CAA and Indian Citizenship


ప్రశ్నార్ధకంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం 2019 

ప్రజాస్వామ్యంలో ప్రతి చట్టానికి సాధికారత అవసరం. చట్టాలని ప్రతిపాదించిన వారు దాని కోసం ప్రజాభిప్రాయాన్నికూడగట్టటమే కాక, దానిపై వచ్చే విమర్శలకి సరయిన సమాధానాలు ఇవ్వగలగాలి.నిరసన తలెత్తినపుడు, వారి ఆందోళనని అర్ధం చేసుకోవాలి. ఆ చట్టం భారత పౌరసత్వాన్ని గురించి అయినప్పుడు ఆయా చట్టాలకు సాధికారత కూర్చాల్సిన ప్రజాస్వామిక బాధ్యత ప్రభుత్వాలకి మరింత అవసరం. కానీ నెల క్రితం ప్రభుత్వం భారత పౌరసత్వ చట్టంలో సవరణ జరిపే ముందు, తరువాత కూడా  చేసిన, చేస్తున్న ప్రకటనలు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కనపడట్లేదు. ఎవరి కోసమయితే సవరణలు చేశామంటున్నారో వారితో సహా దేశం మొత్తం మీద ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. గృహ మంత్రిత్వ శాఖ చట్ట సవరణల గురించి ప్రజల స్పష్టత కోసం విడుదల చేసిన ‘ప్రశ్నలు- జవాబులు’ కూడా ప్రజల తెలివిని పరీక్షించి మరిన్ని ప్రశ్నలకి దారితీసేలా వున్నాయి తప్ప భయాందోళనల్ని తగ్గించేవిలా లేవు. ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్యలో పార్లమెంటులో జరిగిన చట్ట సవరణ ప్రజల్లో సాధికారత కూడగొట్టుకునే అవకాశం కోల్పోయి ప్రశ్నార్ధకం అవుతోంది. 

అసలు జరిగిన పౌరసత్వ సవరణ చట్ట సవరణ సారాంశం ఇది - పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్ లలో మత పరమయిన హింస ఎదుర్కునే అల్పసంఖ్యాక సమూహాలకి -  హిందువులు, సిక్ఖులు, బౌద్ధులు, క్రిస్టియన్లు - చెందిన వ్యక్తులు 2014 ముందే భారత దేశంలోకి ఏ పత్రాలు లేకుండా ప్రవేశించినట్లయితే (చొరబడినట్లయితే లేదా వీసా గడువు మీరి ఉండిపోతే) వారికి భారత ప్రభుత్వం చొరవ తీసుకుని, వారు భారతీయ పౌరసత్వ నిబంధనల క్రింద మామూలుగా గడపాల్సిన 11 - 14 సంవత్సరాలు దేశంలో గడపకపోయినా - త్వరిత గతిన - అంటే 6 సంవత్సరాలున్నాసరే - పౌరులుగా నమోదు చేయిస్తుంది. 

2003 లో వాజపేయి ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్నిసవరణ ద్వారా వివిధ రకాల పౌరులని వర్గీకరించి, భారత దేశ పౌరసత్వాన్ని రాష్ట్రాల్లో నివాసాన్ని ప్రాతిపదిక చేస్తూ ఇక్కడి ‘విదేశీయులని’ జాతీయ పౌర చట్టం ద్వారా వెతికి తియ్యాలనే ని సవరణ తెచ్చే వరకు (దీని గురించి కూడా లోతుగా చర్చించుకోవాలి) ప్రధానంగా భారతీయ పౌరసత్వాన్నిపొందేందుకు వున్నవి రెండు మార్గాలే: మొదటిది ఈ వంశానుగతంగా అంటే పుట్టుక ద్వారా వచ్చేది. ఒక వేళ తల్లి లేదా తండ్రికి విదేశీ పౌరసత్వం వున్నప్పుడు వారు దరఖాస్తు పెట్టుకోవాలి. పౌరసత్వం పొందటానికి రెండో మార్గం - భారత దేశంలో 11 నుండి 14 సంవత్సరాలు  వివిధ వీసాలపై నివసించిన తరువాత, పౌరురాలిగా ఉంటానని దరఖాస్తు పెట్టుకోవటం. దానిని ప్రభుత్వం దాని కేసు అర్హత బట్టి పరిగణిస్తుంది. వీసా వీగిపోయినా దేశంలో ఉండిపోయే వారు చట్ట ప్రకారం ‘అక్రమ వలసదారు’ గా పరిగణింపబడతారు. వారిపై ఎప్పటికప్పుడు దేశ పోలీసుల నిఘా ఉంటుంది. అనేక దేశాలకి చెందిన చాలామందిని వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు, పరిమితి దాటి దేశంలో ఉండిపోయినందుకు జైళ్లలో పెట్టిన సందర్భాలు రోజు దిన పత్రికల్లోవస్తూనే ఉంటాయి. ఈ చట్ట సవరణ ద్వారా ఈ మూడు దేశాలనుండి మతం కారణంగా బాధలు పడి వచ్చిన వారిని ‘అక్రమ వలసదారులు’ గా పరిగణించకుండా వారికి పౌరసత్వాన్ని త్వరగా ఇవ్వబోతున్నారు. 

అయితే విషయాన్ని కొంత విస్తృతార్ధంలో అంటే, చారిత్రక, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల భారతదేశంలో సరయిన అనుమతి పత్రాలు లేకుండా గడిపే వాళ్ళకి సంబంధించిందిగా చూడటం అవసరం. అటువంటి వాళ్ళు ప్రధానంగా రెండు రకాలు. మొదటి రకంలో దేశ సరిహద్దుల్లో పొట్ట పోసుకోవటం కోసం దేశాల మధ్య తిరుగుతుండే అనేక సంచార జాతులు లేదా తెగలు -  కాశ్మీర్కి చెందిన బఖర్వాల్స్, తూర్పులో ఛక్మా తెగలకు చెందిన వాళ్ళు ఒక భాగమయితే ఇతర చారిత్రక కారణాల వల్ల దేశంతో గాఢమైన సంబంధం ఏర్పర్చుకున్న నేపాలీ సంతతి వాళ్ళు మరొకరు. భారత ఉపఖండం దైనందిన జీవితంలో వలస పాలనా కాలం నుండి అంతర్గత భాగం అయిన ఈ ప్రజ 1950 లోని భారత నేపాల్ ఒప్పందం ప్రకారం అన్నిపౌరసత్వ హక్కులు పొందారు కానీ పూర్తి పౌరులుగా గుర్తింపబడలేదు. ఇలా హక్కులు పొందిన ప్రజానీకం 25 లక్షలకి పైగా భారత దేశంలో ఉంటారని అంచనా. రెండు దేశాల సరిహద్దు సిబ్బందులు పెట్టె ఇబ్బందులని తట్టుకుంటూ గడిపే ప్రజలు వీళ్ళు. వివిధ మతాలకు, కులాలకు చెందిన వీరిని భారత ప్రభుత్వం ఎత్తుగడలకు ఉపయోగ పడతారనో, చవకగా శ్రమ అందిస్తారనో, చూసీ చూడనట్లు వదిలేస్తూ వచ్చింది. శత్రువులని, దేశ  ద్రోహులని, చొరబాటు దార్లని ముద్రలు వెయ్యలేదు. ఈశాన్య రాష్ట్రంలో 

సరయిన పత్రాలు లేకుండా వుండే రెండో గ్రూపు - సంక్షోభాల వల్ల కానీ దురదృష్టకర పరిస్థితుల్లో ఏ అనుమతులు (వీసా పత్రాలు) లేకుండా భారత దేశంలోకి పొరుగు దేశాల నుండి పారిపోయి వచ్చిన వారు. వారిని అంతర్జాతీయ చట్ట పరిభాషలో  శరణార్ధులు అంటారు. స్వంత దేశంలో రాజకీయ అభిప్రాయాలు/కారణాలు, ఉద్యమాల కారణంగానో, మత పరమయిన హింస వల్లో, లింగ పరమయిన హింస వల్లో వేరే దేశాల్లో ఆశ్రయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడిన వాళ్ళు. రాజకీయంగా చైనా వేధించిన టిబెటన్ బుద్ధిస్టులకి, భాషా కారణంతో తూర్పు పాకిస్తాన్ వేధించిన బెంగాలీలకి, స్వయం ప్రతిపత్తి కోసం  అడిగారని శ్రీలంక వేధించిన తమిళులకి - భారత దేశం శరణు కల్పించింది. వీరిలో ఈ మధ్యే వచ్చిన వాళ్ళు బుద్ధిస్టు రాజ్య మిలిటరీ ఊచకోత తట్టుకోలేక మియాంనార్ నుండి పారిపోయిన రోహింగ్యా ప్రజలు. వీరందరూ ఐక్య రాజ్య సమితి ఊచకోతకు లేదా రాజకీయ హింసకి గురయిన వారని గుర్తించిన వారే. వీరిలో టిబెటన్ బుద్ధిస్టులు, మియాంనర్ ముస్లింలు, శ్రీలంక తమిళులు పౌరసత్వం అడిగిన సందర్భాలు తక్కువ. పరిస్థితులు బాగు పడితే వెళ్ళిపోదామని చూస్తున్నారు. మన దేశానికి శరణార్థ విధానం లేకపోవటం వల్ల, ఏ అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకం చెయ్యక పోవటం వల్ల, తిరిగి పంపించే విధానం ఏర్పర్చుకోక పోవటం వల్ల ఈ శరణార్ధుల పట్ల అనేక అపోహలు, పుకార్లు ఏర్పడ టానికి అవకాశం  ఏర్పడుతోంది. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ప్రతి దేశం పాటించాల్సిన నాన్ - రెఫాల్మెంట్ - అంటే ఆపదలో వున్న శరణార్ధులని తిరిగి వెంటనే వెనక్కి పంపకూడదు - అన్నవిలువని ఎప్పుడూ మన దేశం పాటిస్తూ వచ్చింది. ఉపఖండంలో పెద్ద దేశం అవటం వల్ల , వలస వాదులు పెట్టిన చిచ్చు ఉపఖండంలో రగులుతూ ఉండటం వల్ల , ఉపఖండంలో పెద్ద మనిషి గా చెలామణి అవ్వాలనే ఆశ వల్ల అనేకమంది శరణార్ధులకు దశాబ్దాల కాలం నీడ కల్పించింది.

ఇప్పుడు జరిగిన పౌరసత్వ సవరణ వల్ల ఇటువంటి రెండు రకాల ప్రజానీకంలో - కొన్ని దేశాలనుండి వచ్చిన కొన్ని మత సమూహాల ప్రజలలో - ఎవరయినా భారతీయ పౌరసత్వం కావాలనుకుంటే, దాని కోసం దరఖాస్తు చేసుకుంటే, కొంత త్వరగా పొందగలిగే వెసులుబాటు వచ్చింది. వారి ఇబ్బందులు దీని వల్ల కొంత మేరకు తగ్గితే ఇది తప్పకుండా ఆహ్వానించ దగ్గ పరిణామం, హర్షణీయం కూడా. శరణార్థ విధానం లేని మన దేశంలో పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న ప్రజల్లో కొంత మందికయినా కొంత వెసులుబాటు కల్పించే పౌరసత్వ చట్ట సవరణ రావటం మంచిదే. 

కానీ దీని వల్ల పొరుగుదేశాల్లో  వేధింపులు, హింసకి గురయిన, గురవుతున్న అల్ప సంఖ్యాక సమూహాల ఉద్ధరణ జరిగిపోతోందని భావించటం అతిశయోక్తి  మాత్రమే. చట్టం చెయ్యటం వేరు, దాని అమలు వేరు. ఈ సవరణ వల్ల 2014 ముందు వచ్చిన ప్రజలకే వెసులుబాటు వుంది కానీ, తరువాత వచ్చిన వారికి లేదు. అంటే, ప్రస్తుతం - 2020 లో - మతపరమయిన వేధింపులు ఎదుర్కుంటున్న ఈ మూడు దేశాల అల్ప సంఖ్యాక మత సమూహాల వ్యక్తులకి ఈ చట్ట సవరణ ఏ వెసులుబాటు కల్పించదు. ఇంకా విచిత్రమేమిటంటే 1971 భారత- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో తూర్పు పాకిస్తాన్ లోని హిందువులెదుర్కొన్న మత పరమయిన హింస గురించి రాసినందుకు, బాంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి, అక్కడి మత ఛాందస వాదులనుండి తీవ్ర బెదిరింపులని ఎదుర్కొని మన దేశంలో అత్యంత ధీరోదాతురాలని పదేళ్ల క్రితం అందరు భుజాలకెత్తుకున్న తస్లీమా నస్రీన్ వంటి వారికి ఈ సవరణ ఏ వెసులుబాటు కల్పించదు. అందువల్లే ఈ చట్ట సవరణ కున్న తీవ్ర పరిమితులు చర్చకి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది. 

మొదటిగా పరిగణలోనికి తీసుకోవాల్సింది ఈ చట్ట సవరణ తీసుకున్నవర్గీకరణ సరైందేనా అన్నది. దాని కోసం మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఆయా పొరుగు దేశాలలో అల్ప సంఖ్యాక సమూహాలు ఎదుర్కుంటున్న వేధింపులు, హింసలు కేవలం మత పరమయిన వేనా?  ఆ మత పరమయిన వేధింపులు హింస కేవలం ఈ మూడు పొరుగు దేశాల్లోనే (ఆఫ్గనిస్తాన్ మనకి అసలు పొరుగు దేశమే కాదు కూడా) జరుగుతున్నాయా? ఈ దేశాల్లో మెజారిటీ మతస్థులు వేరే ఏ రకమయిన రాజకీయ, మత పరమయిన వేధింపులు ఎదుర్కోవట్లేదా? అన్నవి. ఈ మూడింటికీ సమాధానం లేదు, కాదు అనే వస్తుంది. చైనాలో అల్పసంఖ్యాకులయిన టిబెటన్లు గానీ, శ్రీలంకలో తమిళులు ఎదుర్కున్న హింస గానీ రాజకీయ పరమయింది, మత పరమయింది కాదు. రెండవ ప్రశ్నకి సమాధానము - మన పొరుగున వున్న దేశాల్లో పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లతో పోలిస్తే మియాంనార్, చైనా లలో మత పరమయిన హింస ఏమీ తక్కువగా లేదు. కానీ ఈ రెండు దేశాల్లోనూ మత పరమయిన హింస ఎదుర్కుంటున్నవారు ముస్లింలు. పాకిస్తాన్ లో హిందువుల కంటే మరింత హింస ని ఎదుర్కొంటున్న అల్ప సంఖ్యాకులయిన అహ్మదీయాలనే ముస్లిం వర్గం కూడా ఈ కోవలోకే చెందుతుంది. మూడవది, అన్ని దేశాల్లో మెజారిటీ మతానికి చెందినప్పటికీ రాజకీయ అభిప్రాయాల వల్ల మత పరమయిన వేధింపులకు గురయ్యే వ్యక్తులు కోకొల్లలు.  తస్లీమా నస్రీన్ ఆ కోవలోకి చెందిన వ్యక్తే. ఈ మధ్యనే దైవ దూషణ చేసాడనే నెపం పై మరణ శిక్ష విధించబడిన పాకిస్తానీ ప్రొఫెసర్ స్సర్ జునైద్ హఫీజ్ ఆ కోవలోకి చెందిన వారే. ఇన్ని రకాల సంక్లిష్ఠతో కూడుకున్న పొరుగు దేశాల అల్ప సంఖ్యాక వర్గాల వాస్తవాల్లోంచి ఏ ప్రత్యేక వాస్తవాలపై ఆధార పడి ఈ చట్ట సవరణ లో ఈ మూడు దేశాలలోని కొన్ని రకాల అల్ప సంఖ్యాక వర్గాలకి వెసులుబాటు కల్పించారో నన్న సందేహాలు ఉత్పన్నం రావటంలో ఆశ్చర్యమేమీ లేదు. 

రెండవ విషయం ఈ చట్ట సవరణ రాజ్యాంగం లోని  సమానత్వ సూత్రాలతో, లౌకిక సుఫుర్తితో ఏకీభవిస్తుందా అని. ఇక్కడ రెండు రకాలయిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాలి. ఒకటి బయటి దేశాల్లో మైనారిటీ సమూహాలని మన దేశం ఏ ప్రతిపాదికపైన గుర్తించాలి? రెండు, పత్రాలు లేని వివిధ రకాల ప్రజల్లో, కొన్ని దేశాలకి చెందిన, కొన్ని రకాల సమూహాలకి వెసులుబాటు కల్పించటం లౌకిక, సమానత్వ సూత్రాలలో ఇముడుతుందా? మొదటి ప్రశ్నకి సమాధానం - మైనారిటీ సమూహాలని మన దేశ రాజ్యాంగం ప్రకారమే గుర్తించగలం. రాజ్యాంగం ప్రకారం దేశంలో అనేక రకాల అల్ప సంఖ్యాక వర్గాలున్నాయి - భాష పరమయినవి, సంఖ్యా పరమయినవి, మత పరమయినవి. వాటన్నింటికీ తమ అస్తిత్వాలని కాపాడుకోవటానికి హక్కులు, వెసులుబాట్లు వున్నాయి. ఇవి కాకుండా ఇతర అల్ప సంఖ్యాకులయిన ఆదివాసీ, దళిత సమూహాలకు ప్రత్యేక రక్షణలు రాజ్యాంగంలో వున్నాయి. పౌరసత్వ చట్ట సవరణ వీటన్నింటిలో కేవలం మత పరమయిన మైనారిటీలనే గుర్తింస్తోంది, మిగిలిన అల్పసంఖ్యాక సమూహాలని గుర్తించట్లేదు. అంతే కాక, మన దేశంలో భాష పరమయిన, మత పరమయిన మైనారిటీగా గుర్తించబడి పొరుగు దేశాలయిన చైనా, మియాన్మార్ లలో మైనారిటీలుగా ఉంటూ ఊచకోతకు, హింసకి గురవుతున్న ముస్లిం సమూహాలని పూర్తిగా వదిలేసింది. రెండవది, మన దేశంలోకి వివిధ బాధలు, కారణాలతో వివిధ దేశాలనుండి వివిధ మత సమూహాల ప్రజ వచ్చి చేరిన తరువాత, రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకరణ ప్రకారం వారందరికీ సమాన రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత భారత రాజ్యానికుంది. అంటే వారే దేశాల నుండి వచ్చినా ఒకే రకంగా చూడాలి, ఒకే వెసులుబాట్లు కల్పించాలి. కానీ ఇలా చక్మాలని, టిబెటన్లని, గూర్ఖాలని, తమిళులని, రోహింగ్యాల సంగతి వదిలేసి కేవలం మూడు దేశాల్ల నుండి వచ్చిన కొన్ని మత సమూహాలకు రక్షణ కల్పించటం  మన దేశ చట్టాల ప్రకారం వివక్షని పాటించటమే అవుతుంది. శరణార్ధుల్లో కావచ్చు, పత్రాలు లేని ప్రజల్లో కావచ్చు ఎంచుకుని వెసులుబాటు కల్పించటం మన రాజ్యాంగం లోని లౌకికత్వ, సమానత్వ స్ఫూర్తికి భంగమే కదా? 

ఇలా చట్ట సవరణ లో వున్న వర్గీకరణలు, దాని ప్రాతిపదికలే అతార్కికంగా, అసంబద్ధంగా వున్నప్పుడు చట్ట సవరణకి ఏ ప్రశ్నలు లేని విస్తృత ప్రజా ఆమోదం రావాలని ఆశించటం కష్టం. పైగా పౌరసత్వం అన్నది కేవలం పత్రాలపై ఆధార పడిన సాంకేతిక విషయం కాదని అందరికీ తెలుసు. ఎవరు ఈ దేశానికి చెందుతారు అన్నది చారిత్రక, రాజకీయ నేపధ్యంపై ఆధారపడుతుంది. భారత దేశం చైనాతో పాకిస్తాన్తో యుద్ధాలు చేస్తున్నప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పై చెయ్యి కావాలనుకున్నప్పుడు వేధింపులకు గురవుతున్నఅక్కడి అల్పసంఖ్యాక వర్గాలకి ద్వారాల్నితెరిచిపెట్టింది. సదుపాయాలూ కల్పించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు బావుల కోసం ఇస్లా మతాన్ని భూతంగా చూపించి అకారణంగా ద్వేషించటం, చమురు బావులున్నముస్లిం దేశాల్నిఆక్రమించుకోవడం ఒక ఎత్తుగడగా మారిన సందర్భంలో, అమెరికాలో, ఐరోపా దేశాల్లో లాగే, మన దేశంలో కూడా అకారణ ముస్లిం ద్వేషం (దాని కవల దళిత ద్వేషం లానే) ప్రధాన స్రవంతి సంస్కృతిలో  భాగంగా మారింది. వారినీ, వారు నివశించే ప్రాంతాలని మినీ పాకిస్తాన్ అనటం మామూలయిపోయింది. అంతర్గత రక్షణ పేరుతో మనదేశంతో సహా ఆయాదేశాల్లో వున్న‘ముస్లింలు’ అన్ని దేశాల ప్రజలందరికీ ‘శత్రువు’ గా మార్చబడ్డారు. రాజుల మధ్య జరిగిన యుద్ధాలని, హిందూ ముస్లిం ప్రజల మధ్య జరిగిన కొట్లాటలుగా అర్ధం చేసుకోవటం మన దేశంలో మామూలయిపోయింది. ప్రభుత్వాలని ఏ ఆర్ధిక హక్కులు అడగలేని ప్రజలు తమని తాము చారిత్రక బాధితులయిన హిందువులుగా చూసుకుని ఇప్పటి సామాన్య ముస్లింలని శత్రువులుగా చూడటం అలవాటు చేసుకున్నారు. భారత దేశానికి పాకిస్తాన్తో వున్న శత్రుత్వం, పాకిస్తాన్ కాశ్మీర్లో చేసిన వికృత రాజకీయాలు దీనికి పూర్తిగా తోడ్పడ్డాయి. 

2000 సంవత్సరం తరువాత సామాన్య ముస్లింల దేశభక్తి ని శంకించటం మొదలయ్యి చివరికి గత ఐదేళ్లలో  ఏ కారణంతో అయినా సరే ముస్లింలని అణచటం, వారికున్న కనీస హక్కులు, వెసులుబాట్లు తీసెయ్యటం, వారిగురించి మాట్లాడితే  ‘మైనారిటీల అప్పిజమెంట్’ అనటం, అసలు ముస్లింలతో సంబంధం ఉంటేనే దేశ ద్రోహం అనటం, అడపా, దడపా ఒక్కరినో, ఇద్దరినో, పదుల్లోనో , వందల్లోనో ‘చంపటం సరైందే, (ఇంకా చెప్తే దేశ భక్తనే) స్థాయికి ఈ దేశ సామాన్య, మధ్య తరగతి ప్రజ ‘ఎదిగింది’. ముస్లింలు బయటివాళ్ళు, మన వాళ్ళు కాదు, మన దేశానికి చెందరు అన్నప్రచారం తీవ్రంగా, లోతుగా జరిగింది. రాజకీయ నాయకులు ‘మేము అందరి కోసం  పని చేస్తాం’ అని కాకుండా, ‘మేమీ ప్రజకి వ్యతిరేకం, మమ్మల్ని గెలిపిస్తే వారిని అణుస్తాము కాబట్టి మాకు ఓట్లు వెయ్యండి’ అని అడిగి మరీ గెలుస్తున్నారు. చేసి చూపిస్తున్నారు కూడా. కాశ్మీరు లో తీవ్ర నిర్బంధం కావచ్చు, బాబ్రీ మసీదు కూలగొట్టటం గురించిన అసంబద్ధ, అన్యాయమైన తీర్పు కావచ్చు, రాజ్యాంగం , న్యాయ న్యాయాలతో సంబంధం లేకుండా మేము చెప్పిందే సరైంది. మేము చెప్పినట్లు కోర్టులు పని చెయ్యాలి అని దేశ పాలకులు అంటుంటే, కరక్టే అనే ప్రజ పెరిగారు. హిందూయిజం మరియు భారతీయత అంటే ముస్లిం వ్యతిరేకతే అన్న మూర్ఖపు ఆలోచన పై నుండి క్రింది వరకూ ప్రబలిపోయిన సందర్భంలో ముస్లింల భారతీయతని శంకించటం సాధారణమయిపోయింది. 

ఇటువంటి సందర్భంలో తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణ ముస్లింలని భయాందోళనలకి నెట్టటం ఆశ్చర్య కరమేమీ కాదు. మూడు ముస్లిం దేశాల్లోని ముస్లిమేతర అల్ప సంఖ్యాక వర్గాలకి మత పరమయిన వేధింపులున్నాయి కాబట్టి త్వరగా పౌరసత్వం కల్పిస్తాం; ఊచకోత ఎదుర్కున్న బౌద్ధ దేశ అల్ప సంఖ్యాక ముస్లిం బాధితుల్ని మాత్రం వెంటనే వెళ్ళగొడతారం అని ఒక పక్క ఉరుముతూ, మరో పక్క ఈ చట్టం ఈ దేశ ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్తున్నాం కదా, నమ్మండి అని హుంకరిస్తుంటే నమ్మటం అనుభవిస్తున్నముస్లిం లకే కాక, తటస్థ పరిశీలకులకు కూడా జీర్ణించుకోవటం కష్టం గానే వుంది. పైగా హిందువులకి ఏ దేశం లేదు కాబట్టి భారత దేశం రక్షణ కల్పించాలనటం శుద్ధ అసత్యం. ప్రపంచంలో ఇజ్రాయిల్ తప్ప పౌరసత్వాన్ని పితృభూమి/మాతృభూమి లేదా మత పరమయిన భూమిక పై ఇవ్వట్లేదు. అట్లా అయితే అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా లలోని అనేక క్రిస్టియన్ దేశాల్లో, ఆఫ్రికా లోని పదుల సంఖ్యలోని దేశాల్లో ఇంత మంది హిందువులకి పౌరసత్వం లభించేది ఉండేది కాదు. దాదాపు 3 కోట్ల మంది భారత సంతతి హిందువులు ఏ బెంగా లేకుండా జీవితం గడిపేవారు కాదు కూడా. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో భారతీయ హిందువులు లేని దేశాలు తక్కువే. పైగా ముస్లింలు ఏ దేశానికయినా వెళ్ళచ్చనే వాదన క్రిస్టియన్లకి కూడా వర్తిస్తుంది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని ప్రభుత్వం కొంత మంది సాధువుల సహాయంతోనో లేక తమ వాట్సాప్ గ్రూపుల్లోనో తప్ప సమర్చించు కోలేనప్పుడు, దేశంలో సగం పైగా రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకించినప్పుడు, దాని కోసం ప్రభుత్వం రాలీలు చేయించాల్సిన అగత్యం పట్టినప్పుడు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చెయ్యం అంటున్నప్పుడు, దేశ ప్రజలందరికీ మంత్రులే చట్ట సవరణని విశదీకరించి చెప్పలేనప్పుడు పౌరసత్వ సవరణ చట్ట సాధికారత ప్రశ్నార్థకమే అవుతుంది! 

Published in Andhra Jyothi as Prasnardhakamaina Samapaurasatvam, on 8th January 2019

Comments