America-Israel's War on Iran: Context and Consequences

ఇరాన్ పై అమెరికా-ఇజ్రేయిల్ యుద్ధం: నేపధ్యం, పర్యవసానాలు ఎ. సునీత అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, చట్టాలకు వ్యతిరేకంగా జరుపుతున్న యుద్ధానికి రెండు ప్రధాన పార్స్వాలున్నాయి. మొదటిది ప్రపంచ రాజకీయాలు, ఆర్ధికం పై దాని ప్రభావం, రెండవది ఇరాన్ సమాజం ప్రజాస్వామ్యం, హక్కులు, స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా జరుపుతున్న పోరాటాలపై దాని పర్యవసానాలు. చమురు వేటలో పశ్చిమాసియాలో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, దాని సహచరుడు అఖండ ఇజ్రాయెల్ ప్రాజెక్టు లని వ్యతిరేకించిన ఇరానియన్ ఇస్లామిక్ రిపబ్లిక్, ఈ వ్యతిరేకత కారణంగా ఆర్ధిక ఆంక్షలకు గురయ్యి రాజకీయ ఇబ్బందులతో పాటు తీవ్ర ప్రాణ నష్టాన్ని ఎదుర్కొంది. అయితే, ఆవిర్భావ దశ నుండి దశాబ్దాల పాటు ఆత్మ రక్షణలో బ్రతకటం వల్లనో ఏమో, ఇస్లామిక్ రిపబ్లిక్ నియంతృత్వ ధోరణులని సంతరించుకుని ప్రజా నిరసనలని, ప్రతిఘటనని, పోరాటాలని నిరంకుశంగా అణచివేస్తూ వచ్చింది. ఈ నిరంకుశ ధోరణిని పాశ్చాత్య దేశాలు తమ ఇరాన్ ప్రజా వ్యతిరేక ఆంక్షలు కొనసాగించటానికి నిరంతరంగా వాడుకుంటే, ఒక పక్క ఆంక్షల బరువుని, మరో పక్క ప్రజాస్వామ్య లేమిని భరించిన ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలకి (esti'sâl - desperation/helplessness) లోనయి ఎట్లాగో అట్లా ఇస్లామిక్ రిపబ్లిక్ పోతే చాలు అనే పరిస్థితికి వచ్చారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై మొదలుపెట్టిన యుద్ధం ఎటువంటి పర్యవసానాలకి దారి తీయబోతోందో చూద్దాం. నేపధ్యం ఇరాన్ ఒక దేశమే కాదు, మానవ నాగరికతకి ఒక ప్రధాన కేంద్రం. ఇప్పటి అజర్బేజాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాక్, అర్మేనియా, జార్జియా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, తుర్కెమినిస్థాన్ ల తో పాటు టర్కీ, తజకిస్థాన్ లోని కొన్ని భాగాలు ఈ ప్రాంతం కేంద్రంగా పాలించే రాజుల క్రింద ఉండేవి. శతాబ్దాల పాటు పశ్చిమాసియా, సెంట్రల్ ఆసియా, దక్షిణ ఆసియా ల మధ్య లింకుగా ఉండటంతో భాష, తత్వ శాస్త్రం, విజ్ఞానం, సాహిత్యం, వ్యాపారం, వాణిజ్య సంబంధిత ప్రధాన కేంద్రంగా మారింది. గ్రీకు, అరబ్బు, టర్కిక్, మంగోల్ లు అనేక శతాబ్దాలు పరిపాలించినప్పటికీ స్థానిక పర్షియన్లు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చారు. 10 వ శతాబ్దంలో ఇస్లాం లోకి మారటం, సిల్క్ రూట్ వాణిజ్యంలో భాగం అవటం కలిపి, పర్షియన్లు పాలకులుగా మారటం కలిసి, పర్షియన్ భాష, విజ్ఞానం, సాహిత్యం వికసించటం ప్రారంభమయింది. ఇరాన్ జాతీయ గ్రంధంగా భావించే షహ్నమే ఈ సమయంలోనే స్వచ్ఛమైన పర్షియన్ లో కూర్చబడింది. పాలనా నిర్వహణలో శతాబ్దాల పాటు తాము గడించిన అనుభవాన్ని పర్షియన్లు ఎన్నో సామ్రాజ్యాలకు - మొఘలులు, బహ్మనీలు, విజయ నగర సామ్రాజ్యాలతో - సహా, తీసుకెళ్లి వాటికి తమ సేవలు, పాలనా నిర్వహణ నమూనాలు, ఫ్యాషన్లు, భాష, సైనిక వ్యూహాలతో సహా వ్యాపింప చేశారు. పర్షియన్ భాష ప్రభావం పశ్చిమాసియా నుండి చైనా వరకూ ప్రబలటంతో, భారత ఉప ఖండంలో 18 వ శతాబ్దం వరకూ రాజ భాషగా ఉంటూ వచ్చి, ఉప ఖండ సాహిత్యం, జ్ఞానాన్నీ ఇతర ఖండాలకు పరిచయం చేసింది. 18 వ శతాబ్దం చివరికి తమ సామ్రాజ్యం పతనమవుతున్న సమయంలో రష్యన్ సామ్రాజ్యంతో జరిగిన అనేక యుద్ధాలలో అప్పటివరకూ ఇరాన్ రాజుల పాలనలో వున్న అనేక ప్రాంతాలు ఇతరులకి చేరాయి. 20 వ శతాబ్దంలో అక్టోబర్ విప్లవం తర్వాత అవి సోవియెట్ యూనియన్ లో చేరటమో లేదా స్వతంత్ర ప్రాంతాలు కావటమో జరిగింది. ఈ సమయంలో ఆధునికత ఇరాన్ సమాజంలో ప్రవేశించి రాచరిక వ్యతిరేక భావనలకు దారితీయటంతో అప్పటి రాజు 1905 లో మజ్లీస్ (పెద్ద వాళ్ళ సభ) కి కొంత అధికారాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అదే సమయంలో ఐరోపా సామ్రాజ్య వాద వ్యాపారులు ఇరాన్ కి చేరి, అప్పటి రాజు చేసిన అప్పుల వల్ల, వ్యాపారం పై తమ ఆధిపత్యాన్ని సాధించి, ప్రభుత్వాన్ని నిర్దేశించే స్థితికి చేరుకున్నారు. ప్రపంచంలోనే 3 వంతుల పెట్రోలు బావులు ఈ భూభాగంలో బయట పడటంతో వీరి లాభాల దాహం మరింతగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిషు వాళ్ళు, రష్యన్లు కలిసి దేశాన్ని ఆక్రమించుకుని, 1943 లో టెహ్రాన్ ప్రకటన ద్వారా, తమకి కావాల్సిన చమురు బావుల నియంత్రణ సంపాదించుకుని, స్వాతంత్య్రాన్ని ప్రకటించారు. అప్పటికి ఇరాన్ కొంత మేరకు పార్లమెంటరీ రాచరిక వ్యవస్థ లోకి ప్రవేశించింది. సైన్యం లోనుండి పాశ్చాత్య దేశాలకి కూడా నచ్చే రాజుగా అవతరించిన రెజా షా పెహల్వి మజ్లీస్ కి కొంత అధికారాలు ఇచ్చాడు. అనేక ఒడుదుడుకులు తర్వాత సుస్థిర పాలన నెలకొల్పిన మొహమ్మద్ మోసద్దేక్ 1951 లో పార్లమెంటు అంగీకారం తీసుకుని చమురు బావులని జాతీయం చేసాడు. ముందు మద్దతు ప్రకటించిన షా అమెరికా, బ్రిటన్ బలవంతంతో అతడిని తీసేసాడు కానీ, ప్రజా ఉద్యమం కారణంగా మళ్ళీ వెనక్కి తెచ్చాడు. ఆ సెగ తట్టుకోలేక కొన్నాళ్ళు బయట గడిపాడు. అయితే అమెరికా, బ్రిటన్ మద్దతుతో సైనిక విద్రోహం చేసి మోసద్దేక్ ని తీసేసిన ఫేజ్లొల్లాహ్ జహేది సహకారంతో వెనక్కి వచ్చి 25 ఏళ్ల పాటు నిరంకుశ పాలన చేసాడు. అన్ని ప్రతిపక్ష పార్టీలని, కమ్యూనిస్టు పార్టీని, అన్ని రకాల నిరసనలని తీవ్రంగా అణచి వేసాడు. కొన్ని వందల మంది రాజకీయ ఖైదీలని చంపించాడు. ఇద్దరూ కలిసి అమెరికా, బ్రిటన్ లకి చమురు బావుల్ని కట్టబెట్టి, ఇరాన్ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారు. దేశ ఆర్ధికాభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కుంటుబడ్డాయి. ఈ నిరంకుశ, దేశీ, విదేశీ, పెట్టుబడిదారీ శక్తుల పాలనకి వ్యతిరేకంగా 1978 లో ప్రజాస్వామ్య వాదులు, కమ్యూనిస్టులు, ఫెమినిస్టులు, ఇస్లామిస్టు లతో కలిసి జరిపిన పెద్ద ప్రజా పోరాటంలో రాజా పెహల్వి దేశం వదిలి వెళ్ళిపోతే ఇరాన్ లో ఒక జాతీయ వాద, జనాకర్షక, షియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. ఈ రాజ్యంగం అందరికీ, ప్రభుత్వంతో సహా, సంరక్షకులు ఉండాలనే భావనని ప్రవేశ పెట్టి, ఎన్నికయిన ప్రభుత్వాన్ని నడిపించే సుప్రీమ్ కౌన్సిల్ ని, ఆడవాళ్ళకి మగవాళ్ళని సంరక్షకులుగా పెట్టింది. పరిశ్రమలని జాతీయం చేసి, పాశ్చాత్య ప్రభావాన్ని తగ్గించి, ఇస్లాం మత ప్రభావాన్ని పెంచే విధానాలని అనుసరించింది. అప్పటి వరకూ వున్న రాజకీయ పార్టీలని నిషేధించింది. అనేక ప్రాంతాల్లో వామ పక్ష వాదులు, పార్టీలు ఈ విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తే, వాటి అణచివేతలో అనేక మంది, ముఖ్యంగా కుర్దులు, మరణించారు. ఇది ఒక రకంగా సోవియెట్ యూనియన్ ఏర్పడినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారి పట్ల స్టాలిన్ పాటించిన విధానాలని పోలినవి. విధానాలని వ్యతిరేకించిన అంతర్గత విమర్శకులని రాజ్య వ్యతిరేకులుగా పరిగణించిన ధోరణి. 1920 లలో పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రారంభమయిన జాతీయవాదాన్ని కొనసాగిస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ అమెరికన్ వ్యతిరేకతని ఒక ప్రభుత్వ విధానంగా మార్చింది. దేశంలోనూ, పశ్చిమాసియాలోనూ జనాకర్షణ సంపాదించింది. పారిపోయిన పెహల్వి కి షెల్టర్ ఇచ్చిన అమెరికాని వ్యతిరేకిస్తూ విద్యార్థులు టెహ్రాన్ అమెరికన్ ఎంబసీ ఉద్యోగుల్ని బంధించి ఉంచినప్పుడు, వారిని విడిపించటానికి వచ్చిన అమెరికన్ ఎలైట్ సైనికుల్ని ఓడించిన సంఘటన దీనికి ఊతమిచ్చింది. ఆ తర్వాత అమెరికా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూల దొయ్యటానికి జరిపిన అనేక ప్రయత్నాలు ఇరాన్ ప్రభుత్వ ద్రుష్టి కోణాన్నే కాక, అక్కడి వామ పక్ష, స్త్రీవాద, ప్రజాస్వామ్య పోరాటాలని కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇరాన్ పై అమెరికన్ యుద్ధాలు: ఇరాన్ పాలకుల అమరత్వ కేంద్రిత దృష్టికోణం 1979 నుండి కూడా అమెరికా ఇరాన్ ప్రభుత్వాన్ని రెజీమ్ అని పిలుస్తూ ఎన్నో రకాలుగా దాని సాధికారతని దెబ్బ తియ్యటానికి ప్రయత్నించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడ గానే దాని మీద సమగ్ర ఆంక్షలు - ఆర్ధిక, రాజకీయ, విజ్ఞాన పరమైన, సైనిక సంబంధిత - విధించింది. డాలర్ పునాది పై నడిచే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఇరాన్ తన చమురు అమ్ముకోలేకుండా, ఇతర దేశాలతో వాణిజ్యం చేసుకోలేకుండా, వైజ్ఞానిక జ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోనీయ కుండా, ఆయుధాల్ని కొనుక్కోనీయకుండా చేసిన ఆంక్షలివి. వేరే దేశాలతో ఆర్ధిక లావాదేవీలని, సంబంధాలని తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ ఆంక్షలని తట్టుకుని, అంతర్గత ప్రతిఘటనని నిర్మూలించిన సమయంలో అమెరికా ఇరాక్ ని ఇరాన్ పైకి ఉసి గొల్పి, ఆయుధాలు, డబ్బు ఇచ్చి యుద్ధం మొదలు పెట్టించింది. 8 ఏళ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఇరు పక్షాలు కలిపి దాదాపు 20 లక్షల మందిని పోగొట్టుకున్నారు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ మీద ఆంక్షలని తీవ్ర తరం చేసి, అవసరమైన మందులు కూడా లేకుండా చేసి అనేక మంది పిల్లలు, స్త్రీలు, సామాన్య ప్రజల మరణాలకు కారణమయింది. దీన్ని తట్టుకుని నిలబడిన ఇరాన్ లో అమెరికా వ్యతిరేకత గట్టి పడింది. ఇరాన్ అమెరికాని ఇంకొక రెండు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై ఎదిరించి నిలబడింది. వాటిలో ఒకటి పశ్చిమాసియాలో అమెరికా బంటు అయిన ఇజ్రాయెల్ స్థానిక పాలస్తీనా ప్రజలపై దశాబ్దాల పాటు జరిపిన దిగ్బంధాన్ని, అణచివేత, మారణ హోమాలని వ్యతిరేకించి, అక్కడి ప్రతిఘటనా శక్తి అయిన హమాస్ రాజకీయ పార్టీ కి సమర్ధన ఇచ్చింది. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని మానవ హననమని స్పష్టంగా చెప్పింది. రెండు, తమకి న్యూక్లియర్ శక్తిని వృద్ధి చేసుకునే హక్కు ఉందంటూ, న్యూక్లియర్ శక్తిని ఉత్పన్నం చేసే ప్లాంటులని ఏర్పాటు చేసుకుంది. ఇది న్యూక్లియర్ ఆయుధాలున్న అమెరికాకి, ఇజ్రాయెల్ కి నచ్చక ఆయుధాలు తయారు చేస్తోందంటూ అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారు కానీ అనేక కష్ట నష్టాలకి వోర్చి అదే స్టాండు పై నిలబడింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పాటు నుండి పలు యుద్ధాల కారణంగా ఆత్మ రక్షణని ఇరాన్ పాలకులు తమ ప్రధాన ఎత్తుగడ చేసుకున్నారు. సైన్యంతో పాటు, ఇస్లామిక్ రిపబ్లిక్ ని కాపాడటానికి ఒక ప్రత్యేక నేవీ, ఎయిర్ ఫోర్స్, అధికారం వున్న ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్ ని, అంతర్గత రక్షణ కోసం ప్రజల మీద గూఢచర్యం చేసే బాస్జి పోలీసులని ఏర్పాటు చేసుకుంది. దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ నకబాలో తరిమేసిన పాలస్తీనియులు నివసించే శరణార్థ శిబిరంపై 1983 లో పాలెస్తీనియన్ లిబరేషన్ సంస్థ ఉందనే కారణంతో దాడి చేసి మారణ హోమం జరిపినప్పుడు ఆ షియా కేంద్రిత ప్రాంతంలో ఏర్పడిన హిజ్బుల్లా పార్టీ కి, దాని సైన్యానికి ఆత్మ రక్షణలో తర్ఫీదు ఇచ్చి ఒక బలమైన శక్తి గా తయారు చేసి అక్కడి నుండి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గేలా ఇరాన్ చేసింది. 2010 తర్వాత ఈ ఆత్మ రక్షణ ఎత్తుగడలో భాగంగా యెమెన్ లోని అప్పటి ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ - హూతీ - కి కూడా మద్దతు ప్రకటించింది. పశ్చిమాసియాలో పాశ్చాత్య దేశాలకి నచ్చని వీళ్లందరినీ ఇరాన్ దేశ ప్రాక్సీలు అంటారు గానీ, ఇవన్నీ భౌగోళికంగా పాలస్తీనా స్వాతంత్య్రాన్ని సమర్ధించే రాజకీయ-సైనిక శక్తుల మధ్య ఏర్పడిన అనధికార ఒప్పందాలుగా అర్ధం చేసుకోవాలని భౌగోళిక రాజకీయాలు పరిశోధించే నిపుణులు అంటారు. ఇరానియన్ అమెరికన్ రాజనీతి శాస్త్రజ్ఞుడు వలీ నసర్ ఈ నేపథ్యంలో ఇరాన్ పాలక వర్గం - రాజకీయ నాయకులూ, మత గురువులు, సైనికాధికారులు, శాస్త్రజ్ఞులు మొ. వారిలో - ఈ అమెరికన్ అష్ట దిగ్బంధం అమరత్వాన్ని ఆరాధించి, కోరుకునే సంస్కృతిని, మనస్తత్వాన్ని వృద్ధి చేసిందని విశ్లేషిస్తారు. అరబ్బు పాలనలో పర్షియన్ల కస్టాలు, ఇంకా వెనక్కెళ్ళి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ దాడుల్ని అన్నింటినీ తట్టుకుని నిలబడ్డామనే గర్వ పూరిత చరిత్రతో పాటు, షియా మత ఆవిర్భావ సందర్భమయిన కర్బాలా ని తమ స్వంతం చేసుకుని అమరత్వాన్ని అన్నింటికన్నా ఉన్నతమయిన విలువగా చూసే దృష్టికోణాన్ని ఏర్పర్చుకున్నారని అంటారు. దీన్ని కేవలం షియా ఇస్లాం నుండి సహజంగా వచ్చిన విలువగా చూసే కన్నా, ఇస్లామిక్ రిపబ్లిక్ అలవర్చుకున్న విలువగా అర్ధం చేసుకోవాలని అంటారు. ఈ ద్రుష్టి కోణంలో యుద్ధంలో చనిపోవటం అంటే ఓడిపోవటం కాదు, పై ప్రపంచంలో స్థానం సంపాదించటం. ఇరాన్ లో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు రెజా షా పెహల్వి కి వ్యతిరేక పోరాటాల్లో అన్ని భావజాలాల పురుషులు, స్త్రీలు పోరాడారు, ఆ క్రమంలో నిర్బంధానికి, బలవంతపు మరణాలకు గురయ్యారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత స్త్రీలపై, ఇతర మైనారిటీల మీద వివిధ రకాల చట్ట పరమైన ఆంక్షలు, పరిమితులు తీసుకొచ్చింది. కొంత మంది ఆంక్షలు భరించలేక గురయ్యి వేరే దేశాలకి వెళ్లి పోయారు. ప్రధానంగా మగవాళ్ళ ‘సంరక్షణ’ క్రింద వుండి ఉద్యోగాలకి, పాస్ పోర్టు తీసుకోవటానికి, వ్యాపారం చెయ్యటానికి మగవాళ్ల అనుమతి తీసుకోవాలని, విడాకులు తీసుకోవాలంటే తమ సాక్ష్యం తో పాటు ఇతరుల సాక్ష్యాలు కావాలని వంటి నిబంధనలతో పాటు, హిజాబ్ ని తప్పనిసరిగా వేసుకోవాలని తెచ్చిన నియమాలు ఆపేక్షింపదగ్గవి. అంతకు ముందు ఆధునికత పేరుతో షా తెచ్చిన హిజాబ్ నిషేధం ఎంత ఏక పక్షంమైనదో ఇది కూడా అంతే. ఒకటి, రెండు తరాల క్రిందే ఇటువంటి నియమాల నుండి బయట పడిన చదువుకున్న పట్టణ స్త్రీలకి ఇది తిరోగమనం లాగే అనిపించింది. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ స్త్రీలతో సహా అందరి విద్య కోసం కృషి చేసింది. 1979 లో 30 శాతం లోపున్న అక్షరాస్యతా శాతం ఇప్పుడు దాదాపు శతాబ్దం చివరికి దాదాపు 100 శాతానికి పెరిగింది. పాశ్చాత్య దేశాలలో లాగా ఆడవాళ్ళ మేధో సామర్థ్యం గురించి పనికిమాలిన చర్చలు చెయ్యకుండా, అందరికీ వున్నత విద్యలో ప్రవేశించే అవకాశమిచ్చింది. బహుశా ఇరాక్ తో యుద్ధంలో యువకులని కోల్పోవటం, అలాగే స్త్రీల మీద వుండే ఇతర ఆంక్షలు వాళ్ళు వున్నత విద్యలోకి వెళ్ళటానికి తోడ్పడి ఉండొచ్చు. విద్య తో పాటు ఆరోగ్యం మీద బాగా ఖర్చు పెట్టి మాతృ మరణాలని చాలా తగ్గించింది. దాదాపు జనాభాలో సగం మంది ఆహారం, ఇంధనం పైనా, ఇతర రకాలుగా వివిధ సబ్సిడీలు పొందుతారు కాబట్టి ఆడవాళ్ళకి కూడా సామాజిక రక్షణ లభిస్తుంది, అయితే, చదువుకున్న ఆడవాళ్ళకి, భారత దేశంలో లాగే, వేతనమిచ్చే శ్రమలో అవకాశాలు పోవటం వల్ల ఎక్కువగా కుటుంబం మీదే ఆధారపడవలసి వస్తుందని, శ్రామిక శక్తిలో వారి శాతం 14% మాత్రమే నని పరిశోధకులు రాశారు. ప్రభుత్వ ఆదాయంకూడా చమురు ఎగుమతుల మీదే ఆధారపడి ఉండటం, దాని పైన వున్న ఆంక్షల వల్ల సాంఘిక సంక్షేమాన్ని ప్రభావితం చేస్తే, ఆడవాళ్ళని షియా ఇస్లామిక్ వ్యవస్థ కుటుంబం లో భాగంగా మాత్రమే చూసి, వ్యక్తులుగా పరిగణించక పోవటం వల్ల వారికి అందాల్సిన సంక్షేమం అందకుండా చేస్తోందని కూడా విశ్లేషించారు. అయితే, ఆడవాళ్ళలో పెరిగిన విద్యా శాతం వూరికే పోలేదు. ఆడవాళ్లు కనీసం మూడు రకాలుగా తమ పరిస్థితులని బాగు చేసుకోవటానికి ప్రయత్నించారు. ఒకటి, ప్రభుత్వ అధికారుల, మత గురువుల భార్యలు ఆడవాళ్ళకి మరిన్ని వెసులుబాట్లు, అవకాశాలు కల్పించటానికి ఇస్లామిక్ ఫెమినిస్టుల పేరుతో, కొంత కృషి చేశారు. కొంత మంది ఇస్లామిస్టులు, పాలకులకి పూర్తి భావజాల పరమైన మద్దతు ప్రకటించి, పార్లమెంటుకి ఎన్నికయ్యారు. లౌకిక స్త్రీవాదులు స్త్రీల హక్కుల కోసం, స్త్రీల వ్యతిరేక చట్టాల ఉపసంహరణ కోసం, ముఖ్యంగా ‘సంరక్షకుల’ నియమం తీసెయ్యటం కోసం, నైతిక పోలీసుల ఉపసంహరణ కోసం అనేక నిరసనలు చేశారు. ఈ మూడు రకాల రాజకీయాలు వున్న స్త్రీలు కొన్ని విషయాల్లో కలిసి పని చేశారు కూడా. వీళ్ళు కాకుండా, కోర్టులలో, ఆఫిసుల్లో, బహిరంగ స్థలాల్లో మత నియమాలని ఎదిరించటానికి సాధారణ స్త్రీలు తామే ఖురాన్, ఇస్లామిక్ న్యాయ శాస్త్రాలు చదువుకుని ఆయా నియమాలు మత గ్రంధాలకి వ్యతిరేకమని తమ కేసుల్ని న్యాయ మూర్తుల ముందు తామే వాదించుకోవటం మొదలు పెట్టారు. కోర్టులలో ఇలా వాదించిన సాధారణ ఆడవాళ్ళ గురించి ఇరానియన్ బ్రిటీష్ ప్రొఫెసర్ జీబా మీర్ హుస్సేనీ డాక్యుమెంటరీ కూడా తీశారు. సంస్కరణలకి నిరంతరం పాటు పడుతూ వచ్చారు. వీళ్ళతో పాటు ఇస్లామిక్ రిపబ్లిక్ చేసిన చట్టాల్లో, విధానాల్లో, న్యాయ వ్యవస్థలో సంస్కరణ తేవటానికి ప్రయత్నించిన రాజనీతి శాస్త్రజ్ఞులు మతానికి, ప్రభుత్వానికి మధ్య దూరం ఉండాలని వాదిస్తూ వచ్చారు. ఇరాక్ యుద్ధం ముగిసిన తర్వాత, ప్రాగ్మాటిస్టులు, సంస్కరణ వాదులు ప్రభుత్వం లోకి వచ్చినప్పుడు కొన్ని నియమాలని చూసీ చూడనట్లు వదిలేయటం, బాసీజ్ ని నియంత్రించటం తో 1990 ల నుండి పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగానో, నైతిక పోలీసుల ఆగడాల గురించో, ప్రభుత్వంపై మత గురువుల నియంత్రణ వద్దనే, ఎన్నికల ఫలితాల గురించో చిన్నా, పెద్దా నిరసనల అలలు ఎగిసి పడుతూనే వున్నాయి. ఈ శతాబ్దంలో 2009, 2017 నిరసనల తర్వాత 2022 లో మెహసా అమీని అనే కుర్దిష్ ఇరానియన్ యువతిని హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని నెపం మీద బాసీజ్ పోలీసులు అరెస్టు చేసి, కొట్టి చంపటంతో, వచ్చిన నిరసనలు జిన్, జియాన్, ఆజాది (స్త్రీలు, జీవితం, స్వేచ్ఛ) నినాదంతో దేశం మొత్తం మీద, అనేక పట్టణాల్లో తీవ్ర నిరసనలు కొన్ని నెలల పాటు జరిగాయి. యువతీ, యువకులు పెద్దగా పాల్గొన్న ఈ నిరసనలు - ఆర్ధిక, రాజకీయ, సామాజిక - వ్యవస్థలో సమూలమైన మార్పులని కోరాయి. ఆడవాళ్లు హిజాబ్ ని బహిరంగంగా తగలబెట్టారు, మాపై మత పరమైన ఆంక్షలు తీసెయ్యాలన్నారు. ఈ నిరసనలపై ప్రభుత్వ అణచివేతలో 500 మంది పైగా కాల్పుల్లో చనిపోయారు. 2026 జనవరిలో ఆర్ధిక సంక్షోభం చెలరేగి, ద్రవ్యోల్బణం తీవ్రతరం అవటంతో, ఇంకా పెద్ద ఎత్తున చెలరేగిన నిరసనలని ప్రభుత్వం మరింత తీవ్రంగా అణచివేయటంతో అధికారిక లెక్కల్లో 3000 మంది చనిపోతే, అనధికార లెఖ్ఖల్లో మరింతమంది చనిపోయారని అంచనా. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న ప్రస్తుత యుద్ధం ఇరాన్ పై ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని అనేక మంది విశ్లేషకులు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కలల ప్రాజెక్టు ‘అఖండ ఇజ్రాయెల్’ కోసం జరుగుతున్నదిగా భావిస్తున్నారు. 1979 లో ఇరాన్ విద్యార్థులు అమెరికన్ ఎంబసీ ఉద్యోగుల్ని సంవత్సరం పైగా బందీలుగా పెట్టుకున్న ఘటన అమెరికన్ రక్షణ వ్యవస్థ మరిచిపోలేదు. అప్పటి నుండే అమెరికా ఇరాన్ ని ఒక టెర్రరిస్టు దేశంగానే పరిగణిస్తూ వచ్చింది. ఇరాన్కి సంబంధం లేక పోయినా 2001 లో ట్విన్ టవర్లపై దాడుల తర్వాత అమెరికా ఇరాన్ ని కూడా యాక్సిస్ అఫ్ ఈవిల్ క్రింద ప్రకటించింది. అమెరికన్ చమురు దాహాన్ని, సామ్రాజ్యవాదాన్ని బహిరంగంగా విమర్శించటంతో పాటు, అఖండ ఇజ్రాయెల్ (ఈజిప్తులో నైలు నది నుండి ఇరాక్ లో యూఫ్రేట్స్ నది మధ్య భాగమంతా దేవుడు యూదులకి ఇచ్చిన భూభాగం కాబట్టి ఇప్పుడున్న సిరియా, ఇరాక్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు, సౌదీ అరేబియా దేశాలన్నింటినీ ఇజ్రాయెల్ లో కలుపుకునే ప్రయత్నం) ప్రాజెక్టుని అడ్డుకునే శక్తిగా మారినందుకు ఇరాన్ అంటే ఆ రెండు దేశాలకి ఆగ్రహమే కానీ, ఇరాన్ భౌగోళిక సైజు, జనాభా, దాని కున్న మిలిటరీ శక్తి, దాని సమర్ధకులయిన హేజ్బొల్లా, హూతీ సైన్య రాజకీయ పార్టీలు, గల్ఫ్, ఆఫ్ఘానిస్తాన్ యుద్ధాల్లో అమెరికా ఓటమి తర్వాత ఇరాక్ లో షియా ప్రజల సైన్యాల ఏర్పాటు కారణంగా ప్రత్యక్ష యుద్ధానికి దిగలేదు. 2011 లో బుషెహ్ర్ లో న్యూకియార్ పవర్ ప్లాంటు పెడుతున్నామని ప్రకటించిన తర్వాత అమెరికా కి ఇరాన్ ని వేధించటానికి కొత్త కారణం దొరికింది. సుప్రీమ్ లీడర్ అలీ ఖమేయిని ఇరాన్ ఇటువంటి ఆయుధాలు చేయదనే ఫత్వా ఇచ్చారు కాబట్టి మేము ఆయుధాల కోసం కాకుండా యురేనియం ని ఎనర్జీ, మెడికల్ అవసరాల కోసం ఉపయోగించుకునే హక్కు మాకుందని ఇరాన్ అంటే, దానిని 60 శాతం మించి ఎన్రిచ్ చేస్తున్నారు కాబట్టి అది బాంబుల తయారీకి భవిషత్తులో అయినా ఉపయోగ పడుతుందని అమెరికా ఆరోపణ. ఈ మధ్యలో ఇజ్రాయెల్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి ఇరాన్ ఎనర్జీ ప్లాంటులన్నింటినీ పని చెయ్య కుండా చేసింది. అనేక మంది ఇరాన్ న్యూక్లియర్ శాస్త్రజ్ఞులని చంపింది. దౌత్యవేత్తలని కూడా హత్య చేసింది. మరొక సార్వభౌమిక దేశ ఉన్నతాధికారులని చంపటం, యుద్ధం లేకున్నా వాళ్ళ ఎనర్జీ సదుపాయాలని ధ్వంసం చెయ్యటాన్ని ఆత్మ రక్షణ అంటూ సమర్ధించుకుంది. వీటి మధ్యలో 2015 లో ఒబామా అధ్యక్షుడిగా వున్నప్పుడు అమెరికా, ఇరాన్ సంప్రదింపులు జరుపుకుని ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం ఇరాన్ అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ సూపర్ విజన్ కి ఒప్పుకుంది. ఆ సంస్థ పలు సార్లు ఆయుధాలు లేవని నివేదిక లిచ్చింది. ట్రంప్ మొదటి సారి అధికారంలోకి రాంగానే ఈ ఒప్పందాన్ని కెమెరా ముందు చింపి ముక్కలు చేసాడు. మధ్యలో బైడెన్ అధ్యక్షుడయినప్పుడు కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికన్ శాంక్షన్ల కారణంగా ఇరుక్కుపోయి వున్న ఇరాన్ డబ్బుని విడుదల చేయించాడు. కొంత సంప్రదింపులు జరిగాయి కానీ అంతకు ముందే అమెరికా చేసిన నమ్మక ద్రోహం వలన ఒప్పందం ముందుకి పోలేదు. పైగా బైడెన్ పశ్చిమాసియాలో శాంతి లేకుండా చేసిన ఇజ్రాయెల్ సేవలో తరించి పాలెస్తీనా గాజా నాశనాన్ని, దానిలో భాగంగా హిజ్బుల్లా పై దాడుల పేరుతో లెబనాన్ లో ఇరాన్ దౌత్యవేత్తలని చంపటాన్ని, పూర్తిగా సమర్ధించాడు. పశ్చిమాసియాలో ఈ లోపల రాజకీయాలు మారాయి. సిరియా లో ఇరాన్ కు స్నేహితుడయిన అబూ అల్ బషర్ ప్రభుత్వం, పశ్చిమ దేశాలు విధించిన సంవత్సరాల ఆంక్షలు, వీటి మధ్యలో అతడి పార్టీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు, ఐసిస్ తో సహా పశ్చిమ దేశాలు కలిసి చేసిన తీవ్ర అంతర్యుద్ధం వలన కూలిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కోరుకున్నట్లు ఐసిస్ కి చెందిన అహ్మద్ అల్ షరా సిరియా అధ్యక్షుడు అయ్యి వాళ్ళకి పూర్తి బంటుగా మారాడు. ఈ లోపల పాలస్తీనా జన హననం నేపథ్యంలో ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా పై దాడులు చేసి ముఖ్యులని చంపి దానిని బలహీనం చేసింది. ఈ రకంగా ఇద్దరు ఇరాన్ సమర్ధకులు బలహీన పడటంతో అఖండ ఇజ్రాయెల్ గురించిన నెతన్యాహూ ఆశలు మళ్ళా చిగురించాయి. యుద్ధాలు ఆపేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి రెండో సారి అధ్యక్షుడయిన ట్రంప్ అధికారం లోకి రాంగానే అంతర్జాతీయ చట్టాలు మాకు చెల్లవని, ఐక్య రాజ్య సమితి లోని అనేక సంస్థల నుండి తొలగి పోయి, బలమే న్యాయం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నాడు. అమెరికా అధ్యక్షులు ఏ పార్టీ వాళ్ళయినా ఇజ్రాయెల్ సమర్ధకులు, అది చేసే యుద్ధాల్ని పూర్తిగా సమర్ధిస్తూనే వుంటారు కానీ ట్రంప్ ఈ సమర్ధనలో ఎక్కువ ఆకులు చదివాడు. సర్వ నాశనం చేసిన గాజా ని తామే పాలిస్తామంటూ ఒక బోర్డు అఫ్ పీస్ ని తయారు చేసి, దానిలో పాలెస్తీనీయులకి ఏ పాత్రా లేకుండా అమెరికాని, గల్ఫ్ దేశాలనీ, ఇతర ముస్లిం దేశాలనీ పెట్టాడు. ఒక పక్క అన్ని దేశాలతో టారిఫ్ యుద్ధాలు, మరో పక్క ప్రత్యక్ష సైనిక చర్యలు చేస్తున్నాడు. అమెరికాకి ఇష్టం లేని దేశాల్లో, 1960 లలో ఇంగ్లాండు, ఫ్రాన్స్, నెథర్లాండు తమ వలసల్లో చేసినట్లు ‘నాయకత్వ మార్పు’ అనే కల్తీ లేని సామ్రాజ్యవాద విధానాన్ని విధానాలని పునరుద్ధరించాడు. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకుని వచ్చి, అక్కడ చమురు బావుల్ని అమెరికన్ కంపెనీలకి ఇచ్చేటట్లు చేసాడు. క్యూబా కి చమురు లేకుండా చేసి, దేశం మొత్తం అంధకారంలో ఉండేలా చేసాడు. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అధికారం చేతిలో పెట్టుకున్న ఈ పిచ్చోడితో వేగటానికి నిశ్చయించుకున్న ఇరాన్ గత సంవత్సరం ఖతార్ లో న్యూక్లియర్ ఒప్పందం కోసం దౌత్య సంప్రదింపులు మొదలుపెట్టింది. సరిగ్గా అవి ఒక కొలిక్కి వస్తున్న సమయంలో, శాంతి మాట ఇష్టం లేని ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెడతామని నిర్ణయిస్తే, వెనక బడిపోతామనే భయంతో ట్రంప్ అమెరికాని కూడా జత చేసాడు. ఇరాన్ లో న్యూక్లియర్ ఆయుధాలని తయారు చేసే ప్లాంటుల పైనా తీవ్రమైన బాంబు దాడులు చేసి, మేమన్నీ నాశనం చేసేశామని ప్రకటించాడు. ఇరాన్ ఇజ్రాయెల్ పైకి డ్రోన్లని పంపించింది కానీ తీవ్రమైన దాడులకు దిగలేదు. పదే పదే అబద్ధాన్ని చెబితే అది నిజమవుతుందనే విషయం పాశ్చాత్య మీడియా ప్రోపగాండా మనకి అర్ధం చేయిస్తుంది. ఇరాన్ దగ్గరున్న ఎన్రిచ్ చేసిన యురేనియం మాకు కావాలని, ఇరాన్ తన న్యూక్లియర్ ప్లాంటులని అన్నింటినీ నాశనం చెయ్యాలని, భవిషత్తులో ఎప్పుడూ కూడా ఈ ఆయుధాలు తయారు చెయ్యమని వాగ్దానం చెయ్యాలని ట్రంప్ షరతులు. ఇవన్నీ ఇరాన్ ఒప్పుకున్న న్యూక్లియర్ ఒప్పందాన్ని ట్రంప్ నాశనం చేసిన విషయాన్ని పక్కన పెట్టి, నెపమంతా ఇరాన్ మీద మోపి, మళ్ళా మళ్ళా యుద్ధం చేస్తానని ప్రకటిస్తూ వున్న ట్రంప్ ని ఏ దేశమూ ఖండించలేదు. మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు లేవు మొర్రో అంటున్నా సరే, ఈ మాటల యుద్ధం ఆప లేదు. కొన్ని నెలల విరామంతో ఈ సారి ఒమాన్ ఆధ్వర్యంలో అమెరికా, ఇరాన్ మధ్య సంప్రదింపులు ప్రారంభమయినాయి. ఒప్పందం దాదాపు ఖరారయ్యి ప్రకటించే సమయంలో నెతన్యాహు మళ్ళా రంగం లోకి దిగి, యుద్ధం చెయ్యాల్సిందే నని ట్రంప్ ని ఒప్పించాడు. ట్రంప్ కి కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో బయట పడుతున్న నేరాల నుండి తప్పించుకోవటానికి ఇదొక మంచి సాకుగా పనికొచ్చింది. వెనిజులా లో చేసినట్లే వారం లోగా ‘నాయకత్వ మార్పు’ తెచ్చేయొచ్చని 2025 జూన్ లో ఇజ్రాయెల్ తో కలిసి ఒమాన్ దేశ దౌత్య ఒప్పందం కుదిరే సమయానికి, సరిగ్గా ఒప్పందం లోని లక్ష్యాలతో, ఇరాన్ పై కలిసి దాడులకు దిగాయి. మొట్టమొదటి దాడిలో ఇజ్రాయెల్ ఎప్పటి లాగే సుప్రీమ్ లీడర్ అలీ ఖమేయిని, అయన మొత్తం కుటుంబాన్నే కాకుండా, ఆయనతో మీటింగ్ లో వున్న అనేక సైనిక, పౌర ఉన్నతాధికారుల్ని చంపింది. అమెరికన్ విమానాలు ఒక స్కూలు మీద పదే పదే బాంబులేసి 165 స్కూలు పిల్లల్ని చంపాయి. నాయకత్వాన్ని హత్య చేసి స్కూళ్ళు, ఇతర పౌర భవనాల పైన బాంబులేసి, సంపూర్ణ విజయం సాధించేశామని ట్రంప్ భావించాడు. అయితే అమెరికా సామ్రాజ్యవాద అహంకారాన్ని, మానవ హననం చేస్తున్న ఇజ్రాయెల్ దౌష్ట్యాన్ని ఊహించని విధంగా, ఇరాన్ తనదయిన ఎత్తుగడతో ఎదురుకుంది. ఇటువంటి యుద్ధానికి ఎప్పటినుండో సిద్ధమయిన ఇరాన్, పై స్థాయిలో వున్న నాయకత్వాన్ని ఎంతమందిని చంపినా సరే, క్రింది వాళ్ళు తమంతట తామే నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థని తయారు చేసింది. వికేంద్రీకరించిన ఇరాన్ రివొల్యూషనరీ గార్డు నాయకత్వం తో పాటు మత నాయకత్వం కూడా వికేంద్రీకృతమయింది. పై వాళ్ళు హత్యకి గురయితే క్రింద వాళ్ళు నాయకత్వం వహిస్తారు. రెండవది, ఇరాన్ తన మిస్సైల్ టెక్నాలజీని, బహుశా రష్యా, చైనా సహాయంతో, బాగా వృద్ధి చేసుకుని, చాలా దూరం వెళ్లగలిగే స్వంత మిస్సైళ్ళని, పశ్చిమాసియాలో అమెరికన్ ఇంట్రసెప్టర్లని ఏమార్చే డ్రోన్లని తయారు చేసుకుంది. మూడు, భౌగోళికంగా పర్వతాలతో కూడుకుని చాలా పెద్ద భూభాగాన్ని కలిగి ఉండటంతో ఇరాన్ తన సైన్య సంబంధిత ఫ్యాక్టరీలన్నింటినీ దూర ప్రాంతాల్లో, పర్వతాల మధ్యలో, నేల మాళిగల్లో ఉంచు కోవటం వల్ల ఇవి దాడుల్ని తట్టుకునే పరిస్థితుల్లో వున్నాయి. నాలుగు, తన భౌగోళిక అనుకూలతలని యుద్ధంలో అనుకూలతగా మార్చుకుని, 20 శాతం ప్రపంచ చమురు నౌకలు వెళ్లే హోర్ముజ్ జల సంధిని తన నియంత్రణలోకి తెచ్చుకుని, ఆ నౌకల రాకపోకలని నియంత్రించటం మొదలు పెట్టింది. పైగా, గల్ఫ్ దేశాలతో సంబంధాలని గౌరవిస్తూనే, తన చుట్టూ వున్న అమెరికన్ సైనిక స్థావరాలని, అమెరికన్ సైన్యంతో పని చేసే అన్ని టెక్నాలజీ కంపెనీలని, శత్రు ఆస్తిగా పరిగణిస్తున్నానని ప్రకటించింది. ఆఖరిగా, యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కి సంపూర్ణ విజయం అంటే నాయకత్వ మార్పు, ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం వదులుకోవడం, న్యూక్లియర్ ఆయుధాలు చెయ్యమని చెప్పటం. ఇరాన్ కు మాత్రం ఈ బాంబుల దాడులకు తట్టుకుని, తనని తాను నిలబెట్టుకుంటే, విజయం సాధించినట్లే. ఈ యుద్ధ వ్యూహం ద్వారా రెండో వారం తిరిగేటప్పటికి ఇరాన్ హత్యకి గురి కాబడిన నాయకుల స్థానంలో కొత్త నాయకులని నియమించింది. గల్ఫ్ లో అమెరికన్ స్థావరాల మీద దాడులు చేసి, వాటిని పనికి రాకుండా చేసి, అక్కడి గ్యాస్, చమురు రిఫైనరీలు దెబ్బ తినే టప్పటికి ఆయా దేశాలన్నీ యుద్ధం ఆపమని అమెరికా మీద వత్తిడి పెంచాయి. అమెరికన్ యుద్ధ నౌకలు ఒమాన్ తీరం నుండి దూరం జరిగాయి. యుద్ధ పిపాసి ఇజ్రాయెల్ లో మిస్సైల్ తీవ్రత వల్ల యుద్ధ వ్యతిరేక నిరసనలు మొదలయ్యాయి. గల్ఫ్ దేశాలే కాకుండా హోర్ముజ్ జల సంధి మూసెయ్యటం వల్ల ప్రపంచమంతా ఆర్ధిక నష్టానికి, పెట్రోల్, గ్యాస్ కొరతకి, గురవటమే కాకుండా, పరోక్షంగా తీవ్ర ఇతర కొరతలోకి ప్రవేశించాయి. పనిలో పనిగా, ట్రంప్ కుటుంబం, స్నేహితులు ఈ యుద్ధం జరిగిన వారాల్లో స్టాక్ మార్కెట్ లో బెట్టింగ్ చేసి మిలియన్లు సంపాదించారు కానీ ఒక దేశంగా అమెరికా యుద్ధంలో ఓడిపోయిందని అనేక మంది నిపుణుల అంచనా. నాలుగో వారానికి అమెరికా రక్షణ వ్యవహారాల శాఖలో వ్యతిరేకత మొదలయింది. వారి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇరాన్ పైన యుద్ధం చేసేటంత ఏ ఆరోపణలు, సాక్ష్యాధారాలు తమ దగ్గర లేవని చెప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ట్రంప్ సమర్ధకులయిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గుంపు లో కూడా టక్కర్ కార్ల్సన్, మేగాన్ కెల్లీ, కాండన్సు వన్స్ బయటి కొచ్చి ఇది ఇజ్రాయెల్ కోసం అమెరికా స్వంత ప్రయోజనాలని లెక్క చెయ్యకుండా ట్రంప్ చేస్తున్న యుద్ధమని, ఈ యుద్ధం అమెరికాకి వ్యతిరేకమని ప్రకటించారు. అమెరికా డెమొక్రాట్లలో ఇజ్రాయెల్ భక్తులు, సమర్ధకులు ఉండటం వల్ల రిపబ్లికన్లతో కలిసి ఇప్పటికీ ఆయుధాల సరఫరా ఆపట్లేదు కానీ, అమెరికన్ ప్రజల నుండి ఈ యుద్ధానికి తీవ్ర మైన వ్యతిరేకత వుంది. నాటో ఇరాన్ వల్ల తమకేమీ ప్రమాదం లేదు కాబట్టి మేము ఈ యుద్ధంలో పాల్గొనమని చెప్పేసింది. దక్షిణ కొరియాతో సహా మరే దేశాలు ఈ యుద్ధంలో పాలు పంచుకోవటానికి సిద్ధంగా లేమని చెప్పాయి. ఈ పరిస్థితుల్లో, ఇరాన్ కంటే కొన్ని రెట్లు బలమైన సైన్యం, టెక్నాలజీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వున్న అమెరికా వెనక్కి తగ్గి సంప్రదింపుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. వియత్నాం, ఆఫ్గనిస్తాన్ లలో జరిగినట్లు శక్తి మాత్రమే యుద్ధాన్ని గెలవటానికి చాలదని, ఇరాన్ పాటించిన వ్యూహం నిరూపించింది. అవతలి వాళ్ళ ఆయుధ సామాగ్రి ఖర్చు అయిపోయేలా చెయ్యటం, భౌగోళిక పరిస్థితులని యుద్ధ ఎత్తుగడలో అనుకూలతగా మార్చుకోవటం, యుద్ధాన్ని ఎన్నో దేశాలకి వ్యాపింప చేసి తీవ్రమయిన ఆర్ధిక నష్టం చెయ్యటం, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థే అతలా కుతలం అయ్యేలా చెయ్యటం వల్ల అమెరికా తాను ప్రారంభించిన యుద్ధాన్ని కొనసాగించలేని స్థితికి వచ్చింది. ఈ లోపల ఇజ్రాయెల్ ఇదే సందని దక్షిణ లెబనాన్ ని ఆక్రమించుకుంటోంది. పేరుకి గాజా యుద్ధ విరమణ ఒప్పందం జరిగినా గాజా లో, వెస్ట్ బ్యాంకు లో ఇప్పటికి 1500 మందికి పైగా, దక్షిణ లెబనాన్ లో గత సంవత్సరమంతా అడపా, దడపా బాంబులు వేస్తూ తన యుద్ధ పిపాసని చల్లార్చుకుంటున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఇరాన్ యుద్ధం మొదలయిన తర్వాత కొన్ని మిస్సైళ్ళు వేస్తె, దాని సాకుగా తీసుకుని దక్షిణ లెబనాన్ ఖాళీ చేస్తే తప్ప తన సరిహర్డుల్లోని ప్రజలకి రక్షణ లేదని చెప్పి, 10 లక్షల మంది ప్రజలని ఖాళీ చేయించింది. వాళ్ళు దేశ జనాభాలో నాలుగవ వంతు. పైగా దేశం లోపలి వెళ్లి హెజబుల్లా లేని బీరూట్ లో అన్ని పౌర భవనాలు - హాస్పిటళ్లు, స్కూళ్ళు - తో సహా జన సాంద్రత వున్న ప్రదేశాల్లో విపరీతంగా బాంబులేసి ఇప్పటికే 3000 మందికి పైగా సంహరించింది. దక్షిణ లెబనాన్ లో మరొక నక్బ నిర్వహిస్తోంది. 1948 లో పాలస్తీనీయుల్ని తరిమేసినట్లు శతాబ్దాల తరబడి అక్కడ జీవించిన ప్రజలని తరిమేసి, ఊళ్ళకి వూళ్ళని - ఇల్లు, బ్రిడ్జిలు, నీళ్ల సదుపాయాలు, స్కూళ్ళు - బాంబులేసి తుడిచి పెట్టొస్తోంది. దీనితో ఫ్రాన్స్ తో సహా అనేక యూరోపియన్ దేశాలు ఇది ఖండించి ఇజ్రాయెల్ మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాయి. సరిగ్గా ఈ సందర్భంలో ఎప్పటి నుండో అమెరికా స్నేహితుడయిన పాకిస్తాన్ ఒక మధ్యవర్తిగా అవతరించి సంప్రదింపులకు ఇద్దరినీ పిలిచింది. ముందు తన స్వంత ఎజెండా తో వచ్చిన అమెరికా, సంప్రదింపులకు ఇరాన్ చెప్పిన ఎజెండానే ఒప్పుకుంది. అయితే ఇజ్రాయెల్ మధ్యలో జోక్యం చేసుకోవటం వల్లో, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి రెండు సార్లు సంప్రదింపుల మధ్యలో యుద్ధం మొదలు పెట్టి బాంబులు వెయ్యటం వల్లో ఇరాన్ కి వారి పట్ల నమ్మకం కుదరకో, ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు. ట్రంప్ ఈ లోపల ఇజ్రాయెల్ ని ప్రస్తుతం లెబనాన్ లో వున్న క్రిస్టియన్ జయోనిస్టు ప్రభుత్వం తో కలిపి అమెరికాలో సంప్రదింపులు జరిపించి ఒక తూ తూ మంత్రం కాల్పుల విరమణకి ఒప్పించాడు. అయితే కుక్క తోక వంకర చందంగా ఇజ్రాయెల్ గాజా లో పాటించనట్లే ఇక్కడ కూడా కాల్పుల విరమణ పాటించకుండా, తన రక్త పిపాసని తీర్చు కుంటోంది. రెండో దఫా సంప్రదింపులు జరుగుతాయో, అక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ ప్రజలపై ఈ యుద్ధ ప్రభావం ఈ యుద్ధం ఎలా ముగిసినా సరే, పశ్చిమాసియాలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని మాత్రం తీవ్రంగా దెబ్బ తీసింది. గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలని పాక్షికంగా నాశనం చెయ్యటమే కాక, ఆయా దేశాలు వాటి గురించి పునరాలోచించుకునేటట్లు చేసింది. ప్రపంచంలో ఇరాన్ స్థాయి పెరగటమే కాక, అదొక సైనిక శక్తిగా అవతరించింది. 20 వ శతాబ్దంలో అతి పెద్ద ఎయిర్ ఫోర్స్ శక్తితో దేశాలని నేల మట్టం చేసే యుద్ధ నమూనాని మార్చి భౌగోళిక అనుకూలతలని, ఆర్ధిక వ్యవస్థ అంతరాయాన్ని యుద్ధ వ్యూహంలో భాగం చేసింది. చైనా, రష్యా లతో సంబంధాలని బలపరుచుకుంది. హోర్ముజ్ పై నియంత్రణ సాధించింది. నెల తిరక్కుండానే అమెరికాని సంప్రదింపులకు వచ్చేలా చేసింది. ఇది మామూలు విషయం కాదు. అయితే, ఈ యుద్ధ పరిణామాలు ప్రజల మీద ఎలా వుండబోతున్నాయి? ఇరాన్ లో ప్రజాస్వామ్య లేమిని, మానవ హక్కుల ఉల్లంఘనని, స్త్రీల అణచివేతని అమెరికా - ఇజ్రాయెల్ చాలా ఏళ్ల నుండి ఇరాన్ పై తమ ప్రచార యుద్ధంలో ఏ సిగ్గూ -శరం లేకుండా ఒక ఆయుధంగా మార్చుకున్నాయి. ఎన్ని సార్లు పోరాడినా ప్రభుత్వ విధానాలని మార్చలేక, గత సంవత్సర కాలంగా ఇరాన్ ప్రభుత్వం చేసిన దమన కాండ నేపథ్యంలో నిరాశ-నిస్పృహ లకి లోనయ్యిన ప్రజలలో కొంత మంది అమెరికా ప్రారంభించిన యుద్ధాన్ని స్వాగతించారు, వెంటనే ఇరాన్ ప్రభుత్వం పడి పోయి, రాజా పెహల్వి వారసుడు మళ్ళా వచ్చి తమ పర్షియన్ వారసత్వాన్ని పునరుద్ధరించాలని కూడా భావించారు. అయితే ఇరాన్ జైళ్లల్లో మగ్గుతున్న ఆక్టివిస్టులతో పాటు అక్కడి ట్రేడ్ యూనియన్లు, మానవ హక్కుల కార్యకర్తలు, స్త్రీవాద కార్యకర్తలు అందరూ ఇదొక సామ్రాజ్యవాద యుద్ధమని, వీళ్ళకి ఎక్కడా ప్రజల హక్కులని బలోపేతం చేసే ఉద్దేశం లేదనీ అంటూ బలంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌర భవనాలు, విశ్వ విద్యాలయాలు, నీళ్ల సదుపాయాల పై బాంబులు పడిన తర్వాత, యుద్ధాన్ని ఆహ్వానించిన వాళ్ళకి కూడా జ్ఞానోదయం కలిగింది. ఈ యుద్ధంలో ఇరాన్ అత్యున్నత నాయకత్వాన్ని ఇజ్రాయెల్, అమెరికా కలిసి రంజాన్ సమయంలో హత్య చెయ్యటంతో, ఖమేయిని భక్తులయిన షియాలు ఆశించే అమరత్వాన్ని సాధించుకున్నారు. ఆయనతో పాటే హత్యకి గురయిన అందరూ కూడా అమరులయ్యారు. ఈ ఘటన అమెరికా/ఇజ్రాయెల్ ఆశించినట్లు ఇరాన్ ని విభజించటానికి బదులు దగ్గరికి తీసుకొచ్చింది. దీనితో పాటు అమెరికా/ఇజ్రాయెల్ ఇరాన్ లో ఫ్యాక్టరీలు, నీటి, పౌర, ప్రజా సదుపాయాలపై చేసిన దాడులు ఇరాన్ ప్రభుత్వ సాధికారతని పెంచాయి. రెండు, హత్యకి గురయిన ఆ నాయకత్వంలో తమ సంస్కృతి, నాగరికతలతో పాటు అన్ని అన్ని నాగరికతల్ని అర్ధం చేసుకుని, కయ్యానికి కాలు దువ్వని మనుషులుంటే, వారి స్థానంలో వచ్చిన నాయకత్వం రాటు తేలి, కఠినమైందని ఇరాన్ విశ్లేషకుల అభిప్రాయం. యుద్ధం జరుగుతున్న సమయంలోనే జనవరి నిరసనల్లో అరెస్టు చేసిన ఆక్టివిస్టులని హడావిడిగా విచారణ జరిపి, వురి తియ్యటం జరిగింది. మూడు, ఇరాన్ కి ఈ యుద్ధం వల్ల తీవ్ర ఆర్ధిక నష్టం జరిగింది. గత సంవత్సరం అమెరికా పధకం ప్రకారం ఇరాన్ ఫైనాన్సియల్ వ్యవస్థని దెబ్బ తీసింది. అదీ, ఇదీ కలిపి ఈ నష్టం తీరాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రయివేటీకరణ వల్ల ఈ ప్రభావం డబ్బున్న వాళ్ళ కన్నా సబ్సిడీల మీద ఆధార పడే అత్యధిక ప్రజల పైనే పడనుంది. కానీ ప్రజలకి యుద్ధం వల్లా, ఇతర అడ్డంకుల వల్ల నిరసనలు చేసే అవకాశం తగ్గిపోయింది. నాలుగు, ఇరాన్ లో ప్రజాస్వామ్యం కోసం జరుగుతూ వచ్చిన అనేక ప్రజా పోరాటాలని ఈ యుద్ధం తీవ్రంగా దెబ్బ తీసింది. ఇజ్రాయెల్, అమెరికా ‘రెజిమ్ చేంజ్’ పేరుతో ఈ పోరాటాలని తమ ప్రయోజనాలకు వాడుకున్న తీరు, అంతర్గతంగా ఆ ప్రజలని దేశ ద్రోహులుగా పరిగణించటానికి మార్గం సుగమం చేసింది. జిన్, జియాన్, ఆజాది వంటి పోరాటాల ద్వారా తాము తమ ప్రభుత్వాన్ని, చట్టాలని, వ్యవస్థని మార్చుకునే అవకాశాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రదర్శించిన కపటత్వం భవిష్యత్తులో కూడా ప్రభావితం చేయబోతోంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ చేసిన యుద్ధం ఇరాన్ కి నష్టం కలిగించటంతో పాటు, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, గల్ఫ్ దేశాల్లో అమెరికా సాధికారతని, ఇజ్రాయెల్ ఆధిక్యతని దెబ్బ తీసింది. పశ్చిమాసియా రూపం దీనితో మారిపోయింది. దీనిని వ్యూహాత్మకంగా ఎదిరించి, తట్టుకున్న ఇరాన్ దేశ పాలకులు ఆ ప్రాంతంలో తమ స్థాయిని మాత్రమే కాకుండా దేశంలో అంతర్గతంగా తమ సాధికారతని కూడా పెంచుకున్నారు. అయితే, దీని వల్ల ఇరాన్ లో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక శక్తులు బలోపేతం అవుతాయా అన్నది ప్రశ్నార్థకం. Published in Mahila Margam, April 2026

Comments