Surepalli Sujatha



ప్రో.సుజాతపై ఫిర్యాదులు: అసలు కారణాలు

కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ సూరేపల్లి సుజాత పై అఖిల భారత విద్యార్థి పరిషత్ మరియు అనేక భారతీయ జనతా పార్టీ సంస్థలు ఆమె డిసెంబర్ 25న మనుస్మ్రితి దహన దినం సందర్భంగా భారత మాత చిత్రపటాన్ని తగులపెట్టటానికి కుట్ర పన్నారని ఫిర్యాదులు చేశాయి. మనుస్మ్రితి దహనం బాబా సాహెబ్ అంబెడ్కర్ 1927 లో భారత దేశంలో కుల, పితృస్వామ్య సంస్కృతిని పోగొట్టి ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా చేపట్టిన నిరసన పద్ధతి. ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు మాత్రమే కాదని, రోజువారీ జీవితంలో సమానత్వం, సౌభ్రాఅతృత్వం, స్వేచ్ఛ వున్నప్పుడే ఒక దేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతోంది ఆయన బలంగా నమ్మారు. డిసెంబరు 25 న అనేక రకాల సంఘాలు, సంస్థలు తాము కుల పీడనని, మహిళల అణచివేతని వ్యతిరేకిస్తున్నామని చెపుతూ మనుస్మ్రితి ప్రతులని ఎప్పటినుండో బహిరంగంగా దహనం చేస్తూ వస్తున్నాయి. కెమెరాల ముందు జరిగే కార్యక్రమం కనుక, చేసేదే ప్రచారం కోసం కనుక పైకి ఒకటి చెప్పి, లోపల మరోది చేసే అవసరం ఉందని నమ్మటం కొంచెం కష్టమే కాబట్టి, అసలు సమస్య వేరే ఉన్నట్లు, ప్రొ.సుజాత పై ఫిర్యాదులు కూడా అక్కడి నుండే వస్తున్నట్లు అనిపిస్తోంది.

ఫిర్యాదు చేసిన సంస్థల సభ్యులు తమకి ఈ కార్యక్రమం పట్ల అభ్యంతరం లేదంటూనే మనుస్మ్రితి దహనం గురించి తమకున్న అభ్యంతరాలని వివిధ రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. క్లుప్తంగా వారి వాదన ఇది. భారత రాజ్యాంగం అందరినీ సమానులని ప్రకటించి రిపబ్లిక్ గా అవతరించిన 70 సంవత్సరాలు గడిచింది గనుక 1500 ఏళ్ల క్రితం కులవ్యవస్థని సమర్ధించే మనుస్మ్రితిని దహనం చెయ్యటం వల్ల, కులాన్ని  మళ్ళా తవ్వి బయటికి తీసి, సమాజంలో ప్రజల మధ్య కుల విభజనలని ప్రోత్సహించి నట్లు అవుతుందని. అయితే కులం ఈ కార్యక్రమం వల్లే బయటికొస్తుందని అనటం అసంబద్ధమైన వాదన. రాజ్యాంగ ప్రకటన మనం మనకి చేసుకున్న వాగ్దానం మాత్రమే. అదింకా వాస్తవ పరిస్థితులని క్షుణ్ణంగా మార్చలేదు. తీవ్ర అసమానతలని నిర్మూలిస్తామని చెప్పిన రాజ్యాంగ హామీని అమలు పరచాల్సిన పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఆ స్పూర్తితో ఎంతమేరకు పనిచేసాయి? చేసుంటే ఇన్ని రకాల హింసాత్మక ఘటనలు -  గత సంవత్సరం జరిగిన మంథని మధుకర్ హత్య కావచ్చు, అభంగ పట్నం లో అగ్ర కుల నాయకుడు దళిత యువకులపై చేసిన హింస కావచ్చు - జరిగుండేవి కావు. అగ్ర కుల సమాజం తమ ఆధిపత్యాన్ని వదులుకోవడాన్నీ ఇంకా సిద్ధపడలేదని ప్రతి రోజూ మనకి దృష్టాంతాలు ఎదురవుతూనే వున్నాయి. అత్యాధునిక అపార్టుమెంటుల్లో పని మనుషుల పట్ల అంటరానితనాన్ని పాటించి, అతి తక్కువ వేతనాలు ఇచ్చి పని చేయించుకోవటం నుండి పెద్ద స్థాయి ప్రొఫెసర్నైనా సరే తాను పెద్ద కులానికి చెందానని అహంకారంతో గౌరవించని అటెండర్లు వరకు, రాజ్యాంగ పరంగా ఇవ్వాల్సిన సీట్లు తప్ప, ‘జనరల్’ సీట్లలో దళిత అభ్యర్థులకు సీట్లు ఇవ్వని పార్టీలు, యూనివర్సిటీల వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే తరగని గని లా కుల ఆధిపత్యం నిలుపుకునే ఆకాంక్ష ప్రతి క్షణం కనిపిస్తూనే ఉంటుంది. “ఈ రోజుల్లో కులమెక్కడుందండీ” అనే పెద్ద మనుషులు అనేక మంది తమ రోజువారీ జీవితాల్లో దాన్ని పాటించటంలో నిష్ణాతులు. గణాంకాలు చూసుకున్నా సరే, ఈ దేశంలో డెబ్బై ఏళ్ల రాజ్యాంగ అమలు తరువాత, దళితులు, ఆదివాసీలు అతి పేద వారు, నిరక్షరాస్యులు, భూమి లేని వారు గా కొనసాగటం గమనిస్తే, అప్రకటిత కుల శాసనాన్ని కాదని ప్రకటిత రాజ్యాంగం ఇంకా పూర్తిగా అమలు కావట్లేదని ఒప్పుకోవాలి. ఈ రకమైన అప్రకటిత కుల శాసనాన్ని (దానిలో భాగమైన స్త్రీలపై పెత్తనాన్ని) సమర్ధించే మనుస్మ్రితి వంటి శాస్త్రాలని తగులపెట్టటం రాజ్యాంగాన్ని బలపరిచే చర్యే తప్ప అడ్డుకట్ట వేసే చర్య కాదు.

వీరి మరొక అభ్యంతరం ఏమిటంటే, ఇలా దళిత, బహుజన సమూహాలు తామంతట తామే సమీకృతమయ్యి వ్యతిరేకించటం వల్ల సమాజం విడిపోతుందని, కుల ప్రాతిపదికన సమీకృతమయితే, కులాన్ని బలపరిచినట్లే నని.  హిందువులని కులమనే అస్తిత్వం విభజిస్తుందని, కాబట్టి దాన్ని గురించి కాక హిందువునే అస్తిత్వం గురించే మాత్రమే మాట్లాడాలని వీరి ఇంకొక వాదన. మరయితే వీరికెందుకు ప్రత్యేకంగా ఎస్. సి సెల్ లేదా మైనారిటీ సెల్ నిర్వహిస్తున్నారనే ప్రశ్న వెంటనే వస్తుంది. అంతే కాదు, అందరు హిందువుల కోసం అజెండాని కొంత మంది మాత్రమే ఎలా నిర్ణయించగలరు? అలాగే, అంతర్గత సమానత్వం లేకుండా ఇన్ని కులాల హిందువులందరు ఒక్కటి ఎలా అయితారన్న విషయం కూడా పెద్దగా చర్చించరు. వారి కుల సంఘాలతో సహా , రాజ్యాంగం ఇచ్చిన సమీకృత హక్కు క్రిందే అన్ని కుల సంఘాలు పనిచేస్తాయి. 1980 ల నుండి ఇటువంటి సమీకరణాల వల్లే ప్రభుత్వాలు వీరిని పట్టించుకుంటున్నాయని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అమలు పరచని పధకాలు, హక్కులు ఈ మాత్రమైనా ఆయా దళిత, బహుజన సమూహాలకు ఈ సమీకరణాల వల్లే అందుతున్నాయి కూడా.

సూరేపల్లి సుజాత ఇటువంటి ఒక రాజకీయ, సామాజిక సమీకరణాలతో అనుబంధం వున్న సామాజిక శాస్త్రవేత్త, అధ్యాపకురాలు, మేధావి. రెండు దశాబ్దాల నుండి ప్రజా క్షేత్రంలో పనిచేస్తూ ఎదిగిన నాయకురాలు. ఏ పార్టీ తో సంబంధం పెట్టుకోకుండా సమస్యల కేంద్రంగా అనేక ప్రభుత్వాలని, వాటి ప్రజా వ్యతిరేక చర్యల గురించి జంకు లేకుండా నిలదీసే వ్యక్తి. అనేక రకాల నిరసనల్లో, ఉద్యమాలలో పాలుపంచుకున్న వ్యక్తి. తన రచనలతో అనేకమందిని ప్రభావితం చేసింది. విద్యార్థుల పట్ల నిబద్ధతో, సుహృద్భావంతో వ్యవహరించే అధ్యాపకురాలు. స్థానికంగా దేశవ్యాప్తం గా, అంతర్జాతీయంగా పేరున్న ఒక దళిత మహిళా మేధావి కూడా. తెలంగాణ ప్రభుత్వ వున్నత విద్య మండలి పిలిచి ఆవిడతో జెండర్ సెన్సిటిజషన్ పై పాఠ్య పుస్తకం రాయించింది. ఆమె రాసిన పుస్తకం ఈ మధ్యనే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రచురించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. ఏ ముందు చూపున్న ప్రభుత్వం అయినా ఇటువంటి ప్రభావశీల మేధావిని రాష్ట్రానికి, దేశానికి ఒక విలువయిన వనరుగా భావిస్తుంది.తాను ప్రిన్సిపాల్ గా వున్న విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్ధుల మధ్య గొడవలు రాకుండా వుండాలని ఆమె చేసిన ప్రయత్నం ఏ బాధ్యతాయుతమైన వ్యక్తి అయినా చేసేదే.

ఆమెపై కరీంనగర్ లో ఫిర్యాదులు చేసిన సంస్థలు తమ భావజాలం దృష్ట్యా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో జరుగుతున్న దళిత బహుజన సమీకరణలలో ఆమె పోషించిన పాత్రకి ఈ విధంగా స్పందించటం ఆశర్యకరమేం కాదు. తమ పార్టీ మనుగడ తప్ప ప్రాంత, దేశ భవిష్యత్తు గురించి పెద్దగా సోయి లేని ఈ రాజకీయ కార్యకర్తలు ఇలా తమ తమ పార్టీలు, ప్రభుత్వాలకి లొంగని మేధావులని మాట్లాడ నియ్యకుండా చేస్తే తమ స్థానం బలపడుతుందని,  తమ ప్రగతికి సోపానం ఏర్పాటు అవుతుందని భావిస్తున్నట్లున్నారు. కానీ తాము కూడా ఆమె వంటి పలు మేధావులు చేసిన ఉద్యమాల పునాదుల పైనే నిలబడి వున్నారని వారు గుర్తిస్తున్నట్లు లేరు. మరి ఇటువంటి ఒక ప్రభావశీల దళిత మహిళా మేధావిపై జరుపుతున్న అబద్ధపు ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం, సమాజం చూస్తూ ఊరుకుంటాయా అన్నవి మన ముందున్న ప్రశ్నలు.


4 జనవరి 2018 న "సుజాతపై ఎందుకింత ఆగ్రహం" పేరుతో ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమయింది.

Comments