370 and Kashmiri Women




ప్రత్యేక హోదా: కాశ్మీరీ స్త్రీలు 

భారత రాజ్యంగంలో (21 భాగంలో 370 మరియు 371 ప్రకారణల క్రింద) ప్రత్యేక హోదా అనుభవిస్తున్న పదకొండు రాష్ట్రాల్లోని జమ్మూ కాశ్మీర్ కి పార్లమెంటు అకస్మాతుగా  హోదా తీసేసినందుకు దేశప్రజలు చాలా మంది ఆనందించారుపెద్దగా విషయం అర్ధం కాకపోయినా, హోదా కున్న చారిత్రిక, రాజకీయ కారణాలు, డెబ్బై ఏళ్లలో దానిలో జరిగిన మార్పులు, అది తీసేస్తే వచ్చే అంతర్జాతీయ పరిణామాలు తెలియక పోయినా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇటువంటి హోదా  - అంటే తమ ప్రత్యేక సంస్కృతీ, వివాహ చట్టాలు, భూ చట్టాలు, తమ అనుమతి లేకుండా బయటి వారు రాకుండా నిరోధించే స్వేచ్ఛ - స్వాతంత్య్రానంతర భారత దేశంలో తెచ్చుకుని, రాజ్యంగంలో భాగం చేసుకుని, కాపాడుకుంటున్న అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లలో మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా తీసేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోందిడెబ్బై ఏళ్ల క్రితమీ భారత దేశంలో విలీనమయిన జమ్మూ & కాశ్మీర్ ఇప్పుడే పూర్తి భాగమైందని ఫేస్బుక్ లో, వాట్సాప్ లో అన్ని రకాల న్యూస్ ఛానెళ్లలో వినవస్తున్న విచిత్ర వాదన లో భాగం - సవరణ కాశ్మీరీ మహిళలని విముక్తి చేసిందనే వాదన. 370 ప్రకరణ ప్రకారం బయటి వారిని పెళ్లి చేసుకుంటే వారు భూమి, ఆస్తి హక్కుని కోల్పోయారని సవరణ వల్ల పూర్తి వివాహ స్వేచ్ఛ, సమానత్వం అనుభవించొచ్చని అనేకమని  సంస్కరణ వాదులు, స్త్రీ స్వేచ్చా వాదులు, అలాగే వారిని పెళ్లి చేసుకోవటానికి (వారికిష్టం ఉందొ లేదో తెలుసుకోకుండానేమరి కొంత మంది గిరీశాలు ఉత్సాహ పడిపోతున్నారు. 2002 లో వచ్చిన సుప్రీమ్ కోర్టు తీర్పు మార్పుని తెచ్చిందని ఇప్పుడు కాశ్మీరీ స్త్రీలకి అడ్డంకి లేదన్న విషయం సోషల్ మీడియా విద్యాలయాలు వీరికి ఎందుకో చెప్పట్లేదు మరి

మన దేశంలోని అన్ని సమాజాల్లో - రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర - వున్నట్లే కాశ్మీరీ సమాజంలో కూడా పితృస్వామ్యం వుందిఅమ్మాయిల కంటే అబ్బాయిలకు అన్ని విషయాల్లో ప్రాధాన్య మివ్వటం మామూలు. వివాహ విషయంలో కులం, కట్టుబాట్లు, స్థాయి చూసుకోవటం కూడా మామూలయినావివాహ విషయంలో మాత్రం అమ్మాయిల అనుమతి  మాత్రం తీసుకుంటారు. స్త్రీల విద్యా స్థాయి పురుషుల విద్య స్థాయి కంటే తక్కువేఅయితే, పోలిక ఇంతకీ మించి చెయ్యలేంజమ్మూ కాశ్మీరీ సమాజం రాజస్థాన్, మహారాష్ట్ర , తెలంగాణ వంటి మైదాన రాష్ట్రం కాదు. వీటన్నిటితో పోలిస్తే 1940 నుండి తీవ్ర హింస, ఒడిదుడుకులు, ప్రభుత్వ అస్థిరత, నిరంతర యుద్ధం ఎదుర్కుంటున్న సరిహద్దు రాష్ట్ర సమాజం. ఇతర సరిహద్దు ఈశాన్య రాష్ట్రాలలో లాగే ఇక్కడ కూడా అనేక సార్లు  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చెయ్యటం, గవర్నర్ పాలన పెట్టటం లేదా ఎన్నికలు తూ తూ మంత్రంగా నడుపటం వల్ల శాంతి, స్థిరత్వం ఎప్పుడూ లేవు. దాని వల్ల జరిగిన తీవ్ర నష్టం ఏమిటంటే స్త్రీలు తమ సమానత్వ హక్కుల కోసం ఎప్పుడూ పోరాడే అవకాశం పొందలేక పోవటం.  

కాశ్మీరీ స్త్రీల సమానత్వ ప్రయాణం భిన్నంగా సాగిందిఅన్ని రాజకీయ ఉద్యమాల్లో - 1947 లో పాకిస్తానీ సైన్యాన్ని ఎదుర్కోవడం దగ్గరి నుండి కాశ్మీరీ వేర్పాటువాదంలో భారత రాజ్యాన్ని వ్యతిరేకించటం వరకుస్త్రీలు సమానమయిన పాత్రే పోషించారు. దానికి తగ్గ తీవ్ర హింస కూడా అనుభవించారురాజా హరి సింగ్ సైన్యాలు జమ్మూలో ముస్లిం లని ఊచ కొత్త కోసినప్పుదు అత్యాచారాలకి గురయ్యి చంపబడిన వాళ్ళల్లో స్త్రీలు అనేకం. కాశ్మీరీలు స్వతంత్రం కోసం చేస్తున్న పోరాటంలో భాగస్వాములయినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. దాన్ని అణచటానికి కాశ్మీరులో కేంద్ర ప్రభుత్వాలు 1990 నుండి పెంచుతూ పోయిన 7 నుండి 8 లక్షల భద్రతా దళాల చేతుల్లో వాళ్ళు అనుభవించిన తీవ్ర లైంగిక హింసని కాశ్మీరీ మానవ హక్కుల సంఘాలు, బయటి మానవ హక్కుల సంఘాలు నమోదు చేస్తూనే వున్నాయివాటిల్లో, 2017 లో సుప్రీమ్ కోర్టు గుర్తించినాభారత ప్రభుత్వం ఇప్పటికీ వొప్పుకోని కునాన్ పుష్పోరా సంఘటన ఒకటి. 1991 లో మిలిటెన్సీ ఎక్కువున్న  రెండు గ్రామాల్లో భద్రతా దళాలు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి అమ్మాయిని, స్త్రీని లైంగిక హింసకి గురి చేశాయివారిని ఇంటర్వ్యూలు చేసి 'మీకు కునాన్ పుష్పోరా గుర్తుందా?' అనే పుస్తకం రాసిన  ముగ్గురు కాశ్మీరీ యువతులు 2016 లో రాశారుభారత దేశ లైంగిక హింసా చట్టాల్లో భద్రతా దళాలు చేసే అత్యాచారాలు చేర్చాల్లన్న డిమాండు, ఈశాన్య రాష్ట్ర మహిళలతో పాటు, కాశ్మీరీ స్త్రీల వేదన నుండే వస్తోంది

భారత దేశంలో సుస్థిర ప్రభుత్వాలు, శాంతి వున్న రాష్ట్రాల్లో (కుల, వర్గ అణచివేతలు తీవ్రంగా ఉన్నప్పటికీ) ప్రజలు అర్ధం చేసుకోలేని బాధ కాశ్మీరీ స్త్రీలది. 1990 నుండి వాళ్ళు 70,000 మంది కొడుకులు, భర్తలు, సోదరులని, కూతుళ్ళని, తల్లులని కోల్పోయారు. 10,000 మందికి పైగా కుటుంబ సభ్యులు మాయమయ్యారు. అలా మాయమయిన భర్తల తాలూకు అర్ధ విధవలు ఎంత మందో. రాజ్యం చేతుల్లో హింసకి గురయి బ్రతికి బట్ట కట్టినప్పటికీ శారీరక, మానసిక వికలాంగులుగా మిగిలి పోయిన వాళ్ళు మరింత మంది. 2014 తరవాతే, కేంద్ర ప్రభుత్వ పెల్లెట్ గన్ను ప్రయోగం వల్ల కళ్ళు పోయి వికలాంగులుగా మిగిలిపోయిన పిల్లల్ని, పెద్దవాళ్ళని చూసుకునేదెవరు? కాశ్మీరీ మహిళలే కదా? ప్రతి రోజూ, దైనందిన కార్యక్రమాలకి - పొలాల్లో పనిచేయటానికి, ఇంటికి కావాల్సినవి కొనుక్కోవటానికి - కూడా ప్రతి పది గజాలకి ఒక భద్రతా దళ జవానుతో చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి వారిది. అర్ధ రాత్రి, అప రాత్రి ఎప్పుడంటే అప్పుడు ఇళ్లలో చెక్ చేస్తుంటే నిద్ర లేకుండా, ఎప్పుడు వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లోని మగవాళ్ళు మాయమవుతారో, చనిపోతారో తెలియని పరిస్థితి వారిది. మాయమయిపోయిన కొడుకుల్ని, భర్తల కోసం తల్లులు, భార్యలు సంఘాలు పెట్టుకుని, కనీసం ఎక్కడ శరీరాన్ని పడేశారో చెప్పండి, చివరి క్రతులు చేసుకుంటాం అంటూ పోరాటం చేస్తున్న స్త్రీలు వీళ్ళు

కాశ్మీరీ స్త్రీలు ఎదుర్కుంటున్న పరిస్థితులు ఏవీ కాశ్మీరీ పితృస్వామ్య సమాజం కల్పించిన సమస్యలు కావు. గత కొన్ని దశాబ్దాలుగా వారి సమస్యలు, పోరాటాలు కుటుంబం, వివాహం, ఆస్తి చుట్టూ తిరగట్లేదుఅవి విస్తృత రాజకీయ పరిస్థితులకి, ఆయా పరిస్థితుల్లో వచ్చిన పోరాటాలకి ముడిపడి వున్నాయికుటుంబంజీవితం చిన్నాభిన్నమవుతుంటే వివాహ హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి, కుటుంబంలో సమానత్వం గురించివచ్చే, పోయే ఆస్తి గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికుంటాయి? కాశ్మీరీ స్త్రీలని రాజ్యం కల్పించే స్థిరత్వం, భద్రత అనుభవిస్తున్న సమాజాల్లో బ్రతికే పితృస్వామ్య కుటుంబాల్లో స్త్రీలుగా ఊహించుకోవటం వల్లే భారతీయ ప్రధాన సంస్కృతీ ఇటువంటి సంకుచిత ఊహాగానాలకు పాల్పడుతోంది. ఇది ముస్లిం స్త్రీలకి కేవలం మూడు తలాక్ లు మాత్రమే సమస్య అయినట్లు మాట్లాడటం వంటిదే. ముస్లింలని నియంత్రించొ, కొట్టోబాధ పెట్టో మాత్రమే జాతీయ వాదులుగా తమని తాము నిరూపించుకోగలమన్న భావన ప్రబలి తమ తమ కుటుంబ సభ్యులు ఇంటికొస్తారో లేదో అన్న జీవన్మరణ భయం పట్టుకున్న ముస్లిం స్ట్రీలకి కేవలం మూడు తలాక్ ఆచారాన్ని నేరమయం చేస్తే జీవితం బాగు పడుతుందా? ప్రతి పది మంది కాశ్మీరీ ప్రజల్లో ఒకరు రాజ్య హింసకి గురవుతుంటే, కళ్ళ ముందు చెప్పలేనంత హింసకి బంధువులు, కుటుంబ సభ్యులు గురవుతుంటే, తమ సమాజం అస్తిత్వమే కోల్పోతుంటే, స్త్రీలుగా తాము హక్కులు పొందుతున్నామని వారు ఆనందిస్తారా? అలా వారు భావించాలని మనమందరం అనుకోవటం కేవలం అవివేకం, అజ్ఞానాలకి సూచిక మాత్రమే కాదు, బ్రిటిషు వలస భావజాల అవశేషాల్ని మనం ఇంకా వదులుకోలేదనటానికి నిదర్శనం

స్త్రీల అసమాన హోదాని ఒక ప్రాంతాన్నో, సమూహాన్నోదేశాన్నో ఆక్రమించుకోవటానికివారికిష్టం లేకుండా తమలో కలిపేసుకోవటానికిపాలించటానికి లేదా వారిపై యుద్ధం ప్రకటిం చటానికి సాకుగా వాడుకోవటం, తమ సంస్కరణల వల్లే ఆయా ప్రాంత, దేశ స్త్రీలు విముక్తి పొందారని వాదించటం చరిత్రలో మాత్రం కొత్త కాదు. భారత దేశంలో భర్తలని కోల్పోయిన స్త్రీలని సతి పేరుతో కాలుస్తారనిఅప్పుడే పుట్టిన ఆడ పిల్లల్ని చంపేస్తారనీకాబట్టి భారత దేశానికి సభ్యతా, సంస్కృతీ నేర్పాలంటే తాము పాలించక తప్పదని బ్రిటిషు వారు బలంగా నమ్మారు. తమకా సమాజాల, సంస్కృతుల చరిత్రా, తీరు తెన్నులు అర్ధం కాకపోయినా యూరోపియన్ సిద్ధాంతకర్తలు ప్రాచ్య దేశాల సమాజాలని పూర్తి పితృస్వామికమయిన 'ఓరియంటల్' సమాజాలని సూత్రీకరించారు. 2001 లో ఆఫ్ఘనిస్తాన్ పై, బిన్ లాడెన్ ని పట్టుకుంటామన్న సాకుతో దాడి చేసిన అమెరికాతాలిబాన్లని తమ ప్రయాజనాలకోసం తామే తయారుచేశామనే చారిత్రక వాస్తవాన్ని కప్పిపెట్టిఅక్కడి స్త్రీలని తాలిబన్ నుండి రక్షించటానికి యుద్ధం చేస్తున్నామని సమర్ధించుకుంది. దాని కోసం పదే పదే బుర్ఖా వేసుకున్న స్త్రీల ఫోటోలని తమ ప్రచారాల్లో వాడుకుందిమన దేశంలో 1980 నుండి ముస్లిం స్త్రీలు తీవ్ర పితృస్వామ్య అణచివేతలో వున్నారని, వారిని 'విముక్తి' చేసే చట్టాలు చెయ్యటానికి బలమయిన జాతీయవాద ప్రభుత్వం అవసరమనే భావన బలంగా వెళ్లూనుకుంది. జాతీయ వాద పార్టీలంటే ముస్లింలని క్రమశిక్షణలో, క్రమంలో పెట్టాలని, దానిలో భాగంగా వారికుండే 'ప్రత్యేక చట్టాలని' తీసెయ్యాలనే నమ్మకం ప్రబలింది. మహిళా సాధికారత అంటే ఇప్పుడు మహిళలందరికీ అవసరమయ్యే చట్టాలు, పాలసీలు చెయ్యటం అవసరం లేదు. అందువల్లే గత అయిదేళ్లనుండి నుండి భారతీయ మహిళలకి పార్లమెంటులో సమాన భాగస్వామ్యం కల్పించే మహిళా బిల్లు గురించి ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడం లేదు. దాని బదులు కొన్ని శాఖల ముస్లింలలో దురాచారంగా వున్న మూడు తలాక్ లని నిరోధించే చట్టం ప్రభుత్వాలకి  ప్రధానమయి కూర్చుంది. 370 ప్రకారణ సవరించి పితృస్వామ్యం నుండి కాశ్మీరీ స్త్రీలని విముక్తి చేసామన్న భావన  కోవలోకి చెందిందే!   

డా. సునీత 

Published in Andhra Jyothi on 20th August 2019



Comments