జాతీయ పౌరసత్వ జాబితా పేద ప్రజలపై ప్రభుత్వ యుద్ధం!
ఆధునిక ప్రపంచంలో, ప్రధానంగా 20 వ శతాబ్ది మధ్యనుండి, యూరోపియన్ సామ్రాజ్యాలు అంతరించి, ప్రపంచమంతా జాతి రాజ్యాలు ఉద్భవించిన సందర్భంలో ‘పౌరసత్వం’ మనుషుల ఉనికికే భూమికగా మారిపోయింది. జాతి రాజ్యాలు భూభాగాన్ని మాత్రమే కాకుండా, మనుషుల్ని కూడా గాఢమైన సరిహద్దులతో విభజించుకున్నాయి. పౌరులు, వలసదారులు, అక్రమ వలసదారులు, శరణార్థులు ఇలా మనుషుల్ని జాతి రాజ్య అస్తిత్వంతో పునర్నిర్వచించాయి. శతాబ్దం క్రిందటి సామ్రాజ్యాల్లో జాతి అస్తిత్వం లేకపోయినా బ్రతక గలిగిన మానవులకి జాతి రాజ్యాల బయట మన గలిగే పరిస్థితులు ఇప్పుడు లేవు. భూమ్మీద పుట్టిన ఎవరయినా ఏ జాతి రాజ్య పౌరులు కాకుంటే వారు చచ్చిన వారితో లెక్క.
ప్రతి జాతి రాజ్యం సాధారణంగా పుట్టుక తో పౌరసత్వం ఇస్తుంది. దానితో పాటుగా వలసదారులకు, శరణార్ధులకు పౌరసత్వం ప్రసాదించటానికి ప్రత్యేక నిబంధనలు పెట్టుకుంటుంది, రక్షణ పరమయిన, ఆర్ధికపరమయిన వెసులుబాటు బట్టి. అయితే, ఆయా ఇబ్బందుల పేరుతో ఎప్పుడయితే ప్రభుత్వాలు దేశ ప్రజల పౌరసత్వాన్ని పరీక్షించి, దాని భూమికపై వారిని వర్గీకరించి, పౌరులు కానివాళ్ళ హక్కులన్నీ తీసేసుకునే చట్టాలు చేస్తాయో అప్పుడు ప్రమాద ఘంటికలు మోగినట్లు భావించాలని, 20 వ శతాబ్దపు చరిత్ర స్పష్టపరుస్తోంది. జెర్మనీ లో హిట్లర్ యూదులకి, రాజకీయ ప్రత్యర్థులని ‘దేశ ద్రోహులని’ ‘జాతి విద్రోహులని’ పేరుతో పౌరసత్వం ఊడగొట్టి చేసిన ఊచకోత దీని నేపధ్యం. ఆ సందర్భంలో ఉద్భవించిన అంతర్జాతీయ జాతి రాజ్య సమూహం, ఏ జాతి రాజ్యమయినా పౌరసత్వాన్ని వర్గ, జెండర్, కుల, మత , జాతి, రాజకీయ అభిప్రాయం పరంగా ఇవ్వాలని పూనుకోవటాన్ని తీవ్రంగా గర్హించదగిన మానవ హక్కుల ఉల్లంఘనగా నిర్వచించింది.
స్వతంత్రమొచ్చిన 7 దశాబ్దాల తరువాత ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వం కొత్తగా పౌరసత్వ చట్టాల సవరణలు తెచ్చి ముస్లింలకు వేరే దేశాలు వున్నాయి కాబట్టి ముస్లిమేతర శరణార్ధులకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని చెప్పటం, అంతే కాక, 130 కోట్ల ప్రజలందరి పౌరసత్వాన్ని సాక్ష్యాల ఆధారంగా పరీక్షించి అసలుసిసలయిన భారతీయ పౌరుల్ని గుర్తిస్తామని, సరయిన పత్రాలు లేని వారిని అనుమాస్పద పౌరులుగా పరిగణించి, వారి ప్రాధమిక మానవ హక్కులు - ఓటు హక్కు, ఆస్తి హక్కు మరియు ఇతర అన్ని హక్కులని పీకేసి, వారిని చట్టపరిధి బయట వుండే ప్రత్యేక క్యాంపుల్లో పెడతామని, వారిని ఇతర దేశాలనుండి దొంగతనంగా వచ్చిన చొరబాటుదారులుగా పరిగణిస్తామని, వీలయితే ఆయా దేశాలకి పంపించేస్తామని, లేకుంటే సముద్రంలో పడేస్తామని చెప్పటం దేశమంతా భయాందోళనలు కలిగించి నిరసనలకు తెర తియ్యటం ఆశ్చర్య మేమీ లేదు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, ఈ చట్ట సవరణ జరిగి దశాబ్ద కాలం పైగానే గడిచింది. 2003 లోనే వాజపేయి ప్రభుత్వం పౌరసత్వ చట్టం(1955) లో సవరణలు తెచ్చి ప్రవాస భారతీయుల్ని, భారత సంతతి ప్రజలని గుర్తించి, కొన్నిహక్కులు కల్పించటమే కాకుండా, ప్రభుత్వం దేశంలో వుండే అసలయిన పౌరులతో జాతీయ పౌరసత్వ జాబితాని తయారు చెయ్యాలని, దాని కోసం ప్రత్యేకంగా ఒక జాతీయ జనాభా పట్టిక తయారుచేయాలని, దీనికి వివరాలు ఇవ్వకపోతే దాని నేరంగా పరిగణించాలని నిబంధనలు ప్రవేశ పెట్టింది. ఈ చట్టం క్రింద తహసీల్దార్ స్థాయి ఉద్యోగులు ఎవరినయినా అనుమానాస్పద పౌరులుగా పరిగణించే వెసులుబాటు వుంది. కానీ ఏ భూమికపై అనుమానించాలో నిర్దేశకాలు లేవు. అలాగే, సంబంధం లేని ఎవరయినా సరే ఇతరుల పౌరసత్వంపై అనుమానం వ్యక్తం చేసే వెసులుబాటు వుంది.
అనాలోచితం గానో, స్వలాభం కోసమో కాంగ్రెసు ప్రభుత్వం 2010 లో ఈ చట్టాన్ని అమలు లోనికి తెచ్చి మొదటి సారి జాతీయ జనాభా పట్టికను తయారు చేసింది. 2015 లో ఆ పట్టికని బిజెపి వచ్చిన తరువాత అప్డేట్ చేశారు. మన తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన సకల జనుల సర్వే అదే. కానీ దాని తరువాత - జాతీయ పౌరసత్వ జాబితాని తయారుచేయాలనే అడుగు - కాంగ్రెసు వెయ్యలేదు. బిజెపి కూడా మొదటి ఐదేళ్ళలో పెద్దగా చప్పుడు చెయ్యలేదు. కానీ, 2019 లో తిరిగి ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీ తో గెలిచిన వెంటనే, ఆ అడుగు ముందుకేసి, జనాభా పట్టికతో ఆగకుండా, జాతీయ పౌరసత్వ జాబితా తయారుచేస్తామని గృహ మంత్రి, ప్రధాన మంత్రి పార్లమెంటు లోనూ, బయటా పదే పదే ప్రకటనలు చేశారు. దీని కోసమే 2019లో మళ్ళా జాతీయ జనాభా పట్టికని మళ్ళా అప్డేట్ చేస్తున్నామని ప్రకటించి, దాని కోసం ఒక 4000 కోట్లు కూడా కేటాయించేశారు.
ఈ జాతీయ జనాభా పట్టికకూ ప్రతి పదేళ్లకూ జరిగే జనాభా లెఖ్ఖలతో సంబంధం లేదు. అవి వేరుగా జరుగుతాయి. జనాభా లెఖ్ఖలకి స్వచ్చందంగా వివరాలు ఇవ్వొచ్చు. కానీ జనాభా పట్టిక కి అందరూ వివరాలు ఇవ్వటం తప్పనిసరి. అంతే కాక, దీని ప్రధాన ఉద్దేశం జాతీయ పౌరసత్వ జాబితాకు మూల వనరుని, భూమికని ఏర్పర్చటం. అంటే, అనుమానాస్పద పౌరుల్ని గుర్తించి, వేరు చేసి, వారి హక్కులు తీసెయ్యటం.
అస్సాంలో అనుభవం
దీనికి ప్రధాన స్ఫూర్తి అస్సాంలో 1980 లలో వలసదారులకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం. అప్పటి తూర్పు పాకిస్తాన్, తర్వాత బాంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్ధుల వల్ల అస్సామీయుల భాష, సంస్కృతి దెబ్బ తింటున్నాయి కాబట్టి, 1971 తరువాత వచ్చిన వారందరినీ ఏరేసి తిరిగి బాంగ్లాదేశ్ పంపించటం గానీ, దేశంలో వేరే చోటికి పంపించాలని ఈ ఉద్యమం కోరింది. ఉద్రిక్తత, హింస తో కూడిన ఉద్యమాన్ని శాంతింప చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం అస్సాంలో జాతీయ పౌరుల జాబితా జాబితా చెయ్యటానికి 1985 లో అస్సాం ఒప్పదం క్రింద ఒప్పుకుంది. దీని పర్యవసానాలు అర్ధమయ్యో ఏమో కానీ కాంగ్రెసు ప్రభుత్వం దాన్ని అమలు చెయ్యకుండా పక్కన పెడితే, ఆలోచించకుండా దూసుకుపోయే బిజెపి 2014 నుండి దాన్ని అమలుచేసి జాబితా తయారీ ఎలా జరగబోతోందో భారత ప్రజలందరికీ తెలియచేసింది.
ఐదు సంవత్సరాల పాటు, 50,000 మంది ఉద్యోగులు (వారిలో కాంట్రాక్టు ఉద్యోగులు అనేకం) రూ. 1500 కోట్ల ప్రభుత్వ ఖర్చు, రూ.7500 కోట్ల ప్రజల ధనం ఖర్చు చేసింతరవాత, 4 కోట్ల ప్రజల్లో 40 లక్షల మందిని పౌరులు కాదని ఈ ప్రక్రియలో తేల్చారు. దాని కోసం నియమితులయిన కాంట్రాక్టు ఉద్యోగులకీ ఇంత మంది అనుమానాస్పద పౌరులని గుర్తించాలనే లక్ష్యాలు ఇచ్చారు. ఆ నాలుగు కోట్ల మంది ప్రజలందరూ లైన్లలో నిల్చుని తమ తమ పత్రాలని సమర్పించుకున్నారు. పేద వాళ్ళు పత్రాలకు డబ్బులిచ్చుకున్నారు. ఈ క్రమంలో అస్సాంలో పాత పత్రాలు తయారుచేసే వాళ్ళ, చేతి వ్రాతగాళ్ల కుటీర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఏతావాతా స్థానిక క్లర్కులు కూడా వీలైనంత దండు కున్నారని పేపర్లు రాశాయి.
ముసాయిదా జాబితా లో లేని 40 లక్షల మందికి ఇంకో మూడు నెలల్లో తమ పౌరసత్వ నిరూపణ అప్పీల్ వేసుకోవటానికి 200 ట్రిబ్యునల్స్ ని అప్పాయింట్ చేసి, సహాయార్థం చిన్న స్థాయి ఉద్యోగులను, అప్పుడే న్యాయ విద్య పూర్తి చేసిన కొత్త లాయర్లనూ నియమించారు. వందల కిలోమీటర్ల దూరంలో వున్న ట్రిబ్యునళ్లకి నిరుపేదలు ఉన్నవన్నీ అమ్ముకుని తిరిగారు. కొన్ని సంస్థలు, వ్యక్తులూ పని గట్టుకుని కొంత మంది పౌరులు కాదని ఫిర్యాదులు చేశారు. న్యాయం, చట్టం వచ్చి రాని ట్రిబ్యునళ్లు తమకర్ధమయిన రీతిలో తీర్పులిచ్చి 19 లక్షల మందిని పౌరులు కాదని తేల్చాయి. అలా అస్సాంలో జాతీయ పౌరసత్వ జాబితా తయారయింది. జాబితా ప్రకారం కొంత మంది భర్తలు పౌరులయినా భార్యలు కారు. కొడుకులు పౌరులు, తండ్రులు కారు. సైన్యంలో పెద్ద స్థాయి ఆఫీసర్లు కారు. అస్సాం మాజీ మహిళా ముఖ్యమంత్రి కూడా ఈ జాబితాలో చేరలేక పోయారు.
మరి వీళ్ళేం చెయ్యాలి? సుప్రీమ్ కోర్టుకెళ్లచ్చని చట్టం, ప్రభుత్వం నొక్కి చెబుతోంది. సుప్రీమ్ కోర్టు దాకా వెళ్లే వనరులు ఎంత మందికుంటాయనే ప్రశ్నకి సమాధానం లేదు. అంతే కాదు, ఈ లోపల ఇన్ని లక్షల మందిని ఏం చెయ్యాలి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర దానికీ సమాధానం లేదు. ముస్లిమేతరులకు పౌరసత్వ సవరణ చట్టం (2019) క్రింద బాంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులుగా పరిగణించి పౌరసత్వం ఇవ్వాలని, అందుకే తెచ్చామని అస్సాంలో పాలక పార్టీ నాయకులు ప్రకటించేశారు. కానీ ‘మా వాళ్ళు అసలు భారత దేశంలో లేరని, ఉంటే, గింటే 1000 మంది మాత్రమే వున్నారని’ బాంగ్లాదేశ్ ప్రకటించేసింది. ఈ గోలంతా భారత దేశం అంతర్గత విషయమని ఈ పౌరసత్వ జాబితాలో లేని వాళ్ళు బాంగ్లాదేశ్ పౌరులని నిరూపిస్తే వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పింది.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం వీళ్ళని విదేశీయుల చట్టం క్రింద విదేశీయులుగా ప్రకటించి కొంత మందిని క్యాంపులకు తరలించింది. క్యాంపులో ఉంచిన వారిలో అత్యధికులు పేద వారే. అన్ని తెగలు, సామాజిక వర్గాలు, మతాలకి చెందిన వారున్నారు. 15 లక్షల మంది హిందువులయితే, మిగిలిన వారు ముస్లింలు. కానీ, 19 లక్షల మందిని, వారి కేసులు తేలే వరకు, బంధించి పెట్టాలంటే, ఎన్ని జైళ్లు కావాలి? అస్సాంలో ఇప్పటికే కట్టిన బందిఖానాల్లో 3000 మంది మాత్రమే పడతారు. భారత దేశం మొత్తంలో వున్న జైళ్లలో 3 లక్షల మంది మాత్రమే పడతారు. మిగిలిన వారిని ఏమి చెయ్యబోతున్నారు? ఏ సమాధానం ఎవరి దగ్గరా లేదు.
ఇప్పుడు దేశం మంతటా ఎన్ ఆర్ సి?
ఇప్పుడు జాతీయ పౌరజాబితా భారత దేశం మొత్తమ్మీద తయారు చేసి అక్రమ వలసదారులని ఏరి పారేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచం లోనే నాలుగవ పెద్ద భద్రతా దళాలు వున్న దేశంలో పోలీసులు, సైన్యం, రక రకాల భద్రతా దళాలని దాటి సరిహద్దుల నుండి (శరణార్థులు కాకుండా) ఎంతమంది దేశంలో నలుమూలలకి వచ్చి వుంటారు? జనాభా లెఖ్ఖల ప్రకారం 1970 లలో 10 లక్షల మందిపైగా అక్రమ వలసదారులు వుండే వారు గానీ, వారి సంఖ్య 2011 లో ఐదు లక్షలకి పడిపోయింది. 130 కోట్లలో ఐదు లక్షల మంది ఎంత శాతం? వారిని కనుక్కోవటానికి వేల కోట్ల డబ్బు, లక్షల మంది ఉద్యోగుల శ్రమ, కోట్ల మంది సమయం, ఖర్చు అవసరమా అనే ప్రశ్న అందరికీ వస్తోంది. అంతే కాక, దేశ రక్షణ విషయంలో పెద్ద పెద్ద స్కామ్లులు చేసేది అక్రమ వలసదారులు కాదనేది అందరికీ తెలిసిన విషయమే కదా.
ముస్లిమేతరులు సురక్షితమేనా?
ఈ చట్టం అమలు చొరబాటు దారులను తప్ప వేరే వారిని బాధించదని మిగతావారు ఎవరైనా సహజంగా పౌరసత్వ పొందుతారని గృహ మంత్రి భరోసా ఇస్తున్నారు. కానీ గత ఐదేళ్ల అనుభవ రీత్యా, పౌరసత్వ చట్టంలో మొన్ననే తెచ్చిన సవరణ రీత్యా, పాలక పార్టీ వారి భీకరమైన ముస్లిం వ్యతిరేక ప్రసంగాల వల్ల ముస్లింలు ఈ భరోసాని నమ్మడానికి సిద్ధంగా లేరన్నది వాస్తవం. ఇక దళితులు, బహుజనులు, ఆదివాసీలు అందరు పౌరులుగా జాబితాలో చేరిపోతారని ముస్లిమేతరులు ఆందోళన పడ వద్దని పాలక పార్టీ నాయకులు సంకేతాలు ఇస్తున్నారు.
అంతర్గత భద్రతని అధ్యయనం చేసే వాళ్ళు ఎవరయినా ఇది పూర్తిగా తెలివి తప్పిన వాదన అని అర్ధంచేసుకుంటారు. 20 కోట్ల ముస్లింలలో డబ్బున్న కోటి మందిని పక్కన పెడితే, 19 కోట్ల ప్రజలని (దాదాపు యూరోప్ ఖండ జనాభా) అభద్రతకు, భయాందోళనకు గురి చేసి ఇబ్బంది, బాధ పెట్టటం భారత దేశ అంతర్గత భద్రతని, దేశంలో శాంతిని, బహిర్గత రక్షణని ఏ విధంగా పెంచబోతోంది? పైగా, 19 కోట్ల ముస్లింలని బాధ పెట్టటానికి మిగిలిన 110 కోట్ల భారత జనాభా తమని తాము ఇబ్బంది పెట్టుకోవటానికి తయారయి వున్నారని అనుకోవాలా? ముస్లిమేతరులు కూడా తమ వివరాలని పత్రాలతో సహా ప్రభుత్వానికి సమర్పించాలి కదా.
ఈ దేశంలో ఎంతమంది దళితులకు, ఆదివాసీలకు, ఇతర బహుజన కులాలకు తాము ఇక్కడి వారే అని నిరూపించుకోవటానికి పత్రాలున్నాయి? వారిలో ఎంత మంది దగ్గర పుట్టిన సర్టిఫికెట్లు వున్నాయి? తమవి లేకపోతె తల్లి తండ్రులవి ఇవ్వాలి అని నిర్దేశించారు. అది ఇంకా హాస్యాస్పదం. ఐదారు కోట్లు మహా అయితే పది కోట్ల మంది దగ్గర తప్ప, మిగిలిన దేశ జనాభా దగ్గర తమని తాము ఇక్కడ పుట్టామని నిరూపించుకునే సర్టిఫికెట్లు తక్కువ. వున్న వారికి కూడా మన ప్రభుత్వాల సమర్ధత, వాటి ఉద్యోగుల పుణ్యమా అని తప్పులు తడకలతో ఉంటాయి. ఆధార్లో వుండే పేరుకి ఓటర్ కార్డులో వుండే పేరు స్పెల్లింగ్ వేరు వేరుగా ఉంటాయి. స్త్రీలకయితే పెళ్లప్పుడు పేరే మారిపోతుంది. ఇక ఆనాధలు, ట్రాన్సజేండర్ వ్యక్తులు, వరదల్లో, భూకంపాల్లో, వలసల్లో పత్రాలు కోల్పోయిన వాళ్ళు ఇలా అనేక మందికి సరయిన జన్మ పత్రాలుండే అవకాశమే లేదు.
పధకాల కోసం అన్నీ పత్రాలు చూపిస్తారు కదా, పౌరసత్వం కోసం ఎందుకు చూపించరు అని కొంత మంది మధ్య తరగతి మేధావులు అడుగుతూ ఉంటారు. వాళ్ళతోపాటు దేశంలో కొచ్చిన చొరబాటుదార్లని ఎరెయ్యకూడదా, అమెరికాలో అక్రమ వలసదార్లని ఏరేస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు చెయ్యకూడదు అని దబాయిస్తున్న వాళ్ళు కూడా ఒక సారి తమ పత్రాలని సరి చూసుకోవటమే కాకుండా, మన దేశ ప్రజల గురించి, వారి సామజిక, ఆర్ధిక పరిస్థితులు, మన ప్రభుత్వ వ్యవస్థ లోపభూయిష్టత నేపథ్యంలో ఈ పౌరసత్వ జాబితా గురించి ఆలోచిస్తే దానిలోని సమస్యలు, దాని పర్యవసానాలు త్వరగా అర్ధమవుతాయి. ఆధార్ కార్డు లో పేరు సరిదిద్దటానికి పేద కుటుంబాలు పది, పదిహేను రోజుల కూలీ పోగుట్టుకోవాల్సిన అసమర్థ వ్యవస్థ మనది. అసలు సర్టిఫికెట్లు తప్పుల్లేకుండా ఇచ్చే వ్యవస్థలను ఏర్పాటు చెయ్యలేని ప్రభుత్వాలకి ప్రజలనుండి నువ్వు నువ్వేనని, నువ్విక్కడే పుట్టావు అని పత్రాల సాక్ష్యాలు తీసుకురా అని అడగటానికి ఏ హక్కు ఉంటుందో అర్ధం కావట్లేదు.
అమానవీయం, అనర్ధ దాయకం
పౌరసత్వ జాబితా, అమలు పరంగానే కాక, భావనా పరంగానే లోపభూయిష్టమయింది, ప్రమాద కరమైంది. అనంతమయిన వనరులున్న ప్రభుత్వం వనరులు లేని అత్యధిక జనాభా ప్రజలని తాననుకుంటున్న పద్ధతుల్లో తమని తాము ఈ దేశ పౌరులుగా నిరూపించుకోమని, లేకుంటే అక్రమ వలసదారుగా పరిగణించి, బందిఖానాల్లో పెడతామనటం ఏ రకంగా న్యాయమైంది? ఆధార్, పాన్ కార్డు లకి పౌరసత్వ జాబితాకు తేడా అదే. ప్రాతిపదిక స్పష్టం చెయ్యకుండా అనుమానాస్పద పౌరులని గుర్తించే అధికారం క్రింది స్థాయి ఉద్యోగుల కివ్వటం, దాని ఆధారంగా చేసే లోపభూయిష్టమైన అనుమానాస్పద పౌరులని శిక్షిస్తామనటం అన్యాయం కాదూ?
పాలక పార్టీ ప్రతినిధులు రోజుకొక పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఒక పక్క హుంకరిస్తూ, ఇంకొక పక్క హెచ్చరిస్తూ, మరో పక్క పుట్టుక గురించిన ప్రశ్నలకి జవాబు ఇవ్వక్కర్లేదని ప్రకటనలు జారీ చేస్తున్నారు. 30 శాతం నిరక్షరాస్యులున్న దేశంలో ప్రభుత్వ అధికారులు జనాభా పట్టిక కోసం ఇళ్ళకొస్తే వివరాలు ఇవ్వకుండా సాధారణ ప్రజలు ఉండలేరు. మనం అడగని చట్టాన్ని తెచ్చి, మనమిప్పటికే ప్రభుత్వాలకి సమర్పించుకున్న వివరాలని పక్కన పెట్టి, మన సోషల్ మీడియా వ్రాతలపై పూర్తి అధికారాలు సంపాదించిన ప్రభుత్వాలకి ఇంకా ఏం కావాలి? చట్టాలు న్యాయ బద్ధంగా, తర్క బద్ధంగా ఉండాల్సిన అవసరం లేదా? చట్టాలు అన్యాయంగా వున్నప్పుడు, అనుభవించే ప్రజలు ఆయా చట్టాలని వెనక్కి తీసుకోమని అడగటం తప్పేలా అవుతుంది?
అనుమానాస్పద పౌరుల్ని లేదా పౌరసత్వ జాబితా నుండి తొలగించిన వారిని క్యాంపుల్లో పెట్టె ప్రక్రియ మౌలికంగా అమానవీయమయిన, అత్యంత దుర్మార్గమయిన ప్రక్రియ. రాజ్యాంగ పరిధిలోనుండి పౌరులని బయటికి పంపించటమంటే ఏ హక్కులూ, ఉనికి, రక్షణ లేని జీవచ్ఛవాల్లాగా వారిని మార్చటం. క్యాంపుల్లో వారింక ఏ దేశానికి చెందిన వాళ్ళు కాదు. ఏ రాజ్యానికి వారి గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఉండదు. జెర్మనీ లో నాజీలు యూదులకి ఇలాగే పౌరసత్వం పీకేసి క్యాంపుల్లో పెట్టి తిండి పెట్టకుండా, ప్రయోగాలకి, హింసకి గురి చేసి, అత్యంత దుర్మార్గంగా చంపారు.మియాంనార్ కూడా రోహింగ్యా ప్రజలపై దాడులు చేసి దేశంనుండి వెళ్ళ గొట్టే ముందు వారి పౌరసత్వాన్ని పీకేసింది.
పౌరసత్వ జాబితా తయారు చేసే ప్రక్రియ చిన్న చిన్న సవరణలతో సరిదిద్దగలిగే చట్టం కాదు. ఏ సామాజిక భేదాలతో సంబంధం లేకుండా అందరు ప్రజలకీ పౌరులుగా సమాన హక్కులు కల్పిస్తూ జాతీయోద్యమ ఫలితంగా వచ్చిన విప్లవాత్మక రాజ్యాంగ మూలాలనే కదిలించే చట్టం. ప్రజాస్వామ్య మంటే ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీగా ఉండటం బదులు ప్రజలనే ఎప్ప్పుడూ ప్రభుత్వాలకి జవాబుదారీ చేసే ప్రయత్నం. మౌలికంగా ప్రజాస్వామ్యానికే విరుద్ధం. విజ్ఞత ఉన్న ప్రభుత్వం అయితే ఈ చట్టాన్ని ఉపసహరించుకోవాలి. ఇది అనవసరమే కాదు దేశానికి అనర్ధ దాయకం కూడా.
Published in Andhra Jyothy as Pedalapai Paurasatva Yuddham on 27th
January 2020
Comments
Post a Comment