Death of medical student Preethi in Warangal

ప్రీతీ బలవన్మరణం మన వ్యవస్థల వైఫల్యమే! మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ హాస్పిటల్ విధుల్లో పాల్గొంటున్న ధరావత్ ప్రీతి నాయక్ సీనియర్ పెడుతున్న వేధింపులని భరించలేక ప్రాణాలని తీసుకోవటం విషయాన్ని అర్ధం చేసుకున్న వారి మనసులని కలచి వేసింది. గత కొన్నేళ్లుగా ఇటువంటి అనేక మంది అసాధారణ విద్యార్థులు, విద్యార్థినులు ప్రాణాలు తీసుకునే పరిస్థితులకి విద్యా సంస్థలలో మారని కుల-లింగ సంస్కృతి కారణమని మనకు సెంథిల్ కుమార్ నుండి రోహిత్ వేముల, పాయల్ తడవి, ఇంకా అనేక మంది బలవన్మరణాలు పదే పదే తెలియ చేశాయి. విద్యార్థి ఉద్యమాలు లింగ వివక్ష, కుల వివక్ష, అనేక విద్యా సంస్థల్లో, ముఖ్యంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రబలిన వేధింపులతో కూడిన తీవ్ర పని వత్తిడి, అమలవ్వని లింగ వివక్ష, కుల వివక్ష వ్యతిరేక నియమాలు ఈ నేపథ్యంలో పట్టించుకోవాల్సిన అంశాలుగా బయటికి తెచ్చాయి. అణగారిన సమూహాలకు చెందిన యువకులు ఉన్నత విద్యా సంస్థల్లో ఎదుర్కునే సవాళ్ల గురించి 2016 లో రోహిత్ మరణంతో మొదలయిన చర్చకి అణగారిన వర్గానికి చెందిన యువతులు ఉన్నత విద్య లోకి రావటం గురించిన చర్చ కూడా తోడవ్వాల్సిన సమయం వచ్చింది. 1942 లో అఖిల భారతీయ అణగారిన వర్గాల మహిళా సదస్సులో మాట్లాడుతూ డా. బి. ఆర్. అంబేద్కర్ అందులో పాల్గొన్న సభ్యులకి, “మీ పిల్లలకి చదువు చెప్పించండి. వారిలో పైకి రావాలనే ఆశ కల్పించండి. తొందర పడి పెళ్లిళ్లు చెయ్యకండి. పెళ్లి ఒక గుదిబండ. వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడ గలిగే వరకూ వారిపై ఇంత పెద్ద బాధ్యత మోపకండి. .. పెళ్లయిన ప్రతి అమ్మాయి భర్తకి బానిసలా పడి ఉండకుండా, అతడికి స్నేహితురాలిగా, అతనితో సమానంగా నిలబడగలిగేటట్లు తయారుచేయండి” అంటూ సందేశమిచ్చారు. స్త్రీలందరికీ పురుషులతో అన్ని రకాల సమానత్వం రాకుండా ఆధునిక భారత దేశం తయారవదని బలంగా నమ్మిన స్త్రీవాది. ఈ స్త్రీవాదాన్ని ప్రాతినిధ్యం, అందరి భాగస్వామ్యం తో కూడిన ప్రజాస్వామిక సంస్కృతిని, వ్యవస్థలను నిర్మించాలనే అంబెడ్కర్ విస్తృత ప్రాపంచిక దృక్పధం, తాత్వికత లో, భాగంగా చూసుకున్నప్పుడు ధరావత్ ప్రీతి నాయక్ ఎదుర్కున్న పరిస్థితులు అర్ధం చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. మన కుల సమాజంలో అణగారిన కులాల, సామాజిక వర్గాల స్త్రీలని కులీన దృక్కోణంలో మునిగిన ప్రధాన స్రవంతి పని చేసే కూలీలుగానో, కట్టు బానిసలు గానో, మంచీ మర్యాద లేని స్త్రీలు గానో, ‘క్యారక్టర్’ లేని స్త్రీలుగా పరిగణించటం నేర్పింది. అనేకానేక ప్రభుత్వ పధకాలు, అవి జనాభా నియంత్రణ విధానం నుండి రైతు ఆత్మహత్యల పరిహార పధకాల వరకూ, కుల ధ్రువీకరణ పత్రాల నుండి ఆషా వర్కర్ల విధి విధానాల వరకూ వరకూ, ఆయా స్త్రీలపై అత్యాచారాల సందర్భంలో న్యాయస్థానాల నిర్లక్ష్యం నుండి సంక్షేమ హాస్టళ్లలో ఇప్పటికీ అమలయ్యే అవమానాలు, క్రూరత్వం, దోపిడీ - ఎక్కడ చూసుకున్నా వారిని తెలివి, మతి, మర్యాద లేని మంద లాగా తప్ప మర్యాద, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం వున్న మనుషుల్లాగా చూడటం ఇప్పటికీ అతి తక్కువ. ఎంత స్త్రీవాదం వచ్చినా, ఆధిపత్య కులాల స్త్రీలతో సహా సమాజంలో, తప్పని సరి పరిస్థితుల్లో తప్ప, ఆయా స్త్రీలంటే చులకన, చిన్న చూపు, ముఖ్యంగా లైంగిక పరమైన చిన్న చూపు ఇప్పటికీ ‘సాధారణమే’. వారి ప్రాణాలకి, మర్యాదకి, శరీరాలకి దక్కాల్సిన మానవత్వాన్ని ఈ సమాజం ఆపాదించటం ఇప్పటికీ ‘అసాధారణమే’. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న అంబెడ్కర్ అణగారిన వర్గాల స్త్రీలు తమ ఆత్మ గౌరవం ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని, సమాజం విధించిన వివిధ రకాల బానిసత్వాన్ని వదులుకోవాలని పిలుపునిచ్చి నప్పటికీ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ఈ మార్పు రాకుండా బలంగా అడ్డుకుంటూ వస్తున్నాయి. బంజారా సమూహానికి చెందిన ప్రీతి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందే స్థాయి దాకా రావటం మన స్వాతంత్య్రానంతర సమాజంలో ఇప్పటికీ అసాధారణమే. ఇతర అణగారిన సమూహాల్లో లాగే ఈ సమూహంలో కూడా ఉన్నత విద్య నభ్యసించ గలిగే యువత, అధిపత్య కులాలతో పోలిస్తే తక్కువ, అందులో యువతుల శాతం మరింత తక్కువ. 2021 లో కూడా వున్నత విద్యలో షెడ్యూల్డు తెగల స్త్రీల శాతం కేవలం 2.8% మాత్రమే. ఆర్ధిక స్థోమత సాధించి, పిల్లలందరినీ చదివించ గలిగే ప్రీతి నాయక్ కుటుంబాల వంటివి అతి తక్కువ. తమ సమూహంలో కూడా వుండే సెక్సిజం ని అధిగమించి ఆడ పిల్లలని చదివించటం ఒక పెద్ద అడుగు. తమ సమూహ స్త్రీలని చులకనగా చూసే అవకాశం ఉందని తెలిసిన ఆ తండ్రి ఆడ పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి అడుగులోనూ అండగా ఉన్నట్లు అర్ధమవుతోంది. చిన్నప్పుడే పెళ్లి చెయ్యకుండా అమ్మాయిలని ఉన్నత చదువులకి పంపించిన కుటుంబం ప్రీతిది. అయితే ఎంత జాగ్రత్తగా అణగారిన సమూహాల్లోని ఆడ పిల్లలని కుటుంబాలు చూసుకున్నా, ఇతర వ్యవస్థలు ఈ యువతులని అంతే జాగ్రత్తగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి ఏర్పడకపోతే ఏమవుతుంది. అంబెడ్కర్ తన రాజ్యాంగ రచనల్లో సమానత్వాన్ని స్థాపించాలంటే అసమానతలని నిర్మూలించటానికి ప్రతి వ్యవస్థలోనూ సంస్థాగత చర్యలు తీసుకోవాలని, ఆ చర్యలకి చట్ట బద్ధత వుండాలని చెపుతూ వచ్చారు. ప్రీతి విషయంలో కూడా సంస్థాగత కట్టుబాట్లు, చర్యలు చేపట్టక పోవటం, వేధింపులతో కూడుకున్న సంస్థాగత సంస్కృతి ఆమె ప్రాణాలని తీసుకుంది. ఆడపిల్లలని చదివించాలి, స్త్రీలు ముందుకెళ్లాలి అని చెప్పే ప్రభుత్వం, ఎట్లా అయినా సఫలీకృతులయిన స్త్రీలని హీరోయిన్లని వెన్ను చరిచే సమాజం రెండూ కూడా ఆయా స్త్రీలు పని స్థలాల్లో ఎదుర్కునే లింగ పరమైన చులకనా భావాన్ని ఇప్పటికీ అర్ధం చేసుకోలేక పోతున్నాయి. స్త్రీలు కాబట్టే వారికి బుర్ర తక్కువుంటుందని, సరిగ్గా పని చెయ్యరని, అందులో అణగారిన వర్గాల స్త్రీలయితే అసలు ఏ మాత్రం పనికిరాని వాళ్ళని ప్రతి చోటా అవమానాల పాలు చెయ్యటం చాలా మామూలు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకూ ఈ అవమానాలు ఎదుర్కోవటం పని స్థలాల్లో స్త్రీలకి రోజు వారీ అనుభవం. దీన్ని వేధింపుగా కొత్త చట్టాలు కొంత మేరకు తమ పరిధిలో గుర్తించాయి గానీ లైంగిక వేధింపులంటే ఎక్కువగా ఇతర సెక్స్ పరమైన వేధింపులపై ద్రుష్టి పెట్టటమే ఇప్పటికీ సాధారణం. స్త్రీలుగా పని స్థలాల్లో ఎదుర్కునే ప్రధాన మైన వేధింపులు - అందరి ముందూ చులకనగా మాట్లాడటం, పని రాదని అందరికీ చెప్పటం, ఆమె చేసే పనులని అప్రధానం చెయ్యటం, వారు మాట్లాడేది సీరియస్ గా తీసుకోకపోవటం, ప్రొమోషన్ ఇవ్వకపోవటం, ఇలా ఇవన్నీ లింగ పరమైన వేధింపులే. ఆయా స్త్రీలు స్వతంత్రులుగా వ్యవహరిస్తే సరే సరి. సామర్ధ్యం, ఆత్మాభిమానం వున్న ప్రీతి పని చేసే స్థలంలో వృత్తి పరమైన అవమానాన్ని తట్టుకోలేక పోయింది. మన రాష్ట్రంలో విశ్వ విద్యాలయాలతో సహా ఇటువంటి సంస్థాగత సంస్కృతి మారలేదు. ప్రత్యేకంగా వైద్య వున్నత విద్యనే తీసుకుంటే అవి దీనికి తగినంత బడ్జెట్లు కేటాయించ కుండా, తగినంత మంది వైద్యులని ఆస్పత్రుల్లోకి తీసుకోకుండా, ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు అన్నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధులపై ఆధారపడే లా చెయ్యటం దీనికి నేపధ్యం. వైద్య విద్య, అన్ని ఉన్నత విద్యల్లానే, తీవ్రమైన అధికార అసమానతలతో కూడుకుని ఉంటుంది. వనరులు సమ కూర్చటం, పని స్థలాల్లో అమలు చెయ్యాల్సిన మౌలిక చట్టాలు ఇక్కడ వర్తింప చెయ్యటం లైంగిక వేధింపుల కమిటీలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, థోరాట్ ఆధ్వర్యంలో తయారు చేసిన కుల వేధింపుల మార్గ దర్శకాలు అమలు చెయ్యటం దీనిని ప్రజాస్వామిక రించటానికి అవసరమైన అడుగులు. వున్న పరిస్థితుల్లో తీవ్ర వత్తిడిలో పని చేస్తున్న వైద్య విద్యా సంస్థల్లో అన్ని రకాల వేధింపులు జరగటం ఆశ్చర్య కరమేం కాదు కదా!. ప్రీతి నాయక్ బలవన్మరణం ఒక వ్యక్తి వేధింపుల కారణంగా మాత్రమే జరిగింది కాదు. అది ఒక వ్యవస్థా పరమైన వైఫల్యం. ఇంకా చెప్పాలంటే అనేకానేక వైఫల్యాల కూడిక. ఒక పక్క, ఆడపిల్లలని వున్నత విద్య దాగా చదివించగలిగే స్థితికి అణగారిన వర్గాలోని కొన్ని కుటుంబాలు చేరుకుంటుంటే, ఇంకో పక్క వారిని సమాన స్థాయిలో పరిగణించే సంస్థాగత సంస్కృతిని ఏర్పర్చలేని వైఫల్యం ఇది. విద్యకి, పౌరసత్వానికి మధ్య సంబంధం తెగి పోయిన సందర్భంలో కులం/లింగం నుండి బయట పడలేని పౌర సమాజం మధ్యలో అణగారిన వర్గాల స్త్రీలు పడే వేదనకి ప్రీతి బలవన్మరణం ఒక సూచిక. దీన్ని కేవలం ఒక వ్యక్తి వేధింపులకి కుదించి, సి బి ఐ విచారణ ద్వారా నేరస్తుల్ని పట్టుకుని శిక్షించటానికి పరిమితం చేయలేము. ఇక్కడ కష్ట తరమైన ప్రశ్నలని కూడా వేసుకోవాలి. ప్రభుత్వం నుండి సరయిన చర్యలు సరే, కులవ్యతిరేక ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు సామాజిక సంస్కృతిలో తెచ్చిన మార్పులు, చట్ట పరమైన సవరణలు ఉన్నత విద్యా సంస్థల్లో, కులీన పని స్థలాల్లో కొత్తగా చేరుతున్న ప్రీతి వంటి యువతులకు ఎందుకు ఉపయోగ పడట్లేదు? సమాజంగా మనం వ్యక్తిగత ప్రగతికి ప్రధాన పీట వెయ్యాలని మాత్రమే ఎందుకు చెబుతున్నాం? ‘మన పని మనం చూసుకుందాం, మన చదువు మనం చదువుకుని, ఒక మంచి వుద్యోగం కొడదాం’ అనే విలువని బలపరుస్తూ భవిషత్తు పాడై పోతుందనే భయంతో పిల్లలని సంస్థాగత మార్పుల కోసం కృషి చేసే ఏ రాజకీయాలకే దగ్గరికి చేరనీయకుండా ఆపటం సరైందేనా? ఎవరూ పట్టించుకోకుంటే జరగాల్సిన సంస్థాగత మార్పులు ఎట్లా జరుగుతాయి? ఏ మార్పు జరగకుండా మన వున్నత విద్యా సంస్థలు తమ లింగ వివక్షతో కూడుకున్న సంస్కృతిని ఎట్లా మార్చుకుంటాయి? ఆ సంస్కృతి మారకుంటే మన అణగారిన తెగల, కులాల, వర్గాల యువతులు ఆత్మ గౌరవంతో, నిబద్ధతతో ఎట్లా విద్యని పూర్తి చేసుకుంటారు, ఉద్యోగాలు ఎట్లా చేస్తారు, ఎట్లా బ్రతుకుతారు? ఇవన్నీ లేనప్పుడు మన ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది?

Comments