దేవుడొప్పుకున్నా, ఒప్పుకొని భక్తులు!!
మొత్తానికి ఇద్దరు పిల్లలు కనే శక్తి వున్న స్త్రీలు, ‘వారి’ మాటల్లో చెప్పాలంటే, ముట్లుడిగని స్త్రీలు మొన్న అర్ధరాత్రి శబరిమలై గుళ్లో ప్రవేశించి, చరిత్ర సృష్టించారు. అన్ని వర్గాల స్త్రీలు, పురుషులు ఈ గుళ్లో ప్రవేశించవచ్చని, 10 నుండి 50 లోపలి వయస్సు స్త్రీలపై వున్న ఈ గుడి పాటించే నిషేధాన్ని కొట్టేస్తూ దేశ ఉన్నత న్యాయస్థానం అక్టోబర్ 3న ఇచ్చిన తీర్పు వల్ల ఇది సాధ్యపడింది. తమదొక ప్రత్యేక సంప్రదాయమని, అందువల్ల 1965లో అన్ని వర్గాల వారికి దేవాలయ ప్రవేశం ఉండాలని చేసిన చట్టం తమకి వర్తించదని, తమ దేవుడికి ఇటువంటి సంప్రదాయం పాటించే హక్కు ఉందని శబరిమల ట్రస్టు ఎంతగానో సుప్రీమ్ కోర్టులో వాదించింది. కోర్టు మాత్రం అయ్యప్ప దేవస్థానం ప్రత్యేక మతం కింద రాదనీ , అందువల్ల ఆ చట్టం పరిధిలోకే వస్తుందని, అప్పుడు ఒక వర్గ ప్రజలని నిషేధించే సంప్రదాయం రాజ్యాంగం ప్రకారం చెల్లదని చెప్పింది.
అయితే, కోర్టు అనుమతి ఇచ్చినా తాము మాత్రం దీన్ని ఒప్పుకోమని అయ్యప్ప స్వామి మహిళా భక్తులు వాదిస్తున్నారు. మా దేవుడు మహా బ్రహ్మచారి కాబట్టి, లైంగికేచ్ఛ వున్న స్త్రీలు ప్రవేశించకూడదని, బ్రహ్మచర్యం పాటించే మగ భక్తులకి ముట్లుడిగని స్త్రీలని చూస్తే వ్రత భంగం అవుతుంది కాబట్టి అసలైన భక్తులు ‘అటువంటి’ స్త్రీలు ఆలయప్రవేశం చెయ్యకుండా ఆపాలని వారి భావన. వీరి కంటే, ముందుకు పోయిన కేరళలోని రాష్ట్రీయ సేవక్ సంఘం, భారతీయ జనతా పార్టీ ఇదొక హిందూ సంప్రదాయంలో కోర్టుల అనవసర జోక్యమని ఇదంతా హిందువుల మత స్వేచ్చకీ వ్యతిరేకమని, భంగమని చెపుతూ అంతటితో ఆగకుండా, కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా నిరసనలు చేసి, ఆలయానికి వెళుతున్న మహిళలపై భౌతికంగా దాడులు చేసి తామనుకున్న వాదాన్ని ఎలాగైనా నిరూపించుకోవాలని ప్రయత్నించింది.
ఇక్కడ మూడు ప్రధాన వాదనలు కనిపిస్తున్నాయి. మొదటిది, హిందూ మత సంప్రదాయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదనే వాదన, ఇది ఎంతమేరకు సహేతుకం, చారిత్రకం? డెబ్బై ఏళ్ల నుండి రాజ్యాంగ స్పూర్తితో హిందూ మత సంప్రదాయాల్ని ఆధునీకరించటానికి, ప్రజాస్వామీకరించటానికి చేసిన ఆలయ ప్రవేశ చట్టాలు, దేవాలయాలపై అగ్ర కులాల పట్టుని ఎంతో కొంత తగ్గించటానికి ప్రభుత్వాలు, కోర్టులు చేసిన, చేస్తున్న విధి విధానాలు ప్రయత్నాలని పక్కన పడేయలేం కదా. అయినా ఏ ఆధునిక దేశంలో కోర్టులు, ప్రభుత్వాలు మత సంప్రదాయాల్ని నియంత్రించకుండా ఉంటున్నాయి? సౌదీ అరేబియా తో సహా నియంత్రిస్తూనే వున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో అయితే తప్పకుండా నియంత్రిస్తాయి. ఆధునిక దేశంలో, ఒక జాతి రాజ్యంగా, రిపబ్లిక్ గా మనని మనం ప్రకటించుకున్న తరువాత ప్రాచీన సంప్రదాయాలు, మత పరమయిన వాటితో సహా, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే వాటిని మార్చుకోవాలని అన్ని దేశాల్లో లాగే, మన కోర్టులు అనేక తీర్పులు ఇచ్చాయి. దీని వల్ల కాలానికి అనుగుణంగా అన్ని మతాలు మారినట్లే హిందూ మతం కూడా మారుతోంది. హిందువుల్లో భాగమేనని గాంధీతో సహా కొట్లాడిన దళితులు తమ ఆలయ ప్రవేశం కోసం పెద్ద ఉద్యమాలే చేశారు, చేస్తున్నారు కూడా. స్త్రీలని అశుద్ధంగా భావించటం ఇటువంటి అనాలోచిత, నిర్హేతుక సంప్రదాయంలో భాగం కాక, మరేమిటి? అది వదిలేసినంత మాత్రాన హిందూ మతం దెబ్బ తింటుందనే వాదన ఎంత నిర్హేతుకమో ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అర్ధమవుతుంది. వందేళ్ల క్రితం 10 ఏళ్ల బాలికకి పెళ్లి చెయ్యకపోతే హిందూ మతం, కుటుంబం విచ్చిన్నమవుతాయని తిలక్ వాదించాడు. స్త్రీలు చదువుకుంటే మతం, కులం, సంప్రదాయం చెడిపోతుందని చాలామంది సంప్రదాయ వాదులు బలంగా నమ్మారు. వారే గెలిచుంటే, ఈ రోజు మహిళా భక్తులు రోడ్లమీద కొచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితులుండేవా?
రెండవది, కోర్టులో వ్యాజ్యం వేసిన మహిళలు కానీ, ఆలయంలో ప్రవేశిస్తున్న భక్తులు కానీ,అసలైన భక్తులు కాదనే వాదన. తమ లాంటి అసలైన మహిళా భక్తులు సంప్రదాయాన్ని గౌరవించి ఆ వయస్సులో ఆలయంలోకి వెళ్ళటానికి ప్రయత్నించరని అనేక మంది మహిళలు చెప్తున్నారు. అసలైన భక్తులు ఎవరనే నిరూపణ ఏ మతంలో అయినా కష్టమే. ఏ మతంలో అయినా భక్తి ఆచరణకు సంబంధించింది. అంతే కాక ఆ ఆచరణ వ్యక్తిగతమయింది. దానికి బయటి కొలమానాలు - వ్రతాలు, దీక్షలు, తీర్థ యాత్రలు వంటివి - కొంత మేరకే పనికొస్తాయని చెప్పే పురాణాలు, కధలు,జానపద కధనాలు కోకొల్లలు. ఇంకా చెప్పాలంటే, నాస్తికులు పిలిచినా సరే దేవుడు పలుకుతాడని చిన్నప్పటినుండి కధలు వింటాం. ఆలయంలోకి ప్రవేశిస్తున్న వారి భక్తిని/భక్తి కొరతని కొలిచే సాధనాలు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా? అన్ని దాడులు, నిరసనల మధ్యలో, ప్రాణాలని ఫణంగా పెట్టి, ఆ తరువాత సమాజంలో ద్వేషాన్ని తట్టుకోవాలని తెలిసినప్పటికీ, తెగించి ఇరుముడితో కొండనెక్కుతున్న ఈ మహిళలని వద్దనే దేవుళ్లేవరయినా వుంటారా? వాళ్ళు మావోఇస్టులయినా సరే, నెలసరిలో వున్నవాళ్ళయినా లేక నాస్తికులయినా సరే అన్ని కష్టాలకోర్చి తన కోసం వచ్చిన వారిని ఏ దేవుడయినా, ఆహ్వానించకుండా అక్కున చేర్చుకోకుండా ఉంటాడా? కష్టాలకోర్చిన వాళ్ళు భక్తులా, లేక నిబంధనల పేరుతో వాళ్ళని తోసిపుచ్చే వాళ్ళు భక్తులా?
ఇంక, మూడవ విషయం, భౌతిక దాడులు చేసాయినా సరే మహిళల ఆలయ ప్రవేశాన్ని ఆపుతాం అనే భక్త శక్తులు. వీరికి దేవుడు, మతం, భక్తి పట్ల ఆసక్తి తక్కువ, రాజకీయాలు, అధికారం పట్ల ఆసక్తి ఎక్కువ అన్నది చూస్తేనే అర్ధమవుతుంది. ఏ దేవుడి భక్తులయినా ‘మేం గుడికోస్తాం మొర్రో’ అన్న వాళ్ళని ఎదురెళ్లి ఆహ్వానించాలి తప్ప వస్తే కొడతాం అంటే వారి భక్తిని తప్పకుండా శంకించాల్సిందే. అసలు కొడతాం, చంపుతాం అన్నవి భక్తిలో మాత్రమే కాదు, ఆధునిక ప్రజాస్వామ్య సంస్కృతిలో కూడా భాగం కాదు. అభిప్రాయాలు బలంగా చెప్పొచ్చు, వ్యాసాలు రాయొచ్చు, బ్లాగుల్లో ప్రచారం చేసుకోవచ్చు, ధర్నాలు చెయ్యొచ్చు, కోర్టు కెళ్లొచ్చు, ఎలక్షన్లలో పోటీ చేయచ్చు. మరి ఒక పక్క ఇవన్నీ చేస్తూ ‘గుడి కొస్తే కొడతాం’ అనటం దేనికి సంకేతం? ప్రజాస్వామ్య బద్ధంగా నీ వాదన గెలవట్లేదు కాబట్టి, బలంతో నిరూపించుకుందామేగా?
శబరిమలై ఆలయంలోకి కొంతమంది మహిళలు ప్రవేశిస్తే హిందూ మతంలోని సంప్రదాయ వాదం కూలిపోతుందని సంప్రదాయవాదులు, దీని వల్ల పెద్దగా ఒరిగేది లేదని ప్రగతిశీలవాదులు అనుకోవటం రెండూ కొంచెం కష్టమే. మతం అంతర్గతంగా ప్రజాస్వామీకరించబడాలని, అప్పుడే భక్తి, భక్తుల సాంద్రత పెరుగుతుందని ముఖ్యంగా ఆధునిక కాలంలో దేవుడు, మతాలూ మనగలుతాయని అనేక మతాల్లోని భక్తులు విశ్లేషన్లతో సహా చెప్తున్నారు. ఆ రకంగా చూసినప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు మహిళలొస్తే మతం చెడిపోతుంది అనుకోవటం నిర్హేతుకంగా అనిపిస్తుంది. అలాగే, ఒకరో ఇద్దరో భక్తులు వచ్చినంత మాత్రాన ఆలయాల పితృస్వామ్య సంస్కృతి మారుతుందా అన్న అనుమానం కలగటం సహజమే అయినా వీళ్లేసిన దారుల్లో మరింతమంది ముందుకొచ్చి నిర్హేతుకమైన సంప్రదాయాల్ని పక్కకి ఊడ్చేసి, సమానత్వాన్ని తెచ్చే కాలం వస్తుందని ఆశ పడటం మాత్రం సహేతుకమే. ఆ విధంగా చూసినపుడు ఇది సమానత్వాన్ని ప్రేమించే అందరు ఆహ్వానించదగ్గ ఒక శుభ పరిణామం!!
https://www.bbc.com/telugu/india-46758887
Comments
Post a Comment