On consent in intimate relationships

అంగీకారం, నమ్మక ద్రోహం 


జూబిలీ హిల్స్ లో మైనర్ యువతిపై జరిపిన సామూహిక అత్యాచారంలో రాజకీయ పరపతి ఉన్న కుటుంబాల యువకులుండటంతో పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేయటం రాష్ట్రంలో అమలవుతున్న సమ న్యాయం గురించి సహజం గానే అనేక ప్రశ్నలు లేవదీసింది. పేద వర్గాల, కింది కులాల యువకుల ప్రమేయం వున్నప్పుడు అత్యుత్సాహంతో నియమ నిబంధనలు అతిక్రమించి వ్యవహరించే వ్యవస్థ డబ్బు, పరపతి, రాజకీయ అధికారం వున్న యువకుల దగ్గరికొచ్చేటప్పటికి అన్ని రకాల నియమాలు వల్లించటం బాలికలు, స్త్రీలపై జరిగే హింస పట్ల రాష్ట్ర అధికార వ్యవస్థ కున్న నిబద్ధత గురించి కూడా అనుమానాలు రేకెత్తించింది. అయితే, జరుగుతున్న వాటన్నింటి మధ్యా ఆందోళన కలిగించే విషయం ‘ఆ యువతి ఇష్ట పూర్వకంగానే, తన అంగీకారంతోనే కారు ఎక్కింది కదా’ అని ప్రజల మధ్య పాకుతున్న వాదన. 


అత్యాచార ఘటనల్లో అంగీకారం (కన్సెన్ట్) గురించిన చర్చ ఈ రోజుది కాదు. స్త్రీలు, యువతులు రెచ్చగొడితే తప్ప మగవాళ్ళు తమంతట తాము వారి మీద పడరనీ, స్త్రీల అంగీకారం లేకుంటే లైంగిక చర్య అసాధ్యమనీ, స్త్రీలు, యువతులు తమపైన జరిగిందని చెప్పే అత్యాచారాలు సాధారణంగా వారి అంగీకారంతో జరిగే ఉంటాయనీ, కేవలం తమ స్వలాభం కోసమే జరిగిన దాని గురించి అబద్ధాలు చెప్తారని పోలీసుల్లో, కోర్టుల్లో, రోజువారీ న్యాయ వ్యవస్థ పని తీరులోనే కాక, కాక ప్రజా సంస్కృతి లో కూడా ఇప్పటికీ బలమయిన నమ్మకం వుంది. ఒక మహిళ వంటి మీద గాయాలు లేకున్నా, ఆ పురుషుడి వంటి మీద గాయాలు చెయ్యకపోయినా ఆ మహిళ లైంగిక చర్యకి అంగీకరించింది అని అర్ధం చేసుకోవాలనే శిక్షా స్మ్రుతి లోని నియమాన్ని 1984 లో మహిళా ఉద్యమ పోరాట ఫలితంగా మార్చారు. దీని ఫలితంగానే అప్పుడు అధికార పూరిత సంబంధాల్లో జరిగే సంఘటనలకు, పురుషులు గుంపుగా చేసే సంఘటనల్లో బాలికలు అంగీకారం ఇచ్చినట్లు ఏ మాత్రం భావించ కూడదని చట్టం గుర్తించటం మొదలు పెట్టింది.    


అయితే లైంగిక సంబంధాలు, చర్యల్లో అంగీకారం గురించి ప్రజా రంగంలో చర్చలో ఇప్పటికీ ‘సమాజం ఎంత మారినా, స్త్రీ పురుషులు ఎన్ని చోట్ల కలిసి పని చేసినా, ఎన్ని స్నేహాలు పెంచుకున్నా, మగవాళ్ళు సహజంగానే ఏ స్త్రీనైనా లైంగిక దృష్టితోనే చూస్తారని, అవకాశమొస్తే వారిని వాడుకోవాలని చూస్తారని, దానికి బలం వాడటానికి వెనుకాడరని, కాబట్టి బాలికలు, స్త్రీలు వారితో ఎప్పుడూ, ఎన్నటికీ జాగ్రత్తగా, హద్దుల్లో మాత్రమే వ్యవహరించాలనే’ దృస్థితోనే నడుస్తోంది. ఈ అనాగరిక దృక్పధాన్ని చాలా మంది ‘వాస్తవిక దృక్కోణం’ అని కూడా నమ్మబలుకుతుంటారు. 


స్త్రీలు, పురుషులు ప్రవ్రుత్తి పరంగా ఎప్పటికీ మారరనే అశాస్త్రీయ ధోరణితో నడిచే ఈ చర్చ గత వందేళ్లల్లో మన దేశంలోనే జరిగిన మార్పుల గురించి గుర్తించటానికి సిద్ధంగా లేదు. స్త్రీలని ఎప్పటికప్పుడు హద్దులు దాటమని వందేళ్ల క్రితం నాటి సామాజిక ఉద్యమాల దగ్గరినుండి ప్రభుత్వాలు రోజు వారీ చేసే స్త్రీల సాధికారత ప్రకటనల వరకూ ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. మీకు హద్దులు లేవు, సైన్యంలోకి రావచ్చు, పోలీసులు కావచ్చు, రోదసి లోకి వెళ్లొచ్చు, యూనివర్సిటీలకి వీసీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు అని చెప్పుకుంటూ వస్తున్నాయి. బాలికలు, బాలురు అలాగే యువతులు, యువకులు పోటీలు పడి చదువుకోవటాన్ని, ఆటలాడటాన్ని, అనేక రకాల పోటీల్లో పాల్గొనటాన్నీ చూస్తే ఈ స్త్రే-పురుష ప్రవ్రుత్తి సిద్ధాంతం తప్పని ఎవరికయినా అర్ధమవుతుంది. ఇన్ని విషయాల్లో మారుతున్న బాలికలు, బాలురు, మారిన యువతీ యువకులు స్నేహ సంబంధాలు, రొమాంటిక్ సంబంధాల విషయంలో మాత్రం మారకుండా ఎలా వుంటారు?  


ఇలా మారుతున్న పరిస్థితులని మహిళా ఉద్యమకారుల కృషి ఫలితంగా 2013 లో జరిగిన చట్ట మార్పులు గుర్తించి యువతీ యువకుల/ స్త్రీ -పురుషుల సంబంధాల్లో అంగీకారానికి కొత్త నిర్వచనాలు ఇచ్చాయి. మారుతున్న పరిస్థితుల్లో పాత హద్దులు చెరిగి, కొత్త హద్దులు ఏర్పడాల్సిన అవసరాన్ని గుర్తించాయి. యువతీ యువకులు దగ్గరగా మెలిగే పరిస్థితుల్లో ప్రతి చర్యకి అంగీకారం అవసరం అనే కొత్త హద్దు ఈ సందర్భంగానే ఏర్పరిచారు. మార్పుని ఆహ్వానిస్తూనే, శారీరక సంబంధాల పరిణామం, ఇష్టపూర్వకమయినా, బలవంతంగా జరిగేవయినా, ఇప్పటికీ స్త్రీలపైనే తీవ్రంగా వుంటాయనే సామాజిక వాస్తవికతని గుర్తించిన చట్ట మార్పులివి. 2012 లో ఢిల్లీ లో జరిగిన సామూహిక అత్యాచార సంఘటన జరిగిన చట్ట మార్పులొస్తే 2017 లో మీ టూ ఉద్యమ సందర్భంలో అనేక మంది స్త్రీలు అంగీకారం పై చర్చని ముందుకు తీసుకెళ్లారు. విషయం సన్నిహిత సంబంధాలు ఏర్పరచు కోవాలా, కాదా అని కాదని, సన్నిహిత సంబంధాల్లో కూడా అంగీకారం లేని చర్యలన్నీ దాడులనే భావనని సమాజంలోకి తెచ్చింది. మొదట ఇష్టంతో కొన్నింటికి ఒప్పుకున్నంత మాత్రాన, తర్వాత మగవాళ్ళు చేయాలనుకునే, చేసే అన్ని లైంగిక చర్యలకి వాళ్ళు అంగీకారాన్ని తెలిపినట్లు కాదని అర్ధం చేయించటానికి ప్రయత్నించింది. 


నడుస్తున్న ఈ చరిత్ర నేపథ్యంలో ఇప్పటి సంఘటనని చూద్దాం. జూబిలీ హిల్స్ మైనర్ అమ్మాయి ఇష్టంతోనే పబ్ కి వెళ్లి ఉండొచ్చు. తర్వాత తనకి తెలిసిన అబ్బాయే కాబట్టి ఆ అబ్బాయితో కారులో ఇంటి వరకూ ప్రయాణం చెయ్యటానికి సిద్ధ పడి ఉండొచ్చు. దీన్ని కూడా అడ్వెంచర్ అందామా మనం? అమ్మాయి అబ్బాయి మంచి వాడని నమ్మింది కాబట్టే కారెక్కింది. మరి అతడేం చేసాడు? పచ్చి నమ్మక ద్రోహం. మగ స్నేహితులతో కలిసి ఆమెని సామూహిక లైంగిక దాడికి గురిచేశాడు. దానికి ఏ అమ్మాయయినా అంగీకారం తెలుపుతుందా? చర్చ జరగాల్సింది నమ్మిన స్నేహితురాలికి ద్రోహం చేసే అబ్బాయిల గురించి కదా? అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకుంటూ, పబ్ లకి వెళ్తూ, సెలెబ్రేట్ చేసుకోవటం మామూలవుతున్న ఈ సందర్భంలో ఎందుకు అబ్బాయిలు నమ్మిన స్నేహితురాళ్ళకి  ఇటువంటి ద్రోహం చేస్తున్నారు అనేది చర్చలోకి రాకుండా, అమ్మాయిలు హద్దుల్లో ఉండాలి అన్న చర్చ ఎందుకు నడుస్తున్నట్లు? 


‘మా కాలంలో అయితే మేమెప్పుడూ హద్దులు మీరు ప్రవర్తించే వాళ్ళం కాదు, ఎప్పుడూ దూరంగానే ఉండేవాళ్ళం’ అనే ఆడవాళ్లు, మగవాళ్ళు కూడా గురించాల్సిన విషయం మారుతున్న పరిస్థితులు సన్నిహితంగా మెలుగే సందర్భాలని ఏర్పరిచి, కొత్త రకమయిన హద్దుల్ని నేర్చుకోవాల్సిన అవసరాన్ని, దాని కోసం అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మారాల్సిన సందర్భం కల్పించాయి అని. ఈ హద్దులు పాత సమాజ విలువల ననుసరించి కేవలం అమ్మాయిలకె కాదు, అబ్బాయిలకి కూడా అని అర్ధం చేసుకున్న యువకులు, ఇప్పటికే తయారవుతున్నారు అని. ఎంత సన్నిహితంగా మెలిగినప్పటికీ, అమ్మాయిల ఇష్టా ఇష్టాలని అర్ధం చేసుకోవటం, నీకు ఇది చెయ్యటం ఇష్టమేనా అని అడగటం పెద్ద కష్టమయిన విషయమేమీ కాదు కదా? అలా మారని అబ్బాయిలకి ఈ విషయం నేర్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చర్చ యువతుల, స్త్రీల ‘హద్దు మీరిన’ ప్రవర్తన చుట్టూనే ఇంకా తిరగటం బాధ్యతా రాహిత్యాన్ని సూచించదూ? 


బాలికలు, యువతులు, స్త్రీలు రెండు శతాబ్దాలుగా సమాజం కలిపించిన సమానత్వ స్వేచ్చా స్వాతంత్రాలని కొంత మేర అనుభవిస్తూ వాటి సరిహద్దులని తమ కోసం, మిగిలిన వారి కోసం విస్తరించటానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. సమస్య వారితో కాదు, వారి పైన దాడులు జరిపిన, జరుపుతున్న వాళ్ళతో. విషయం, అప్పుడూ, ఇప్పుడూ అంగీకారం గురించే. ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ అన్న విలువలు స్త్రీలకి తమ ఇష్టాయిష్టాల గురించి కనీసం  చెప్పుకోలేని సమాజ పరిస్థితుల్లో చెలామణి అయ్యేవి. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది, ఆ పరిస్థితులు మారుతున్న సందర్భంలో సన్నిహిత సంబంధాల్లో అంగీకారాన్ని అర్ధం చేసుకోవటం గురించి, శారీరక సాన్నిహిత్యం మొదలయిన తరువాత కూడా వద్దు అంటే ఒప్పుకుని పక్కకి జరగటం గురించి. ఎంత కష్టమయినా, సంక్లిష్టమయినా, ఆ చర్చని ఇప్పటికయినా ప్రారంభించాల్సిన అవసరం వుంది.      


Published in Andhra Jyothi as 'Angeekaram leni laingika charyalannee daadule!'


Comments