Rape and punishment


కఠిన శిక్షలతో లైంగిక అత్యాచారాలు తగ్గుతాయా?

నిర్భయ పై జరిగిన లైంగిక అత్యాచారం సమయంలో జరిగిన చర్చ మళ్ళా దిశ అత్యాచారం, హత్య సందర్భంలో పునరావృతమవటం చాలా ఆశ్చర్యం గాను, మరింత బాధా కరంగాను వుంది. ఇంత ఘోరమైన హత్యాచారాలు ఆపాలంటే వారిని బహిరంగంగా వురి తియ్యటమే లేదా కఠిన శిక్షలు ఒకటే మార్గం అన్న శుష్క, బాధ్యతా రహితమైన వాదన సామాన్యులు, రాజకీయ నాయకులు చేస్తుండగా వింటుంటే భయం వేస్తోంది. లైంగిక అత్యాచారం ఎంత సాధారణంగా రోజువారీ జరుగుతోందో తెలియని అజ్ఞానం ఒక పక్క మన సమాజంలో పురుషులు ఈ రకంగా ఎందుకు తయారవుతున్నారనే అవగాహనా రాహిత్యం మరో పక్క ఈ మధ్యలో నేర పరిశోధనా వ్యవస్థ - పోలీసులు, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, న్యాయ మూర్తులు క్షేత్ర స్థాయిలో ఎలా ఉంటుందో తెలియనితనం వీటన్నిటి మధ్య సోషల్ మీడియాలో అజ్ఞాన తీర్పులు, పార్లమెంటులో అవివేక పరిష్కారాలు వెలువడుతున్నాయి.  

ముందుగా దిశ లేదా ఆదిలాబాదులో ఇలాగే హత్యాచారానికి గురయిన కరుణ (పేరు మార్చాను) బ్రతికుంటే ఏమి జరిగేదో ఒక సారి ఆలోచిద్దాం. జరిగిన దాని గురించి వారిని, వారి కుటుంబాలని  సమాజంలో బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, తెలిసిన, తెలియని వాళ్ళు అనేక రకాల అవమానాలకు గురిచేసేవారు. దిశకి పెళ్ళవటం ఎట్లా అని బంధువులు గుచ్చి గుచ్చి అడుగుతుండేవారు. కుటుంబం మద్దతిచ్చి నప్పటికీ ఇద్దరికీ పనికెళ్ళటం దుర్లభంగా మారి ఉండేది. ప్రభుత్వ పరంగా గాని, ప్రయివేటు పరంగా గాని, ఇటువంటి అత్యాచారానికి గురయిన స్త్రీలకి ఆ భయోత్పాతం నుండి బయట వెయ్యటానికి అవసరమయిన వైద్య సదుపాయాలూ పెద్దగా లభించి ఉండేవి కాదు. దిశ కి కొంతలో కొంత అటువంటి సదుపాయం లభించినా, కరుణకి లభించే అవకాశం లేక దాన్నుండి బయట పడటానికి ఆమెకి జీవిత కాలం పట్టి ఉండేది. ఈ లోపల ఆమె కుటుంబ ఆర్ధిక పరిస్థితి మరింత కుంటు పడి ఉండేది. 

ఇక నేర పరిశోధనా వ్యవస్థకొద్దాం. ముందుగా, బ్రతికున్నప్పుడే కుటుంబ సభ్యులు ఆయా స్త్రీలు కన్పించట్లేదని పోలీసులకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా స్పందించలేదని, పేరు, వివరాలు చట్ట విరుద్ధంగా బయట పెట్టేశారని గుర్తుంచుకుందాం. ప్రజా పోరాటం లేకున్నట్లయితే, అవసరం లేకపోయినా దిశకి చట్ట విరుద్దమయిన రెండు వేళ్ళ పరీక్ష జరిగుండేది. ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని, కరుణకి ఆ ముద్దాయిల్లో ఎవరయినా తెలుసా అనే ఎంక్వైరీ జరిగేది. సమయానికి ముద్దాయిలని గుర్తించే పెరేడ్ జరగటం, చార్జిషీట్ దిశ విషయంలో జరిగినా, కరుణ విషయంలో జరిగుండేవి కాదు. ఆమె కేసు పరిశోధనలో తాత్సారం తప్పకుండా జరిగుండేది. ఇదంతా జరిగి, ఈ రెండు కేసులు కోర్టుకి వెళితే, ముద్దాయిల తరఫు డిఫెన్స్ లాయర్లు తమ వృత్తి ధర్మం ప్రకారం - ఆ సమయంలో వాళ్లిద్దరూ అక్కడ ఎందుకున్నారు అని, వాళ్ళిద్దరి లైంగిక చరిత్ర, ముద్దాయిలు వారికి తెలుసా, వారు ఎందుకు రేపిస్టులతో సంఘర్షించలేదు, వొంటి మీద గాయాలేందుకు లేవు వంటి ప్రశ్నలతో వారిని విసిగించి, నిందించి అవమానించి, వారి వర్ణనల్లో తప్పులు వెతికి ముద్దాయిలని రక్షించటానికి ప్రయత్నించే వారు. బాధితులకి ఎందుకు ఫిర్యాదు చేశామా, ఎందుకు బ్రతికున్నామా అని అనిపించేలా కోర్టుల వాతావరణం ఉంటుందని ప్రతీక్ష బాక్సీ వంటి లీగల్ స్కాలర్ చెప్పిన రీతిలో ట్రయల్ జరిగుండేది. ఈ లైంగిక చరిత్ర గురించిన  ప్రశ్నల బాధ కుల, వర్గ రీత్యా కరుణకి ఎక్కువగా, దిశకి తక్కువగా వుంది ఉండేది. ఇదే కారణాల వల్ల కరుణ పై అత్యాచారం చేసిన వారికి తక్కువ శిక్ష పడే అవకాశాలు కూడా ఉండేవి. 

ఇదీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి. ఈ పరిస్థితుల వల్లే లైంగిక అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడ్డవి, పడుతున్నవి చాలా తక్కువ. ఇప్పటికీ సమాజంలో లైంగిక అత్యాచార బాధితుల పట్ల చులకన, చిన్న చూపు, అవమానకరమైన చూపులు, చేష్టలు మామూలు. యువతులనయితే వారి శీలం పోయిందని, వారిలో ఎదో తప్పుంది కాబట్టే వారిపై అత్యాచారం జరిగిందని భావిస్తారు. అందరూ వారిని, వారి కుటుంబాన్ని దూరం పెడతారు. వారిదే తప్పని, వారినే నిందిస్తారు. పోలీసుల దగ్గరికి వచ్చేవి ప్రాణాల మీదకి వచ్చినవి, ఎక్కువ మెడికో లీగల్ కేసులు ఉంటాయి. దేశంలో చాలా మంది పోలీసుల చిట్టాలో స్త్రీలపై జరిగే లైంగిక నేరాలు దొంగతనాల కంటే చిన్న స్థాయి నేరాలు. లైంగిక అత్యాచారాలని అత్యధిక పొలిసు స్టేషన్లలోసరిగ్గా  పట్టించుకోరు. దిశ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళ గురించే అవమాన కరంగా మాట్లాడతారు. దేశంలోఇతర చోట్ల అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చెయ్యటానికి వెళ్లిన స్త్రీలపై పోలీసులు కూడా అత్యాచారానికి పాల్పడిన సంఘటనలు లేకపోలేదు. హాస్పిటళ్లలో డాక్టర్లతో సహా అందరూ అత్యాచారం కేసులో వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన బాధితుల్ని జూలో జంతువులని చూసినట్లు చూస్తారు. కనీస మానవీయ స్పృహ లేకుండా హేళనగా చూస్తారు. చాల మంది డాక్టర్లకి రెండు వేళ్ళ పరీక్ష నేరస్మృతి నుండి తీసేశారని, కాబట్టి చెయ్య కూడదని కూడా తెలియదు. ఇక కోర్టుల్లో వాయిదాల పైన వాయిదాలు అయ్యి కొన్ని ఏళ్ల పాటు సాగుతూ ఉంటాయి. చిన్న పిల్లలుగా అత్యాచారాలకి గురయ్యిన వాళ్ళు తీర్పు సమయానికి పెళ్లి వయసుకి వచ్చిన సంఘటనలు ఎన్నో. న్యాయ పోరాటానికి కొన్ని సార్లు దశాబ్దాలు పడతాయి.

అందుకే ఇప్పటికీ లైంగిక అత్యాచారాల గురించి ఫిర్యాదు చేసే ఆడవాళ్ళ, బాలికల  సంఖ్య అతి తక్కువ. జరిగే వాటిల్లో కేవలం 2% నుండి 5% మాత్రమే రిపోర్టు చెయ్యబడతాయని ఒక అంచనా. తండ్రులు, సోదరులు, మామలు, బాబాయిలు, మొగుళ్ళు చేసే లైంగిక అత్యాచారాలు అసలు బయటికి రావు. దినపత్రికల క్రైమ్ పేజీలో అప్పుడప్పుడు కనపడతాయి. చిన్న పిల్లలపై జరిగే వాటిల్లో అబ్బాయిలు, బాలుర మీద జరిగే లైంగిక అత్యాచారాలు సగానికి సగం వున్నాయని క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ట్రాన్సజెండర్ స్త్రీలపై రోజు వారీ జరిగే అత్యాచారాలు, హత్యలు చట్ట పరిధిలోకే ఇంకా రాలేదు. అంటే పట్టుబడిన నేరస్థుల సంఖ్య కంటే అసలు నేరస్థుల సంఖ్య అనేక వందల రేట్లు ఎక్కువ. బాధితులు ఫిర్యాదులే చెయ్యలేని పరిస్థితుల్లో వున్నప్పుడు, పట్టుబడిన ఒకరిద్దరికి కఠినమైన శిక్షలు వెయ్యటం వల్ల పరిస్థితి మారి పట్టుబడని రేపిస్టులు భయపడతారని భావించటం కష్టం. 

లైంగిక అత్యాచారం గురించి సమాజ ఆలోచనా రీతులు మారకుండా ఈ పరిస్థితి మారుతుందని ఆశించగలమా? స్త్రీలు అత్యాచారం గురించి గురించి అబద్ధాలు ఆడతారనే బలమైన నమ్మకం ఇప్పటికీ లేదూ? అసలు అత్యాచారాలని, ఆ స్త్రీ చనిపోతే తప్ప, ఇప్పటికీ హింసగా పరిగణించటం చెయ్యం కదా. అంతే కాక, మనం వివిధ రకాల హత్యాచారానికి వివిధ రకాలుగా స్పందిస్తాం - ఆ స్త్రీ కులం, వర్గం, ప్రాంతం, జెండర్, రాజకీయ అస్తిత్వం బట్టి. అత్యాచారానికి గురయిన స్త్రీ బ్రతికి బయట పడితే ఆమెని మనిషిగా గౌరవంతో చూడటం మనకింకా తెలియదు. వారి పట్ల మానవీయంగా ఎలా ప్రవర్తించాలో సమాజం నేర్పట్లేదు. అత్యాచారానికి గురయిన స్టీని శీలం చెడిన స్త్రీగా చూడటం మాత్రమే మనం నేర్చుకున్నాం. స్త్రీల శీలమంటే వారి శరీరాలలో ఉందనే సమాజం ఇప్పటికీ చెపుతోంది. దాని దృష్టిలో స్త్రీలంటే ప్రధానంగా పురుషుల లైంగిక వాంఛలకు పనికొచ్చే వస్తువులు - వివాహం బయట, లోపల కూడా. అందుకే అత్యాచార వ్యతిరేక నిరసనలు ఆయా స్త్రీలు వివాహ వ్యవస్థకి పనికిరారనే భయం, బాధ నుంచి వస్తున్నాయి ఎక్కువగా.  స్త్రీలు వ్యక్తులని, లైంగిక అత్యాచారం వారి శరీరాన్నీ, వ్యక్తిత్వాన్నీ, ఆత్మ గౌరవాన్ని గాయపరుస్తుందని, శరీరంపై హక్కుకి హాని కలిగిస్తుందనే అవగాహన, స్పృహ అత్యాచార వ్యతిరేక నిరసనల్లో కూడా ఇంకా రాలేదు. 

మనల్ని మనం వేసుకోని వేసుకోని మరొక ప్రశ్న, ఇంత పెద్ద సంఖ్యలో రేపిస్టులు ఎందుకు తయారు అవుతున్నారనేది. ఇంత మంది పురుషులు స్త్రీల (బాలికలు, బాలురు, ట్రాన్సజెండర్ స్త్రీల) శరీరాల్ని కేవలం తమ లైంగికేచ్ఛకి వాడుకునే వస్తువులుగా భావించటానికి కారణాలేంటి? అసలు మన పురుషుల్లో, యువకుల్లో ఎంత మందికి లైంగిక చర్య ఇద్దరు మనుషుల అంగీకారంతో కూడుకుని వుండాలని తెలుసు? స్త్రీలకి వాంఛలు, ఇష్టాయిష్టాలు ఉండవని, ఉండకూడదని, వారు కేవలం పురుషుల వాంఛలకు, ఇష్టాలకి పనికొచ్చే వస్తువులని నేర్పింది సంప్రదాయ సమాజం. దాన్ని ఈ ఆధునిక సమాచార యుగంలో కొనసాగిస్తోంది మన సమాజం, కుటుంబాలు, విద్యావ్యవస్థ, సినిమాలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా లే కదా? ఈ ధోరణులు మారకుండా యువకులు, పురుషులు ఎట్లా మారతారు? విద్యా సంస్థల్లో లైంగికత, లైంగిక సంబంధాల గురించి సరయిన దృక్పధం నేర్పాలంటే అడ్డుపడేది యాజమాన్యం, ఆ తరువాత తల్లి తండ్రులు, వెనుకాడేది టీచర్లు. ఎవరూ ఏమీ నేర్పక పొతే ఇంటర్నెట్ పోర్నోగ్రఫిక్ సైట్ల నుండి లైంగిక సంబంధాల గురించి నేర్చుకుంటున్నారు ఈ తరం యువకులు. దిశ చనిపోయిన తరువాత ఆమె అత్యాచార వీడియో కోసం పోర్నోగ్రఫిక్ సైట్లలో వెతికిన 8 లక్షల వ్యక్తులు వీళ్లల్లో భాగమే. ఇలా తయారవుతున్న పురుషత్వం నేపథ్యంలో పురుషులకి ఇతరుల శరీరాలు కేవలం వాడుకుని పారేసే వస్తువులు కాదని ఈ సమాజం ఎలా నేర్పాలనుకుంటోంది? వారిని రేపిస్టులుగా తయారవకుండా ఎలా ఆపాలనుకుంటోంది? ఈ రకంగా  ‘మగ బుద్ధి’ ని పెంచి పోషిస్తున్న సమాజంలో పట్టుబడని లైంగిక అత్యాచారాల సంఖ్య, రేపిస్టుల సంఖ్య తగ్గే అవకాశమేదీ?

దిశ హత్యలో పట్టుబడిన నిందితులకు బహిరంగంగా వురి వెయ్యాలని ఉత్సాహ పడుతున్న అనేకులు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళని, ఇంకా పట్టుబడని అనేక నేరస్తుల్ని తయారుచేస్తోంది మన సమాజం, మన వ్యవస్థలెనని. రేపిస్టులందరినీ ఉరికంబం ఎక్కించాలంటే మన దేశంలో పురుష జనాభా శాతం తగ్గిపోయే ప్రమాదం నిజంగా వుంది. మనం త్వరగా చెయ్యాల్సింది ఈ లైంగిక అత్యాచారాలని ప్రేరేపించే సంసకృతిని కట్టడి చెయ్యటం. మనకి లేనే లేని అత్యాచార బాధితులకి అవసరమయిన సహాయ సహకారాలు అందించే వ్యవస్థలని ఏర్పర్చుకోవటం. బాధితుల మాటలు నమ్మటం. పోలీసులు బ్రతికున్న బాధితులపైన అత్యాచారాన్ని కూడా సీరియస్ గా తీసుకుని తమ శైలి మార్చుకుని అందరు అత్యాచార నిందితులకు శిక్షలు పడేట్లుగా చూడటం. కోర్టుల వాతావరణాన్ని బాధితులకి అనుగుణంగా మార్చటం. బాధితులకి మానసిక స్థయిర్యాన్నిచ్చే వైద్య పరమయిన వసతులని తయారు చెయ్యటం, దానికి వైద్య వ్యవస్థని సన్నిద్ధం చెయ్యటం. అత్యాచార బాధితులు ఎందుకు బ్రతికున్నామా అనే ప్రస్తుత పరిస్థితుల నుండి జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు, మేము గౌరవంతో బ్రతకుతాం అన్న పరిస్థితిని సమాజ వైఖరులు మార్చటం ద్వారా తీసుకు రావటం. ఇవన్నీ చెయ్యకుండా నలుగురో, ఐదుగురో పట్టుబడ్డ నిందితులని క్రూరంగా చంపేస్తే లైంగిక అత్యాచారాలు తగ్గుతాయనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు! 

Published in Andhra Jyothy Newspaper on 6th December

Comments