వెనక్కి నెడుతున్న ట్రాన్స్ జండర్ హక్కుల సంరక్షణ (సవరణ) చట్టం
క్వియర్ కమ్యూనిటీలో అందరూ వ్యతిరేకించిన సవరణలతో పార్లమెంట్ హడావిడిగా గత వారంలో వారి గురించే అమలు లోకి తీసుకొచ్చిన ట్రాన్స్ జండర్ హక్కుల సంరక్షణ (సవరణ) చట్టం, గత దశాబ్ద కాలంలో ట్రాన్స్ ప్రజల జీవితాల్లో వచ్చిన పరిమిత ప్రగతిని వెనక్కి నెట్టింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కానీ, తామే ఏర్పాటు చేసిన జాతీయ ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కౌన్సిల్ ని కానీ, సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన న్యాయ మూర్తుల అడ్వైజరీ కమిటీ ని కానీ సంప్రదించకుండా, ఒక్క ట్రాన్స్ ప్రతినిధి కూడా లేని భారత పార్లమెంట్ 2019 లో తానే చేసిన చట్టంలో ఎవరూ అడగని సవరణలు తెచ్చింది. ఆ చట్టమే కొంత లోపభూయిష్టమనుకుంటే, ఇప్పటి సవరణలు 2014 లో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన నల్సా తీర్పు లోని ప్రధాన మార్గ దర్శకాలని నీరుగారుస్తాయి. వీటిలో అత్యంత ప్రధానమైంది, తమ జండర్ ని నిర్ణయించుకునే పూర్తి అధికారం వ్యక్తులకు మాత్రమే ఉండాలి, ఒకరి జెండర్ నిర్ణయించే అధికారం ఏ డాక్టర్లూ, మెడికల్ బోర్డులూ లేదా ఏ ప్రభుత్వ కమిటీలకీ ఉండదు. ప్రస్తుత చట్ట మార్పులు దీనికి పూర్తి విరుద్ధంగా అటువంటి ‘పరీక్షలు చేసే అధికారాన్ని’ మెడికల్ బోర్డులకి కట్టబెట్టాయి.
వున్నత న్యాయస్థానం నల్సా తీర్పు ద్వారా వ్యక్తులందరికీ (‘ట్రాన్స్’ వ్యక్తులకి మాత్రమే కాదు) జండర్ ని నిర్ణయించుకునే అధికారం ఇచ్చింది. అంటే పుట్టుకతో ఆపాదించిన మగ, ఆడ అనే జండర్ ని కాకుండా తాము గుర్తించుకున్న జండర్ లో బ్రతకాలనుకునే వ్యక్తులు, ఇతర జండర్ వ్యక్తులుగా మారటమే కాకుండా ఈ రెండింటి అవతల, నాన్ బైనరీ, గా కూడా ఉండొచ్చు. పుట్టుకతో ఆపాదించే మగ తనాన్ని వద్దనుకుని తమ లోపలి ఆడతనాన్ని స్వంతం చేసుకునే వ్యక్తి తనని తానూ స్త్రీగా, ట్రాన్స్ మహిళ గా, లేదా హిజ్రా, కిన్నర, జోగ్తా అనే వివిధ రకాలుగా పిలుచుకుంటారనీ; పుట్టుకతో ఆపాదించే ఆడతనాన్ని కాకుండా తమ లోని పురుషత్వాన్ని గుర్తించుకుని దానితో బ్రతకాలనుకునే ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారనీ, మూడవ జండర్ గా కొంత మంది మాత్రమే తమను తాము గుర్తించుకుంటారనే అవగాహననుండి వచ్చిన మార్గదర్శక సూత్రమిది. శరీర పరంగా ఆడ/మగ రెండు వర్గాల్లో ఇమడని శరీర లక్షణాలు వుండే ఇంటర్ సెక్స్ వ్యక్తులు కూడా తమ శరీరాలపై పూర్తి హక్కులు కలిగి, తమ జండర్ ని నిర్ణయించుకునే హక్కుని ఈ తీర్పు ప్రకారం పొందారు.
ఇదంతా, వైద్య శాస్త్రం, సైకాలజీ, లేదా జీవ శాస్త్రజ్ఞులు ఇచ్చిన జ్ఞానం కాదు. అణగారిన ఇతర సమూహాల లాగే, ఆయా ట్రాన్స్ సమూహాలు తమ గురించి తాము ఉత్పన్నం చేసుకున్న జ్ఞానం. గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సమూహాలే వైద్యులని, సైకాలజిస్టులని, పోలీసులని, బ్యూరోక్రాట్లని, మేధావులని, రచయితలని సమాజాన్ని మొత్తం చైతన్యవంతం చేసుకుంటూ వస్తున్నారు. ఇటువంటి చైతన్యాన్ని తమ పరిశోధనల్లోకి తీసుకు వెళ్లిన అనేక మంది శాస్త్రజ్ఞులు 2018 లో అమెరికాలో ట్రంప్ ఇటువంటి చట్టాన్ని తీసుకురావాలని చూసినప్పుడు 2000 మందికి పైగా, అటువంటి పరీక్షలు అశాస్త్రీయం, అనైతికం, హక్కులకు భంగ కరం అంటూ ప్రకటన విడుదల చేశారు https://not-binary.org/statement/. మన పార్లమెంటు మాత్రం, 2014 లో ఇటువంటి స్పూర్తితో ఇచ్చిన తీర్పుని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, దాన్ని తల కిందులు చేసి, జండర్ నిర్ణయించే అధికారాన్ని వైద్య నిపుణులకి ఇచ్చింది.
వైజ్ఞానిక రంగం, శాస్త్ర జ్ఞానం సామాజిక పక్షపాతాలకి అతీతంగా ఎప్పుడూ లేదు. ఐరోపాలో ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల అణచివేతని గుర్తించకుండా స్త్రీల ని అవయవాలకు కుదించి ప్రతి సమస్యకీ వారి గర్భాశయమే కారణంగా చూసేది. 19 వ శతాబ్దపు తెల్ల జాతి సమాజాల్లో నల్ల జాతి వారికి మేధ తక్కువుంటుందని, పశువుల్లాగా తీవ్రమైన బాధని తట్టుకోగలరని, సాధారణ ప్రజల్లాగే, సైంటిస్టులు నమ్మేవాళ్ళు, ప్రయోగాలు చేసేవాళ్ళు. ప్రభుత్వాలు ఇటువంటి జ్ఞానాన్ని ఉత్పన్నం చెయ్యటానికి సహకరించటమే కాకుండా, దీన్ని వుపయోగించి స్త్రీలు, పురుషుల నిర్వచనాల్లో ఇమడని వ్యక్తులని, వారి మధ్య సంబంధాలని, సమలైంగికత్వాన్ని చట్టాల ద్వారా నేరపూరితం చేశాయి. మానసిక వైద్యులు తిరిగి వారిని ‘కరెక్టు’ చేసే చికిత్సలు - షాక్ థెరపీ తో సహా - కనిపెట్టి వాడారు.
బ్రిటిషు వాళ్ళ రాకతో మన దేశంలో నేర చట్టాలకి, విజ్ఞాన నైపుణ్యానికి మధ్య ఈ లింకు ఏర్పడింది. వలస పాలన రాక ముందు పురుషుల మధ్య సమ లైంగికతకి, స్త్రీ-పురుష చట్రంలో ఇమడని వ్యక్తులకి భారతీయ సమాజంలో, సంస్కృతిలో, రాచరిక వ్యవస్థలో చోటు ఉంటూ వచ్చింది. బ్రిటిషు విక్టోరియన్ సాంప్రదాయ భావజాలం తమ సమాజంతో పాటు, తమ సామ్రాజ్యం వున్న అన్ని చోట్లా పితృస్వామ్య జండర్ వ్యవస్థలో ఇమడని వ్యక్తులు, సమూహాలని అనుమానితులు, నేరస్థులుగా పరిగణించే చట్టాలు చేసాయి. వాటిలో మొదటిది సమలైంగికత్వాన్ని నేరం చేసిన సెక్షన్ 377. స్థానిక బ్రిటిష్ అధికారులు హిజ్రాలు పిల్లలని ఎత్తుకుపోతారని, బలవంతంగా హిజ్రాలుగా మారుస్తారనే రూమర్లని వ్యవహార జ్ఞానంగా తమ పత్రాల్లో రాసుకుని, వీటితో ఒక మోరల్ పానిక్ సృష్టించి, 1871 లో హిజ్రాలని ‘సహజసిద్ధమైన’ నేర సమూహంగా ప్రకటించారని జెస్సికా హించీ విశ్లేషించారు. వారి ఆస్తులని స్వాధీనం చేసుకుని, రోడ్ల మీద నృత్యాలు, ఆడ బట్టలు వేసుకోవటాన్ని నిషేధించి, వారి పిల్లల్ని ఎత్తుకుపోయి, రోజూ పోలీసు స్టేషన్లో హాజరవ్వాలని చెప్పి వారిని తీవ్రంగా హింసించారు. ఈ చట్టాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో పని చెయ్యకుండా తిరగేవాళ్ళని, భిక్షాటన చేసే వాళ్ళని, లైంగిక శ్రమ చేసే వారిని నేరస్థులుగా పరిగణించే చట్టాలని కూడా వీరిపై వాడేవాళ్లు. ఈ చట్టాల అమలులో వైద్యులు, వారి జ్ఞానం, వారు తయారు చేసిన పరీక్షలు కీలక పాత్ర పోషించాయి. ఆయా చట్టాలు, అటువంటి వ్యవహార, శాస్త్ర జ్ఞానం, మెడికల్ హింస వలస పాలనాంతరం అలాగే కొనసాగి సమాజంలో సాధారణ జ్ఞానంగా పరిణమించింది.
జండర్ అంటే శరీర పరంగా పుట్టుకతో వచ్చే అస్తిత్వం కాదని, స్త్రీ పురుష పాత్రలని, అస్తిత్వాలని సమాజం తయారు చేస్తుందని, అందువల్ల వాటిని సంపూర్ణంగా మార్చటం కూడా సాధ్యమే నని 20 వ శతాబ్దపు స్త్రీవాదులు చెప్తే, జీన్స్, క్రోమోసోములు, జననాంగాలు, పునరుత్పత్తి అవయవాల పై ఆధారపడి ఒక జండర్ ని ఆపాదించినప్పటికీ ఆ మనుషులు భిన్నమైన జండర్ అస్తిత్వం ఏర్పర్చుకుంటారని ట్రాన్స్ ప్రజల ఉద్యమాలు మనకి నేర్పించాయి. జండర్ శరీర అవయవాలకి సంబంధించింది కాదని, మనసుకి సంబంధించిందని అర్ధం చేయించారు. శతాబ్దాలుగా మన సమాజంలో వుండిన హిజ్రా, కిన్నర, జోగథా వంటి సమూహాలు ఎవరి సహాయం, సహకారం లేకపోయినా తమ భిన్న జండర్ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే వచ్చాయి. అన్ని వైపుల నుండి విపరీతమైన హింస అనుభవించిన ట్రాన్స్ పురుషులు ఒకరి కొకరు అండగా నిలబడి తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నారని గత పదేళ్లలో మనకి తెలిసింది.
హిజ్రాలని, క్వియర్ వ్యక్తులని ‘సరిదిద్దాల్సిన వైపరీత్యాలుగా’ తప్ప సాధారణ మనుషులుగా పరిగణించని సమాజానికి 1990 ల తర్వాత వచ్చిన హిజ్రా, ట్రాన్స్, ఇతర క్వియర్ ఉద్యమాలు తమ పట్ల తమ కుటుంబాలు, విద్యా సంస్థలు, ఆఫీసులు, తోటి సమాజం చూపించే తీవ్ర వివక్ష, చేసే లైంగిక హింస గురించి వివరంగా చెప్పాయి. రేవతి, లివింగ్ స్మైల్ విద్య, శాంతా ఖురై, కల్కి వంటి అనేక మంది రాసిన ఆత్మ కధలు అన్ని స్థాయిల్లో అన్యాయానికి వ్యతిరేకంగా చెయ్యాల్సిన వారి సంఘర్షణ ని ఇతరులకి తెలియచెప్పాయి. ‘సాధారణ’ మనుషులు తేలిగ్గా అసాధారణమయిన క్రూరత్వాన్ని తమ మీద చూపించటానికి ఒక ప్రధాన కారణం తమ ఉనికినే నేరమయం చేసిన వలసవాద చట్టాలని, వాటిని తొలగించి అందరిలా పౌరులుగా పరిగణించని భారత ప్రభుత్వమని తేటతెల్లం చేశాయి. 2014 లో ఉన్నత న్యాయస్థానం ఆపాదించిన ఆడ, మగ జెండర్ లని తిరస్కరించే వారికి కూడా రాజ్యంగంలోని ప్రాధమిక హక్కులు వర్తిస్తాయని చెప్పి వారికి స్వతంత్రం వచ్చిన ఆరు దశాబ్దాలకి పౌరసత్వం ప్రసాదించింది. తమిళనాడు, కేరళ, ఒరిస్సా తో పాటు అనేక రాష్ట్రాల్లో ట్రాన్స్ జండర్ సంక్షేమ బోర్డులు స్త్రీలు, బలహీన వర్గాల కోసం వుండే కొన్ని సంక్షేమ పథకాల పరిధిలో ట్రాన్స్ సమూహాల వ్యక్తులకి కూడా కొంత అవకాశం కల్పించాయి. కానీ ఇవి తెలంగాణ తో సహా అత్యధిక రాష్ట్రాల్లో అత్యంత పరిమితులతో కొద్ధి మందికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పటికీ ట్రాన్స్ సమూహాల్లో అత్యధికులు జీవన పోరాటంలో చిక్కుకుని, సమాజం అంచుల్లో బ్రతుకుతూ, ఏ రకంగానూ ప్రభుత్వ సహాయాన్ని అర్ధించరు.
2026 చట్ట సవరణలు ఈ చాలీ చాలని, ఎక్కడా పెద్దగా అమలు కాని పథకాల ‘సరయిన’ అమలు కోసం ‘ట్రాన్స్’ వ్యక్తుల నిర్వచనాన్ని హిజ్రా, కిన్నెర వంటి సమూహాలకి, ఇంటర్ సెక్స్ వ్యక్తులకి కుదించి, వారు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులవటానికి మెడికల్ టెస్టులు చేయించుకోవాలని అంటూ ట్రాన్స్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్ట పరిధి నుండి అత్యధిక శాతం వ్యక్తులని తొలగించింది. వ్యక్తులకి తమ జండర్ నిర్ణయించుకునే అధికారం ఉంటుందని, లింగ, జండర్ అస్తిత్వం శరీర అవయవాల నుండి వచ్చేది కాదని సుప్రీమ్ కోర్టు 2014 లో ఒప్పుకున్న సత్యాన్ని పక్కకి తోసి, ట్రాన్స్ అస్తిత్వాన్ని, ఇంటర్ సెక్స్ శరీరాలతో ముడేసి, జండర్, లింగ పరమైన సోయి లేని శాస్త్ర జ్ఞానంతో పని చేసే మెడికల్ టెస్టులకి అనుసంధానించి మనల్ని కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తోంది. ‘నిజమైన’ టాన్స్ వ్యక్తులని, ‘మోసపూరిత’ ట్రాన్స్ వ్యక్తులనుండి, సుప్రీమ్ కోర్టు వద్దన్న పరీక్షల ద్వారా, వేరు చేసే అధికారం ఈ మెడికల్ బోర్డులకి ఇచ్చింది. ఒక దశాబ్దం పైగా పోరాడుతున్న ట్రాన్స్ మగవాళ్ల ఉనికినే గుర్తించలేదు. ఆడ, మగ అస్తిత్వాల్లో ఇమడని వాళ్ళనీ గుర్తించలేదు. అసలు మేమే మీ జండర్ ని నిర్ణయిస్తామంటోంది. ట్రాన్స్ వ్యక్తులని కుటుంబం హింసించినా సరే అక్కడే ఉండాలని, బయటి కొచ్చి వేరే ట్రాన్స్ సమూహాల సహాయం తీసుకుంటే, అలా సహాయం చేసిన వారికి కఠిన శిక్ష వేసే ప్రకరణని పెట్టింది. ఈ శిక్షలు ట్రాన్స్ వ్యక్తులపై లైంగిక దాడి చేస్తే వేసే రెండేళ్లకంటే చాలా ఎక్కువ. 19 వ శతాబ్దపు వలస చట్టాల లాగా ట్రాన్స్ ప్రజల ఉనికినే నేరమయం చేసే చట్టమిది.
ట్రాన్స్ ప్రజలు పెద్దగా ప్రభుత్వ సంక్షేమంపై ఆధారపడి బ్రతకట్లేదు. 2019 నుండి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వార్షిక బడ్జెట్ లో అయిదు నుండి పది శాతం మాత్రమే ఖర్చు చేసిందని పార్లమెంటు సభ్యులు క్రిందటి వారం చర్చలో ఎత్తి చూపారు. తీవ్రమైన శారీరక, ఆర్ధిక, సామాజిక హింస ఎదుర్కుంటూ కూడా, చదువున్నా ఉద్యోగాలు, పనుల్లో రానివ్వరు కాబట్టి అనేక మందికి భిక్షాటనపై, సెక్స్ వర్క్ పై ఆధార పడటం తప్పట్లేదు. అయితే, 2014 తీర్పు తర్వాత వచ్చిన చిన్న వెసులుబాటుతో కొంత మంది ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. మన రాష్ట్రంలో మెట్రో లోనూ, ట్రాఫిక్ కాన్స్టేబుళ్లుగా వున్నారు. కొంత మంది స్వంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు తమ కంటూ కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ముందు తరాల వాళ్ళు, యువతరం వారిని చదువు పూర్తి చేసుకొమ్మని చెబుతున్నారు. గ్రేస్ బానో ప్రచురణ సంస్థ ప్రారంభిస్తే, తమిళనాడు లో నర్తకి నటరాజ్ పద్మశ్రీ పొందారు. ట్రాన్స్ కళాకారిణి రేవతిని ప్రభుత్వమే పిల్లల స్కూళ్లల్లో జండర్ గురించి చైతన్య పరచమని అడిగింది. గత పదేళ్లలో కార్పొరేట్ సంస్థల్లో కొంత కదలిక వచ్చింది. ట్రాన్స్ జండర్ కార్డు ద్వారా గుర్తింపు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంత వైద్య సహాయం లభిస్తోంది. కొందరయినా సరే, ట్రాన్స్ వ్యక్తుల తల్లి తండ్రులు, స్వీకర్, క్వియర్ బంధు వంటి సంస్థల్లో సభ్యులయి, ఒకరి నుండి ఒకరు నేర్చుకుని, తమ పిల్లలకి సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వాధికారులతో పని చేసి, ఇతరులని కూడా చైతన్య పరుస్తున్నారు. కిరణ్ నాయక్ వంటి ట్రాన్స్ పురుష ఉద్యమకారులు ఇతర సామాజిక సంస్థలు, ఉద్యమ కారులకి ట్రాన్స్ ప్రజల సమస్యలని అర్ధం చేయించటమే కాకుండా, అనేక ఇతర సమస్యలపై కలిసి పని చేస్తున్నారు.
2014 తీర్పు, 2019 చట్టం ఇచ్చిన అతి చిన్న వెసులుబాట్ల తోనే ఇంత ప్రగతిని సాధించిన ట్రాన్స్ ప్రజలని 2026 సవరణలతో ఇటువంటి దుర్మార్గమైన సవరణలతో మళ్ళా వెనక్కి నెట్టటం న్యాయమేనా?

Comments
Post a Comment