Cancellation of Maulana Azad Fellowships

మౌలానా ఆజాద్ ఫెలోషిప్పుల రద్దు దేన్ని సూచిస్తోంది? కొన్ని రోజుల క్రితం వున్నట్లుండి మైనారిటీ శాఖా మంత్రి స్మ్రితి ఇరానీ మతపరమైన మైనారిటీ విద్యార్ధులకి ఉన్నత విద్య అభ్యసించటానికి ఇచ్చే మౌలానా ఆజాద్ ఫెలోషిప్పులని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సంవత్సరానికి 1000 మందికి దాకా ఇచ్చే ఈ పరిశోధనా ఫెలోషిప్ వల్ల ఇప్పటికి ఆరువేల మంది పార్సీ, సిక్కులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్, ముస్లిం విద్యార్థులు గత పదేళ్లలో వివిధ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో పరిశోధన చెయ్యటం, ఆయా డిగ్రీలతో వివిధ ఉద్యోగాలకి అర్హులవ్వటం జరిగిందని మైనారిటీ మంత్రిత్వ శాఖ సమాచారం బట్టే తెలుస్తోంది. మరి ఇంత మంది విద్యార్థులు లబ్ది పొందుతున్న స్కాలర్షిప్ ని ఎందుకు రద్దు చేస్తున్నారని అడిగితే వారికి ఇతర స్కాలర్షిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆవిడ ప్రకటించారు. నిజమేనా? అన్ని అభివృద్ధి చెందిన దేశాలు వున్నత విద్యని ఒక ప్రజా వనరుగా పరిగణించి అన్ని సామాజిక వర్గాల వారికి దానిలో భాగస్వామ్యం కలిపించటానికి ప్రయత్నిస్తాయి. ప్రజాస్వామిక విలువలు, జాతీయతా భావనలు పెంపొందించే ప్రయత్నాల్లో ఉన్నత విద్యని ఒక సాధనంగా చూస్తాయి. మన దేశం కూడా వలస పాలన అంతం అయిన తర్వాత ఉన్నత విద్యని దేశాభివృద్ధికి ఒక సూచికగానే చూసింది. సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్, సైన్సెస్ లో లేదా టెక్నాలజీ లో పరిశోధన చేసి డాక్టరేట్ పొందటం కనీసం ఐదేళ్ల శ్రమ ఫలితం. ఫెలోషిప్ లేకుండా ఇది అసాధ్యం. ఏ దేశంలో కూడా పరిశోధనా విద్యార్ధులు ఫెలోషిప్పులు లేకుండా డాక్టరేట్లు చెయ్యరు. అమెరికా వంటి దేశంలో వేలాది కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, దానికి సరిపడా ఫెలోషిప్పులు వున్నాయి. అన్ని జాతుల వారికి, మన దేశం నుండి వెళ్లిన వారితో సహా ఫెలోషిప్లు విరివిగా లభించే ఏర్పాట్లు వున్నాయి. ఉన్నత విద్యలో అవకాశాలు పెరగటం, వున్నత విద్య నభ్యసించిన వారి శాతం పెరగటం ఒక దేశ అభివృద్ధికి చిహ్నం. మన దేశంలో 1990 ల తర్వాత, ముఖ్యంగా 2000 తర్వాత ఈ స్పృహ పెరిగి పరిశోధనలో అన్ని సమూహాలకి చెందిన విద్యార్థులు చేరేటట్లుగా చూడటానికి ఈ ఫెలోషిప్పుల సంఖ్యని పెంచారు. మౌలానా ఆజాద్ ఫెలోషిప్పులతో కలిపి అన్ని రకాల ఫీల్డులలో ప్రస్తుతం వున్నత విద్య నభ్యసించే వారికి - ఇంజనీరింగ్, మెడిసిన్ తో సహా - దాదాపు 5000 దాకా వున్నాయి. 1990 ల ముందు తో పోల్చుకుంటే ఇది ఎక్కువ గానే కనిపిస్తుంది కానీ, మన జనాభాతో, మనక్కావాల్సిన ఉన్నత విద్యా శాతంతో పోల్చుకుంటే ఈ ఫెలోషిప్పుల సంఖ్య పెద్ద ఎక్కువేం కాదు. 130 కోట్ల జనాభాలో తక్కువ భాగమున్న అగ్ర కులాల్లో 20% మంది డిగ్రీ చదువు, ఆ పైన చదివిన వాళ్ళు ఉంటే, అత్యధిక కులాల్లో, సమూహాల్లో ఈ శాతం 5 నుండి 16 వరకూ వుంది. ముస్లింలలో ఆ శాతం 5%. ముస్లింలలో కొన్ని వెనక బడిన సమూహాలు వెనుకబడిన వర్గాలలో భాగం గాను, చాలా కొన్ని అంటరాని తనాన్ని అనుభవించిన సమూహాలు షెడ్యూల్డ్ కులాల సమూహంలో భాగం గాను, అతి కొన్ని ఆదివాసీ సమూహాలు షెడ్యూల్డ్ తెగల లో భాగం గాను ఫెలోషిప్పులకి అర్హులుగా వున్నాయి. అందరూ కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిశోధనా విద్యార్థులకు నిర్వహించే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అర్హులే. కానీ వాటి కోసం తీవ్ర పోటీ వుంది. మౌలానా ఆజాద్ ఫెలో షిప్ తప్ప మత సమూహాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే అందుబాటులో వుండే ఫెలో షిప్లు లేవు. ఇది పొందితే వేరే ఫెలోషిప్ తీసుకోలేరు. కాబట్టి స్మ్రితి ఇరానీ ఇచ్చిన కారణం ‘అశ్వర్థామ హతః, కుంజరః” వంటి దన్నమాట. ముస్లింలలో విద్యా పరమైన వెనుకబాటు తనం ఉందని జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ 2006 లో తెచ్చిన రిపోర్టు వల్ల తేటతెల్లమయింది. ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ వారి శాతం జనరల్ కేటగిరి వారి విద్యా స్థాయి కంటే చాలా తక్కువగా ఉందని, ముఖ్యంగా వున్నత విద్యలో వారి శాతం 4. 1 శాతం మాత్రమే ఉందని 2000 వరకూ వివిధ రకాల విద్యా సర్వేలు తెలిపాయి. ఈ నివేదికలన్నీ వచ్చిన తర్వాతే సుమారు 2012 నుండి, మైనారిటీ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్పులు అందిస్తూ వచ్చింది. విద్య డబ్బున్న వాళ్ళ విశేషాధికారంగా పరిణమించిన నయా ఉదారవాద కాలంలో ఈ పదేళ్లలో ముస్లిం విద్యార్థులలో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్పులు 58 లక్షలు మంది, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులు 73 లక్షలు మంది, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్పులు 11 లక్షల మంది వాడుకున్నారని మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా తెలుస్తుంది. అంటే, ఇంత మంది దేశాభివృద్ధిలో భాగమయ్యారన్న మాట. గత ఇరవయ్యేళ్ళల్లో ఆధునిక విద్యలో, ముఖ్యంగా ఉన్నత విద్యలో మత పరమైన మైనారిటీ విద్యార్థుల సంఖ్య పెరగటానికి ఇది ప్రధాన కారణం. 2001 నుండి ముస్లింలలో విద్యాపరమైన వెనుకబాటు తనానికి వారి మత పరమైన పిచ్చే కారణమని, వాళ్ళు ఆధునిక విద్యని కాదని, తమ పిల్లలని మత పరమైన విద్యనందించే మదరసాలకి పంపించి, ప్రధాన స్రవంతికి దూరంగా పెంచటం వల్లే అనేక రకాల వైపరీత్యాలు సంభవిస్తున్నాయనే చర్చ బలంగా ప్రబలింది. ఆయా మదరసాలని సంస్కరించటానికి అనేక రకాల స్కీములు 2004 నుండి మొదలయ్యి ఈ మధ్య వరకూ నడిచాయి. వేలాది మద్రసాలకి సైన్స్, లెక్కల ఉపాధ్యాయుల్ని పెట్టుకోవటానికి కొంత మేరకి డబ్బు ఇవ్వటం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాల్లో మద్రసాలు ఈ స్కీము ద్వారా విద్యార్థులకి ఈ పాఠాలు కూడా చెప్పి మామూలు స్కూల్ పరీక్షలు కూడా రాయించాయి. మాను విశ్వవిద్యాలయానికి చెందిన రెహానా సుల్తానా వంటి కొంత మంది ముస్లిం విద్యావేత్తల కృషి వల్ల అటువంటి అనేక మంది విద్యార్థులు దూర శిక్షా సదుపాయం ద్వారా ఆధునిక విద్యకి అర్హత సాధించి డిగ్రీలు పొందారు. కొంత మంది డాక్టరేట్లు కూడా చేసారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పెద్ద పెద్ద విద్యా సంస్థలు రెండు రకాల విద్యలని అందించే ప్రయత్నాల్ని చేస్తున్నాయి. ఆధునిక విద్యావంతులయిన ఉలేమా ఇప్పటి ముస్లింలకు చాలా అవసరమని వారి ఉద్దేశం. మత పరమైన విద్య కారణంగానే ముస్లిం సమూహాలు ఆధునిక సమాజం లోనికి రావటానికి తిరస్కరించి భారతీయ సమాజాన్ని, దేశాన్ని వెనక్కి లాగుతున్నాయని ఇప్పటికీ ఘోషించే వాళ్ళు గుర్తించాల్సిన విషయం గత కొన్ని దశాబ్దాలలో ముస్లింలలో ఆధునిక విద్యకి పెరిగిన డిమాండు, ముఖ్యంగా ఇంగ్లీషు విద్యకి పెరిగిన డిమాండు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం స్పందించాలని ముస్లిం సామాజిక కార్యకర్తలు చేసిన కృషి ఫలితమే పైన పేర్కొన్న వివిధ రకాల స్కాలర్షిప్పులు. దక్షిణ భారత దేశం ఈ విషయంలో కొంత మేరకు మెరుగ్గా ఉండటానికి కారణం గత రెండు దశాబ్దాల కాలంలో ముస్లిం సమూహాలకు కల్పించిన రిజర్వేషన్. దాని వల్ల ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ ముస్లిం విద్యార్థులు పెరిగి, దక్షిణ భారత విశ్వవిద్యాలయాల్లో వారి శాతం జనరల్ కేటగిరి విద్యార్థుల స్థాయికి పెరిగిందని, ఉత్తర భారత దేశంలో అలీఘర్ లేదా జామియా వంటి మైనారిటీ విద్యా సంస్థలని మినహాయిస్తే అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ ముస్లిం విద్యార్థుల శాతం 1 నుండి 2 శాతం మించట్లేదు అని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే 2019 జాతీయ విద్యా సర్వే కూడా ఉన్నత విద్యా శాతం ముస్లింలలో అన్ని సమూహాల కంటే తక్కువ గానే (5%) వున్నదని, ఇది ఇతర వెనుకబడిన, వివిక్షకి గురయ్యే సమూహాల స్థాయి కంటే కూడా తక్కువుందని తెలిపింది. ఉన్నత విద్యలో వెనుకబడి ఉండటం వెనుకబాటు తనానికి, వివక్షకు ఒక ప్రధాన సూచిక అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట మైనారిటీలకు (ఇతర వివక్షని, వెనుకబాటు తనాన్ని ఎదుర్కొనే సమూహాల విద్యార్ధులకి ఇచ్చే) ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ లని కూడా రద్దు చేసింది. ఇప్పుడు మౌలానా ఆజాద్ ఫెలోషిప్పులని రద్దు చేసింది. దీని కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ శాతం ముస్లిం విద్యార్థులు అవటంతో ఈ రద్దు ఉద్దేశం ముస్లిం విద్యార్థుల భవిశ్యత్తుని దెబ్బ తీయటమే ననే అనుమానం బలంగానే కలుగుతోంది. ముస్లిం విద్యార్థులతో మొదలయిన ఈ కాండ, దళిత, ఆదివాసీ, ఇతర వెనుకబడ్డ సమూహాలకి చెందిన పరిశోధక విద్యార్థుల ఫెలోషిప్పులకి కూడా గండి కొట్టదని ఎలా నమ్మటం? స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల పాటు దేశంలో కొన్ని తరాల పాటు ఆధిపత్య కులాల ప్రజలు, అతి తక్కువ ఖర్చుతో, ప్రభుత్వ విద్యాలయాల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుని అన్ని రకాల ఉద్యోగాలు పొందారు. 1990 లలో ఫ్యూడల్ కుల వ్యవస్థ నుండి అణగారిన కులాల, సామాజిక వర్గాల వారు కొంత మేరకు బయటపడి తాము కూడా చదువుకోవాలంటూ తలెత్తి చూసేటప్పటికి, నయా ఉదారవాదం పేరుతో ప్రజల కోసం పెట్టె ప్రభుత్వ ఖర్చుని తగ్గించెయ్యాలనే పీనాసి భావజాలం ప్రభుత్వ విధానమయ్యింది. సంపద పెరిగిన 2000 దశకంలో విద్య కోసం ఖర్చు పెట్టాలనే వాదనకి కొంత సమర్ధన దొరికింది, అలాగే ఆయా సమూహాల్లో విద్యా దాహం కూడా పెరిగింది. అన్ని సామాజిక వర్గాల వారు దేశ అభివృద్ధిలో భాగం కావాలని ఆశించిన రాజ్యాంగ నిర్మాతల ఊహలు వాస్తవంగా మారే అవకాశం ఏర్పడిన ఈ చారిత్రిక సందర్భంలో ఇటువంటి తిరోగమన చర్యలు చేపట్టటం దేన్ని సూచిస్తుంది? ఎ . సునీత

Comments