసం తినటానికి వైరుధ్యం లేదని స్విట్జర్లాండ్ సమాజాన్ని గమనిస్తే తెలుస్తుంది. అక్కడి ప్రజలు వాటికి సౌందర్య పోటీలు కూడా పెట్టుకుంటారు, వాటి మాంసం కూడా తింటారు. 

మన దేశంలోని ప్రతి సమాజం తమకు లభ్యమయ్యే ఆహార పదార్ధాల బట్టి ప్రత్యక ఆహార అలవాట్లు ఏర్పర్చుకుంది. కేరళలో, గోవాలో, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో గోమాంసాన్నిఅందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అనేక మంది ముస్లింలు, దళితులతో పాటు, ఇంట్లో చెప్పకుండా బీఫ్ తినేవాళ్లు అనేకం. చాలా మంది పేద ప్రజలకి ఖరీదయిన పప్పు దినుసులు, గొర్రె మాంసం కన్నా చవగ్గా దొరికే గొడ్డు మాంసం శరీరానికి అవసరమయిన మాంస కృతులని చేకూరుస్తుంది. ఇన్నాళ్లు మన అసమర్ధ ప్రభుత్వాలు, మీరు ఖరీదయిన పప్పుల్ని మాత్రమే తినాలనే నియమం పెట్టక కనీసం ఆయా సమాజాలని గొడ్డు మాంసం తిననిచ్చాయి. ఇప్పుడు అది కూడా వద్దని, అతి అల్ప సంఖ్యాకులయిన అగ్రకుల హిందువుల ఆహార అలవాట్లని అందరిపై రుద్దటానికి పూనుకున్నాయి. ఖరీదైన పప్పులు ఎంత మంది కొనగలరు? మాంస కృతులని ప్రజలకి చవగ్గా అందించలేని ప్రభుత్వానికి చవగ్గా దొరికే గొడ్డు మాంసం తినద్దని చెప్పే నైతిక హక్కు ఎక్కడి నుండి వస్తుంది? మాంస క్రుతుల్లేని ఆహారం వల్ల శరీరం, ఆరోగ్యం దెబ్బతిన్న యువ శక్తితో దేశాన్నిఅభివృద్ధి పధంలో ఏ రకంగా తీసుకుపోగలరు? 

కేవలం గోమాంసం తినటం పైన, తినే వారి పైనా, దెబ్బతినే మనోభావాల పైన, మాంస వ్యాపారస్తుల చట్ట నిబద్ధతపైన, శుభ్రత పైన ద్రుష్టి పెట్టి దీని చుట్టూ అల్లుకుని వున్నఅనేక కీలక ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలని పక్కకి పెట్టటం అత్యంత విచారకరం. చర్చని మనోభావాలపై కేంద్రీకరించటం వల్ల ప్రజలని, వారి ఆహార భద్రతని, ఆహారంలోని పోషక విలువలని, బ్రతుకు తెరువుని చూసుకోవాల్సిన ఆధునిక ప్రభుత్వ బాధ్యతలని గుర్తు చెయ్యకుండా కేవలం అమూర్త భావజాలాన్ని బలపరచేదిగా తయారవవుతోంది. గోమాంస నిశేధం వల్ల పెద్ద మాంస కంపెనీలు మాత్రమే లాభ పడతాయని, అనేక మంది చిన్నా చితకా వ్యాపారస్తుల బ్రతుకు తెరువు దెబ్బ తింటుందని, ఆ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు జీవనోపాధి కోల్పోతారని, వారిలో దళితులు, ముస్లింలు అధికులని, ఇది పూర్తిగా అప్రజాస్వామిక, మితవాద, ఆధునిక వ్యతిరేక విధానమని ఇప్పటికైనా గొంతెత్తి స్పష్టంగా చెప్పాలి. అభివృద్ధి అంటే ప్రజలని, వారి జీవితాలని, జీవనోపాధిని మెరుగు పరచాలని, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పర్చిన పార్తీలకి తమకి వోటెయ్యని ప్రజలని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచెయ్యటం ఇప్పటికయినా అత్యవసరం. 

15 ఏప్రిల్ 2017 న ఆంధ్ర జ్యోతి వార్తా పత్రికలో "భావజాలంతో బ్రతుకుతెరువు బలి" పేరుతో ప్రచురితమయింది.


Comments