Iranian women's protests

ఇరాన్ లో హిజాబ్ నిరసనలు! 22 ఏళ్ల ఇరానియన్ యువతి మెహసా అమీనిని సెప్టెంబర్ 14 సెప్టెంబర్ న ఇరానియన్ సన్మార్గ పోలీసులు (ఘస్తే ఇర్షాద్/మొరాలిటీ పోలీసులు) టెహరాన్ లో తలమీద హిజాబ్ సరిగ్గా కట్టుకోలేదని కస్టడీ లోకి తీసుకుని జరిపిన హింసకి 16 న ఆమె చనిపోయింది. అధికారులు ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయిందని ప్రకటించి పోస్ట్ మోర్టమ్ రిపోర్టు కూడా ఇవ్వకుండా అంత్య క్రియలు జరపమని నిర్దేశిస్తే, బాధతో, కోపంతో తల్లడిల్లిన ఆమె తండ్రి మత పెద్దలని కూడా తన కూతురి దహన సంస్కారాల జోలికి రావొద్దని చెప్పారు. సన్మార్గ పోలీసులు చేసిన హత్యల్లో ఇది మొదటిది కాదు, చివరిది కాకపోవచ్చు. కానీ మెహసా అమీని కస్టోడియల్ హత్య తర్వాత మొదలయిన తీవ్ర నిరసనలు ఇరాన్ ని కుదిపేస్తున్నాయి. నిరసనల్లో టీచర్ల సంఘాల నుండి శ్రామికుల సంఘాల వరకూ, నగరాల నుండి చిన్న పట్టణాల వరకూ, అనేక రకాల స్త్రీల సంఘాల నుండి స్త్రీలు, పురుషులు తేడా లేకుండా, ముఖ్యంగా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేని స్థాయిలో స్త్రీలు తమ హిజాబ్ ని తగులబెట్టటం, సన్మార్గ పోలీసులని నేరుగా వ్యతిరేకించటం, పోలీసు వాన్లకి కూడా ఎదురెళ్లటం చేస్తుంటే, ఇంకో పక్క నిరసన కారులు ఇరానియన్ విప్లవంతో స్థాపించ బడిన ఇస్లానిక్ రిపబ్లిక్ కి మూల స్తంభాలయిన గార్డియన్ కౌన్సిల్ ని, రిపబ్లికన్ గార్డుల వ్యవస్థని, అసలు ఇస్లానిక్ రిపబ్లిక్ అన్న భావననే ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఫ్రెంచ్ సిద్ధాంత కర్త మిచెల్ ఫ్యూకో వర్ణించినట్లు విప్లవాత్మక భావన. దీర్ఘ చరిత్ర వున్న పర్షియాని పాశ్చాత్త్య వలసవాదులు తమ వశం చేసుకుని తమకనుకూలమయిన రాజు షా పెహల్వి ని గద్దె నెక్కించి దేశ వనరులని దోచుకోవటాన్ని సహించలేని ఇరాన్ ప్రజలు 1979 లో వివిధ రకాల ఇస్లామిస్టులు, వివిధ రకాల కమ్యూనిస్టులు, స్త్రీ వాదులు, ప్రజాస్వామ్య వాదుల కూటమి నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ని స్థాపించుకున్నారు. ఇస్లాం, ఆధునికత, గణ తంత్ర వ్యవస్థ మూడూ కలిసిన వ్యవస్థని నిర్మించుకోవాలనే వారి ఆలోచన ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది. పాశ్చాత్య దేశాలు దాన్ని గేలి చేశాయి. ఇరాన్ పై పొరుగు దేశం ఇరాక్ దేశ నేత సద్దాం హుస్సేన్ చేసిన దాడిని సమర్ధించాయి. ఆ యుద్ధంలో ఇరాన్ లక్షల మంది ప్రజలని పోగొట్టుకుంది. ఇరాన్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థ ఈ యుద్ధ కాలంలో వేళ్లూనుకుని, విప్లవం తర్వాత సంక్షోభాలని ఎదురుకున్న అనేక దేశాల లాగే, నిరంకుశ రాజ్య ధోరణులు అలవర్చుకుంది. మతాన్ని తన చేతుల్లో ఒక ఆయుధంగా మార్చుకుంది. తమంతట తాము పెద్ద ఎత్తున షా వ్యతిరేక పోరాటంలో పాల్గొని, ఇస్లామిక్ విప్లవాన్ని కోరుకున్న దేశ స్త్రీలపై హిజాబ్ ని, వదులు బట్టలు వేసుకోవటాన్ని డ్రెస్ కోడ్ గా అమలు చేసింది. దాన్ని అమలు చెయ్యటానికి సన్మార్గ పోలీసు వ్యవస్థని నెలకొలిపింది. ప్రభుత్వ వ్యతిరేకతని కఠినంగా నియంత్రించటానికి రిపబ్లికన్ గార్డుల వ్యవస్థని ఏర్పరిచి, గత నలభై ఇళ్లల్లో అనేక మందిని జైళ్లల్లో బంధించి, హింసించి, చంపించింది. విప్లవం తర్వాత ఏర్పడిన రిపబ్లిక్ లో అన్నింటి కన్నా శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ 12 మంది మగ మత గురువులతో కూడుకున్నదే. వాళ్ళే ఇరాన్ ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులని నియమిస్తారు. అధ్యక్ష పదవికి అభ్యర్ధులని వాళ్ళే ఎంపిక చేస్తారు. వాళ్ళు సమర్ధించిన వ్యక్తులే సాధారణంగా ఎన్నికవుతారు. అయితే ఇరాన్ లో రాజ్యం ఇలా అన్ని అధికారాలు తీసుకోవటం, రిపబ్లిక్ ని, ఎన్నికలని నియంత్రించటం, గార్డియన్ కౌన్సిల్ అన్ని రకాల అధికారాల్ని చెలాయించటం, మత పరమైన నియమాలని అమలు చెయ్యటం షియా ఇస్లాం లో అన్నింటికన్నా శక్తివంతమైన మత కేంద్రం, దాదాపు 80,000 మంది చదువుకునే, కోమ్ నగరం లోని మత గురువులతో సహా ఎవరూ పూర్తిగా సమర్ధించ లేక పోయారు. కోమ్ నగరంలో చదువుకున్న వాళ్ళలో సంస్కరణ వాదులు, మిత వాదులు, అతి వాదులు అందరూ ఉంటూ వచ్చారు. వీరిలో సంస్కరణ వాదిగా పేరున్న 2009 అధ్యక్ష అభ్యర్థి మౌసావి, హిజాబ్ వంటి డ్రెస్ కోడ్ నియమాలని పెద్దగా పట్టించుకోవద్దని నిర్దేశించిన ఇంతకు ముందు అధ్యక్షుడు హసన్ రౌహానీ, చిన్నతనం లోనే 5000 మంది ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ ఖైదీలని ఉరికంబం ఎక్కించి, రాజ్యాధికారం పరంగా, మత పరంగా కఠిన ధోరణులని అవలంబించే ఇప్పటి ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసి వరకూ వున్నారు. ఇరాన్ లో ఇటువంటి నిరంకుశ ధోరణులు పెరగటానికి, ఇస్లామిక్ గణతంత్ర రాజ్యాన్ని కూలగొట్టటానికి అప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రయత్నించిన పాశ్చాత్య దేశాలు తమ వంతు సహకారం అందించాయి. ఏదో ఒక నెపంతో ఆంక్షలు పెడుతూ వచ్చాయి. ఇరాన్ ఆయిల్ ని కొనకూడదన్నాయి. దశాబ్దాల తరబడి పిల్లలకి కావాల్సిన మందులు కూడా దొరక్కుండా అడ్డుకున్నాయి. మెహసా అమీని హత్య తర్వాత కూడా కొత్త ఆంక్షలు విధించాయి. ఇరాన్ లో ఆర్ధిక వ్యవ్యస్థని తీవ్రంగా దెబ్బ తిని, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువయ్యి లోపలి నుండి కూలి పోవాలని వీళ్ళ ఆశ. అయితే ఇరాన్ రాజ్యం, ప్రభుత్వం, ప్రజలు దీనిని గట్టిగానే తట్టుకున్నారు. గణ తంత్ర స్వభావాన్ని ఇరాన్ రాజ్యం అలవర్చుకుంది. ఆహారం, పెట్రోల్, నీళ్లు, అలాగే న్యాయం, ఆరోగ్యం సాధారణ ప్రజలకి సాధ్యమయినంత అందుబాటులోనే ఉంచింది. స్త్రీలకి రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులున్నాయి. కొంత మంది అధ్యక్షులు కఠిన ధోరణులు అవలంబిస్తే, మరి కొంత మంది సంస్కరణ వాదులు గా ఉంటూ వచ్చారు. మొన్నీ మధ్య జరిపిన సర్వేలో కూడా రిపబ్లిక్ కి మూల సూత్రాలయిన అమెరికన్ వ్యతిరేకత, ఇజ్రాయిల్ వ్యతిరేకత లని అత్యధిక ప్రజలు సమర్ధించారు. కానీ ఇస్లామిక్ స్పూర్తితో ఏర్పడిన గణతంత్ర రాజ్యం ఉండాల్సిన రీతిలో వుండట్లేదని, ప్రభుత్వం అట్లా పనిచెయ్యట్లేదని, తమకివ్వాల్సినవి ఇవ్వట్లేదని ఇరాన్ ప్రజలు వీలున్నప్పుడల్లా పోరాడారు. 1980 లలో ఖోమేనీ మీద మార్క్సిస్టు ఇస్లామిస్టు బృంద సభ్యులు దాడి చేశారు. 1999 లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. 2009 లో సంస్కరణ వాది గా పేరున్న మౌసావి ఎన్నికల్లో ఓడించబడినప్పుడు తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కోమ్ లోని కొంత మంది మత గురువులు కూడా ఇది తప్పని గార్డియన్ కౌన్సిల్ కి రాశారు. ఆంక్షల వల్ల కుదేలయిన ఆర్ధిక వ్యవస్థలో, గార్డియన్ కౌన్సిల్, రిపబ్లికన్ గార్డు అధికారుల అవినీతి గురించి 2017 నుండి నిరసనలు జరుగుతూనే వున్నాయి. ఇరానియన్ స్త్రీలు వీటన్నింటిలో భాగమే. వారెప్పుడూ బాధితుల్లాగా తమని తాము భావించుకోలేదు కూడా. రాజ్యాంగమిచ్చిన అన్ని హక్కులని వినియోగించుకుంటూ వచ్చారు. ప్రాధమిక స్థాయి నుండి వున్నత విద్య, అన్ని ఉద్యోగాల ల్లో సమాన స్థాయిల్లో వున్నారు. ఇస్లాం ని స్త్రీవాద దృక్పధంతో పరిశీలించి ఇస్లామిక్ స్త్రీవాదాన్ని రూపొందించుకున్నారు. స్త్రీల సమస్యల పైన మ్యాగజైన్లు నడిపారు. షరియా కోర్టులు పురుషులకి అనుకూల తీర్పులిస్తున్నాయని, తాము కూడా ఖొరాన్ ని, హదీస్ ని పూర్తి స్థాయిలో చదువుకుని, ఇస్లామిక్ న్యాయ సూత్రాలు నేర్చుకుని, తమ కేసుల్ని తామే వాదించుకుని కొత్త మిలీనియం లోనికి వచ్చేటప్పటికి షరియా కోర్టుల్లో న్యాయమూర్తులు స్త్రీల హక్కులని పక్కకి పెట్టలేని స్థితికి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కువ మహిళా సినిమా దర్శకులున్నది ఇరాన్ లోనే. హసన్ రౌహానీ ఎనిమిదేళ్లలో సన్మార్గ పోలీసులని అదుపులో ఉంచటంతో యువకులతో సహా, యువతులకు కూడా రోజు వారి జీవితంలో మరి కొంత స్వేచ్ఛ అందుబాటులోకి వచ్చింది. క్రిందటి సంవత్సరం ఎన్నికయిన ఇబ్రహీం రైసి ఆహారం, పెట్రోలు ధరల్ని కట్టడి చెయ్యకుండా, వేరే పరిస్థితులని బాగు చెయ్యకుండా, తానేదో అంతా కట్టడి చేస్తున్నానని చూపించుకోవటానికి ఇస్లామిక్ రిపబ్లిక్ కి హిజాబ్ అత్యంత కీలకం కాబట్టి, హిజాబ్ నియమాలని సన్మార్గ పోలీసుల ద్వారా కట్టడి చేస్తానని ప్రకటించిన తర్వాతే మెహసా అమీని కస్టోడియల్ హత్య జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మహిళలు హిజాబ్ ని రాజ్య నిరంకుశత్వానికి వ్యతిరేక చిహ్నంగా పరిగణించి నిరసిస్తున్నారు. హిజాబ్ ధరించే ఇరానియన్ స్త్రీలు హిజాబ్ ని ధరించాలా, వద్దా అనే నిర్ణయాధికారాన్ని ఇస్లాం స్త్రీల కిస్తుందని, దాన్ని రాజ్యం నిర్ణయించకూడదని వాదిస్తూ హిజాబ్ వద్దంటున్న తోటి మహిళలతో కలిసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీటిల్లో వ్యవస్థతో, ప్రభుత్వ పని తీరుతో వారి కున్న అసంతృప్తి, పెరుగుతున్న ధరలు, అవినీతి పట్ల వ్యతిరేకత అన్నీ కలగలిసి వున్నాయి. ఇంత కాలానికి, ఎంతో కష్టపడితే వచ్చిన స్వేచ్చని వెనక్కి లాక్కుంటామంటే కలిగే ఆగ్రహముంది. ఇస్లామిక్ విప్లవ వారసత్వంలో తమకి లభించాల్సినవి లభించలేదని, దాని ఫలితాలు కొంత మందే స్వంతం చేసుకున్నారని, నిరంకుశ మార్గాల ద్వారా రిపబ్లిక్ నడపడానికి, రాజ్యాంగం, మతం తమకిచ్చే స్వేచ్ఛని ప్రభుత్వం లాక్కోవటానికి తాము ఒప్పుకోమని ఇరానియన్ స్త్రీలు, పురుషులు చేస్తున్న ఈ నిరసనలని ఆ దేశంలో వ్యవస్థ ప్రజాస్వామీకరణ కోసం జరిగే పోరాటంగా అర్ధం చేసుకుంటే తప్ప, హిజాబ్ ఇరాన్ స్త్రీల నిరసనలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారిందో అర్ధం చేసుకోలేము. అయితే 2009, 2019 లలోని నిరసనల్లాగే వీటిని కూడా ఇరాన్ ప్రభుత్వం అణచివేసే అవకాశం చాలా వుంది. ప్రభుత్వ లెక్కల్లోనే ఇరాన్ లో 130 మంది చనిపోయారు. వేల మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ఎవరి ఆచూకీ తెలపట్లేదు. నిరసనలు యూనివర్సిటీలకు కూడా పాకాయి. ఇరాన్ లో మిత వాదులు, సంస్కరణ వాదులు తప్పనిసరి హిజాబ్ నియమాన్ని తీసెయ్యమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కానీ నిరసనలు ఇంతటితో ఆగుతాయా అన్నది ప్రశ్నార్ధకమే.

Comments