Islamophobia in Corona times

కొరోనా సమయంలో మతం!

కొరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సమయంలో మత సమూహాల ఆచరణలు, మత పరమయిన సమీకరణల స్వభావం కూడా వేగంగా మారాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఒక పక్క భయాలు, ఆందోళన, బందిఖానాలయిన ఇళ్లల్లో పెరుగుతున్న హింస నేపథ్యంలో మతపరమయిన స్వాంతన అవసరం పెరుగుతుంటే, ఇంకో పక్క గుమి గూడటంపై విధించిన తప్పనిసరి ఆంక్షలు ఆ స్వాంతన  దొరక్కుండా చేస్తున్నాయి. అన్ని మతాలకి, మతపరమయిన ఉత్సవాలకు గుమిగూడటం అత్యంత ఆవశ్యకం. కానీ అదే ప్రాణాంతకమయిన వైరస్ ని  వేగంగా వ్యాపింప చేస్తుందంటే ఏమి చెయ్యాలో అర్ధంకాక రోమ్ లోని కాథలిక్ చర్చిల నుండి, బోధ్ గయా లోని మహా బోధి ఆలయం వరకు, తిరుపతి గుడి నుండి అమెరికాలో ఎవాంజెలికల్ చర్చి వరకు మత పెద్దలందరూ తలలు పట్టుకుంటున్నారు. ఎవరు లేకుండా పూజలు, పునస్కారాలు, ఉత్సవాలు, ప్రబోధాలు, కన్ఫెషన్లు ఎట్లా చెయ్యటం, నడపడం అన్నది వారి ప్రశ్న. ఆధునిక యుగంలో మతాల మనుగడకి ప్రపంచ యుద్ధాల తరువాత వచ్చిన పెద్ద సంక్షోభం ఇదే కావచ్చు. 

గుర్తించాల్సింది ఏమిటంటే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు, ప్రజలు కూడా వేగంగా ఏమీ కదల్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకటే చెవిలో పోరుతున్నా సరే ఈ వైరస్ ప్రభావాన్ని అమెరికా, బ్రిటన్ వంటి ప్రభుత్వాలు కొంత కాలం పెడ చెవిన పెట్టాయి. ఆలస్యంగా స్పందించాయి, సరే ప్రభుత్వాలు మేలుకుని ప్రజలని బయటకి రావద్దని చెప్పిన తరువాత అయాచితంగా లభించిన సెలవలుగా భావించి ఇటలీ, బ్రిటన్ లలో ప్రజలు పండగ చేసుకున్నారని ఆయా దేశాల పత్రికలూ, ప్రసార మాధ్యమాల్లో అనేక మంది రాశారు. ఇటలీ ప్రజలయితే ప్రపంచ ప్రజలారా మేలుకోండి, మా లాగా మీరు ప్రవర్తించొద్దు, మీ ప్రభుత్వాలు చెప్పినట్లు చెయ్యండి అని పదే పదే చెప్పారు. మన దేశంలో మార్చి మధ్య నుండి లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాల్లో చాలా మంది శెలవలుగా భావించి బయట తిరిగారు. భౌతిక దూరం పాటించటం అటుంచి, పార్టీలు చేసుకున్నారు. విదేశాల నుండి దేశం లోకి వచ్చి క్వారంటైన్ పాటించకుండా పార్టీలు చేసుకున్న ప్రముఖులు, పెళ్లిళ్లు చేసుకున్న ఘనులు, పారిపోయిన పెద్ద ఆఫీసర్లు, డాక్టర్ల గురించి వార్తా పత్రికలు చాలానే రాశాయి. కేరళలో ఇటలీ నుండి తిరిగొచ్చిన ఇటువంటి ఒక కుటుంబం తిరగటం వల్లే వైరస్ బాగా వ్యాప్తి చెందిందన్నది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే.

కానీ ప్రభుత్వాలు, స్పోర్ట్స్, వినోద ప్రపంచాలతో పాటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల పెద్దలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి తమ వంతు చర్యలు తీసుకుంటున్నారు. సౌదీ అరేబియా లో మక్కా లోని గ్రాండ్ మసీదు ఎనిమిది రోజుల పాటు మూసేసారు, మొత్తం శుభ్రం చేసిన తరువాత కొంత మందికి మాత్రమే తెరిచారు. దుబాయ్ లో శుక్రవారం ప్రార్ధనలని 15 నిముషాలకి కుదించారు. మలేషియా, ఇండోనేషియా లలో మసీదుల్లో శుక్రవారం ప్రార్ధనలపై కొన్ని వారాల పాటు ప్రభుత్వాలే నిషేధం విధించాయి. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం, తాజీకిస్తాన్ లో మత పెద్దల కౌన్సిల్ ప్రజలని మసీదులలో గుమికూడొద్దని చెప్పారు. ఇరాన్లో షియా మత పెద్దలు డాక్టర్లు, ఆరోగ్య రంగ శ్రామికులు దేశానికి సైనికులంత అవసరమని ఉద్ఘాటించారు. అమెరికా, యూరప్ ఖండాలలో కూడా ఇదే జరుగుతోంది. మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత దేవుబంద్ నుండి, ఫిరంగి మహల్ నుండి ముస్లిం మత పెద్దలు, అలాగే షియా పెద్దలు, అనేక నగరాల్లో మత పెద్దలు ప్రజలని ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోమని చెప్పారు. అన్ని చర్చీల డియోసెస్ కూడా ప్రజలని గుమి కూడద్దని, ప్రభుత్వంతో సహకరించాలని, సహకరిస్తామని ప్రకటించాయి. చాలా మంది ఆన్లైన్ బోధనలు, ప్రబోధాలు చేస్తున్నారు. తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం నుండి అనేక ఆలయాలను పెద్ద ఎత్తున భక్తులు గుమికూడకుండా మూసేయటం జరిగింది. 

అయితే పరిస్థితులు ఎంత వేగంగా రోజు రోజుకీ మారుతూ వచ్చాయంటే విషయం అర్ధం చేసుకోవటానికి, చర్యలు తీసుకోవటానికి మతాల పెద్దలకి సంస్థలకి కూడా కొంత సమయం పట్టింది. ఇటలీ లో ప్రభుత్వం చెప్పినా వినకుండా చర్చిలో సర్వీస్ చేసిన కొంత మంది కాథలిక్ గురువులు వైరస్ తో చనిపోయారు. అలాగే దక్షిణ కొరియాలో నాల్గవ అతి పెద్ద నగరమయిన డేగు లో షింశోన్జీ అనే క్రిస్టియన్ శాఖ ఫిబ్రవరి మొదటి వారంలో జరిపిన సమావేశాల వల్ల అక్కడ 320 కేసులు రావటంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.  అలాగే ఇప్పటికీ యుఎస్ లోని లూయిసినా, ఫ్లోరిడాలల్లో కొన్ని చర్చిలు ప్రభుత్వం వద్దంటున్నా ప్రార్ధనా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మన దేశంలో ఉత్తర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున హోలీ పండుగ జరుపుకోవటం, భద్రాచలంలో శ్రీ రామ నవమి జరుపుకోవటం, తమిళ నాడులో పెద్ద ఎత్తున జాతరలు జరుపుకోవటం చూస్తూనే వున్నాం. తిరుమల లో కూడా ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన ఒక భక్తుడికి వైరస్ సోకిందని తెలిసిన తరువాతే మార్చి 18న ఆలయం మూసెయ్యటం జరిగింది. పంజాబ్లో జర్మనీ నుండి, ఇటలీ మీదుగా తిరిగొచ్చిన 70 ఏళ్ల సిక్కు గురువు క్వారంటైన్ పాటించకుండా అనేక గ్రామాలు తిరిగి వేలాది మందిని కలవటంతో దాదాపు 40,000 మందిని క్వారంటైన్ చెయ్యాల్సి వచ్చింది. కోవిడ్ వైరస్ ప్రమాద కరమే అయినా దాని గురించి అందరికీ తెలియక పోవటం వల్ల, లాక్ డౌన్ అందరికీ కొత్త అవటం వలనా, ఎప్పుడు వినటం, చూడక పోవటం వలన చర్చీలు, ఆలయాలు, మత పరమయిన సంస్థలు మిగిలిన ప్రజల్లాగే కొంత అటూ ఇటూగా స్పందించాయి. 

ఇంత గందరగోళ పరిస్థితుల మధ్య ఢిల్లీలో మర్కజ్ అనే తబ్లీగి జమాత్ అనే ముస్లిం వర్గం నడిపే ఆశ్రమంలో కరోనా ప్రబలిందనే వార్తతో మన దేశంలో ఇప్పటికే అంతర్లీనంగా వుండే కమ్యూనల్ వైరస్ ప్రజ్వరిల్లి విపరీతంగా ప్రబలిపోయింది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించక ముందు మర్చి 13 నుండి 15 వరకు అంతర్జాతీయ సెమినార్ పెట్టుకున్నవీళ్ళు ఢిల్లీ ప్రభుత్వం మీటింగ్లు వద్దని అన్న తరువాత మధ్యలో కాన్సిల్ చేశారు. అయితే, అనేక మంది తమ టికెట్లు తర్వాత బుక్ అయ్యి ఉండటంతో ఢిల్లీలో ఉండిపోయారు. ఈ లోపల దేశం మొత్తం మీద లాక్ డౌన్ అయ్యి, ఆ తరువాత అంతర్జాతీయ ప్రయాణాలు క్యాన్సిల్ అవటంతో చాల మంది విదేశీయులు కూడా ఉండిపోయారు. బయటికి ఒక్కొక్కళ్ళు వెళ్లే వీలుండటంతో కొంత మంది బయట తిరిగారు. వీళ్లల్లో చాలా మందికి కరోనా ఉందని టెస్టులు చేయటంతో తెలిసింది. అప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ సెమినార్ కి వెళ్లిన వారికి కొరోనా వచ్చిందని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి రాశాయి. అయితే దాన్ని చాలా రోజులు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి మేలుకుని మేమేదో చేస్తున్నాం అని చెప్పటానికో, ప్రజల్లో కొరోనా గురించి భయం కల్గించటానికో ఈ కేసులకి పెద్ద ప్రచారం కల్పించింది.  అంతే, మిగిలిన మేధావులు చిలవలు, పలవలుగా పాత, పాత దేశ, విదేశాల వీడియోల్ని తమదయిన శైలిలో వ్యాఖ్యానించి తబ్లీగి జమాత్ మాత్రమే కాక, ముస్లింలందరు - అంటే తబ్లీగి జమాత్ తో ఏ మాత్రం ఏకీభవించని షియాలు, సున్నీలు, బరెల్విలు, ఎహ్ల్ హదీస్, వహాబీ -  కొరోనా ని వ్యాప్తి చెయ్యటానికి, తద్వారా భారత దేశ సమగ్రతని, భద్రతని దెబ్బ తీస్తున్నారని ప్రచారం మొదలెట్టారు. సామాజిక మాధ్యమాల్లో, టెలివిజన్ న్యూస్ పేరుతో నడిచే వినోదం లో వచ్చేదంతా నిజమని నమ్మే అనేక మంది సామాన్య ప్రజలు ఇది ముస్లింలు మాత్రమే వ్యాప్తి చేసే  వైరస్ అని భయపడి వారు అమ్మేవి బహిష్కరిస్తున్నారు. తిడుతున్నారు, కొన్ని చోట్ల కొట్టారు కూడా. ఇంకా హేయమయిందేమిటంటే  కొన్ని చోట్ల ఊర్ల నుండి, ఆస్పత్రుల నుండి ముస్లింలని వెళ్లగొట్టటం. 

వైరస్ కి నిజంగా మతం, కులం, ప్రాంతం, వర్గం, జెండర్ ఉన్నట్లయితే ఎంత బాగుండు? ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది వైజ్ఞానికులు, డాక్టర్లు, ఎపిడెమియోలాజిస్టులు అంటే అంటువ్యాధుల నిపుణులు, కమ్యూనిటీ వైద్యంలో నిపుణులు, ప్రజా వైద్య నిపుణులు కొరోనా లక్షణాలు, వ్యాప్తి, పెరుగుదల, దాన్ని అరికట్టడంలో పనికొచ్చే మందులని అర్ధం చేసుకోవటంలో తలమునకలై వున్నారు. డిసెంబర్ నుండి ప్రతి రోజు కొత్త అధ్యయనాలు కొత్త కోణాల్ని, జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తూనే వున్నాయి. వివిధ దేశాల యూనివర్సిటీల్లోని వైజ్ఞానికులు తమ అధ్యయనాలని ఇంటర్నెట్ లో విస్తృతంగా ఇతర దేశాల వైజ్ఞానికులతోనే కాక చదవాలనుకునే వారందరితో పంచుకుంటూనే వున్నారు. ఆసక్తి వున్నవారు ఎవరయినా వీటిని చదువుకోవచ్చు. అయితే వ్యాధులతో ప్రతి క్షణం జీవించి, వాటి గురించి అర్ధం చేసుకోవటానికి జీవితాలు ధారపోసి వేలాది మందికె ఇప్పటి వరకు పూర్తిగా అర్ధం కాని కోవిద్ 19 గురించిన జ్ఞానం సామాన్య ప్రజల వరకు వచ్చేటప్పటికి నిర్ధారితమైన, కుట్ర పూరిత చర్యల పర్యవసానంగా ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మీడియాలో రావటం ఇంత ఆందోళన కరమయిన కమ్యూనల్ పరిణామాలపై దారితీయకుంటే, తప్పకుండా హాస్యాస్పదం అయుండేది.  దానికి తోడు బాధ్యతాయుతమయిన పదవుల్లో వున్నరాజకీయ నాయకుల అజ్ఞాన పూరితమయిన ప్రకటనలు ఈ కమ్యూనల్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. 

ఐక్య రాజ్య సమితి లోని మత స్వేచ్ఛ కి సంబంధించిన కమిటీ న్యాయంగానే దీని గురించి ఆందోళన వ్యక్తం చేసింది. మత పరమయిన అల్ప సంఖ్యాక వర్గాలపై మహమ్మారి సమయంలో దాడి చెయ్యటం అత్యంత హేయమైందని, ప్రభుత్వాలు ఇటువంటి ప్రచారాలని వెంటనే ఆపాలని ప్రకటించింది. అంత కంటే ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిని అరికట్టే ప్రయత్నాలకు భంగమని గుర్తించి వీటిని  వెంటనే ఆపాలని ప్రకటించింది. మహమ్మారి సమయంలో కొన్ని వర్గాల వారిపై గురి చేస్తే, దాని చూసి మిగిలిన వర్గాలకి చెందిన రోగులు కూడా ఆ కళంకం వస్తుందని భయ పడి బయటకి రారని, డాక్టర్లకి చెప్పరని, దాని వల్ల వైరస్ మరింత వేగంగా పాకి అందరికీ సోకుతుందని, కాబట్టి వెంటనే రోగులని మత పరంగా గుర్తించటం మానేయాలని, ఆ వివరాలు బయటకి చెప్పకూడదని ప్రకటించింది. రోగుల వివరాలు బయటికి చెప్పటం వల్ల జరుగుతున్న హానిని గుర్తించి మన దేశంలో ఒరిస్సా ప్రభుత్వం దాన్ని నిషేధిస్తూ ఇటువంటి జి.ఓ జారీ చేసింది. అనేక మంది వైద్యులు, ప్రజారొగ్య నిపుణులు ఇది తప్పని, ఆందోళనకరమయిన పరిణామమని ప్రభుత్వానికి, ప్రసార మాధ్యమాలకు రాస్తున్నారు.     

తబ్లిగ్ జమాత్ ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది సీరియస్ గా తీసుకుని తమ మీటింగ్ కాన్సిల్ చేసి వుండాల్సింది. చెయ్యకపోవటాన్ని అనేక మంది ముస్లింలే తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ వారొక్కరే చేశారా ఆ పని? వారు అజ్ఞానంతోనో లేక పరిస్థితుల వల్లో చేసిన దాన్ని ఉద్దేశ పూర్వకంగా చేశారని లేక కుట్ర పూరితంగా చేశారని అంటే ఎలా నమ్మటం? దాని పేరుతో ముస్లిములందరినీ కళంకితులుగా చూపెట్టటం సరైందేనా? దీని వల్ల ఇస్లాం పట్ల, ముస్లిముల పట్ల అపోహలు, భయాలు వున్న వారికి కొంత మానసిక స్వాతన కలిగుండొచ్చు కానీ మొత్తం మీద భారత దేశ ప్రజానీకానికి మాత్రం అత్యంత హాని జరుగుతుందనేది మాత్రం సత్యం. దీన్ని భిన్న మతస్థుల మధ్య పోరాటంగానో లేక ముస్లింల దేశ భక్తి రాహిత్యానికి సూచనగా  చూడటమెంత అవివేకమొ, కోవిడ్ 19 లాక్ డౌన్ తరువాత జరుగుతున్న సహాయ కార్యక్రమాలని చూసినప్పుడు స్పష్టమవుతుంది. కేరళ నుండి పంజాబ్ దాకా, కాశ్మీర్ నుండి అస్సాం దాకా అనేక రకాల మతస్థులు, మతసంస్థలు కలిసి చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తుంది. అనేక ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలు, మసీదులు పని కోల్పోయిన శ్రామికులకు భోజనాలు, బియ్యం ఇంకా అనేక రకాల సహాయాలు చేస్తున్నాయి. తిరుమల ని శుభ్రం చెయ్యటానికి ఒక ముస్లిం భక్తుడు ఒక ట్రాక్టర్ ని దానం చేస్తే దానితో డిసైన్ఫెక్షన్ జరుగుతోంది. వైరస్ సోకిన తబ్లిగ్ సభ్యులని క్వారంటైన్ చెయ్యటానికి తిరుమల దేవస్థానం తన గెస్ట్ హౌసెలని ఇచ్చింది. వైరస్ సోకి చనిపోయిన హిందూ స్త్రీ పాడె మొయ్యటానికి బంధువులు భయపడితే చుట్టుపక్కన ముస్లిం యువకులు మోశారు. కేరళలో మసీదులు, చర్చీలు పెళ్ళిళ్ళ నుండి అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తబ్లిగ్ శాఖే, తమ తమ కార్యాలయాలని శుభ్రం చేసి, క్వారంటైన్ కోసం వాడుకొమ్మని ప్రభుత్వానికి చెప్పింది. ఎక్కడా కూడా వాళ్ళు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యట్లేదు. 

ఏప్రిల్ మొదటి వారం వరకు వచ్చిన వార్తలని గమనిస్తే అర్ధమయిందేమిటంటే, ఈ మహమ్మారిని భారత దేశానికి మొదట తీసుకొచ్చింది విదేశాలకి వెళ్లిన, అక్కడి నుండి వచ్చిన భారతీయులు. అందులో అన్ని మతాల, వర్గాల వారు వున్నారు. పక్కనున్న చైనాలో డిసెంబర్ నుండి వ్యాధి విజృంభిస్తున్నప్పటికీ, చైనా వైరస్ అని పేరు పెట్టి, చైనా గురించిన గురించి కుట్ర సిద్ధాంతాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి తప్ప, వారు తీసుకున్న జాగ్రత్తల గురించి కాలేదు. మార్చి మధ్య దాకా కేరళ తప్ప మిగిలిన ప్రభుత్వాలు తమ తమ  పనుల్లో మునిగిపోయి వివిధ రకాల వేగంతో కదిలి లాక్ డౌన్ ప్రకటిస్తూ వచ్చాయి. ఈ లోపల డాక్టర్లని, నర్సులని ఇల్లు ఖాళీ చెయ్యాలని అనేక మంది బలవంతం చేశారు. క్వారంటైన్ సదుపాయాలు కల్పించ టానికి మరి కొన్ని రోజులు పట్టింది. దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన తరువాత లక్షలాది మంది వలస కార్మికులు ఇంటికి పోవటానికి రోడ్లెక్కారు. కేవలం లాక్ డౌన్ తో కుదరదని, ప్రభుత్వాలు, టెస్టింగ్ పెద్ద ఎత్తున చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటుంటే కూడా మిగిలిన దేశాల ప్రభుత్వాల లాగే మన ప్రభుత్వాలు కూడా నెమ్మదిగా మార్చి నెల చివరికి దీన్ని సీరియస్ గా తీసుకోవటం మొదలుపెట్టాయి. దాదాపు మార్చి మూడవ వారం వరకూ చాలా రకాల మత పరమయిన సమీకరణలు, ఉత్సవాలు ఆగలేదు. సోషల్ డిస్టెన్సిన్గ్ పూర్తిగా అమలు కాలేదు. ఇప్పటికీ జరగాల్సినన్ని టెస్టులు అన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు. మరి వీటన్నిటి మధ్యలో మూడవ వంతు కేసులు మాత్రమే తెచ్చిన తబ్లిగ్ సమావేశంపై మాత్రమే ద్రుష్టి పెట్టి, మిగిలిన కేసుల్ని పక్కన పెట్టటం వల్ల ముస్లిమేతర ప్రజలు దీన్ని కేవలం ముస్లింలకి వచ్చే వ్యాధిగా మాత్రమే భావిస్తే, భారత దేశం ఈ మహమ్మారిపై  యుద్ధం ఎలా గెలవబోతోందో ఆ దేవుడికే తెలియాలి! 

Published in Andhra Jyothi newspaper as Kallolakaalamlo Matham on 19th April 2020




Comments