సర్ ఓటర్ల జాబితా సవరణ కాదు, తొలగింపు ప్రక్రియ!
ఎ. సునీత
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు తెలంగాణ లో మొదలయిన ‘ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ’ - సర్ - ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. ఓటర్ కార్డు వుంది కాబట్టి మా ఓటుకి ఏ ఢోకా లేదని చదువుకున్న మధ్య తరగతి వాళ్ళు, ప్రతి సారీ జరిగినట్లే ఇప్పుడు కూడా ఓటర్ నమోదు జరిగిపోతుందని శ్రామిక వర్గ ప్రజలు, అసలిందంతా ముస్లిం వోటర్లని తీసెయ్యటానికి కాబట్టి, మనకేం కాదని ముస్లిమేతరులు భావిస్తున్నారు. ఇప్పటికె బీహార్, బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలని గమనించిన ప్రజలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు భయాందోళనలో వున్నారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం ఎన్నికల సంఘానికి ప్రతి ఎన్నికల ముందూ ఓటర్ జాబితాని సవరించే అధికారం వుంది. చనిపోయిన వాళ్ళ పేర్లు, డూప్లికేట్ పేర్లు తీసేసి, అలాగే అక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళని, 18 ఏళ్ళు నిండిన వారి పేర్లని జత చేసి జాబితా సిద్ధం చెయ్యాలి. మతి స్థిమితం లేని వాళ్ళు, పౌరులు కాని వాళ్ళు, లేక అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన వాళ్ళు కాకుండా వేరే ఎవరి కయినా సరే నోటీసు ఇచ్చి, వారి వాదన వినే అవకాశం కల్పించి, విని, వారి సాక్ష్యాధారాలు చూసిన తర్వాతే అధికారులు నిర్ణయం తీసుకోవాలి. పొరపాటున పేర్లు తీసేసిన వారి జాబితా కూడా తయారు చేసి, నోటీసు ఇచ్చి, దాన్ని సవరించాలి. సవరించిన నియమాల ప్రకారం ఆధార్ ని ఎన్నికల అధికారులు ఆధారంగా తీసుకోవచ్చు. ఎన్నికల సంఘం 1950 నుండి అనేక సార్లు, ప్రతి ఎన్నికల ముందూ ఈ సవరణ, రొటీన్ గా జరుపుతూ వచ్చింది.
స్వాతంత్య్రానంతర చరిత్రలో మొదటి సారి 2025 లో సర్ ద్వారా ఎన్నికల సంఘం ఈ బాధ్యతని ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ద్వారా ఓటర్ల మీదకి నెట్టింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం నియమాలు (1960) ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణని కొన్ని అవసరమైన నియోజక వర్గాల్లో, లేదా కొన్ని భాగాల్లో చేపట్టొచ్చని పేర్కొన్నాయి. ఆ ప్రత్యేక సవరణ లో కూడా ఓటర్ల నమోదు, తొలగింపులు పైన చెప్పిన పద్ధతులలో మాత్రమే చెయ్యాలి. అయితే గత సంవత్సరం ఎన్నికల సంఘం దేశం మొత్తం మీద ఈ ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ చేపడతామని, 2002 లో ఇటువంటి ప్రత్యేక సవరణ జాబితా విడుదల చేశామనీ, దాని తర్వాత ఇప్పుడు చేస్తున్నామని ప్రకటించింది. వెనక్కి తొంగి చూస్తే, అప్పటి జాబితా తయారీకి ప్రచార ప్రయత్నం 1999 లో ప్రారంభమైందని, 2001- 2001 మధ్య అధికారులు ఇంటింటికీ వెళ్లి ధ్రువీకరణ చేసుకున్నారని, 2003 లో జాబితాని ప్రచురించారని తెలుస్తుంది. దీని వల్ల ఓటర్లు ఇబ్బందులు పడిన సమాచారం కానీ, అంతకు ముందు ఓటర్ల జాబితాతో లింకు చేసుకోవాలని, లేక తమ తల్లి తండ్రుల పేర్లతో లింకు చేసుకోవాలని, లేని వాళ్ళు సాక్ష్యాధారాలు ఇవ్వాలనే షరతులు కూడా మనకి అప్పటి వార్తల్లో కనిపించవు.
జరుగుతున్న ప్రత్యేక ‘సమగ్ర’ ఓటర్ల జాబితా లోని షరతులు, రెండు దశాబ్దాల ముందటి జాబితాతో తప్పని సరిగా లింకు చేసుకోవాలనే నియమం, ఓటర్ల గుర్తింపు పత్రాల సమర్పణ మొ. వి మనకి 1950 చట్టంలో కానీ, 1960 నియమాల్లో గానీ దొరకవు. ఇవన్నీ ‘అవసరానికి తగ్గట్లు ప్రమాణాలని పెట్టొచ్చు’ అని చట్టంలో వున్న నియమాన్ని ఎన్నికల సంఘం విస్తృతంగా, నిరంకుశంగా విస్తరించి తయారుచేసిన ఫలితంగా ఏర్పడ్డాయి.
విదేశీ చొరబాటు దారులు ఓటర్ గుర్తింపు కార్డులు తెచ్చుకుని తమ ఓట్ల ద్వారా రాజకీయాలని శాసిస్తున్నారనే ప్రచారోద్యమం భారతీయ జనతా పార్టీ విపరీతంగా చేస్తూ వస్తోంది. 2018 లో అస్సాం కున్న సంక్లిష్ట వలసల చరిత్ర నేపథ్యంలో, ఎప్పటి నుండో ఒప్పుకున్న డిమాండు ని అనుసరించి, రాష్ట్ర పౌరుల జాబితా తయారు చేస్తే, ముస్లిం ల కన్నా హిందువులు ఎక్కువగా తొలగింపబడ్డారు. దాంతో అసలు ఇక్కడ కాదు, దేశమంతా చొరబడ్డారు అంటూ జాతీయ పౌరుల జాబితా తయారు చేస్తామని 2019 లో ప్రకటించారు. పౌరసత్వ చట్టాల్లో మత పరమైన ప్రమాణాలని ప్రవేశ పెడితే అంతర్జాతీయ నిరసన తో పాటు దేశ వ్యాప్త ప్రతిఘటన రావటంతో కొంత కాలం వెనక్కి తగ్గారు. కానీ, ఈవీఎం లతో పాటు, ఓటర్ల జాబితాని ఎంత తారు మారు చేసినా 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తినటంతో 2025 లో ఈ ఆయుధాన్ని కొత్త రూపంలో ప్రచారం లోకి తెచ్చారు. విదేశీ’ వోటర్లని ఓటర్ల జాబితా నుండి ఏరి వేస్తామని అంటూ పౌరసత్వంతో దీన్ని జత చేశారు. ఒకప్పుడు అస్సాంకి మాత్రమే పరిమితమయిన ఈ పౌరసత్వ పరీక్షని ఇప్పుడు అందరికీ వర్తింప చేస్తున్నారు.
భారత పౌరసత్వ చట్టం బ్రిటిషు ఇండియా విభజన నేపథ్యంలో ఏర్పడటంతో మొదటి నుండీ కూడా కొన్ని షరతులు ఉంటూ వచ్చాయి. అస్సాం ఒప్పందం తర్వాత, 1986 లో తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణలో భారత పౌరురాలు కావాలంటే పుట్టుకతో పాటు, కనీసం తల్లి గానీ, తండ్రి గానీ పౌరులు అయ్యుండాలనే నిబంధన, ఆ తర్వాత 2003 లో తల్లి తండ్రులు ఇద్దరూ కూడా పౌరులు అవటమే కాక, అక్రమ వలస దారులు అయుండకూడదని, అటువంటి వారిని ‘విదేశీయులుగా’ పరిగణించి ‘నిర్బంధ శిబిరాలకు’ తరలించాలనే నిబంధన తెచ్చారు. ఈ సవరణలని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీల వాళ్ళు సమర్ధించారు.
పౌరులు కాని వాళ్ళు ఓటర్ల జాబితాలో వుండకూడదు అనే నియమం తప్ప, ఈ పౌరసత్వ చట్టాలకు, పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియకు, ఓటర్ల జాబితాతో, దాని సవరణతో ఏ చట్ట పరమైన సంబంధం లేదు. అయితే, ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణలో ఈ ‘వంశ పరంపర్యత’ నిరూపణకు కేంద్ర స్థానం ఇచ్చారు. ప్రతి ఓటర్ని, 2002 జాబితాతో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని తమ సంబంధాన్ని నిరూపించుకోవాల్సిందిగా కొత్త నియమం తెచ్చారు. అంటే, తాము గానీ, లేదా తమ తల్లి తండ్రులు, అమ్మమ్మ, తాతలు 2002 ఓటర్ల జాబితాలో వున్నారని చూపెట్టాలి. దీన్నే మాపింగ్ అంటారు. మనం, మన చుట్టాలు ఇద్దరూ 2002 జాబితాలో లేకపోతే మనకి ఎన్నికల సంఘం నుండి ముసాయిదా జాబితా తయారీ తర్వాత నోటీసు వస్తుంది. అప్పుడు మన స్థానిక ఎన్నికల ఆఫిసర్ దగ్గరికెళ్లి మనం ఇక్కడే పుట్టామనీ, చదివామనీ, లేదా ప్రభుత్వం మనని గుర్తించిందని సరి పడే సాక్ష్యాలని ఎన్నికల సంఘం చెప్పిన 11 పత్రాలు, ఇతర సాక్ష్యాలతో ద్వారా చూపెట్టి మన అర్హతని నిరూపించుకోవాలి. చెయ్యలేకపోతే, మనం పూర్తి ‘అనుమానాస్పదులు’ గా మారతాం.
అందరికీ వుండే రేషన్ కార్డు, వివిధ రకాల సంక్షేమ కార్డులని, ఎవరయినా డబ్బులిచ్చి సంపాదిచ్చేస్తారనే నెపం మీద ఈ 11 లో చేర్చ లేదు. ఈ పత్రాల్లో అస్సాం పౌరసత్వ జాబితా, ఫారెస్టు రైట్స్ పత్రం, 10 వ క్లాస్ సర్టిఫికెట్ అతి తక్కువ మందికి ఉంటే, పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్, ఫామిలీ రిజిస్టర్ ఎవరికీ వుండవు. అసలు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఏమిటో ఇప్పటికీ చాలా మంది అధికార్లకే తెలియదు. రాజస్థాన్ లో ఉన్నాయని వినికిడి. స్కూలు డ్రాప్ ఔట్స్ కి మిగిలిన ఆరింటిలో కుల ధ్రువీకరణ పత్రం కూడా ఉండదు. వీటన్నింటితో పాటు బెంగాల్ ఎన్నికల తర్వాత లాజికల్ డిస్క్రి పెన్సి పేరుతో కొత్త ‘తొలగింపు ప్రమాణాలు’ తెచ్చారు. మన పేరు, వివరాలు, ఓటర్ జాబితాలోనూ, అధికారిక పత్రాల్లోనూ ఏ తప్పులు లేకుండా సరిగ్గా సరిపోవాలి. తల్లులకు, పిల్లలకి మధ్య వయసులో తేడా 15 ఏళ్ల కంటే తక్కువ వుండకూడదు. అన్ని కార్డులు, జాబితాల్లో తండ్రి పేరు సరిగ్గా ఒక లాగే ఉండాలి. ఇవి కాకుండా ఎన్నికల ముందు కూడా కొత్తవి తేవచ్చు.
అతి తక్కువ సమయంలో, శిక్షణ లేని వ్యక్తుల ద్వారా, తీవ్ర వత్తిడి క్రింద పని చేయించటంతో ఈ ప్రక్రియ అన్ని స్థాయిల్లో అనేక తప్పులు తడకలతో నడుస్తోందని సాక్ష్యాధారాలతో సహా ఉన్నత న్యాయస్థానికి వెళ్తే, పర్లేదు, తప్పులు దిద్దుకుంటారులే అంటూ, సర్దుకుపొమ్మని చెప్పింది. ఈ గతాన్ని తవ్వి తీసే నియమాలన్నీ ఓటు హక్కుని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అభ్యర్థిస్తే, అర్హులు కాని వాళ్ళని తొలగించటానికి ఈ మాత్రం చెయ్యాలని అనింది. లాజికల్ డిస్క్రి పెన్సి చాలా అన్యాయమని అంటే, నెమ్మదిగా ట్రిబ్యునల్స్ సమస్యలని పరిష్కరిస్తాయి, అప్పటి వరకూ మీరు ఓట్లు వెయ్యకండి, తర్వాత వేసుకోండి అని చెప్పింది. తానే పదేళ్లు సాగదీసి అందరినీ తీసుకునేలా చేసిన ఆధార్ కార్డుని షరతులతో 12 వ గుర్తింపు పరంగా చేర్చటానికి ఆమోదించింది.
రూపం లోనే ఇంత సంకుచితంగా, నిరంకుశంగా వున్న ఈ సవరణ అమలులో ఎట్లా జరిగిందో చూద్దాం. ఈ ప్రక్రియలో అణగారిన, వలస వచ్చిన, సంచార జాతుల ప్రజలు, అన్ని వర్గాల అణగారిన ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలు అందరూ కలిపి దాదాపు ఆరు కోట్ల పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించ బడ్డాయి. బెంగాల్ లో కొన్ని జిల్లాల ఓటర్ల తొలగింపులో 65% పైగా ముస్లిం స్త్రీలు వున్నారు. గత రెండు ఎన్నికల నుండి ఉత్సాహంతో ఓటు వేస్తున్న స్త్రీల శాతం ఈ సర్ లో పెళ్లి తర్వాత అత్తగారింటికి వలసలు, ఇంట్లోంచి గెంటి వెయ్య బడటం, ఇతర వలసలు, కుటుంబ హింస, చదువు లేక పోవటం వంటి కారణాలతో ధ్రువీకరణ పత్రాలు సరయిన సమయంలో ఇవ్వలేక పోవటం వల్ల పడిపోయింది. బీహార్ లో ప్రయోగాత్మకంగా 2025 జూన్ లో మొదలయినప్పుడు ఏవయితే సమస్యలని అనేక మంది క్రింది స్థాయి కార్యకర్తలు ఎత్తి చూపించారో, వాటిని సరిదిద్దుకోవటం బదులు, బెంగాల్ కి వచ్చే సరికి కొత్త ప్రమాణాలని రంగం లోకి తీసుకొచ్చి ఇంకా సంక్లిష్టంగా తయారు చేశారు.
ఓటర్ల మీద బాధ్యత నెట్టెయ్యటం, తొలగించే ప్రమాణాలని కావాల్సినట్లు మార్చుకునే నిరంకుశాధికారం పెట్టుకోవటం, వెనక దారిలో పౌరసత్వ నియమాలతో దీనికి ముడి వెయ్యటం, అన్నింటికీ మించి, పెద్ద ఎత్తున తొలగించే ఉద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా తెచ్చిన ఈ దుర్మార్గపు సర్ ని ఎదుర్కోవటం, ఇతర రాష్ట్రాలలాగే, తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజకీయ పార్టీలకి, పౌర సమాజానికీ, అన్ని సామాజిక సంస్థలకి చాలా పెద్ద పరీక్షే కాబోతోంది.

Comments
Post a Comment