Beauty Contests: New Questions

అందాల పోటీలు: కొత్త సవాళ్లు! తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు, అధికారుల్లో అత్యుత్సాహాన్ని, సాధారణ ప్రజల్లో ఉదాసీనతని, ఆలోచనాపరుల్లో కొంత కలవరాన్ని కలిగిస్తున్నాయి. దీనికి పెద్ద ఖర్చు పెట్టట్లేదు, పైగా దీని ద్వారా తెలంగాణాలో వల్ల టూరిజం పెరుగుతుందని ప్రభుత్వం అంటోంది. రెండూ నమ్మశక్యంగా లేవు. ప్రస్తుత ఫెడరల్ వ్యవస్థలో అనేకానేక కారణాల వల్ల డబ్బు తక్కువయిన రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులని ఆహ్వానించటానికి పడే తంటాలలో ఇదొకటని ఎంత కష్టపడి అర్ధం చేసుకుందాం అనుకున్నా, క్రిందటి ప్రభుత్వం చేయలేనిది మేమేదో కొత్తది చేసేసి, తామెంత గొప్ప వాళ్ళమో నిరూపించుకోవాలనే కోరికే ఎక్కువ కనిపిస్తోంది. మిస్ వరల్డ్ నిర్వాహకులు దీని వల్ల ఆడవాళ్ళలో ‘స్ఫూర్తి’ పెరుగుతుందని ప్రకటించారు. కానీ టూరిజం డిపార్టుమెంటునుండి మహిళా ఐ ఏ ఎస్ అధికారిని తీసెయ్యటంతో మొదలయిన ఈ కార్యక్రమం ప్రధానంగా మగవాళ్ళకి లోనే ఎక్కువ స్ఫూర్తిని నింపుతోందని మీడియా రిపోర్టులు చూస్తే తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మానవ అభివృద్ధి సూచికలో, ముఖ్యంగా చదువు, ఆరోగ్యం లో వెనక బడి, అన్ని రకాల హింసని ఎక్కువగా ఎదుర్కుంటున్న సాధారణ తెలంగాణ మహిళలకి, రాజకీయాలు, ఉద్యోగాలు, పరిశ్రమల్లో వాటా లేనట్లే ఈ ప్రపంచ సుందరి పోటీలని టివి లలో చూడడం తప్ప ఏమీ దొరకదు. వాళ్ళకేమీ సౌందర్య పిపాస తక్కువ లేదు. ఉన్నంతలో మంచిగా తయారవుతారు. చీరల రంగులు, జాకెట్ల డిజైన్లు, మ్యాచింగ్ నగల విషయంలో అన్ని సమూహాల స్త్రీలకీ, తమ స్థోమతని బట్టి కావాల్సినంత ఆసక్తి వుంది. అదే లేకుంటే ఇన్ని రక రకాల దుకాణాలు, ఇంస్టాగ్రామ్ అకౌంట్లు, గల్లీ చివర మగ్గం వర్క్ షాపులు పెరిగేవి కాదు. ఈ గల్లీ ఫ్యాషన్ ప్రపంచంలో భర్తలు, మగవాళ్ల కంటే, తోటి ఆడ వాళ్ళ ప్రశంసలే ప్రధానం. తెలుగు సినిమాలు ఆడవాళ్లకుండాల్సిన ప్రధాన గుణం అందం అనీ, వాళ్ళు కేవలం మగవాళ్ళ కోసమే అందంగా తయారవుతారని దశాబ్దాల నుండి అందర్నీ నమ్మించటానికి ప్రయత్నిస్తున్నాయి. 20 వ శతాబ్దం మధ్యలో చదువులు, ఉద్యోగాల కోసం పరదా నుండి బయట కొచ్చిన ఆధిపత్య కుల స్త్రీలకి ఆధునిక సంస్కృతి తొడిగిన కొత్త పరదాల్లో ఒకటి అందం. చీర, దాన్నుండి కనీ కనిపించకుండా అతి సన్నటి నడుము, పెద్ద జడ, బొట్టు వుండే స్త్రీ శరీర రూపాన్ని తెలుగు సౌందర్యానికి ప్రతీకగా చేసిన బాపు బొమ్మ కొన్ని తరాల ఊహల్ని నిర్దేశించింది. ఓల్గా రాజకీయ కధలు, స్త్రీవాద కవిత్వం స్త్రీల జీవితాలని ఇటువంటి ఊహలు ఎంత బలంగా నియంత్రిస్తాయో వివరంగా విశ్లేషించినప్పటికీ వాటి ప్రభావం చదువుకుని ఆలోచించే ప్రజలకె పరిమితమయింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు, కొద్ది మినహాయింపులతో, స్త్రీలు = అందం అనే మూస లోనే బందీగా ఉండి పోయాయి. హీరోయిన్ల శరీర కొలతల గురించి బహిరంగంగా మాట్లాడటం, మిల్కీ బ్యూటీ, అందాలు ఆరబోయటం, నడిచొచ్చిన అందం అంటూ వర్ణించటం ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ రోజువారీ పదజాలంతో భాగం. కళలు, నైపుణ్యమున్న ఆడవాళ్ళకి పోషకులుగా వుండిన భూస్వామ్య సంస్కృతి అవశేషాలని మన సినిమా పరిశ్రమ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. ఇలా ఆడవాళ్ళని అందమైన శరీరాలుగా మాత్రమే చూసే భావన 1990 లో జరిగిన ప్రపంచీకరణ తర్వాత వస్తు ప్రధాన సంస్కృతిలో బాగా ఊపందుకుంది. 1990 లలోనే సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరీ మణులు అయ్యారు. గత ఇరవయ్యేళ్ళల్లో, వస్తువుల ఉత్పత్తితో పాటు వాటిని అమ్ముకోవటానికి స్త్రీల అందం ఒక ప్రధాన వనరుగా మారింది. ఈ సంస్కృతిలో అందమనే భావన కూడా రూపాంతరం చెందింది. అప్పటి వరకూ పుట్టుకతో వచ్చిన శరీర సౌందర్యం కొంత మంది ఆడవాళ్ళకి పెళ్లి కోసం పనికొచ్చేది. మార్కెట్ అందాన్ని ఆడవాళ్ళందరికీ తప్పకుండా ఉండాల్సిన గుణాల్లో ఒకటిగా మార్చింది. బాపు బొమ్మ వంటి నమూనాల నుండి కొన్ని భాగాలని తీసుకుని అందానికి ఒక కొత్త మూసని తయారు చేసింది. శరీరంపై ఒక్క వెంట్రుక లేకుండా, గీసిన కను బొమలు, నల్లటి జుట్టు, సన్న ముక్కు, తెల్లటి చర్మం, ఎర్రని పెదవులు కలిగి ఉండటం దీనిలో భాగం. అత్యధిక శాతం భారతీయ స్త్రీలు దీనిలో ఇమడరు. చక్కగా కనిపించాలనే వారి సహజ మైన కోరికని మార్కెట్ సంస్కృతి వాళ్ళ బలహీనతగా రూపుదిద్దింది. మా ఉత్పత్తులు వాడితే మీరు అందంగా తయారవుతారు అంటూ ఊదర గొట్టింది. అంతే కాదు, అందంగా ఉంటేనే సంతోషం, వుద్యోగం, కెరీర్ అన్నీ సాధ్యమవుతాయనే సరి కొత్త సక్సెస్ నమూనాని సమాజంలో ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో అందాల పోటీలు ప్రపంచ స్థాయి నుండి సాధారణ కాలేజీ ఫెస్టివల్ లో భాగంగా మారితే, చర్మ సౌందర్య ఉత్పత్తులు, మేకప్ సామాగ్రి అనేక మంది విద్యార్థులు, ఉద్యోగినుల నెల వారీ సామాన్లలో భాగమయ్యాయి. తెల్ల జుట్టు వుండే ఆడవాళ్లు సినిమాలు, సీరియళ్ల లోనే కాదు, నిజ జీవితంలో కూడా కనిపించటం మానేశారు. మార్కెట్ సంస్కృతిని తీవ్రంగా విమర్శించే వాళ్ళు కూడా దీని నుండి బయట పడలేనంత లోతుగా ఈ సౌందర్య భావజాల ప్రభావం వ్యాపించింది. ఈ నిర్దేశిత సౌందర్య నమూనా నుండి పక్కకి జరగితే చాలు, దాన్నొక జీవిత వైఫల్యంగా చూడటం కామన్ సెన్స్ గా మారింది.
ఇదేదో మన దేశానికి పరిమితమైన పరిణామం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి అనేక రకాల నిర్దేశిత సౌందర్య మూసలు ప్రతి దేశంలో వున్నాయి. అప్పట్లో అమెరికాలో ప్రబలిన ఈ సంస్కృతి గురించి నయోమి ఉల్ఫ్ 1990 లోనే ది బ్యూటీ మిత్ అనే పుస్తకంలో విశ్లేషించారు. ప్రస్తుతం దక్షిణ కొరియా దీనికి మంచి ఉదాహరణ. అందరికీ ఇష్టమయిన కొరియన్ పాప్, సీరియళ్ళలో నటించే అమ్మాయిలు నిజ జీవితంలో తిండితో సహా తీవ్రమైన కంపెనీల నియంత్రణలో వుంటారు. అయితే, సౌందర్య భావజాలం కేవలం శరీరం బయట ఆగిపోదు, లోపలికి ఇంకుతుంది. అది ఆడవాళ్ల ఆంతరంగిక చూపులో భాగంగా మారి, వాళ్ళు తమని తాము అంచనా వేసుకునే తీరునీ, ఆత్మ విస్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం టీనేజీ అమ్మాయిలు, యువతులలో తీవ్రంగా కనిపిస్తుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ సౌందర్య మూసల్లో ఇమడటానికి అమ్మాయిలు తిండి మానెయ్యటంతో వారిలో అనేక శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ పుణ్యమాని నగరాలకి పరిమితమైన ఈ రుగ్మతలు అన్ని చోట్లకీ పాకాయి. అమెరికాలో స్త్రీల ఉద్యమంలో పాల్గొన్న ఆడవాళ్ళకి కూడా మధ్య వయసులోకి వచ్చే టప్పటికి ఈ మూసల్లోకి ఇమడక తప్పలేదని బెల్ హుక్స్ రాసారు. 30 ఏళ్ల ప్రపంచీకరణ తర్వాత, బ్యూటీ పార్లర్లు ప్రతి గల్లీ లో పుట్టుకొచ్చి, అనేక మంది యువతుల జీవితాల్లో సౌందర్య ఉత్పత్తులు భాగమయిపోయి, అందం పరిశ్రమగా మారిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలని నిర్వహించి కొత్తగా ఏం సాధించాలని అనుకుంటోంది అని అడగటం అవసరం. దీనితో పాటు ఒక సమాజంగా మనం ఇప్పుడు వేరే ప్రశ్నలు కూడా అడగాలి. ఫ్యాషన్ పరిశ్రమలోకి వెళ్లే ఆడవాళ్ళని మినహాయిస్తే, ఈ అందం నమూనాలలో ఇమడ లేని అత్యధిక శాతం అమ్మాయిల మానసిక సంఘర్షణ గురించి మన వ్యవస్థలో అసలేమయినా అవగాహన వుందా? ప్రభుత్వం గాని, ఇతర విద్యా సంస్థలు గానీ దీని గురించి అధ్యయనాలు చేశాయా? చదువు, ఉద్యోగాలతో వచ్చే ఆత్మ విస్వాసాన్ని ఈ సౌందర్య నమూనాలు ఏ విధంగా దెబ్బ తీస్తున్నాయి? ఈ విమర్శ మార్కెట్ నుండి బయట పడి, అందంగా కనిపించాలనే ఆశ, చక్కగా తయారవ్వాలనే కోరికలని వదులేసుకుని ఇతరులిచ్చే కాంప్లిమెంట్లని ఆస్వాదించకూడదు అని చెప్పదు. ఎన్నో రకాల నియంత్రణ, వత్తిళ్లు, లేని తనం, వేధింపులతో కూడిన జీవితంలో ఆడవాళ్లు రంగు రంగుల బట్టలు, పూసల నగలు, మగ్గం ఎంబ్రాయిడరీ జాకెట్లు, జుట్టుకి రంగుతో చిన్న చిన్న ఆనందాలు పొందటం అవసరం. ఇవన్నింటిలో వారి వ్యక్తిగత ఇష్టాలు, నిర్ణయాధికారం ఉంటాయి. కానీ వారి నియంత్రణలో లేని మార్కెట్ పెద్దది, అక్కడ స్వయం నిర్ణయాధికారం తక్కువ. మార్కెట్ ఆడవాళ్ళ కిచ్చే ‘ఛాయస్’ ఎటువంటిది? బట్టలు, చెప్పులు, హెయిర్ క్లిప్పులు చవకగా అందించటం సరే, మన వేడి వాతావరణానికి సరిపడే సౌకర్యవంతమైన బట్టలు దొరుకుతున్నాయా? ఆడవాళ్ళ చెప్పులు గట్టిగా నడిస్తే తెగిపోయేటట్లు ఎందుకు తయారు చేస్తున్నారు? సల్వార్ లకి జేబులు ఎందుకుండవు? అత్యధిక శాతం వాడే చర్మ సౌందర్య ఉత్పత్తులకి ప్రభుత్వ నియంత్రణ ఉందా? వివిధ వయసుల ఆడవాళ్ల ఆరోగ్యంపై వీటి ప్రభావం ఏంటి? ఇవి కేవలం ఆడవాళ్లే కాదు, ఈ మధ్య ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చిన మగవాళ్ళ గురించి కూడా వెయ్యాలి. వాళ్ళు వేసుకుంటున్న బిగుతు జీన్స్, వాడుతున్న హెయిర్ జెల్స్ శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? చక్కగా తయారవ్వాలని, అందంగా ఉండాలనే కోరికలు మానవ సహజం. వాటిని వ్యవస్థీకరించి, పై నుండి మూసల ద్వారా నియంత్రించి, వ్యక్తుల చేతులనుండి నిర్ణయాలని తీసేసుకున్నప్పుడు అది సమస్యగా మారుతుంది. ఈ వ్యవస్థీకృత సౌందర్య నమూనా మనుషులకి తమతో, ఇతరులతో ఏర్పడే సంబంధాలని ప్రభావితం చేసి, జీవితంలో వచ్చే వత్తిళ్లకి తోడయినప్పుడు దాని గురించి లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. మా ఆవిడ ఎప్పుడూ దుప్పటి లాంటి నైటీ వేసుకు తిరుగుతుంది అంటూ ఇంట్లో పని చేసేటప్పుడు కూడా అందంగా వుండాలని ఆశించే భర్తలు, నేను అందంగా లేను కాబట్టే నాకు స్నేహితులు లేరు అని ఆత్మ విస్వాసం దెబ్బతిన్న టీనేజీ పిల్లల కుంగుబాటు, ఉద్యోగినులు ‘స్మార్ట్’ గా తయారయితేనే ప్రమోషన్లు ఇచ్చే బాసులు, అమ్మాయిలు వ్యాక్సింగ్ చేసుకోకుంటే డేటింగ్ కష్టం అని నమ్మే యువతీ యువకులు - ఈ పరిణామాలన్నీ అందం ఒక సామాజిక సమస్యగా తయారయిందని తెలియ చేస్తున్నాయి. వ్యక్తిగతంగా సంతోషం కలిగించే స్థాయి నుండి మనల్ని నియంత్రించే పనిముట్టుగా తయారయిన సౌందర్య పిపాసని మళ్ళా మన నియంత్రణ లోకి ఎలా తెచ్చుకోవాలన్నది ఇప్పుడు మన ముందున్న సవాలు!

Comments