అభినవ గిరీశాలు
గత నెల రాష్ట్రంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు తెలుగు సినిమా హీరోయిన్లు సమంత, నిధి అగర్వాల్ షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు చుట్టూ వున్న మగాళ్లు వారిని బహిరంగంగా వేధించారు. ఆయా మగవాళ్ల ముఖాలు స్పష్టంగా కన్పిస్తున్నప్పటికీ పోలీసులు వారి మీద ఏ కేసులూ పెట్టలేదు. అనుమతి లేకుండా ఆడవాళ్ళ శరీరాన్ని ముట్టుకోవటానికి ప్రయత్నించటం, తాకటం, బట్టలు లాగటం, లైంగిక వేధింపుల క్రింద వస్తాయని వారికి తెలియంది కాదు. ఆయా ఆడవాళ్లు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు అనటానికి ఇవి ఎక్కడో రహస్యంగా జరిగినవి కావు. మగాళ్ల గుంపు కుక్కల్లాగా మీద పడి వేధించిన ఈ దృశ్యాలని చూడని వాళ్ళు తక్కువ. ఇంత పేరున్న ఆడవాళ్లని వేధించినా, తమ మీద ఏ కేసూ రాలేదంటే ఈ పాటికి ఆయా మగాళ్లు ఏ స్త్రీనయినా సరే ఏమయినా చెయ్యొచ్చు అని కాలరెగరేస్తూ ఉండొచ్చు.
ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే జరగదని, ఏ పేరున్న హీరో బయటికెళ్లినా వాళ్లకి ఈ ఫాన్స్ తాకిడి జరుగుతుందని అనొచ్చు. అయితే, మగ హీరోలని లైంగికంగా వేధించటానికి ప్రయత్నించిన ఘటనలు తక్కువ. పైగా ఈ సంఘటనలని కేవలం సెలెబ్రిటీ సంస్కృతిలో భాగమని కొట్టిపడెయ్యలేము. ఉత్తర భారత దేశమంతా హోలీ పండుగప్పుడు ఇలా బహిరంగ వేధింపులు జరుగుతాయని, కొత్త సంవత్సర వేడుకలప్పుడు బెంగళూరులో, గోవాలో ఇలా వేధింపులు జరుగుతాయని వార్తల్లో వింటూనే వున్నాం. దీనికున్న చారిత్రక సాంస్కృతిక కారణాలు లోతయినవే.
బహిరంగ స్థలాల్లో తమ తమ కుటుంబ మగవాళ్ళతో కాకుండా తమంతట తాము స్వేచ్ఛగా తిరిగే ఆడవాళ్ళని భారతీయ మగస్వామ్యం ‘అందరికీ చెందిన ఆడవాళ్ళుగా’ పరిగణిస్తుంది. తర తరాలుగా భూస్వామ్య సంస్కృతిలో అధికార కులాల మగవాళ్ళు శ్రామిక వర్గ-కుల స్త్రీలని హక్కుగా వాడుకున్న అలవాటు వల్ల ఇంటికి బందీ అయ్యి ఉండకుండా బయట తిరిగి, పని చేసే ఆడవాళ్ళందరినీ తక్కువ చూపు చూసే అలవాటు మన సంస్కృతిలో చాలా బలంగా వేళ్ళూనుకుని వుంది. ఆ చూపు ఆడవాళ్ళని ‘మర్యాదస్తులు’ ‘అమర్యాదస్తులు’ అని విభజిస్తుంది. ఈ కనిపించని గీత కి సరయిన వైపు ఉండటానికి అంటే, తమని తాము మర్యాదస్తులని నిరూపించుకోవటానికి ఈ దేశంలో ప్రతి మహిళా, నాతో సహా, తమ శరీరం, ఆహార్యం, నడక, నడవడికని ఎప్పటికప్పుడు పోలీసింగ్ చేసుకుంటూ ఉంటుంది. బయట వేతనం కోసం పని చేసే ఆడవాళ్ళకి - వాళ్ళు కార్పొరేట్ ఉద్యోగి కావొచ్చు, రాళ్లు కొట్టుకునే కూలీ కావొచ్చు - ఈ వత్తిడి మరింత ఎక్కువ. గీతకి ఇటువైపుంటే మరొక మగవాడికి చెందిన మహిళకి ఇచ్చే గౌరవం, అటువైపుంటే అందరికీ చెందిన మహిళగా హేళన, వేధింపు, అవమానం, హింస రోజువారీ అనుభవం అవుతాయి. నిర్ణయించేది మాత్రం కుల-వర్గ మగస్వామ్య చూపు.
నటీమణుల వేధింపుల విషయంలో ఇంకొక పార్శ్వము కూడా వుంది. ఒక శతాబ్దం క్రితం వరకూ, తీరికగా కళ ని అభ్యసించి వాటిలో నైపుణ్యం తెచ్చుకున్న ఆడవాళ్ళందరూ కొన్ని ప్రత్యేక సమూహాల క్రింద పరిగణింప బడేవారు. తవాయిఫ్, దేవదాసీ, కళావంతులు,భోగం వాళ్ళు - అని వివిధ పేర్లున్న ఈ సమూహాల స్త్రీలు నృత్యం, సంగీతం, ఇతర కళల్లో ఆరి తేరి జమీందార్లు, రాజులు, జాగీర్దార్లు, ఇతర వ్యాపారస్తులని అలరించి, దానికి ప్రతిఫలంగా ఆస్తి ని పొంది, స్వతంత్రంగా బ్రతికే వాళ్ళు. రాచరిక- భూస్వామ్య పితృస్వామ్యంలో వీరికొక స్థానం ఉండేది. సంగీతం, కవిత్వం తో మెహఫిల్స్ నడిపి, ఇతర రకాల జ్ఞానాన్ని, దానితో పాటు పరపతిని సంపాదించి తమ హవేలీలో రాజ్య యంత్రాంగం నడిపిన మలఖా బాయి చందా వంటి హైద్రాబాదు వాళ్ళు కూడా వుండేవాళ్ళు. 20 వ శతాబ్దపు మొదట్లో ఫోటోగ్రఫి, సినిమా, అడ్వర్టైజ్మెంట్ లు వచ్చిన కొత్తల్లో బయట మెసిలే జ్ఞానం, ధైర్యం, ఆత్మ విస్వాసం వున్న గౌహర్ జాన్ అనేక మంది తవాఁ యిఫ్ లు తమ ఫోటోలని అగ్గిపెట్టెల నుండి గ్రామఫోన్లు వరకూ పబ్లిసిటీ కోసం ఇచ్చేవాళ్ళు. హిందూస్తానీ సంగీతంలో మొదట తమ పాటలని రికార్డు చేసుకున్న స్త్రీలు వీళ్ళే. అంటే అన్ని రకాల నృత్యం, సంగీతాలు శతాబ్దాల పాటు కాపాడింది ఈ సమూహాల స్త్రీలే. హిందీ సినిమాల నుండి తమిళ, తెలుగు సినిమాలలో మొదట ప్రవేశించిన నటీమణులలో అనేక మందికి ఈ కళా సమూహాల నుండి వచ్చిన నేపధ్యం ఉంది.
అయితే, ఇలా కుటుంబాల బయట స్వతంత్ర స్త్రీలు ఉండటం బ్రిటిషు మగస్వామ్యానికి నచ్చక 19 వ శతాబ్దపు రెండవ భాగంలో కొత్త చట్టాలు తీసుకొచ్చి, వీళ్ళపై అమర్యాదస్తులని ముద్ర వేసి, వాళ్ళ ఆస్తి, భూమి లాగేసుకుని వారిని అందరికీ శరీరాన్ని అమ్ముకునే స్త్రీలుగా దిగజార్చింది. ఈ మార్పులో అప్పటికి రూపు దిద్దుకుంటున్న భారతీయ మధ్య తరగతి మగస్వామ్యం కూడా అతి ఉత్సాహంగా పాల్గొంది. వీరేశలింగం వంటి మొదటి తరం మగ సంఘ సంస్కర్తలు ఈ చర్యలకి మద్దతు ఇచ్చారు. భర్తలకి మంచి భార్యలుగా ఉండటానికి ఆడవాళ్ళ చదువుకోవాలని ఆశించిన ఆ తరానికి అనేక విద్యల్లో ప్రావీణ్యమున్న ఈ ‘నాచ్ స్త్రీలు’ గౌరవానికి అర్హులుగా కనిపించలేదు. బ్రిటిషు విక్టోరియన్ భావజాలాన్ని తమదిగా చేసుకున్న మధ్యతరగతి మగస్వామ్యం జాతీయోద్యమ మప్పుడు బలపడి ఇటువంటి ‘అమర్యాద కరమైన’ సమూహాల స్త్రీల నుండి సంగీతం, నృత్యాన్ని ఉద్ధరించే కార్యక్రమం చేపట్టింది. తమ కుటుంబాల స్త్రీలకి కొంత సంగీతం, నృత్యం నేర్పించటంతో మొదలయి, ఆ కళా రూపాల నుండి శృంగార సంబంధింత పార్శ్వా లన్నింటినీ ‘అశ్లీలం’ పేరుతో తీసి పడేసి, దైవ భక్తికి ముడేసి ‘శాస్త్రీయ’ కళలుగా మార్చింది. ఆ క్రమం లోనే సదర్ నుండి భరత నాట్యం రూపొందింది. దీనికి దేవికా రాణి ఒక మంచి ఉదాహరణ. అప్పటికి భూమి, ఆస్తి, కుటుంబ చట్టాల్లో మార్పుల వల్ల కుటుంబ స్త్రీలకి మాత్రమే ఇటువంటి కళలు నేర్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా కళా సమూహాలు సెక్స్ వర్క్ లేదా సాధారణ రికార్డింగ్ నృత్యాల వంటి ప్రమాదకరమైన లైంగిక శ్రమ లోకి నెట్ట బడ్డాయి. కుల, వర్గ, మగస్వామ్య సంస్కృతి ఈ రెండిటి మధ్య గీత ని గీసి, నియంత్రించింది.
1947 తర్వాత పోషక వర్గ మగస్వామ్య చూపుతో రూపుదిద్దుకున్న సినిమావరణం, మధ్య తరగతి మగవాళ్ళకి అటు వైపు రికార్డింగ్ డాన్సులు, మరో పక్క శాస్త్రీయ నృత్య రూపాలు రెండూ కూడా ఒకే తెర మీద చూపించింది. పౌరాణిక, జానపద సినిమాల్లో మగ ఋషుల తపస్సుని భగ్నం చెయ్యటానికో, దేవేంద్రుడి సభలో రంభా ఊర్వశి నృత్యాలనో, రాజు సభలో నృత్యమనో, మగ కవికి ఉత్సాహం అందించటానికో, మగ హీరోల శృంగార కలల్లోనో వివిధ రకాల శృంగార శాస్త్రీయ నృత్య రూపాలు వాడారు. సాంఘిక సినిమాలు పెరిగాక మగవాళ్ళు క్లబ్బుల కొచ్చినప్పుడు మర్యాదస్తులు కాని స్త్రీలు కాబట్టి వాళ్ళతో రికార్డింగ్ నృత్యాలు చేయించింది.
మగస్వామ్య గీతాలని దాటందే ఏ స్స్త్రీ కళాకారిణి కాలేదు. సినిమాల్లో శృంగార నృత్యాలు, సంసార పాత్రలు, క్లబ్బు నృత్యాలు ఏం చేసే స్త్రీలయినా మధ్య తరగతి కుటుంబ స్త్రీలకి లేని స్వతంత్ర జీవితం, డబ్బు, స్వేచ్ఛ వృత్తి రీత్యా లభిస్తుంది. అయితే, మగస్వామ్య ద్వంద్వ విలువలని కాపాడటం కోసం, వాళ్ళు ప్రేక్షకుల కోసం తెరమీద ఎంత రిస్కీ పాత్ర పోషించినా, బయట మాత్రం సంప్రదాయ మహిళల మగ ఆధారిత జీవన విధానాన్ని అనుకరించాలి. కొంత మంది పెట్టి పుట్టిన వాళ్ళు తప్ప ఎవరూ తమ స్వతంత్రతని చూపించుకోలేరు. 1990 లలో ఆర్ధిక ఉద్దీపన విధానాల తర్వాత లైంగికత, శరీరం, బట్టల గురించిన విలువలు తీవ్ర గతిన మారిన తర్వాత, గత ఇరవయ్యేళ్ళల్లో తెరపై జీవితానికి, తెర బయట జీవితానికి మధ్య తేడా చెరిగి, హీరోయిన్ల స్వతంత్ర జీవితం కొంత వెలుగులోకి వచ్చింది. తమది కాని సంప్రదాయ జీవితాన్ని నటించాల్సిన వత్తిడి కొంత తగ్గింది.
కానీ తెలుగు మగస్వామ్య చూపు ఇంకా బలంగా నిలబడే వుంది. వెల్లువలా వచ్చిన సాంస్కృతిక మార్పు ని పక్కకి తోసి నయానో భయానో కొంత స్వతంత్రం, అధికారం, సమానత్వం రుచి చూసిన ఇటువంటి ఆడవాళ్లని బట్టల పేరుతో కట్టడి చెయ్యాలని చూస్తోంది. 19 వ శతాబ్దపు మగ సంస్కర్తలు తాము ఆడవాళ్ళ ఉద్ధరణ కోసమే అంతా చేస్తున్నామని భావిస్తే, ఇప్పటి సినిమా-మీడియా సంస్కర్తలు స్త్రీల రక్షణ కోసమే ఇదంతా చేస్తున్నామని అంటున్నారు. కానీ స్త్రీలకి రక్షణ కావాల్సింది ఎవరి నుంచి? భారత దేశం జెండర్ సమానత్వ దేశంగా అవతరించి 75 ఏళ్ళు అయింది. మహిళా పౌరుల రక్షణకి అనేక చట్టాలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వున్నాయి. పైగా, 1990 లలో ఆర్ధిక ఉద్దీపన విధానాల తర్వాత వచ్చిన ఉదారవాద సంస్కృతి నేపథ్యంలో మగస్వామ్య అధికారం, ద్వంద్వ విలువలని కాపాడ్డానికి కొత్త టెక్నాలజిని ఉపయోగించుకుని కట్టుబాట్ల పేరుతో మీడియా మోరల్ పోలీసింగ్ ని వ్యాప్తి చేసి సాధారణీకరించింది, తెలుగు మీడియానే కదా.
19 వ శతాబ్దపు చివర్లో బ్రిటిషు వాళ్ళు తీసుకొచ్చిన మార్పులని దేవదాసి సమూహానికి చెందిన బెంగళూరు నాగరత్నమ్మ వంటి స్త్రీలు ముద్దు పళని రాసిన శృంగార కావ్యం రాధికా స్వాతనం ప్రచురించి వ్యతిరేకించారు.
కొన్ని దశాబ్దాల తర్వాత 20 వ శతాబ్దంలో ముత్తు లక్ష్మి రెడ్డి వంటి మరి కొంత మంది కళలు, కళా రూపాలు సంతరించుకున్న కుల స్వామ్య రూపాన్ని వద్దన్నారు. శతాబ్దం క్రిందే తెలుగు నాట చదువుకున్న ఆడవాళ్లు మాకీ సంస్కరణ-సంరక్షణా-రక్షణా చట్రం వద్దు అంటూ మగస్వామ్య ద్వంద్వ విలువలని ప్రశ్నించారు. 1980లు, 1990 లలో వచ్చిన స్త్రీవాదం మగస్వామ్య చూపుని, దృక్కోణాన్ని ఎండగట్టింది. ‘నిండుగా’ చీర మాత్రమే కట్టుకున్న తరానికి చెందిన స్త్రీవాది అయిన జయప్రభ మగ చూపులని తట్టుకోలేక ఆడవాళ్ళకి ‘పైటని తగలేద్దాం’ అనిపిస్తుందని ప్రకటించారు. గత పదేళ్ల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆక్టివిస్టు స్త్రీలందరూ మీడియా మోరల్ పోలీసింగ్ కి, సైబర్ బుల్లియింగ్ కి వ్యతిరేకంగా గొంతెత్తుతూనే వున్నారు. కానీ తమ చూపు, ఆసక్తులు, ప్రయోజనాలు, సందేశాలు తప్ప వేరే ఏవీ పట్టని అభినవ గిరీశాలకి ఇవన్నీ ఎప్పుడు గుర్తుండాలి?
ఇక్కడ విషయం అసలు బట్టల గురించి కాదేమో. తామే పాత్ర పోషించినా, ఏ పని చేసినా, తమ సౌందర్యం గురించి తాము అవమాన పడమని, మగ స్వామ్యం గీసిన మర్యాద గీత ని, ద్వంద్వ విలువలని మేము పట్టించుకోమని చెప్తున్న ఆడవాళ్ళ గురించిది. మీ చూపు మార్చుకుని, మిమ్మల్ని మీరు ఎందుకు సంస్కరించుకోకూడదు అంటున్న అంటే వస్తున్న ఆగ్రహంలా వుంది. ప్రపంచమంతా స్త్రీల స్వతంత్రతకి అలవాటు పడుతుంటే, తెలుగు మగవాళ్ళు మాత్రం ఇలా మాట్లాడుతున్నారంటే, సంస్కరణ కావాల్సింది ఎవరికన్నట్లు? తమ ఒప్పుకోలు, చూపు, నియంత్రణ వద్దంటున్న స్త్రీలని చూసి, తప్పిపోతున్న తమ నియంత్రణని కాపాడుకోవటానికి ఆధునిక మగ స్వామ్యం చేస్తున్న ఆక్రందనల్లా కన్పిస్తున్నాయివి. ఈ మొత్తంలో నిధి అగర్వాల్, సమంత లపై బహిరంగ వేధింపులు జరిగితే, ఏ చట్టపరమైన చర్యా తీసుకోకుండా, చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకున్న పోలీసు వ్యవస్థది మాత్రం అతి ప్రత్యేక స్థానం!!

Comments
Post a Comment