On Hijab and Secularism

హిజాబ్ ఒక ఆధిపత్య లౌకికవాద సమస్య! మంగళూరు లో ఆకస్మాత్తుగా ఒక కాలేజీ నిర్వాహకులు ఐదుగురు ముస్లిం అమ్మాయిలకి హిజాబ్ (జుట్టుని కప్పి ఉంచే ముసుగు) వేసుకుంటే కాలేజీకి రావద్దని చెప్పేసారు. యూనిఫార్మ్ నియమాలకు హిజాబ్ విరుద్ధమని, గనుక ఇలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సగానికి సగం మంది స్త్రీలని చదువు రాకుండా ఉంచే ఈ దేశంలో కాలేజీ చదువు వరకూ వచ్చే అమ్మాయిలని, అందులోనూ అణగారిన ముస్లిం సమూహానికి చెందిన అమ్మాయిలని చదువుకి దూరం చెయ్యటానికి ఇంత విచిత్ర ఎత్తుగడ బహుశా ఎవరికీ తట్టి ఉండక పోవచ్చు. ఇలా చదువు నుండి బహిష్కారానికి గురయిన ఆ అమ్మాయిలు కాలేజీ విధించిన ఈ అనైతికమయిన, చట్ట విరుద్దమయిన బహిష్కారానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, విద్యార్థుల మధ్య సంఘీభావం ఏర్పడకుండా, కొంత మంది వారి పైన దాడులకు దిగారు. అయితే చర్చ చదువు, కాలేజీ నుండి ముస్లిం అమ్మాయిల కాలేజీ బహిష్కరణ చుట్టూ కాక, వారు తలకి చుట్టుకున్న హిజాబ్ చుట్టూ ఎందుకు తిరుగుతోంది? భారత దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా హిజాబ్ ముస్లిం స్త్రీల తీవ్ర పితృస్వామ్య అణచివేతకు చిహ్నమని, ముస్లిం స్త్రీలు హిజాబ్ వేసుకోకుండా ఉంటేనే దాన్నుండి వారు విముక్తి పొందినట్లనీ, ముస్లిం స్త్రీలని వారి మతం నుండి రక్షించాల్సిన అవసరం ఉందనే ఒక ఉదార వాద భావజాలం గత శతాబ్దంలో బల పడి ఈ శతాబ్దంలో కామన్ సెన్స్ గా మారింది. ఈ భావజాల ప్రభావం వల్లే హిజాబ్ ని ఇస్లాం మత చాందసానికి ఒక చిహ్నంగా మాత్రమే చూడడం ప్రపంచంలో సామాన్య ప్రజలు కూడా అలవాటు చేసుకున్నారు. దానికి న్యూ యార్క్ టైమ్స్, గార్డియన్ పత్రికల నుండి మన స్థానిక వార్తా పత్రికల వరకు తమ వంతు సహకారం అందిస్తూనే వున్నాయి. ఈ భావజాలం ఇంత బలంగా వేళ్లూనుకునేటట్లు చెయ్యటానికి రాజకీయ ఆర్ధిక కారణాలు ప్రధాన మయినవి. ప్రపంచ యుద్ధాల మధ్యలో పశ్చిమ ఆసియా దేశాల్లో పెట్రోల్ ని కనుగొనటంతో ఆయా దేశాలని తమ చెప్పు చేతల్లో వుంచుకోవటం యూరోపు దేశాలకి చాలా అవసరమైంది. సాంస్కృతికంగా అవి వెనుక బడి వున్న దేశాలని, దానికి ఇస్లాం కారణమని, ఇస్లాం మతం ఛాందస మతమనే ప్రచారం విపరీతంగా జరిగింది. అసలు ఆయా దేశాలు ఆధునీకరణ చెందలేవని, ఎందుకంటే అవి మౌలికంగా యూరోపియన్ సమాజాలకు భిన్నమయినవనే పండిత ప్రచారం కూడా యూరోపియన్ సాంస్కృతిక వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చేశారని ఎడ్వర్డ్ సయీద్ ఓరియెంటలిజం అనే ప్రభావశీల పుస్తకంలో ఎత్తి చూపారు. మన దగ్గర కూడా ఈ రకమయిన పోకడలు - అంటే ముస్లిం సమాజం అత్యంత పితృస్వామికమైందనీ, ఎప్పటికీ మార్పు చెందకుండా ఉందనీ, కాబట్టి బలవంతంగా వారిని మార్చాలనే వాదనలు - గత ముప్ఫయి ఏళ్లలో ఊపందుకున్నాయి. దీనిలో తప్పేముంది నిజం కాదా అని వాదించే వాళ్లలో స్త్రీ వాదులు, ముస్లిం వాదులు, ప్రగతి శీల వాదులు కూడా వున్నారు. అయితే ఆధునికీకరణ ప్రతి సమాజంలో వివిధ రకాలుగా వాస్తవీకరించబడుతుంది, మన వంటి నిచ్చెన మెట్ల సమాజంలో హిజాబ్ ధారణ కూడా ఆధునికీకరణ లో భాగ మనే విషయం అర్ధం చేసుకోవాలి. స్త్రీ పురుషులలో ఎవరి వస్త్రధారణని, సాంస్కృతిక చిహ్నాలని ఎంత మేరకు, ఏ రకంగా ఆధునీకరించాలి, ఏ చిహ్నాలని మార్చొద్దు అన్న విషయం, ఎంతమేరకు ఆధునీకరించాలి అన్న విషయాలని ‘చీర’ చరిత్ర ని గమనిస్తే అర్ధమవుతుంది. మనకు తెలిసిన చీర కట్టు - జాకెట్టు, లోపలి లంగా వేసుకుని, కుచ్చెళ్ళతో, పమిటతో వుండేది గట్టిగా 120 ఏళ్ల ముందే తయారయింది. అప్పటివరకూ జాకెట్టు, లోపలి లంగా లేకుండానే, గోసి పట్టి చీర కట్టుకునే వాళ్ళు. ఎప్పుడయితే మధ్య తరగతి స్త్రీలు పురుషులతో కలిసి బ్రిటిష్ వారితో ఫంక్షన్లలో పాల్గొనాల్సి వచ్చిందో అప్పుడు ఈ చీర కట్టుని ఆధునీకరించాల్సి వచ్చింది. గత నలభై ఇళ్లల్లో హిజాబ్ కూడా ఆధునీకరుణకి, గౌరవ ప్రద స్త్రీత్వానికి చిహ్నంగా రూపుదిద్దుకుంది. అప్పటి వరకూ ముస్లిం స్త్రీలు బయటికి వెళ్లాలంటే ఒక తెల్ల షాల్ వంటిది కప్పుకుని బయటికెళ్ళేవాళ్ళు. బాలికలు, స్త్రీలు తమంతట తాము బయటకి వెళ్ళటానికి, పని చేసుకోవటానికి అనుకూలంగా ముస్లిం సమాజాలు ఆమోదించిన వస్త్ర ధారణ - హిజాబ్, బురఖా. అందుకే ఆధునిక సార్వత్రిక విద్య వ్యాపించే కొద్దీ హిజాబ్, కొన్ని చోట్ల బుర్ఖా వ్యాపిస్తూ వచ్చింది. అంటే ముస్లిం సమాజాల్లో పితృస్వామ్య ఆధిపత్యం లేదా అని అడగొచ్చు. తప్పకుండా వుంది. మిగిలిన అన్ని సమాజాల్లో ఎంతుందో, అక్కడ కూడా అంతే. స్వంత బట్టల మీద వేరే వాళ్ళ హక్కెంటి అని వాదించే వాళ్ళు ఒక సారి తమ తమ స్వంత సమాజాల్లో, కుటుంబాల్లో నే కాదు, మన ప్రజామోదిత సంస్కృతిలో స్త్రీల వస్త్ర ధారణ పై ఏ పితృస్వామ్య నియంత్రణ లేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? హిందూ యువతులు బొట్టు లేకుండా వెళ్ళినప్పుడు ఇంట్లో తల్లి తండ్రులు, అన్న దమ్ములతో పాటు, బస్సులో ప్రయాణీకులనుండి , కూరల బండి వాళ్ళు కూడా కామెంటు చేసే వాళ్ళే. ఏ పితృస్వామ్య కట్టుబాట్లూ లేకుంటేనే, పెళ్లయిన స్త్రీలు తూచా తప్పకుండా బొట్టు, మంగళ సూత్రం, మెట్టెలు పెట్టుకెళుతున్నారా? గురువుల దగ్గరి నుండి సినిమా పాటల వరకూ అందరికీ, అన్నింటికీ స్త్రీల వస్త్ర ధారణ సామూహిక సాంస్కృతిక వనరుగా ఇప్పటికీ ఎందుకున్నట్లు? అయితే ఎవరి వస్త్ర ధారణ కేవలం సాంస్కృతిక చిహ్నంగా అంటే మన కళ్ళకి మామూలు గా గోచరిస్తుందనేది సామాజిక అధిపత్యంపై ఆధారపడుతుంది. మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భూమి పూజలు, ఆఫీసుల్లో దేవుళ్ళ ఫోటోలు, చేతికి తాయత్తులు, ముఖానికి పసుపు, కుంకుమ, మెడలో నల్లపూసలు, చేతులకి గాజులు మత పరమయిన చిహ్నాలుగా కాక సాంస్కృతిక చిహ్నాలుగా పరిగణింపబడటానికి కారణం మరేంటో కాదు హిందూ సమూహ ఆధిపత్యమే. ప్రతి దేశంలో ఆధిపత్య మత సంస్కృతి అనురూపంగా అక్కడి లౌకికత, దాని చిహ్నాలు రూపుదిద్దుకుంటాయని లౌకికత, మతాల మధ్య సంబంధాలని అధ్యయనం చేసిన తలాల్ అసద్ అంటారు. యూరోపియన్ దేశాల్లో క్రిస్టియన్ మత సంస్కృతి లౌకికత ని రూపుదిద్ది, సమాజ సంస్కృతిగా ఎలా పరిణమించిందో అట్లాగే మన దేశంలో, హిందూ మతం లౌకికతని రూపుదిద్దటం వల్ల హిందూ మత చిహ్నాలని లౌకికత కి విరుద్ధమైనవని అర్ధం చేసుకోవటం లౌకికవాదులమని భావించే వారికి కూడా కష్టం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వైపరీత్యం లౌకిక వాదాన్ని రాజ్యం మైనారిటీ సమూహాలపై వాడటానికి ఒక ఆయుధంగా చేసుకోవటం. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి యూరోపు దేశాల్లో హిజాబ్ మీద బహిష్కరణ ఈ కోవకి చెందిందే. ఒక దేశంలో విభిన్న సమాజాలు, భిన్న సమూహాలు తమ తమ లౌకికతని భిన్నంగా వ్యక్తీకరించ గలిగే అవకాశాలని తోసిపుచ్చి ఒకే రకమయిన ఆధునికీకరణ, లౌకికత్వం అందరి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నమే ఈ హిజాబ్ బహిష్కరణ. అన్ని పౌర, ప్రాధమిక హక్కుల్నీ పణంగా పెట్టి ఒక మూసపోసిన లౌకికతని దేశ అస్తిత్వానికి ఒకే ఒక చిహ్నంగా ఎత్తి చూపటం దీని లక్షణం. మన దేశంలో ముస్లిం అమ్మాయిల చదువుని ఫణంగా పెట్టటం ఇటువంటి లౌకిక వాద హింసలో భాగమే. ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా చేసిన పదేళ్ల యుద్ధం లో నిండా ముసుగు వేసుకున్న స్త్రీలు, మూడు తలాక్ ల నిషేధ చట్టం తో ఇక్కడి ముస్లిం స్త్రీలు పితృస్వామ్యం నుండి ‘విముక్తు’లయ్యారని అనేక మంది భావించారు. కానీ ఇదే సమయంలో ఎంతో మంది హిజాబ్ ధరించిన ముస్లిం స్త్రీలు వారి వారి దేశాల్లో ఎన్నో రకాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా షాహీన్ బాగ్ ఉద్యమంలో హిజాబ్ ధరించిన స్త్రీలు, పెద్ద చదువుల్లో వున్న వాళ్ళతో సహా - పౌరసత్వం కోసం, ఈ దేశ లౌకికత కోసం, తమ అస్తిత్వం కోసం కనీ విని ఎరగని పోరాటం చేశారు, కేసుల్లో ఇరికించ బడ్డారు, జైళ్లల్లో మగ్గుతున్నారు. తాము పితృస్వామ్య బాధితులం కన్నా రాజ్య హింస, మూస లౌకికవాదం, హిందూత్వ మెజారిటీ విముక్తి వాద బాధితులం అని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తున్నారు. కానీ, లీలా అబూ లూగోడ్ అన్నట్లు ఇప్పటికీ ముస్లిం స్త్రీలని పితృస్వామ్యం నుండి విముక్తుల్ని చెయ్యాలనే జాడ్యం ఒక పట్టాన ఎవరినీ వదిలి పొవట్లేదు. ఆయా యువతులని ముస్లిం సమాజ పితృస్వామ్యం నుండి విముక్తి చెయ్యటానికి వాళ్ళు కాలేజీ కి హిజాబ్ వేసుకోకుండా రావటం ముఖ్యమని అనటం కేవలం ఒక పెత్తందారీ స్త్రీవాదం. కాలేజీలు, కోర్టులు హిజాబ్ వేసుకున్న ముస్లిం బాలికలని స్కూళ్ళకి, కాలేజీలకి రాకుండా చెయ్యటం వారిని చదువు నుండి దూరం చేసి, ముస్లిం సమాజాన్ని లౌకికవాదం పేరుతో ‘వేరుచెయ్యటమే’. కోర్టులు కొత్తగా మత పరమయిన చిహ్నాలని నిషేధించటం హిందూ లౌకికతని ఇతరుల పైన రుద్దటమే. దీన్ని ఇంకో రకంగా అర్ధం చేసుకోవటం విషయాన్ని మసి పూసి మారేడు కాయ చెయ్యటం తప్ప మరేమీ కాదు!

Comments